ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లో కెల్లా మొట్టమొదటి డ్రైవర్ లేని రైలు రాకపోకలను ఢిల్లీ మెట్రో తాలూకు మజెంటా లైన్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
పట్టణీకరణ ను ఒక సవాలుగా చూడకుండా, దేశంలో ఉత్తమమైన మౌలికసదుపాయాల నిర్మాణానికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవడంతో పాటు, జీవించడంలో సౌలభ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి కూడా అవకాశంగా తీసుకోవాలి: ప్రధాన మంత్రి
వివిధ రకాలకు చెందిన మెట్రో.. ఆర్ఆర్‌టిఎస్, మెట్రో లైట్, మెట్రో నియో, వాటర్ మెట్రో.. ల తాలూకు పనులు జరుగుతున్నాయి: ప‌్రధాన మంత్రి
వివిధ ప్రాంతాలలో సేవల ఏకీకరణ సందర్భాలను గురించి ఆయన వివరించారు
డ్రైవర్ అంటూ ఉండనటువంటి మెట్రో రైల్ సదుపాయం కలిగిన కొన్ని దేశాల సరసన చేరిన భారతదేశం: ప్రధాన మంత్రి
Posted On:
28 DEC 2020 12:26PM by PIB Hyderabad
భారతదేశం లో కెల్లా తొలి డ్రైవర్ లెస్ ట్రైన్ రాకపోకలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రో తాలూకు మజెంటా లైన్ లో ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. కిందటి సంవత్సరం లో అహమదాబాద్ లో మొదలైన నేశనల్ కామన్ మొబిలిటీ కార్డు ను ఈ రోజున ఢిల్లీ మెట్రో తాలూకు ఎయర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ కు కూడా విస్తరించడం జరిగింది. ఈ సందర్భం లో కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురి తో పాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈనాటి ఈ కార్యక్రమం పట్టణ ప్రాంత అభివృద్ధిని భవిష్యత్తు అవసరాలకు తగినదిగా సంసిద్ధం చేసేందుకు జరిగిన ఒక ప్రయత్నం అని అభివర్ణించారు. దేశాన్ని భావి కాలం అవసరాలకు సన్నద్ధం చేయడం పాలనలోని ఒక మహత్వపూర్ణ బాధ్యత గా ఉందని ఆయన చెప్పారు. కొన్ని దశాబ్దాల క్రితం పట్టణీకరణ ఆవశ్యకత తలెత్తినప్పుడు భావి కాలం అవసరాలకు ఏమంత శ్రద్ధ తీసుకోవడం జరగలేదని, అరకొరగా కృషి చోటుచేసుకొందని, దీనితో గందరగోళం కొనసాగిందని చెప్తూ, ఇందుకుగాను ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మాదిరిగా కాకుండా, ఆధునిక ఆలోచనల సరళి పట్టణీకరణ ను ఒక సవాలులాగా చూడకూడదని, దానిని దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఒక అవకాశంగా, జీవించడంలో సౌలభ్యాన్ని మనం పెంచుకొనేందుకు ఒక అవకాశంగా చూడాలని ఆయన అన్నారు. ఈ ఆలోచనల సరళిలో భేదాన్ని ప్రస్తుతం పట్టణీకరణ తాలూకు ప్రతి ఒక్క కోణంలోను గమనించవచ్చని ఆయన అన్నారు. 2014వ సంవత్సరం లో కేవలం 5 నగరాలు మెట్రో రైల్ ను కలిగి ఉండగా, ప్రస్తుతం మెట్రో రైలు 18 నగరాల లో అందుబాటులో ఉందని ఆయన అన్నారు. 2025వ సంవత్సరానికల్లా మనం మరో 25 నగరాలకు ఈ సౌకర్యాన్ని విస్తరించుకోనున్నామని ఆయన తెలిపారు. 2014వ సంవత్సరం లో దేశంలో 248 కి.మీ మెట్రో మార్గాలు నిర్వహణలో ఉండగా, మరి ఇవాళ అంతకు మూడింతలు అంటే 700 కిలో మీటర్లకు పైగా మెట్రో మార్గాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 2025వ సంవత్సరానికల్లా మనం 1700 కి.మీ కి విస్తరించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ఇవి ఒక్క సంఖ్యలు మాత్రమే కాదని, భారతదేశంలో కోట్ల కొద్దీ జీవితాలకు జీవన సౌలభ్యాన్ని అందించేందుకు ఒక నిదర్శనంగా ఇవి ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమాచారం ఇటుకల తోను, రాళ్ళతోను, కాంక్రీటు తోను, ఇనుముతోను తయారు చేసిన మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని, ఇది దేశ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి సంబంధించిన సాక్ష్యం కూడా అని ఆయన అన్నారు.
ప్రభుత్వం మొట్టమొదటి సారిగా మెట్రో విధానాన్ని రూపొందించి, సర్వతోముఖ వ్యూహంతో ఆ విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చిందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. స్థానిక అవసరానికి తగ్గట్టు స్థానిక ప్రమాణాలను ప్రోత్సహిస్తూ, మేక్ ఇన్ ఇండియా విస్తరణ, అలాగే ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడం చేస్తూ, ముందుకు పోవడం పై శ్రద్ధ తీసుకోవడం జరుగుతోందని ఆయన అన్నారు. మెట్రో విస్తరణ రవాణా లో ఆధునిక పద్ధతులను వినియోగించుకోవడం అనేవి నగర ప్రజల అవసరాలకు, అక్కడి వృత్తి నిపుణుల జీవనశైలికి అనుగుణంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కారణంగానే వేరు వేరు నగరాల లో మెట్రో రైల్ కు చెందిన వివిధ రకాలపై కృషి జరుగుతోందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్న మెట్రో రైల్ తాలూకు వివిధ రకాలను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఢిల్లీ కి మీరట్ కు మధ్య రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టిఎస్) అంశం పై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అది ఢిల్లీ కి మీరట్ కు మధ్య దూరాన్ని ఒక గంట కంటే తక్కువ కు తగ్గిస్తుందన్నారు. ప్రయాణికుల సంఖ్యలు తక్కువగా ఉన్న నగరాల లో మెట్రో లైట్ వెర్షన్ పై కృషి జరుగుతోందని ఆయన అన్నారు. మెట్రో లైట్ వర్షన్ ను సాధారణ మెట్రో కు అయ్యే ఖర్చులో 40 శాతం వ్యయంతో నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్న నగరాల కోసం మెట్రో నియో తాలూకు కసరత్తు జరుగుతోందని కూడా ఆయన చెప్పారు. దానిని సాధారణ మెట్రో లో అయ్యే ఖర్చులో 25 శాతం వ్యయంతోనే నిర్మించడం జరుగుతుందన్నారు. అదే మాదిరిగా వాటర్ మెట్రో అనేది సాధారణమైన ఆలోచనల సరళి కంటే భిన్నమైంది కాగలదని ఆయన చెప్పారు. జల వనరులు పెద్దవిగా ఉన్న నగరాల లో వాటర్ మెట్రో కు కార్యరూపాన్ని ఇవ్వడంపై కృషి జరుగుతోందని చెప్పారు. ఇది దీవులకు సమీపంలోని ప్రజలకు ఆఖరి మైలు వరకు సంధానాన్ని సమకూర్చుతుందన్నారు.
ప్రస్తుతం మెట్రో అనేది ఒక ప్రజా రవాణా మాధ్యమం ఒక్కటే కాకుండా, కాలుష్యాన్ని నివారించేందుకు ఒక గొప్ప మార్గమని ప్రధాన మంత్రి అన్నారు. మెట్రో నెట్ వర్క్ వల్ల వేల కొద్దీ వాహనాల భారాన్ని రహదారి మార్గం పై నుంచి తగ్గించడమైందని, ఈ వాహనాలు రాకపోకల స్తంభన కు, కాలుష్యానికి కారణంగా నిలిచేవని ఆయన అన్నారు.
మెట్రో సేవల విస్తరణకు ‘మేక్ ఇన్ ఇండియా’ ను అనుసరించడం ముఖ్యమని ప్రధాన మంత్రి అన్నారు. మేక్ ఇన్ ఇండియా ఖర్చులను తగ్గించి, విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు, దేశం లో ప్రజలకు దేశంలోనే మరింతగా ఉపాధిని అందిస్తుందని ఆయన అన్నారు. రోలింగ్ స్టాక్ ను ప్రమాణీకరించడం ప్రతి ఒక్క రైలు పెట్టె నిర్మాణ వ్యయాన్ని 12 కోట్ల నుంచి ప్రస్తుతం 8 కోట్లకు తగ్గించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాలుగు పెద్ద కంపెనీలు దేశంలో మెట్రో రైలు పెట్టెలను తయారు చేస్తున్నాయని, కాగా, డజన్ల కొద్దీ కంపెనీలు మెట్రో విడి భాగాల తాయారీ లో తలమునకలుగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇది మేక్ ఇన్ ఇండియా తో పాటు, స్వయం సమృద్ధ భారతదేశం ఆవిష్కరణకు ఉద్దేశించిన ప్రచార ఉద్యమానికి కూడా సహాయకారిగా ఉందని ఆయన చెప్పారు.
డ్రైవర్ అంటూ ఉండని మెట్రో రైలు కార్యసాధన ద్వారా మన దేశం ఆ తరహా సదుపాయాలు కలిగి ఉన్న ప్రపంచం లోని కొన్ని దేశాల సరసన నిలచిందని ప్రధాన మంత్రి అన్నారు. 50 శాతం శక్తి బ్రేకులను వినియోగించినప్పుడు మళ్ళీ గ్రిడ్ లోకి వెళ్ళేటటువంటి ఒక బ్రేకింగ్ సిస్టమ్ ను ప్రస్తుతం వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మెట్రో రైలులో 130 మెగా వాట్ సౌర విద్యుత్తును వినియోగించడం జరుగుతోందని, దీనిని 600 ఎమ్ డబ్ల్యు కు పెంచడం జరుగుతుందని ఆయన అన్నారు.
కామన్ మొబిలిటీ కార్డును గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆధునికీకరణ కోసం సమాన ప్రమాణాలను, సదుపాయాలను అందించడమనేది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కామన్ మొబిలిటీ కార్డు అనేది ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు. ఈ ఒక్క కార్డు ప్రయాణికులకు వారు ఏ సమయంలో ప్రయాణించినా, ఏ విధమైన సార్వజనిక రవాణా మాధ్యమాన్ని చేపట్టినా సమీకృత లభ్యతను అందిస్తుందని వివరించారు.
కామన్ మొబిలిటీ కార్డు ను ఒక ఉదాహరణగా ప్రధాన మంత్రి తీసుకొని అన్ని వ్యవస్థలను సమన్వయపరచే ప్రక్రియను గురించి వివరించారు. ఆ తరహా వ్యవస్థల సమన్వయం ద్వారా దేశం శక్తిని మరింత సమర్ధమైన విధంగా వినియోగించుకోవడం జరుగుతోందన్నారు. ‘‘ఒక దేశం, ఒక మొబిలిటీ కార్డు ల మాదిరిగా, మా ప్రభుత్వం దేశంలో వ్యవస్థలను ఏకీకృతం చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా అనేక కార్యాలకు పూనుకుందని’’ శ్రీ మోదీ అన్నారు.
‘ఒక దేశం, ఒక ఫాస్ట్ ట్యాగ్’ దేశం అంతటా హైవేల లో అంతరాయం ఎదురవని ప్రయాణాన్ని ఆవిష్కరించిందని ఆయన అన్నారు. దీనితో ప్రయాణికులకు వాహన రాకపోకల స్తంభన, జాప్యాల బారి నుండి విముక్తి లభించిందన్నారు. ‘ఒకే దేశం, ఒకే పన్ను’ అంటే జిఎస్‌టి.. పన్నుల విధానంలోని దుష్ప్ర భావాలను తొలగించిందని, దీనితోపాటు పరోక్ష పన్ను వ్యవస్థలో ఏకరూపత ను కొనితెచ్చిందని ఆయన చెప్పారు. ‘ఒక దేశం, ఒక పవర్ గ్రిడ్’ దేశం లో ప్రతి ప్రాంతం లోను తగినంత నిరంతర విద్యుత్తు లభ్యతకు పూచీ పడుతోందని ఆయన అన్నారు. విద్యుత్తుపరమైన నష్టం తగ్గిందని చెప్పారు.
ఇంతకు పూర్వం గ్యాస్ ఆధారిత జీవనం, ఆర్థిక వ్యవస్థ ఒక స్వప్నం గా ఉన్న ప్రాంతాల లో ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్, అంతరాయాలకు తావు ఉండనటువంటి గ్యాస్ సంధానం లను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. ‘ఒక దేశం, ఒక ఆరోగ్య బీమా పథకం’.. అంటే ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా భారతదేశం లో లక్షల కొద్దీ ప్రజలు వారు దేశం లో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ప్రయోజనాన్ని పొందుతున్నారని వివరించారు. ఒక ప్రాంతం నుంచి, మరొక ప్రాంతానికి తరలి వెళ్ళే పౌరులు ‘ఒక దేశం, ఒక రేషన్ కార్డు’ ద్వారా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఇక్కట్టుల బారి నుండి స్వేచ్ఛను పొందారని, అదే విధంగా నూతన వ్యావసాయిక సంస్కరణలు, ఇ-నామ్ (e-NAM) వంటి ఏర్పాట్ల ద్వారా ‘ఒక దేశం ఒక వ్యవసాయ విపణి’ దిశలో సాగుతోందని తెలిపారు.
***
(Release ID: 1684112)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam