రైల్వే మంత్రిత్వ శాఖ

ఆన్.లైన్ ద్వారా రైలు టికెట్ల బుకింగ్ కోసం నవీకరించిన వెబ్.సైట్., మొబైల్ యాప్!

“ఉత్తమ శ్రేణి సదుపాయాల”తో ఆవిష్కరించిన రైల్వే మంత్రి

ప్రయాణికులకోసం మరింత మెరుగ్గా వెబ్ సైట్ రూపకల్పనకు కృషి చేయాలని ఐ.ఆస్.సి.టి.సి.కి పీయూష్ గోయెల్ పిలుపు.
డిజిటల్ ఇండియా కలను, ప్రధాని దార్శనికతను సాకారం చేయాలని సూచన
టికెట్లతో పాటు, భోజనం, విశ్రాంతి గదులు, హోటళ్లను బుక్ చేసుకునే సదుపాయం
కరోనా సవాళ్లను అధిగమించి సేవలందించిన రైల్వే సిబ్బందికి మంత్రి ప్రశంసలు

ప్రయాణికులకు ఇది నూతన సంవత్సర కానుక


Posted On: 31 DEC 2020 1:53PM by PIB Hyderabad

  ఆన్ లైన్ ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు వినియోగించే www.irctc.co.in అనే ఇ-టికెటింగ్ వెబ్ సైట్.ను, రైల్ కనెక్ట్  అనే మొబైల్ యాప్ ను భారతీయ రైల్వే శాఖ పూర్తిగా సంస్కరించి, నవీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ‘డిజిటల్ ఇండియా’ దార్శనికతకు అనుగుణంగా రైల్వే శాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది.  

  “ఉత్తమ శ్రేణి” సదుపాయాలతో నవీకకరించిన ఇ-టికెటింగ్ వెబ్ సైట్.ను,.. మొబైల్ యాప్.ను రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ 2020, డిసెంబరు 31న ప్రారంభించారు. నవీకరించిన వెబ్.సైట్.ను, మొబైల్ యాప్ ను ప్రయాణికులందరికీ నూతన సంవత్సర కానుకగా రైల్వే శాఖ అందించింది.

  ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ, దేశానికి సేవలందించేందుకు రైల్వే శాఖ కట్టుబడి ఉందన్నారు. తమ సేవలను మరింత బలోపేతం చేసేందుకు, మెరుగైన రైలు ప్రయాణాన్ని అందించేందుకు రైల్వేశాఖ కృషి కొనసాగుతుందన్నారు.  “నవీకరించిన ఇ-టికెటింగ్ సదుపాయంతో  ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలుంటుంది.“ అని అన్నారు.  వెబ్ సైట్.ను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ, ప్రపంచంలోనే అగ్రశ్రేణి వెబ్ సైట్ గా తీర్చిదిద్దేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ.ఆర్.సిటి.సి.) కృషిచేయాలన్నారు. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, డిజిటల్ ఇండియా కలలు సాకారం చేయడానికి పనిచేయాలన్నారు.   

రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఇ-టికెటింగ్ సేవలు:

  టికెట్ల బుకింగ్ కు సంబంధించి మెరుగైన సేవలందించేందుకు, ఎక్కువ సంఖ్యలో టికెట్ల బుకింగ్ నిర్వహించేందుకు నిరాటంకంగా ఇ-టికెటింగ్ సదుపాయం కల్పించేందుకుఐ.ఆర్.సి.టి.సి. ద్వారా నవతరం ఇ-టికెటింగ్ (ఎన్.జి.ఇ-టి.) సేవల వ్యవస్థను 2014లో ప్రారంభించారు. తాజాగా సంస్కరించి, నవీకరించిన ఇ-టికెటింగ్ వెబ్.సైట్, మొబైల్ యాప్ రైలు ప్రయాణికులకు మరెంతో మెరుగైన సేవలందించనున్నాయి.  

వినియోగదారుల అనుభవాల ప్రాతిపదికగా కొత్త సంస్కరణలు:

  రైలు టికెట్ల బుకింగ్ కోసం ప్రపంచ స్థాయి వెబ్ సైట్.కు రూపకల్పన చేయడంలో వినియోగదారుల ప్రయోనాలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారు. యూజర్ లాగిన్ తో అనుసంధానం చేసిన కొత్త సదుపాయాలను, ఫీచర్స్ ను, తొలిసారిగా ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారు. టికెట్టుతో పాటుగా, భోజనం, వసతి సదుపాయాన్ని కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని ఈ వెబ్ సైట్లో కల్పించారు.

 

నవీకరించిన వెబ్ సైట్  ముఖ్యాంశాలు :

  • వినియోగించేవారికి పూర్తిస్థాయి సౌకర్యం కలిగిస్తూ యూజర్ లాగిన్ తో అనుసంధానం
  • భోజనం, విశ్రాంతి గదులు, హోటళ్ల బుకింగ్ ప్రక్రియను ఏకీకృతం చేయడం. టికెట్ల బుకింగ్ తోపాటుగా నేరుగా ఈ సదుపాయాలను ఎంచుకునే అవకాశం. తద్వారా ప్రయాణికుల అన్ని అవసరాలకు ఒకేసమయంలో పరిష్కారం చూపడం.
  • కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం సహాయంతో ప్రయాణికుడు స్టేషన్.లోకి, రైలులోకి వెళ్లేందుకు మందస్తుగానే తగిన సూచనలు చేయడం. దీనితో రైల్వే స్టేషన్లను వెదుక్కోవడానికి, టికెట్ బుకింగ్ కు ప్రయాణికులు హడావుడి పడాల్సిన అవసరం ఉండదు
  • రీఫండ్ ప్రక్రియ ఏ దశలో ఉందన్న సమాచారాన్ని యూజర్ అక్కొంట్స్ పేజీలో చూసుకునే సదుపాయం మరింత సరళతరం. ఇంతకు ముందు ఈ సమాచారం తెలుసుకోవడం కాస్త కష్టతరంగా, సంక్లిష్టంగా ఉండేది.
  • ‘రెగ్యులర్’ లేదా ‘ఫేవరైట్’ ప్రయాణాలను సులభంగా బుక్ చేసుకునే అవకాశం. ఇందుకోసం వెనువెంటనే ఆయా వివరాల్లోకి వెళ్లేందుకు వెబ్ సైట్.లో సదుపాయం.
  • రైళ్లను వెదుక్కోవడం, ఎంపిక చేసుకోవడం మరింత సరళతరం. అందుకు తగిన సమాచారం పేజీపైనే సిద్ధంగా ఉండటం. ఈ సదుపాయంతో ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. సులభంగా టికెట్ బుక్ చేసిన అనుభవం సొంతమవుతుంది.  
  • ఒక పేజీలోనే పూర్తి సమాచారం – అన్ని రైళ్లకు సంబంధించిన వివిధ తరగతుల సమచారం, చార్జీల వివరాలు అందుబాటులో ఉంటాయి. పేజీని ఎంపిక చేసుకుని, కావలసిన రైలులో కావలసిన తరగతిలో టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం. గతంలో అయితే సంబంధిత రైలు పేరును క్లిక్ చేసినపుడు మాత్రమే ఈ వివరాలన్నీ అందుబాటులో ఉండేవి.
  • టికెట్ల అందుబాటు పరిస్థితిని తెలియజెప్పేందుకు బ్యాక్ ఎండ్ లో ‘క్యాచ్ సిస్టమ్’ ప్రవేశపెట్టారు.  
  • వెయిటింగ్ లిస్టులోని టికెట్లకు సంబందించి అవి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను కూడా వెబ్ సైట్ సూచిస్తుంది. ఇదివరకైతే ప్రతి వెయిట్ లిస్ట్ తాజా పరిస్థితినీ విడివిడిగా పరిశీలించాల్సి ఉండేది..
  • ఇతర తేదీల్లో టికెట్ల అందుబాటు పరిస్థితిని కూడా పేజీలోనే తెలుసుకునే అవకాశం కల్పించారు.
  • కంప్యూటర్ల వినియోగంలో అతంగా అనుభవం లేని వారికీ సులభతరమైన బుకింగ్ అవకాశం. దీనితో వెబ్ సైట్.లో వెదుకులాటకు కాలయాపన ఉండదు. సమయం ఆదా అవుతుంది.
  • చెల్లింపు పేజీలోనే ప్రయాణ వివరాలను కూడా చూసే అవకాశం. బుకింగ్ లో ఏదైనా టైపింగ్ తప్పులు ఉన్నా సరిదిద్దుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. పి.ఆర్.ఎస్. సెంటర్ ను సందర్శించడం ద్వారా ఇలాంటి తప్పులను సవరించుకోవచ్చు.  
  • సైబర్ భద్రతా పరంగా తగిన రక్షణ ఏర్పాట్లు ఈ వెబ్ సైట్లో ఉన్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను పొందుపరిచారు.

ఉత్తమ శ్రేణి విశేషాలు:

  ఇతర ఆన్ లైన్ టికెటింగ్ సదుపాయాలకన్నా మిన్నగా ఉండేలా ఉత్తమ శ్రేణి విశేషాలు, లక్షణాలతో ఇ-టికెటింగ్ వెబ్ సైట్.ను, మొబైల్ యాప్ రూపకల్పన జరిగింది. 

  ఇతర టికెటింగ్ వెబ్ సైట్లతో పోలిస్తే ఎంతో అధునాతనమైన సదుపాయాలను ఈ వెబ్ సైట్ కలిగి ఉంది.  చాలా వరకు వెబ్ సైట్లలో ఇలాంటి సదుపాయం ఉండదు. పైగా ప్రయాణికులు బస చేయడానికి, భోజనం బుక్ చేసుకోవడానికి వెబ్ సైట్లోనే అవకాశం ఉండటం ఎంతో గొప్ప విషయం

 ప్రస్తుతం ఐ.ఆర్.సి.టి.సి.కి చెందిన ఇ-టికెటింగ్ వెబ్.సైట్ ను ఆరు కోట్ల మందికి పైగా యూజర్లు వినియోగిస్తూ రోజుకు 8లక్షలకు పైగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ముందస్తుగా రిజర్వ్ చేసుకునే టికెట్లలో 83శాతం ఆన్ లైన్ విధానంలోనే బుక్ అవుతున్నాయి.

ఇకముందు జరిగేది:

  వెబ్ సైట్ లో ‘స్మార్ట్ బుకింగ్ సదుపాయం’ ప్రవేశపెట్టేందుకు ఐ.ఆర్.సి.టి.సి., రైల్వే సమాచారం కేంద్రం (సి.ఆర్.ఐ.ఎస్.) కృషి చేస్తున్నాయి.  డైరెక్ట్ రైలు సదుపాయం లేని స్టేషన్ల మధ్య ప్రత్యామ్నాయ మార్గాల్లో అనుసంధాన రైలు సర్వీసులను బుక్ చేసుకునేందుకు ఈ సదుపాయం ఉపకరిస్తుంది.

  ఇ-టికెటింగ్ సేవల్లో ఎప్పటికప్పుడు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు రైల్వేశాఖ కట్టుబడి ఉంది.  నవీకరించిన వెబ్ సైట్.ను, మొబైల్ యాప్.ను ప్రారంభించిన సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ, కరోనా వైరస్ సవాళ్లను ఎదుర్కొంటూ రైల్వే సిబ్బంది అనుపమానమైన సేవలను అందించిందన్నారు. ఈ సందర్భంగా ఐ.ఆర్.సి.టి.సి. సేవలు కూడా ప్రశంసనీయమైనవని ఆయన అన్నారు.  

 

****



(Release ID: 1685272) Visitor Counter : 260