ప్రధాన మంత్రి కార్యాలయం

ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కు చెందిన న్యూ భాపూర్- న్యూ ఖుర్జా విభాగంతో పాటు ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను డిసెంబర్ 29వ తేదీన ప్రారంభించనున్న - ప్రధానమంత్రి

Posted On: 27 DEC 2020 3:52PM by PIB Hyderabad

ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఇడిఎఫ్‌సి) లోని ‘న్యూ భాపూర్- న్యూ ఖుర్జా విభాగాన్ని’ 2020 డిసెంబర్ 29 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.  ఈ కార్యక్రమంలో భాగంగా,  ప్రయాగ్ రాజ్ ‌లో ఇ.డి.ఎఫ్.‌సి. కి చెందిన ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓ.సి.సి) ని కూడా ప్రధానమంత్రి  ప్రారంభిస్తారు.  ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పాటిల్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్ కూడా హాజరుకానున్నారు.

ఈ.డి.ఎఫ్.‌సి. లోని 351 కిలోమీటర్ల న్యూ భాపూర్- న్యూ ఖుర్జా విభాగం ఉత్తర ప్రదేశ్‌లో ఉంది.  5,750 కోట్ల రూపాయల వ్యయంతో, దీన్ని నిర్మించారు.  ఈ విభాగం స్థానిక పరిశ్రమలైన - అల్యూమినియం పరిశ్రమ (కాన్పూర్ దేహాట్ జిల్లాలోని పుఖ్రాయన్ ప్రాంతం); పాడి పరిశ్రమ రంగం ( ఔరాయ జిల్లా); వస్త్ర ఉత్పత్తి / బ్లాక్ ప్రింటింగ్ (ఎటావా జిల్లా); గాజుసామాను పరిశ్రమ (ఫిరోజాబాద్ జిల్లా);  కుండల ఉత్పత్తులు (బులంద్‌షహర్ జిల్లాకు చెందిన ఖుర్జా);  ఇంగువ లేదా ‘హింగ్’ ఉత్పత్తి (హత్రాస్ జిల్లా); తాళాలు, ఇనుప సామానులు (అలీఘర్ జిల్లా) వంటి పరిశ్రమలలో కొత్త అవకాశాలను కల్పిస్తుంది.  ఈ విభాగం ప్రస్తుతం ఉన్న కాన్పూర్ - ఢిల్లీ ప్రధాన మార్గంలో రద్దీని తగ్గించి, భారతీయ రైల్వేకు మరింత వేగంగా రైళ్ళు నడపడానికి వీలు కల్పిస్తుంది.

ప్రయాగ్ రాజ్ ఏర్పాటుచేసిన అత్యాధునిక ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓ.సి.సి), ఈ.డి.ఎఫ్.‌సి. యొక్క మొత్తం మార్గానికి కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది.  ఆధునిక ఇంటీరియర్సు, ఎర్గోనామిక్ డిజైన్, అత్యుత్తమ ధ్వని నియంత్రణ వ్యవస్థతో ఓ.సి.సి. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా ఉంది.  గ్రిహ-4 యొక్క గ్రీన్ బిల్డింగ్ రేటింగ్‌ తో ఈ భవనం పర్యావరణ అనుకూలమైనదిగా మరియు ‘సుగమ్య భారత్ అభియాన్’ నిబంధనల ప్రకారం నిర్మించారు.

ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈ.డి.ఎఫ్.సి) గురించి :

ఈ.డి.ఎఫ్.సి. (1856 కిలోమీటర్ల మార్గం) లుధియానా (పంజాబ్) సమీపంలోని సహనేవాల్ నుండి ప్రారంభమై, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల గుండా ముందుకు సాగి, పశ్చిమ బెంగాల్ లోని డంకుని వద్ద ముగుస్తుంది.  దీనిని భారత డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ సంస్థ (డి.ఎఫ్.‌సి.సి.ఐ.ఎల్) నిర్మిస్తోంది, డెడికేటెడ్అం ఫ్రైట్ కారిడార్లను నిర్మించడానికి, నిర్వహించడానికి ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం దీనిని ఏర్పాటు చేశారు.  ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రి నుండి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఓడరేవు వరకు వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (1504 కిలోమీటర్ల మార్గం) ను కూడా డి.ఎఫ్.‌సి.సి.ఎల్. నిర్మిస్తోంది.  ఇది ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా వెళుతుంది.

*****



(Release ID: 1684033) Visitor Counter : 148