ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మరో కీలకమైన మైలురాయి చేరిన భారత్; మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్నవారు 2% లోపే
23 రోజులుగా రోజువారీ మరణాలు 300 లోపు
10 రోజులుగా రోజువారీ కొత్త కేసులు 20,000 లోపు
Posted On:
17 JAN 2021 12:19PM by PIB Hyderabad
భారతదేశంలో రోజువారీ కొత్త కోవిడ్ కేసుల తగ్గుదల స్థిరంగా కొనసాగుతోంది. దీంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. మొదటి సారిగా దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్స పొందుతున్న వారి వాటా 2 శాతం కంటే తగ్గి 1.98% గా నమోదైంది.
గడిచిన 24 గంటలలో కొత్తగా 15,144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 2,08,826 కి చేరింది. రోజూ వస్తున్న కొత్త కేసులు గత 10 రోజులుగా 20 వేలలోపే ఉంటున్నాయి.
గత 24 గంటలలో చికిత్సపొందుతున్నవారి సంఖ్యలో మార్పును ఈ అంకెలు తెలియజేస్తున్నాయి. కేరళలో గత 24 గంటలలో అత్యధికంగా 922 కేసులు నమోదు కాగా మధ్య ప్రదేశ్ లో గరిష్టంగా 433 కేసులతో ప్రతికూల మార్పు నమోదైంది.
గడిచి9న 24 గంటలలో 17,170 మంది కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసులలో ఇప్పటిదాకా కోలుకున్నవారి వాటా 96.58% అయింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,01,96,885. ఈ సంఖ్య చికిత్సలో ఉన్నవారికంటే 99,88,059 అదనం. అంటే 48.83 రెట్లు అధికం. కొత్తగా కోలుకున్నవారిలో 80.53% మంది పది రాష్ట్రాలకు చెందినవారే. కేరళలో అత్యధికంగా 5,011 మంది కోలుకోగా మహారాష్ట్రలో 3,039 మంది, ఉత్తరప్రదేశ్ లో 930 మంది కోవిడ్ నుంచి బైటపడ్డారు.
కొత్తగా గత 24 గంటలలో నమోదైన కేసులలో 81% మంది 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు. కేరళలో అత్యధికంగా 5,960 కొత్త కేసులు రాగా ఆ తరువాత స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 2910 కేసులు, తమిళనాడులో 610 కేసులు వచ్చాయి.
భారత్ లో రోజువారీ మరణాలు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 23 రోజులుగా సగటున రోజుకు 300 లోపు మరణాలు నమోదవుతున్నాయి.
గత 24 గంటలలో 181 మంది కోవిడ్ బాధితులు మరణించగా, వారిలో ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 66.3% మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 52 మరణాలు, కేరళలో 27, పశ్చిమ బెంగాల్ లో 15 మరణాలు నమోదయ్యాయి.
***
(Release ID: 1689576)
Visitor Counter : 153