ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళ నాడు లోని కోయంబత్తూరు లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
Posted On:
25 FEB 2021 6:56PM by PIB Hyderabad
తమిళ నాడు గవర్నరు శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పళనిస్వామి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ ఒ.పన్నీర్ సెల్వం గారు, నా మంత్రిమండలి సహచరులు ప్రహ్లాద్ జోశీ గారు, తమిళ నాడు ప్రభుత్వం లో మంత్రి శ్రీ వేలుమణి గారు, విశిష్ట అతిథులు, మహిళలు, సజ్జనులారా.
వణక్కమ్.
కోయంబత్తూరు కు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది పారిశ్రామిక, ఆవిష్కరణల నగరం. కోయంబత్తూరు కు, యావత్తు తమిళ నాడు కు ప్రయోజనం కలిగించే అభివృద్ధి పనులను ఇవాళ మనం ప్రారంభించుకొంటున్నాం.
మిత్రులారా,
భవానీ సాగర్ ఆనకట్ట ఆధునికీకరణ కు శంకుస్థాపన చేస్తున్నాం. ఇది రెండు లక్షల ఎకరాలకు పైగా భూమి కి సాగు నీటి ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు తో ముఖ్యంగా- ఈరోడ్, తిరుప్పూర్, కరూర్ జిల్లా లు ప్రయోజనాన్ని పొందుతాయి. ఈ జిల్లాలలో మన రైతులు అందరికీ ఈ ప్రాజెక్టు ఎంతో లబ్ధి ని అందించనుంది. ఈ సందర్భం లో మహనీయుడు తిరువళ్లువర్ మాటలు నాకు గుర్తుకు వస్తున్నాయి.
உழுதுண்டு வாழ்வாரே வாழ்வார்மற் றெல்லாம் (ఉళుదుండు వాళ్వారే వాళ్వార్; தொழுதுண்டு பின்செல் பவர். మట్రెల్లాం తొళుదుండు పిన్ సెల్వవర్)...
ఈ మాటలకు “రైతులు మాత్రమే నిజంగా జీవించే వారు; మిగిలిన వారంతా వారి వల్లనే జీవిస్తారు; వారిని ఆరాధిస్తారు” అని భావం.
మిత్రులారా,
భారత పారిశ్రామిక ప్రగతి కి తమిళ నాడు ఇతోధికంగా తోడ్పడుతోంది. పరిశ్రమలు ఎదగాలంటే ప్రాథమికంగా అవసరమైన వాటిలో నిరంతరాయ విద్యుత్ సరఫరా ఒకటి. ఈ నేపథ్యం లో ఇవాళ రెండు ప్రధాన విద్యుదుత్పాదన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు మరొకదానికి శంకుస్థాపన చేస్తుండటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. నైవేలి లిగ్నైట్ కార్పొరేశన్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సి) తిరునెల్ వేలి, తూత్తుకుడి, రామనాథపురం, విరుధునగర్ జిల్లాలలో 3వేల కోట్ల రూపాయల వ్యయం తో 709 మెగావాట్ సౌర విద్యుత్తు ప్రాజెక్టు ను అభివృద్ధి చేసింది. అలాగే ‘ఎన్‌ఎల్‌సి’ 7,800 కోట్ల రూపాయలతో నిర్మించిన 1000 మెగావాట్ తాప ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టు తమిళ నాడు ప్రగతి కి దోహదపడనుంది. ఈ ప్రాజెక్టు లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు లో 65 శాతానికి పైగా విద్యుత్తు ను తమిళ నాడు కే ఇవ్వడం జరుగుతుంది.
మిత్రులారా,
సముద్ర ఆధారిత వర్తకం లో, రేవు ఆధారిత అభివృద్ధి లో తమిళ నాడు కు ఉజ్వల చరిత్ర ఉంది. దీనికి తగినట్లుగా తూత్తుకుడి లోని వి.ఒ. చిదంబరనార్ రేవు సంబంధిత వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఈ సందర్భం లో గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వి.ఒ.సి కృషి ని మననం చేసుకుందాం. బలమైన నౌకా పరిశ్రమ, నావికా సంబంధ అభివృద్ధి విషయం లో ఆయన దార్శనికత మనకు స్ఫూర్తి ని ఇస్తుంది. ఇవాళ ప్రారంభిస్తున్న ప్రాజెక్టుల తో ఈ రేవు లో సరకుల రవాణా నిర్వహణ మరింత బలోపేతం అవుతుంది. దీంతో పాటు హరిత రేవుల అభివృద్ధి లో మన చొరవ కు ఊతమిస్తుంది. అంతేకాకుండా తూర్పు తీరం లో ఈ రేవు ను ఓ పెద్ద నౌకా రవాణా కూడలి గా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటాం. మన రేవులు మరింత సమర్థంగా రూపొందితే భారతదేశం స్వయంసమృద్ధం కావడం సహా అంతర్జాతీయ వాణిజ్య, రవాణా కూడలి గా అభివృద్ధి చెందగలదు. రేవు ల ఆధారిత అభివృద్ధి కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ని ‘సాగర మాల’ పథకం ప్రస్ఫుటం చేస్తుంది. ఈ పథకం లో భాగం గా 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయం తో 2015-2035 మధ్యకాలం లో సుమారు 575 ప్రాజెక్టుల ను అమలు చేయబోతున్నాం. “రేవుల ఆధునికీకరణ, కొత్త రేవుల అభివృద్ధి, రేవుల అనుసంధానం పెంపు, రేవు తో ముడిపడిన పారిశ్రామికీకరణ, తీరప్రాంత సామాజికాభివృద్ధి” తదితరాలు ఇందులో భాగం గా ఉంటాయి.
చెన్నై లోని శ్రీపెరంబుదూరు సమీపాన గల మాప్పేట్ లో త్వరలోనే బహుముఖ సరకు రవాణా పార్కు ను ప్రారంభించబోతున్నామని ప్రకటించడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. మరో వైపు ‘సాగర మాల’ పథకంలో భాగంగానే 8 వరుసల కోరంపళ్లం బ్రిడ్జి తో పాటు రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపడతాం. ఈ ప్రాజెక్టు వల్ల రేవు కు వాహన రాకపోక ల రద్దీ సజావు గా, నిరంతరాయం గా సాగిపోయేందుకు వీలవుతుంది. దీంతో పాటు సరకు రవాణా ట్రక్కుల కు సమయం కలిసివస్తుంది.
మిత్రులారా,
ప్రగతి, పర్యావరణ పరిరక్షణ పరస్పరం ముడిపడిన అంశాలు. ఈ నేపథ్యం లో వి.ఒ.సి. రేవు ఇప్పటికే 500 కిలోవాట్ రూఫ్ టాప్ సోలర్ పవర్ ప్లాంటు ను ఏర్పాటు చేసింది. మరో 140 కిలోవాట్ ప్రాజెక్టు ఏర్పాటు పనులు కూడా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా గ్రిడ్ తో సంధానితమైన భూమి మీద నిర్మించే 5 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు పని ని వి.ఒ.సి. రేవు యాజమాన్యం దాదాపు 20 కోట్ల రూపాయలతో చేపట్టడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. రేవు వినియోగించే మొత్తం విద్యుత్తు లో 60 శాతం అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. శక్తి స్వయంసమృద్ధి కి ఇది ఒక సిసలైన ఉదాహరణ.
ప్రియ మిత్రులారా,
అభివృద్ధి లో వ్యక్తుల ఆత్మగౌరవాని కి భరోసా ను కల్పించడమనేది ఓ కీలకాంశం. ప్రతి ఒక్కరికీ తలదాచుకునేందుకు ఇంత నీడ ను చూపించడం ఇందుకుగల మార్గాల్లో ఒకటి. మన పౌరుల ఆకాంక్షలకు, వారి స్వప్నాలకు రెక్కలు తొడగటం లక్ష్యం గా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ను ప్రారంభించడమైంది.
మిత్రులారా,
ఈ నేపథ్యం లో 4,144 అద్దె ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించడం నాకు దక్కిన మహదవకాశం గా భావిస్తున్నాను. ఇవన్నీ తిరుప్పూర్, మదురై, తిరుచిరాపల్లి జిల్లాల లో నిర్మాణం అయ్యాయి. ఈ ప్రాజెక్టు కు 332 కోట్ల రూపాయల ఖర్చు కాగా, 70 ఏళ్ల సుదీర్ఘ స్వతంత్ర భారతదేశం లో ఈనాటి కి కూడా తల తాచుకొనే నీడ కు నోచుకోని పేదలకు ఈ ఇళ్ల ను అప్పగిస్తాంచడం జరుగుతుంది.
మిత్రులారా,
తమిళ నాడు భారీ పట్టణీకరణ చెందిన రాష్ట్రం. ఈ నగరాల సర్వతోముఖాభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం, తమిళ నాడు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి తో ఉన్నాయి. తమిళ నాడు లోని స్మార్ట్ సిటీస్ లో సమీకృత కమాండ్-కంట్రోల్ సెంటర్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ నగరాలన్నిటిలో వివిధ సేవల నిర్వహణ కు తగిన మేధోశక్తి గల సమీకృత సమాచార సాంకేతిక సదుపాయాలు అందుబాటు లోకి రాగలవు.
మిత్రులారా,
ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టు లు తమిళ నాడు లోని ప్రజల జీవితాలకు, జీవనోపాధి కి భారీ స్థాయి లో ఉత్తేజాన్ని ఇవ్వగలవన్న విశ్వాసం నాకు మెండు గా ఉంది. ఈ నేపథ్యం లో ఇవాళ కొత్త ఇళ్ల ను అందుకుంటున్న కుటుంబాలన్నిటికి ఇవే నా శుభాకాంక్షలు. మేము ప్రజల కలలను నెరవేర్చడానికి, స్వయం సమృద్ధియుత భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తూనే ఉంటాం.
మీకు ధన్యవాదాలు.
అనేకానేక ధన్యవాదాలు.
వణక్కమ్.
***
(Release ID: 1700982)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam