ప్రధాన మంత్రి కార్యాలయం
నాలుగవ అంతర్జాతీయ ఆయుర్వేద ఉత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రిశ్రీ నరేంద్ర మోదీ
అంతర్జాతీయంగా ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది.: ప్రధానమంత్రి
ప్రపంచవ్యాప్త వెల్‌నెస్ పై అంతర్జాతీయ సమ్మేళనానికి ప్రధానమంత్రి పిలుపు
ఆయుర్వేదానికి పూర్తి మద్దతుకు హామీ
Posted On:
12 MAR 2021 9:46PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు నాలుగవ అంతర్జాతీయ ఆయుర్వేద ఉత్సవాన్ని ఉద్దేశించి వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, అంతర్జాతీయంగా ఆయుర్వేదంపై ఆసక్తి పెరుగుతున్నదని అంటూ , ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంపై పనిచేస్తున్న వారి కృషిని ఆయన అభినందించారు. ఆయుర్వేదం ఒక సంపూర్ణ మానవ శాస్త్ర విజ్ఞానమని ఆయన అన్నారు. మొక్కలనుంచి మన ఆహారం వరకు, శారీరక దారుఢ్యం నుంచి మానసిక ఆరోగ్యం వరకు ఆయుర్వేదం ప్రభావం, సంప్రదాయ ఔషధాల ప్రభావం చెప్పుకోదగినదని ఆయన అన్నారు.
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. అంతర్జాతీయంగా ఆయుర్వేదానికి మరింత ప్రాచుర్యం కల్పించడానికి ప్రస్తుత పరిస్థితులు అత్యంత అనువైనవని ఆయన అన్నారు. ఆయుర్వేదం పట్ల ప్రస్తుతం ఆసక్తి పెరుగుతున్నదని ఆయన అన్నారు. ప్రజల శ్రేయస్సుకు ఆధునిక , సంప్రదాయ వైద్యం రెండూ ఎంత ముఖ్యమో ప్రపంచం గమనిస్తున్నదని ఆయన అన్నారు. ఆయుర్వేద ప్రయోజనాలను, రోగనిరోధక శక్తి పెంపుదలలో దాని ప్రాధాన్యతను ప్రజలు తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు
. వెల్‌నెస్ టూరిజానికి గల పుష్కల అవకాశాల గురించి మాట్లాడుతూ ఆయన, వెల్‌నెస్ టూరిజం ప్రధాన సూత్రం, అనారోగ్యానికి చికిత్సను అందించడంతోపాటు , వారి శ్రేయస్సును మరింత పెంపొందించడమని అన్నారు. వెల్‌నెస్‌టూరిజానికి సంబంధించిన బలమైన స్తంభం ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యం అని ఆయన అన్నారు. ఒత్తిడి తగ్గించడానికి, చికిత్సకు సంబంధించి కాలానికి అతీతమైన భారతీయ విధానాల్లోని గొప్పదనాన్ని అందిపుచ్చుకోవలసిందిగా ఆయన ఈకార్యక్రమంలో పాల్గొన్న వారిని కోరారు. దేహానికి చికిత్స కావాలన్నా, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా భారతదేశానికి రండి అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ఆయుర్వేదానికి లభిస్తున్న ప్రజాదరణను, సంప్రదాయ వైద్యం, ఆధునిక వైద్యం రెండింటినీ సమ్మిళితంచేయడం వల్లవస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున యువత వివిధ రకాల ఆయుర్వేద ఉత్పత్తులను వాడుతుండడాన్నిఉదహరిస్తూ ప్రధానమంత్రి, ఆయుర్వేదాన్ని, రుజువులతో కూడిన ఆధునిక వైద్య శాస్త్ర విజ్ఞానంతో సమ్మిళితం చేసేస్పృహ పెరుగుతున్నదని ఆయన అన్నారు. ఆయుర్వేదంపైన . సంప్రదాయ వైద్య విధానాలపైన పరిశోధనలను మరింతలోతుగా చేపట్టాల్సిందిగా ఆయన అకడమీషియన్లను కోరారు. చైతన్యవంతమైన స్టార్టప్ సమాజం ఆయుర్వేద ఉత్పత్తులను ప్రత్యేకంగా చూడాలన్నారు. మన సంప్రదాయ చికిత్సా పద్ధతులనుఅంతర్జాతీయంగా అర్ధమయ్యేవిధంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వంవైపునుంచి ఆయుర్వేదానికి పూర్తి మద్దతు నిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.నేషనల్ ఆయుష్ మిషన్ తక్కువ ఖర్చుతో ఆయుష్ సేవల ద్వారా ఆయుష్ వైద్య పద్ధతులను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఆయుర్వేద, సిద్ద, యునాని, హోమియోపతి మందుల నాణ్యతా ప్రమాణాలను అమలు చేసేందుకు, ఆయా సదుపాయాలు, వైద్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. అలాగు ఇందుకు అవసరమైన ముడిసరుకు నిరంతరాయంగా అందేట్టు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వం వివిధ నాణ్యతా ప్రమాణాలను కూడా చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఆయుర్వేదం, ఇతర భారతీయ వైద్య విధానాలకు సంబంధించి మా విధానం సంప్రదాయ వైద్య వ్యూహం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 2014-2023 తో ఇప్పటికే అనుసంధానమై ఉందని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సంప్రదాయ వైద్యానికి సంబంధించి అంతర్జాతీయ కేంద్రాన్ని ఇండియాలో ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించిందని ఆయన అన్నారు.
ఆయుర్వేదం, సంప్రదాయవైద్య విధానాలను అధ్యయనం చేసేందుకు వివిధ దేశాలనుంచి ఎంతోమంది విద్యార్ధులు మనదేశానికి వస్తున్నవిషయాన్నిప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ప్రపంచ వ్యాప్త వెల్‌నెస్ గురించి ఆలోచించడానికి ఇది అనువైన సమయమని ఆయన అన్నారు. ఈ అంశంపై అంతర్జాతీయ శిఖరాగ్ర సమ్మేళనం ఏర్పాటు కావాలని ఆయన సూచించారు.
ఆయుర్వేదానికి సంబంధించిన ఆహార పదార్ధాలు, ఆరోగ్యాన్నిపెంపొందించే ఆహారపదార్ధాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చిరుధాన్యాల ప్రయోజనాలపై ప్రజలలో అవగాహన పెంపొందించాల్సిందిగా ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆయుర్వేదంలో మన విజయాలను కొనసాగించాలని, ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆయుర్వేదం ఒక శక్తిగా ఉండాలి.ఇది ప్రపంచాన్ని మన దేశానికి చేరువ చేస్తుంది. ఇది మన యువతకు సుసంపన్నతనిస్తుంది అని ప్రధానమంత్రి అన్నారు.
***
(Release ID: 1704596)
Visitor Counter : 177
Read this release in:
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam