మంత్రిమండలి

భారత్‌-మారిషస్‌ మధ్య సమగ్ర ఆర్థిక సహకార-భాగస్వామ్య ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Posted On: 17 FEB 2021 3:57PM by PIB Hyderabad

   భారత్‌, మారిషస్ దేశాలమధ్య సమగ్ర ఆర్థిక సహకార-భాగస్వామ్య ఒప్పందం (సీఈసీపీఏ)పై సంతకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

   భారత్‌, మారిషస్  దేశాలు సంతకాలు చేయనున్న ‘సీఈసీపీఏ’- ఆఫ్రికా ఖండంలోని ఒక దేశంతో భారత్‌ కుదుర్చుకున్న తొలి వాణిజ్య ఒప్పందం. ఇదొక పరిమిత ఒప్పందం కాగా- ఇందులో వస్తు వాణిజ్యం, ఉత్పత్తి మూలం నిబంధనలు, సేవలలో వాణిజ్యం, వాణిజ్యానికి సాంకేతిక అవరోధాలు (టీబీటీ), మానవ-జంతు-వృక్ష పరిరక్షణ (ఎస్‌పీఎస్‌) చర్యలు, వివాద పరిష్కారం, వ్యక్తుల సహజ రాకపోకలు (ఎంఎన్‌పీ), టెలికం, ఆర్థిక సేవలు, ఎగుమతి-దిగుమతి విధానాలు, ఇతరత్రా రంగాల్లో సహకారం వంటివి భాగంగా ఉంటాయి.

ప్రభావం - ప్రయోజనాలు

   ఉభయ దేశాల మధ్య వాణిజ్యానికి ప్రోత్సాహం, మెరుగు దిశగా ఈ ఒప్పందం ఒక సంస్థాగత యంత్రాంగం ఏర్పాటుకు దోహదం చేస్తుంది. కాగా, భారత్‌- మారిషస్‌ల మధ్య ఈ ఒప్పందంవల్ల  310 రకాల వస్తువులను భారత్‌ ఎగుమతి చేయగలుగుతుంది. ఈ వస్తువుల జాబితాలో ఆహార పదార్థాలు/ పానీయాలు (80 లైన్లు), వ్యవసాయ ఉత్పత్తులు (25 లైన్లు), జౌళి/వస్త్ర ఉత్పత్తులు (27 లైన్లు) ప్రాథమిక లోహాలు/వాటి ఉత్పత్తులు (32 లైన్లు), ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ వస్తువులు (13లైన్లు), ప్లాస్టిక్స్/రసాయనాలు (20లైన్లు), కలప/కొయ్య ఉత్పత్తులు (15లైన్లు) తదితరాలు ఉంటాయి. అదేవిధంగా మారిషస్‌ 615 ఉత్పత్తులను భారత్‌లో ప్రాధాన్య విపణి లభ్యత ఉంటుంది. ఈ మేరకు శీతలీకరించిన చేపలు, ప్రత్యేక చక్కెర, బిస్కెట్లు, తాజా పండ్లు, పండ్లరసాలు, మినరల్ వాటర్, బీరు, ఆల్కహాల్ పానీయాలు, సబ్బులు, బ్యాగులు, వైద్య/ శస్త్రచికిత్స పరికరాలు, దుస్తులు వంటివాటిని భారత్‌కు ఎగుమతి చేయవచ్చు.

   సేవల వాణిజ్యానికి సంబంధించి భారత సేవాప్రదాన సంస్థలకు 11 విస్తృత సేవా రంగాల పరిధిలోని సుమారు 115 ఉప-రంగాలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు వృత్తిపరమైన సేవలు, కంప్యూటర్ సంబంధ సేవలు, పరిశోధన-అభివృద్ధి, ఇతర వాణిజ్య సేవలు, టెలికమ్యూనికేషన్, నిర్మాణం, పంపిణీ, విద్య, పర్యావరణ, ఆర్థిక, పర్యాటక/ప్రయాణ సంబంధ, వినోద, యోగా, దృశ్య-శ్రవణ, రవాణా సేవలు అందించే వీలుంటుంది. అదే విధంగా మారిషస్‌ సేవా ప్రదాన సంస్థలకు భారత్‌లో 11 విస్తృత సేవారంగాల పరిధిలోని 95 ఉప-రంగాలు అందుబాటులో ఉంటాయి. ఆ మేరకు వృత్తిపరమైన సేవలు, పరిశోధన-అభివృద్ధి, ఇతర వాణిజ్య సేవలు, టెలికమ్యూనికేషన్, ఆర్థిక, పంపిణీ, ఉన్నత విద్య, పర్యావరణ, ఆరోగ్యం, పర్యాటక/ప్రయాణ సంబంధ, వినోద, రవాణా తదితర సేవారంగాల్లో అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాక రెండేళ్లలోగా పరిమిత సంఖ్యలో అత్యంత కీలక వస్తువులకు సంబంధించి ‘ఆటోమేటిక్ ట్రిగ్గర్ సేఫ్‌గార్డ్‌ మెకానిజం’పై సంప్రదింపులు చేపట్టడంపై ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి.

కాలవ్యవధి

   ఈ ఒప్పందంపై రెండు దేశాలకు చెందిన సంబంధిత వర్గాలు పరస్పర అనుకూల తేదీనాడు సంతకాలు చేయనున్నాయి. అనంతరం తదుపరి నెల 1వ తేదీనుంచి ఇది అమలులోకి వస్తుంది.

నేపథ్యం

   భారత్‌-మారిషస్‌ మధ్య అద్భుత ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. ఇవి చారిత్రక/సాంస్కృతిక సంబంధాలతోపాటు తరచూ ఉన్నత-స్థాయి పరస్పర రాజకీయ సంప్రదింపులు, అభివృద్ధి సహకారం, రక్షణ/సముద్ర భాగస్వామ్యం, ప్రజల మధ్య అనుసంధానం తదితరాలతో మరింత పరిపుష్టమయ్యాయి. భారత్‌కు మారిషస్ ఓ ముఖ్యమైన ప్రగతి భాగస్వామిగానూ కొనసాగుతోంది. భారత్ 2016లో మారిషస్‌కు 353 మిలియన్ డాలర్ల ‘ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ’ ప్రకటించింది. దీని అమలులో భాగంగా చేపట్టిన ఐదు ప్రాజెక్టులలో మారిషస్‌ సుప్రీంకోర్టు కొత్త భవన నిర్మాణం ఒకటి కాగా, 2020 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్‌ జుగ్నౌత్‌ దీన్ని సంయుక్తంగా ప్రారంభించారు. అంతకుముందు 2019 అక్టోబరులో రెండు దేశాల ప్రధానమంత్రులు సంయుక్తంగా మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ ప్రాజెక్టు తొలిదశకు ప్రారంభోత్సవం చేశారు. అలాగే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద మారిషస్‌లో నిర్మించిన 100 పడకల అత్యాధునిక ‘ఇఎన్‌టి’ ఆస్పత్రిని కూడా వారు ప్రారంభించారు.

   మారిషస్‌తో వాణిజ్యంలో 2005 నుంచి భారత్‌ అతిపెద్ద భాగస్వామి కాగా, అతిపెద్ద వస్తుసేవల ఎగుమతిదారుగానూ కొనసాగుతోంది. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం సమాచారం ప్రకారం... 2019లో మారిషస్‌ నుంచి దిగుమతులలో భారత్‌ (13.85శాతం), చైనా (16.69 శాతం), దక్షిణాఫ్రికా (8.07శాతం), యూఏఈ (7.28 శాతం) ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ఇక భారత్‌-మారిషస్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2005-06 ఆర్థిక సంవత్సరంలో 206.76 మిలియన్‌ డాలర్లు కాగా, 2019-20 నాటికి 690.02 మిలియన్‌ డాలర్ల స్థాయికి దూసుకుపోగా 233 శాతం వృద్ధి నమోదైంది. భారత్‌ నుంచి మారిషస్‌కు ఎగుమతులు 2005-06 ఆర్థిక సంవత్సరంలో 199.43 మిలియన్‌ డాలర్లు కాగా, 2019-20 నాటికి 662.13 మిలియన్‌ డాలర్ల స్థాయికి పెరిగిన నేపథ్యంలో 232 శాతం వృద్ధి నమోదైంది. ఇక మారిషస్‌ నుంచి భారత్‌ దిగుమతులు 2005-06లో 7.33 మిలియన్‌ డాలర్లు కాగా, 2019-20 నాటికి 280 శాతం పెరిగి, 27.89 మిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో భారత్‌-మారిషస్‌ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న లోతైన ప్రత్యేక సౌహార్ద సంబంధాలు ‘సీఈసీపీఏ’తో మరింత బలోపేతం కానున్నాయి.

 

****(Release ID: 1698780) Visitor Counter : 29