ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం-సెశెల్స్ఉన్నతస్థాయి వర్చువల్ (2021 ఏప్రిల్ 8నాటి) కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగంముఖ్యాంశాలు
Posted On:
08 APR 2021 6:53PM by PIB Hyderabad
సెశెల్స్ రిపబ్లిక్ అధ్యక్షులు, గౌరవనీయులైన వేవెల్ రామ్ కలావన్ గారు... విశిష్ట అతిథులందరికీ...
నమస్కారం!
అధ్యక్షులు శ్రీ రామ్ కలావన్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. బీహార్ లోని గోపాల్‌గంజ్ జిల్లాలో తన వంశ మూలాలున్న ఆయన, భారతమాత పుత్రులే. ఆ మేరకు నేడు స్వగ్రామమైన పార్సౌని ప్రజలు మాత్రమే కాకుండా భారతీయులందరూ ఆయన సాధించిన విజయాలపై గర్విస్తున్నారు. సెశెల్స్ అధ్యక్షుడుగా ఎన్నికవడం ప్రజాసేవలో ఆయన నిబద్ధతపై ప్రజలకుగల నమ్మకాన్ని ప్రస్ఫుటం చేసింది.
మిత్రులారా!
నేను 2015లో సెశెల్స్ సందర్శించిన సందర్భంగా లభించిన ఆదరణను ఓ తీయని జ్ఞాపకంగా నేనిప్పుడు మననం చేసుకుంటున్నాను. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాల్లో నా పర్యటన ఆరంభానికి తొలి గమ్యం ఈ దేశమే. సముద్రతీర పొరుగుతో సత్సంబంధాల్లో భారతదేశం-సెశెల్స్ దేశాలది కీలక భాగస్వామ్యం. ఈ ప్రాంతంలోని అన్ని దేశాలకూ ఎంతో ప్రధానమైన ‘సముద్ర- భద్రత, ప్రగతి’ అంశంపై భారత దృక్పథంలో సెశెల్స్ దేశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ మేరకు సెశెల్స్ భద్రత సామర్థ్యాల వృద్ధి, మౌలిక వసతుల-ప్రగతి అవసరాలను నెరవేర్చుకోవడంలో భారత్ భాగస్వామి కావడం మాకు లభించిన గౌరవం. మన సంబంధాల్లో ఈ రోజు కీలక మైలురాయిని సూచిస్తుంది. మన అభివృద్ధి భాగస్వామ్యంలో కింద పూర్తయిన అనేక కొత్త పథకాలకు ఇవాళ సంయుక్తంగా శ్రీకారం చుడుతుండటమే ఇందుకు కారణం.
మిత్రులారా!
ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలకూ స్వేచ్ఛాయుత, స్వతంత్ర, సమర్థ న్యాయవ్యవస్థ ఎంతో అవసరం. ఈ దిశగా సీషెల్స్ లో ‘కొత్త మేజిస్ట్రేట్ కోర్టు భవనం’ నిర్మాణానికి సహకారం అందించడంపై మాకెంతో సంతోషంగా ఉంది. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి పరీక్షా సమయంలోనూ ఈ అత్యాధునిక భవన నిర్మాణం పూర్తికావడం విశేషం. మన ఆత్మీయ, సుస్థిర స్నేహ సంబంధాలకు చిహ్నంగా ఇది కలకాలం గుర్తుండిపోతుందని నేను కచ్చితంగా చెప్పగలను. అభివృద్ధికి సహకారంలో మానవతా కేంద్రక విధానాన్ని భారత్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది. ఇవాళ ప్రారంభిస్తున్న పది అత్యున్నత ప్రాముఖ్యం గల సామాజిక అభివృద్ధి పథకాలు మా తాత్త్వికతను ప్రతిబింబిస్తాయి. సెశెల్స్ అంతటా గల వివిధ సామాజిక ప్రజా సమూహాల జీవనంలో ఈ పథకాలు ఆశావహ మార్పు తేవడం ఖాయం.
మిత్రులారా!
సెశెల్స్ సముద్ర భద్రత బలోపేతానికి భారత్ కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా భారతదేశంలో తయారైన అత్యాధునిక వేగవంతమైన గస్తీ నౌకను సెశెల్స్ తీరరక్షక దళానికి నేడు అందజేస్తున్నాం. సెశెల్స్ సముద్ర వనరుల రక్షణకు ఈ నౌక ఎంతగానో తోడ్పడుతుంది. ఇక వాతావరణ మార్పు సమస్య ముఖ్యంగా ద్వీప దేశాలకు ప్రత్యేక ముప్పుగా పరిణమిస్తుంది. అందుకే సీషెల్స్ లో భారత్ సహకారంతో నిర్మించిన ఒక మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఇక్కడి ప్రభుత్వానికి అప్పగించడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రకృతి పరిరక్షణతో ప్రగతివైపు సెశెల్స్ ప్రాథమ్యాలను ఈ పథకాలన్నీ ప్రతిబింబిస్తాయి.
మిత్రులారా!
కోవిడ్ మహమ్మారిపై ప్రపంచం చేపట్టిన యుద్ధంలో సెశెల్స్ బలమైన భాగస్వామిగా భారత్ తన వంతు పాత్ర పోషించడం మాకెంతో గౌరవం. అవసరమైన సమయాల్లో మేం సీషెల్స్ కు కావాల్సిన ఔషధాలతోపాటు 50,000 డోసుల 'భారత్ తయారీ' టీకాలను సరఫరా చేయగలిగాం. 'భారత్ తయారీ' కోవిడ్-19 టీకాలను అందుకున్న తొలి ఆఫ్రికన్ దేశం సెశెల్స్ కావడం ఈ సందర్భంగా గమనార్హం. కోవిడ్ అనంతర ఆర్థిక పునరుద్ధరణకు సెశెల్స్ ప్రయత్నాల్లో భారత్ స్థిరమైన మద్దతునిస్తుందని అధ్యక్షుడు రామ్‌కలావన్ గారికీ నేను హామీ ఇస్తున్నాను.
మిత్రులారా!
భారత్-సెశెల్స్ స్నేహసంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవి... అందుకు భారత్ ఎంతగానో గర్విస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రామ్‌కలావన్ గారికీ, సెశెల్స్ ప్రజలకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
అనేకానేక ధన్యవాదాలు.
నమస్తే.
***
(Release ID: 1710604)
Visitor Counter : 204
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam