ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకా పంపిణీ ప్రారంభం

రేపు ప్రారంభమయ్యే జాతీయ స్థాయి టీకా పంపిణీ కార్యక్రమం సన్నద్ధతను సమీక్షించిన అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించిన - డాక్టర్ హర్ష వర్ధన్



కోవిడ్-19 వ్యాక్సిన్ల పట్ల ఉన్న అపోహలను తొలగించి, దేశీయంగా తయారుచేసిన వ్యాక్సిన్ల సమర్థతపై దేశానికి భరోసా కల్పించిన - కేంద్ర మంత్రి.

Posted On: 15 JAN 2021 5:23PM by PIB Hyderabad

రేపు ప్రారంభం కానున్న దేశవ్యాప్త కోవిడ్-19 టీకా పంపిణీ కార్యక్రమం సన్నద్ధతను, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు సమీక్షించారు.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నిర్మాణ్ భవన్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్‌ను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సందర్శించారు.

దేశవాప్తంగా కోవిడ్-19 టీకా వేసే మొదటి దశ కార్యక్రమాన్ని, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, రేపు, 2021 జనవరి, 16వ తేదీ ఉదయం 10 గంటల 30 నిముషాలకు దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు.  దేశ వ్యాప్తంగా చేపడుతున్న ఈ టీకా కార్యక్రమం నిర్వహణ సందర్భంగా, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టే, మొత్తం 3,006 ప్రాంతాలను, దృశ్యమాధ్యమం ద్వారా అనుసంధానిస్తున్నారు.  ప్రతి కేంద్రంలోనూ, రేపు సుమారు 100 మంది లబ్ధిదారులకు టీకాలు వేస్తారు.  టీకాలు వేసే కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి, ప్రాధాన్యతా సమూహాలను గుర్తించారు. ఐ.సి.డి.ఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవలు) కార్మికులతో సహా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని ఆరోగ్య సంరక్షణ కార్మికులు ఈ దశలో వ్యాక్సిన్‌ ను స్వీకరిస్తారు.

డాక్టర్ హర్ష వర్ధన్,  కోవిడ్ కంట్రోల్ రూమ్ సందర్శించినప్పుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆన్‌-లైన్ డిజిటల్ వేదిక "కోవిన్" యొక్క ప్రతి అంశాన్నీ, క్షుణ్ణంగా పరిశీలించారు,  దేశవ్యాప్తంగా కోవిడ్-19 కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది.  ఇది టీకా నిల్వలు, నిల్వ ఉష్ణోగ్రత, కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం లబ్ధిదారుల యొక్క వ్యక్తిగతీకరించిన ట్రాకింగ్ సమాచారాన్ని సులభతరం చేస్తుంది.  టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో, జాతీయ, రాష్ట్ర,  జిల్లా స్థాయిల్లో, కార్యక్రమ నిర్వాహకులకు, ఈ డిజిటల్ వేదిక ఉపయోగపడుతుంది.  ఎంతమంది లబ్దిదారులు టీకాలు వేయించుకున్నారు, ఎంతమంది మిగిలిపోయారు, టీకాలు వేసే కార్యక్రమాన్ని ఎన్ని చోట్ల నిర్వహిచాలని నిర్ణయించారు, ఎన్ని చోట్ల ప్రారంభించారుటీకాల వినియోగం మొదలైన సమాచారాన్ని సమన్వయం చేయడానికి, ఇది ఉపయోగపడుతుంది.

