ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్ - స్వీడన్ వర్చువల్ సమ్మిట్


Posted On: 05 MAR 2021 7:20PM by PIB Hyderabad

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీమరియు స్వీడన్ ప్రధానమంత్రి గౌరవనీయులు స్టీఫన్ లోఫ్వెన్ ఈ రోజు దృశ్యమాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, వారు ద్వైపాక్షిక సమస్యలతో పాటు పరస్పర ప్రయోజనకరమైన ఇతర ప్రాంతీయ, బహుపాక్షిక సమస్యలపై చర్చించారు.

మార్చి, 3వ తేదీన జరిగిన హింసాత్మక దాడి నేపథ్యంలో స్వీడన్ ప్రజలతో ప్రధానమంత్రి మోదీ సంఘీభావం తెలిపారు. ఈ దాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

ప్రధమ భారత-నార్డిక్ సదస్సు కోసం, 2018 లో తమ స్వీడన్ పర్యటనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా, 2019 డిసెంబర్ లో గౌరవనీయులు స్వీడన్ రాజు మరియు స్వీడన్ రాణి దంపతుల భారత పర్యటనను కూడా ప్రధానమంత్రి గుర్తుచేశారు.

భారత, స్వీడన్ దేశాల మధ్య దీర్ఘకాలిక సన్నిహిత సంబంధాలు - ప్రజాస్వామ్యం, చట్ట పాలన, బహుత్వవాదం, సమానత్వం, వాక్ స్వాతంత్య్రం మరియు మానవ హక్కులపై గౌరవం వంటి భాగస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయని ఇరువురు నాయకులు నొక్కిచెప్పారు. బహుపాక్షికత, నియమాల ఆధారిత అంతర్జాతీయ విధానం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పాటు, శాంతి, భద్రతల కోసం పనిచేయడం కోసం వారి బలమైన నిబద్ధత గురించి కూడా ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్ మరియు ఈ.యు. దేశాలతో భారతదేశ భాగస్వామ్యం పెరుగుతున్నట్లు వారు గుర్తించారు.

భారత, స్వీడన్ దేశాల మధ్య విస్తృతంగా కొనసాగుతున్న ఒప్పందాలను ఇరువురు నాయకులు సమీక్షించారు. అదేవిధంగా, 2018 లో ప్రధానమంత్రి మోదీ స్వీడన్ పర్యటన సందర్భంగా అంగీకరించిన సంయుక్త కార్యాచరణ ప్రణాళిక, సంయుక్త ఆవిష్కరణల భాగస్వామ్యం అమలుపై కూడా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్య ఒప్పందాల కింద ఇతివృత్తాలను మరింత వైవిధ్యపరిచే మార్గాలను వారు అన్వేషించారు.

అంతర్జాతీయ సౌర కూటమి (ఐ.ఎస్.ఏ) లో చేరాలని స్వీడన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు. 2019, సెప్టెంబర్ లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యాచరణ సదస్సు సందర్భంగా ప్రారంభమైన - భారత-స్వీడన్ ఉమ్మడి ప్రారంభ చర్య - "లీడర్‌షిప్ గ్రూప్ ఆన్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్ఐటి)" లో పెరుగుతున్న సభ్యత్వాల గురించి కూడా ఇరువురు నాయకులు చర్చించారు.

టీకాలు వేయడంతో సహా, కోవిడ్-19 పరిస్థితిపై ఇరువురు నాయకులు చర్చించారు. అన్ని దేశాలలో టీకాలు అత్యవసరంగా, సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచవలసిన అవసరాన్ని కూడా వారు నొక్కి చెప్పారు.

*****

 


(Release ID: 1702855)