ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్ మహమ్మారి సంక్షోభంలోనూ వ్యవసాయం వృద్ధిరేటు 3.4శాతం!

ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో వ్యవసాయానిదే కీలకపాత్ర

వ్యవసాయ సంస్కరణలు పరిష్కార మార్గాలే: ఆర్థిక సర్వే

Posted On: 29 JAN 2021 3:39PM by PIB Hyderabad

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ల కష్టాలనుంచి భారతీయ వ్యవసాయ రంగం క్రమంగా కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. 2020-21 సంవత్సరంలో తొలి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు 3.4శాతంగా ఆర్థిక సర్వే తెలుపుతోంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ఈ ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టారు.

  జాతీయ ఆదాయంపై కేంద్ర గణాంక వ్యవహారాల కార్యాలయం 2020 మే 29న వెలువరించిన తాత్కాలిక అంచనాల లెక్కల ప్రకారం 2019-20వ సంవత్సరానికి దేశం స్థూల విలువల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా ప్రస్తుత ధరల ప్రకారం 17.8శాతంగా ఉంది.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AVCA.jpg

రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి

  2019-20వ వ్యవసాయ సంవత్సరంలో (నాలుగవ ముందస్తు అంచనాల ప్రకారం) దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 29.65 కోట్ల టన్నులకు చేరినట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2018-19వ సంవత్సరపు ఆహార ఉత్పత్తికంటే ఇది 1.14 కోట్ల టన్నులు ఎక్కువ. 2018-19వ సంవత్సరంలో 28.52 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002763J.jpg

 

వ్యవసాయ ఎగుమతులు

  2019-20వ సంవత్సరంలో భారతదేశంలో వ్యవసాయ, అనుబంధ రంగాల ఎగుమతులు దాదాపు రూ. 2.52లక్షల కోట్ల వరకూ ఉన్నట్టు ఆర్థిక సర్వే పేర్కొంది.  ప్రధానంగా అమెరికా, సౌదీ అరేబియా, ఇరాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఈ ఎగుమతులు జరిగినట్టు సర్వే తెలిపింది. సముద్ర ఉత్పత్తులు, బాస్మతీ బియ్యం, సుగంధ ద్రవ్యాలు, బాస్మతియేతర రకాల బియ్యం, ముడి ప్రత్తి, గానుగపిండి, గానుగ చెక్క, చక్కెర, ఆముదం, తేయాకు వంటి ఉత్పత్తులు ఈ ఎగుమతుల్లో ప్రధానంగా ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం ముందువరసలో ఉండగా, ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో భారతదేశపు వ్యవసాయ ఎగుమతుల వాటా 2.5శాతానికి పైచిలుకుగా  ఉంది.

 

కనీస మద్దతు ధర(ఎం.ఎస్.పి.)

  వ్యవసాయ ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్ల స్థాయిలో కనీస మద్దతు ధరను (ఎం.ఎస్.పి.ని) ఉంచబోతున్నట్టు 2018-19 సంవత్సరం బడ్జెట్ ప్రకటించిందని, ఈ సూత్రం ఆధారంగానే 2020-21వ సంవత్సరపు ఖరీఫ్, రబీసీజన్ల పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ఇటీవలే పెంచిందని ఆర్థిక సర్వే పేర్కొంది.

 

 

 

వ్యవసాయ సంస్కరణలు

  ఇటీవల చేపట్టిన వ్యవసాయ సంస్కరణలను కూడా ఆర్థిక సర్వే తన నివేదికలో ప్రస్తావించింది. “దేశంలోని రైతుల జనాభాలో 85శాతంగా ఉన్న చిన్నకారు, మధ్యతరహా రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవసాయ సంస్కరణలపై 3 చట్టాలు రూపొందాయని, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ వాణిజ్యం పరిధిలో ఇబ్బందులు పడుతున్న రైతుల ప్రయోజనాలకోసమే ఈ చట్టాలు తీసుకువచ్చారని ఆర్థిక సర్వే తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు మార్కెట్ స్వేచ్ఛలో కొత్త యుగానికి నాంది పలుకుతాయని, భారతదేశంలోని రైతుల సంక్షేమానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.   

 

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్

  వ్యవసాయ, ఆహార నిర్వహణా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద కొన్ని ప్రధాన చర్యలను ప్రభుత్వం చేపట్టినట్టు ఆర్థిక సర్వే తెలిపింది.  లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి; సూక్ష్మ ఆహార సంస్థల చట్టబద్ధ సంస్థలుగా రూపొందించేందుకు రూ. 10,000 కోట్లతో పథకం; ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి.ఎం.ఎం.ఎస్.వై.) ద్వారా మత్స్యకారులకు రూ.  20,000 కోట్లు; జంతువుల వ్యాధి నియంత్రణకోసం జాతీయ పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి రూ. 15,000 కోట్లు; నిత్యావసర సరకుల చట్టానికి సంస్కరణలు; వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయ ఉత్పత్తి ధరల నిర్ణాయక, నాణ్యతా నిర్ధారణ, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన; ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు; వంటి పథకాలను, కార్యక్రమాలను ఆర్థిక సర్వే ఉదహరించింది.

 

వ్యవసాయ పరపతి

   దేశంలో సరైన వనరులకు ఏ మాత్రం నోచుకోని చిన్న, సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, దేశంలో వ్యవసాయ కార్యకలాపాలు విజయవంతం కావాలంటే సకాలంలో తగిన రుణ సదుపాయం, పరపతి సౌకర్యం రైతులకు అందుబాటులో ఉండటం చాలా అవసరమని ఆర్థిక సర్వే తెలిపింది. 2019-20వ సంవత్సరానికి వ్యవసాయ రుణ సరఫరాకు నిర్దేశిత లక్ష్యం రూ. 13,50,000కోట్లు కాగా,  ఈ లక్ష్యాన్ని మించి రూ. 13,92,469.81కోట్ల మేర రుణాలను అందించినట్టు ఆర్థిక సర్వే తెలిపింది. ఇక 2020-21 సంవత్సరానికి వ్యవసాయ రుణాల నిర్దేశిత లక్ష్యం రూ.  15,00,000 కోట్లుకాగా,  2020 నవంబరు 30 వరకు రూ. 9,73,517.80 కోట్ల రుణాల పంపిణీ జరిగినట్టు సర్వే తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కారణంగా, వ్యవసాయ రంగానికి రుణాల సరఫరా మరింత పెరుగుతుందని కూడా ఆర్థిక సర్వే అంచనా వేసింది.

  2020 ఫిబ్రవరిలో బడ్జెట్లో చేసిన ప్రకటన దరిమిలా పశుపోషణ రంగాన్ని కిసాన్ క్రెడిట్ కార్డులో పొందుపరిచిన అనంతరం వివిధ సహకార సంఘాలు, పాలఉత్పత్తి కంపెనీలకు చెందిన  కోటిన్నరమంది పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు.  ఇక,  2021 జనవరి మధ్యకాలానికల్లా మొత్తం 44,673 కిసాన్ క్రెడిట్ కార్డులను మత్స్యకారులకు, మత్స్య పరిశ్రమ రైతులకు జారీ చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డులకోసం మత్స్య పరిశ్రమ రైతులు, మత్స్యకారులనుంచి అదనంగా అందిన 4.04లక్షల దరఖాస్తులు వివిధ బ్యాంకుల వద్ద పరిశీలన దశల్లో ఉన్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది.

 

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై.)

   అతి తక్కువ స్థాయిలో ఒకే రకమైన ప్రీమియం చెల్లింపుతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పంటనష్టం కింద బీమా పరిహారం అందించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై.)  ఒక మైలురాయి వంటిదని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. పి.ఎం.ఎఫ్.బి.వై. కింద ప్రతి ఏడాది ఐదున్నర కోట్ల మందికి పైగా రైతులకు బీమా పరిహారం వర్తింరజేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 12నాటికి ఈ పథకం కింద రూ. 90,000కోట్ల విలువైన క్లెయిములను ఇప్పటికే చెల్లించారు. క్లెయిములకు సంబంధించిన పరిహారం మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి వేగంగా జమచేసేందుకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ ఎంతగానో దోహదపడింది. కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో కూడా దాదాపు 70లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం అందింది.    రూ. 8741.30 కోట్ల మేర పరిహారం లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ అయింది.  

 

పి.ఎం. కిసాన్

పి.ఎం.కిసాన్ పథకం కింద 2020 డిసెంబరు నెలలో దేశవ్యాప్తంగా ఉన్న 9కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 18,000కోట్ల మేర సొమ్మును నేరుగా జమచేసినట్టు ఆర్థిక సర్వే తెలిపింది. పి.ఎం. కిసాన్ పథకంలో భాగంగా ఏడవ విడత చెల్లింపు కింద ఈ సొమ్మును వారి ఖాతాల్లోకి జమచేసినట్టు ఆర్థిక సర్వే  నివేదికపేర్కొంది. 

 

పశుపోషణ రంగం

  2014-15నుంచి 2018-19 వరకూ పశు పోషణ రంగం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సి.ఎ.జి.ఆర్.) 8.24శాతంగా నమోదైనట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2020వ సంవత్సరపు జాతీయ ఖాతాల గణాంకాల ప్రకారం వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తిలో పశుపోషణ రంగం స్థూల వాటా 2014-15లో 24.32శాతంగా నమోదైంది. 2018-19వ సంవత్సరంలో ఈ వాటా 28.63శాతానికి పెరిగింది. 2018-19లో నమోదైన మొత్తం వృద్ధి విలువలో పశుపోషణ రంగం వాటా 4.19శాతంగా నమోదైంది.   

 

మత్స్య పరిశ్రమ

  2019-20లో భారత దేశంలో చేపల ఉత్పత్తి ఇదివరకెన్నడూ లేనంత స్థాయికి పెరిగిందని,  1.41కోట్ల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి జరిగిందని ఆర్థిక సర్వే పేర్కొంది. దీనికి తోడు,. జాతీయ ఆర్ఖిక వ్యవస్థ వృద్ధిలో మత్స్య పరిశ్రమ రంగం చేర్చిన స్థూల వాటా రూ. 2,12,915కోట్లుగా నమోదైందని ఆర్థిక సర్వే తెలిపింది.

 

ప్రధానమంత్రి కబీర్ కల్యాణ్ అన్న యోజన (పి.ఎం.-జి.కె.ఎ.వై.)

  2020-21 ఆర్థిక సంవత్సర కాలంలో ఆహార ధాన్యాల కేటాయింపు రెండు మార్గాల ద్వారా జరిగినట్టు ఆర్థిక సర్వే నివేదిక తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.), ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పి.ఎం.-జి.కె.ఎ.వై.) పథకం ద్వారా ఆహార ధాన్యాల కేటాయింపు జరిగినట్టు ఆర్థికసర్వే పేర్కొంది. ప్రస్తుతం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టం అమలవుతోంది. ఈ చట్టం ద్వారానే ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నెలవారీగా ఆహారధాన్యాల కేటాయింపు జరుగుతోంది. ఇక, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద కోవిడ్-19 సమస్యకు ఆర్థికపరమైన ప్రతిస్పందనగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. లక్ష్యంగా నిర్దేశించుకున్న లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి ఉచితంగా నెలకు ఐదు కిలోగ్రామల చొప్పున అదనంగా ఆహార ధాన్యాల కేటాయింపు జరిపేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.  (అంటే, ఈ పథకం కింద అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులకు ప్రాధాన్యతా ప్రాతిపదికగా ఆహార ధాన్యాలను అందిస్తారు.)  ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 80.96 కోట్ల మంది లబ్ధిదారులకు అదనంగా ఆహార ధాన్యాలను అందజేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని వారికి 2020 నవంబరు వరకూ ఒక్కో వ్యక్తికి నెలకు 5కేజీల చొప్పున ఆహార ధాన్యాలను అందించారు. రూ. 75,000కోట్ల వ్యయంతో 2కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందించారు. అంతేకాక, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఒక్కో వ్యక్తికి ఐదు కేజీల చొప్పున మేనుంచి ఆగస్టు వరకూ నాలుగు నెలలపాటు ఆహార ధాన్యాలను పంపిణీ చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టానికిగానీ, రేషన్ కార్డుల పథకానికి గానీ వర్తించని దాదాపు 8కోట్ల మంది వలసకూలీలకు ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున ఆహార ధాన్యాలు అందించారు.  

 

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు

2018-19వ సంవత్సరంతో ముగిసిన గత ఐదేళ్లలో, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రంగం సగటున దాదాపు 9.99శాతం వార్షిక వృద్ధి రేటును  సాధించింది. 2011-12 ధరలతో పోల్చినపుడు వ్యవసాయంలో 3.12శాతం, తయారీరంగంలో 8.25శాతం వృద్ధి నమోదైంది.

 

*****



(Release ID: 1693458) Visitor Counter : 384