ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 పరిస్థితిపై రాష్ట్ర.. జిల్లాస్థాయి అధికారులతో ప్రధాని చర్చ


దేశంలోని ఇతర ప్రాంతాల్లో అమలుకు వీలుగా

ఉత్తమ పద్ధతులను పంచుకోవాలని అధికారులకు సూచన

Posted On: 18 MAY 2021 2:26PM by PIB Hyderabad

   కోవిడ్ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లోని క్షేత్రస్థాయి అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నిర్వహణలో వారి అనుభవాలను తెలియజేయాలని వారిని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా కోవిడ్ రెండోదశ విజృంభణ నేపథ్యంలో ప్రధానమంత్రి ముందుండి పోరును నడిపించడంపై ఈ సందర్భంగా అధికారులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ అనుభవాలను ఆయనతో పంచుకుంటూ ఇటీవలి కేసుల పెరుగుదల విపరిణామాలను చక్కదిద్దడానికి చేపట్టిన వినూత్న చర్యలను ఆయనకు వివరించారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వైద్య సౌకర్యాలు, సామర్థ్యం పెంపు దిశగా తాము చేసిన కృషి గురించి తెలిపారు. దీంతో దేశంలోని ఇతర జిల్లాల్లోనూ అమలుకు వీలుగా వారు అనుసరించిన అత్యుత్తమ విధానాలు, చేపట్టిన వినూత్న చర్యలను క్రోడీకరించి పంపాలని ప్రధానమంత్రి వారిని కోరారు.

   ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నడుమ దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు, ముందువరుస యోధులు, పాలన యంత్రాంగంలోని అధికారవర్గాలు చూపుతున్న అంకితభావాన్ని, అకుంఠిత దీక్షను ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. ఇదే పట్టుదల, ఉత్సాహంతో ముందుకు సాగాల్సిందిగా వారిని కోరారు. దేశంలోని ప్రతి జిల్లా దేనికదే భిన్నమైనదని, తనదైన విశిష్ట సవాళ్లను ఎదుర్కొంటున్నదని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే ‘‘మీ జిల్లాల్లో సవాళ్లేమిటో మీకు చక్కగా అర్థమవుతాయి. కాబట్టి మీ జిల్లా విజయం సాధిస్తే దేశానికి విజయం లభించనట్టే. మీ జిల్లా కరోనాను మట్టికరిపిస్తే, జాతి యావత్తూ మహమ్మారిని తరిమికొట్టినట్టే అవుతుంది’’ అని జిల్లాల అధికారులను ఆయన ప్రోత్సహించారు. కోవిడ్-19 బారిన పడినప్పటికీ కొందరు అధికారులు సెలవు తీసుకోకుండా విధుల్లో కొనసాగటాన్ని ఆయన అభినందించారు. వారి త్యాగాలను తాను అర్ధం చేసుకోగలనని, అనేకమందికి వారు స్ఫూర్తినిస్తున్నారని ప్రశంసించారు.

   కరోనాపై పోరాటంలో అధికారులందరూ పోషిస్తున్న పాత్ర యుద్ధ క్షేత్రంలో సైనిక కమాండర్లు పోషించే పాత్రవంటిదేనని ప్రధానమంత్రి అన్నారు. స్థానిక నియంత్రణ మండళ్లు, ముమ్మర నిర్ధారణ పరీక్షలు, ప్రజలకు సరైన-సమగ్ర సమాచారం ఇవ్వడం వంటివే వైర‌స్‌పై యుద్ధంలో ప్రధాన ఆయుధాలని ఆయన అన్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టగా, అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నదని వివరించారు. అందువల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించే దిశగా మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరి ప్రాణరక్షణే ఈ యుద్ధం లక్ష్యమని, ముఖ్యంగా గ్రామీణ/మారుమూల ప్రాంతాలపైనా దృష్టి సారించాలని సూచించారు. వ్యాధి ఉపశమన సామగ్రి గ్రామీణ ప్రజానీకానికి సులభంగా లభించేలా చూడాలని అధికారులను ఆయన కోరారు.

   ఆయా జిల్లాల్లో ప్రతి పౌరుడి జీవన సౌలభ్యం దిశగా అధికారులు శ్రద్ధ వహించాలని ప్రధానమంత్రి వారికి సూచించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతోపాటు అదే సమయంలో నిత్యావసరాల నిరంతర సరఫరా సాగేలా చూడాలని ఆయన నొక్కిచెప్పారు. ‘పీఎం కేర్స్ నిధి’ ద్వారా దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లను వేగంగా ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయని, ఈ మేరకు అనేక ఆస్పత్రులలో ఇప్పటికే ప్రాణవాయువు ఉత్పత్తి ప్రారంభమైందని వెల్లడించారు.

   వ్యాధి తీవ్రతనుంచి ఉపశమనమే కాకుండా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం, మరణాలు తగ్గించడంలో టీకా వేయించుకోవడం ఎంత కీలకమో ప్రధానమంత్రి వివరించారు. కరోనా టీకాల సరఫరాను అత్యంత భారీగా పెంచేందుకు అనుక్షణం కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. దీంతోపాటు టీకాలిచ్చే ప్రక్రియతోపాటు వ్యవస్థ క్రమబద్ధీకరణకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే 15 రోజుల టీకాల కార్యక్రమ షెడ్యూలును రాష్ట్రాలకు ముందుగానే అందించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. టీకాలు వృథాకాకుండా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆస్పత్రులలో పడకలతోపాటు టీకాల లభ్యతపై ప్రజలకు సరైన సమాచారం అందిస్తే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రధాని తెలిపారు. అదేవిధంగా అక్రమ విక్రయాలను అరికట్టి, అలాంటివాటికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందువరుస యోధులలో ఆత్మస్థైర్యం  ఇనుమడించేలా వారిలో ఉత్తేజం నింపాలని కోరారు.

   దేశంలోని వివిధ గ్రామాల్లో పొలం పనుల సందర్భంగా గ్రామీణులు సామాజిక దూరం పాటించడాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. గ్రామాలు సమాచారాన్ని గ్రహించి, దాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసుకుంటున్నాయని, ఇదే గ్రామసీమల బలమని ఆయన పేర్కొన్నారు. కరోనా వైర‌స్‌పై పోరులో అత్యుత్తమ పద్ధతులను అందరూ అనుసరించాలని ఆయన అన్నారు. అధికారులకు తాను పూర్తి స్వేచ్ఛనిస్తున్నానని ప్రధాని భరోసా కల్పించారు. తదనుగుణంగా ఆవిష్కరణలు చేపట్టవచ్చునని, విధానపరమైన మార్పులను సూచించవచ్చునని వారికి చెప్పారు. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని వారికి విజ్ఞ‌ప్తి చేశారు.

   ఈ సమావేశంలో కేంద్ర హోం/రక్షణ/ఆరోగ్య శాఖ‌ల మంత్రుల‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడు, ఆరోగ్య/ఔష‌ధ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, ప్ర‌ధాని కార్యాల‌య/కేంద్ర‌ ప్రభుత్వ ఇత‌ర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1719643) Visitor Counter : 226