లబ్ధిదారుల లింగం, వయస్సు, ఆరోగ్య పరిస్థితి ప్రకారం లబ్ధిదారుల డేటాను వీక్షించడానికి, క్రమబద్ధీకరించడానికి, జాతీయ, రాష్ట్ర స్థాయి నిర్వాహకులకు ఈ వేదిక ఉపయోగపుడుతుంది. టీకాల మెటాడేటాతో పాటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని జిల్లాల నుండి నివేదించబడిన ప్రతికూల ఈవెంట్ తరువాత రోగనిరోధకత (ఏ.ఈ.ఎఫ్.ఐ) ని కూడా వీరు చూడవచ్చు.  ఏ ప్రదేశంలోనైనా కొత్తగా టీకా వేసే ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలంటే, ఆ ప్రాంతం పిన్-కోడ్‌ను నమోదు చేయడం, ఆ ప్రాంతం లేదా గ్రామాలను పేర్కొనడతో పాటు వ్యాక్సినేటర్‌ను కేటాయించడం ద్వారా, జిల్లా నిర్వాహకులు, కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.  అత్యంత అధునాతన ఈ "కోవిన్" డిజిటల్ వేదికను వినియోగిస్తున్నప్పుడు నేర్చుకున్న పాఠాలను, తదనుగుణంగా సాఫ్ట్ ‌వేర్ లో చేసిన మార్పులను భారత సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చాలని డాక్టర్ హర్ష వర్ధన్ సూచించారు.

ప్రాధాన్యత లేని ఇతర అన్ని సమూహాల కోసం, "కోవిన్" లో పొందుపరచిన లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ పేజీ ని కూడా కేంద్ర మంత్రి సమీక్షించారు.  నమోదుకు అధికారం ఉన్న ఇతర పత్రాలతో పాటు, ఎన్నికల డేటా బేస్ తో సాఫ్ట్ వేర్ ను అనుసంధానించడం ద్వారా లబ్ధిదారుల ముందస్తు జనాభా జాబితాను పొందాలని ఆయన సూచించారు.

అంకితమైన కోవిడ్ కంట్రోల్ రూమ్ దేశవ్యాప్తంగా ఉన్న జిల్లాల వారీగా అందే కోవిడ్-19 డేటాను సమీక్షించడంతో పాటు, మహమ్మారి యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి డేటాను క్షుణ్ణంగా విశ్లేషించే భారీ కార్యక్రమంలో నిమగ్నమై ఉంది.   గత కొన్ని నెలలుగా, ఈ అంకితమైన కంట్రోల్ రూమ్ ద్వారా, కేసు మరణాల రేట్లు, సంక్రమణ రేట్లు, మరణ రేట్లతో పాటు ఇతర సంబంధిత అంశాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది, దీని ఆధారంగా నియంత్రణ వ్యూహాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి.  కంట్రోల్ రూమ్ సమకూర్చే ప్రతిస్పందన వ్యవస్థలో భాగంగా వివిధ దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ వ్యూహాలను ట్రాక్ చేయడానికీ, నమోదు చేయడానికి మరియు వాటిని భారతదేశానికి అనుకూలంగా కీలకమైన కార్యక్రమాల్లో అమలుచేయడానికి, ఈ "కోవిన్" ఉపయోగపడుతోంది. 

కోవిడ్-19 వ్యాక్సిన్ల నిర్వహణకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రచారాలను మరియు పుకారు పుకార్లను నిశితంగా పరిశీలిస్తున్న ‘కమ్యూనికేషన్స్ కంట్రోల్ రూమ్’ యొక్క పనితీరును కేంద్ర మంత్రి, ఈ సందర్భంగా  సమీక్షించారు.  స్వార్థ ప్రయోజనాల ద్వారా వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచార ప్రచారాన్ని ఎదుర్కోవటానికి పరిపాలనా యంత్రాంగాలు విస్తృతంగా అందరినీ కలవాలని ఆయన సలహా ఇచ్చారు.

కోవిడ్-19 కు వ్యతిరేకంగా దేశ ప్రజలందరికీ టీకాలు వేయడానికి భారతదేశం చేపట్టిన కార్యక్రమం, ప్రపంచంలోనే అతిపెద్ద రోగనిరోధక టీకాలు వేసే కార్యక్రమం కానుందని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు.  దేశీయంగా తయారుచేసిన టీకాలైన, "కోవిషీల్డ్" మరియు "కోవాక్సిన్" లు, రెండూ భద్రత, రోగనిరోధక శక్తిని నిరూపించాయనీ, మహమ్మారిని అరికట్టడానికి ఇవి  చాలా ముఖ్యమైన సాధనాలుగా పనిచేస్తాయనీ, కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు.

 

****



(Release ID: 1689004) Visitor Counter : 233