ప్రధాన మంత్రి కార్యాలయం

ఫిక్కీ 93వ వార్షిక సాధారణ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాన మంత్రి

ఒక బలమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం భాగస్వాములందరూ వారి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో సాయపడుతుంది: ప్రధాన మంత్రి

మన పరిశ్రమకు కావలసింది వంతెనలు తప్ప గోడలు కాదు: ప్రధాన మంత్రి

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నీతి ద్వారా, సంకల్పం ద్వారా పూర్తి నిబద్ధత తో పనిచేస్తుంది: ప్రధాన మంత్రి

పల్లెల్లోను, చిన్న పట్టణాల్లోను పెట్టుబడి పెట్టవలసిందిగా పరిశ్రమకు ఆయన పిలుపునిచ్చారు

Posted On: 12 DEC 2020 1:39PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం ఫిక్కీ 93వ వార్షిక సాధారణ సమావేశం- వార్షిక సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు.  దేశీయ అవసరాలను నెరవేర్చుతున్నందుకే కాకుండా ప్రపంచమంతటా బలమైన ‘బ్రాండ్ ఇండియా’ ను నెలకొల్పినందుకు కూడా భారతదేశ ప్రైవేటు రంగాన్ని ప్రధాన మంత్రి అభినందించారు.  ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ ను ఆవిష్కరించడానికి దేశం లోని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవడం దేశ ప్రైవేటు రంగం పట్ల భారత్ కు ఉన్న నమ్మకానికి ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.  

జీవితం లోను, పరిపాలన లోను, నమ్మకం కలిగివున్న వ్యక్తి ఇతరులకు స్థానాన్ని ఇవ్వడానికి ఎన్నడూ వెనుకాడరని ప్రధాన మంత్రి అన్నారు.  ఒక బలమైన ప్రభుత్వం, ప్రజల అఖండ తీర్పు తాలూకు అండదండలు కలిగివున్న ప్రభుత్వం ఆ తరహా విశ్వాసాన్ని, సమర్పణ భావాన్ని ప్రదర్శిస్తుంది అని ఆయన అన్నారు.  నిర్ణయాత్మకమైన ప్రభుత్వం ఎల్లవేళల ఇతరుల దారిలో ఉన్న అడ్డంకులను తొలగించడానికే పాటుపడుతుంది, ఎల్ల వేళల సమాజానికి, దేశ ప్రజలకు సహాయపడడానికే ప్రయత్నిస్తుంది అని ఆయన చెప్పారు.  ఆ తరహా ప్రభుత్వం నియంత్రణ ను, చొరవ ను బలవంతాన లాగేసుకొని తన వద్దే అట్టిపెట్టేసుకోవాలని అనుకోదు అని ఆయన అన్నారు.  అన్ని రంగాలలోను ప్రభుత్వం ఉనికి ఉన్న కాలాన్ని ఆయన గుర్తు కు తెస్తూ, ఈ దృష్టికోణం ఆర్థిక వ్యవస్థ కు కొనితెచ్చిన చేటు ను గురించి వివరించారు.  మరో వైపు, ఒక దూరదృష్టి ని కలిగివున్న ప్రభుత్వం, నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వం స్టేక్ హోల్డర్స్ అందరికీ వారు వారి పటిమ ను గ్రహించుకొనేటట్టు వారిని ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.  గత ఆరు సంవత్సరాలలో, ప్రభుత్వం అన్ని రంగాలలో స్టేక్ హోల్డర్ లను  ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.  ఇది తయారీ మొదలుకొని సూక్ష్మ, లఘు, మధ్యతరహా వ్యాపారసంస్థ (ఎమ్ఎస్ ఎమ్ఇ)ల వరకు; వ్యవసాయం మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకు; సాంకేతిక పరిశ్రమ మొదలుకొని పన్నుల విధానం వరకు, రియల్ ఎస్టేట్ రంగం మొదలుకొని నియంత్రణపరమైన సరళత్వం వరకు వివిధ రంగాలలో సర్వతోముఖమైన సంస్కరణల్లో ప్రతిబింబిస్తోంది అని కూడా ఆయన వివరించారు.

మన పరిశ్రమలకు కావలసిందల్లా వంతెనలే కానీ గోడలు కాదు అని సభికులతో ప్రధాన మంత్రి చెప్పారు.  ఆర్థిక వ్యవస్థ లోని వేరు వేరు రంగాలను విడదీసే గోడలను తొలగించడం ద్వారా ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు లభిస్తాయని, ప్రత్యేకించి రైతులకు కొత్త ఐచ్ఛికాలు లభిస్తాయని ఆయన అన్నారు.  సాంకేతికత లోను, శీతలీకరణ నిలవ సదుపాయాలలోను, వ్యవసాయ రంగంలోను పెట్టుబడి ద్వారా రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు.  వ్యవసాయ రంగం, సేవల రంగం, తయారీ రంగం, సామాజిక రంగాలు ఒక రంగం అవసరాలను మరొక రంగం పూర్తి చేయగలిగే మార్గాలను కనుగొనడంలో శక్తి ని పెట్టుబడి పెట్టాలి అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.  ఈ ప్రయత్నం లో ఫిక్కీ వంటి సంస్థ ఒక వంతెన గానే కాక ఒక ప్రేరణ గా కూడా  నిలవగలుగుతుంది అని ఆయన చెప్పారు.  స్థానిక విలువ ను, సరఫరా వ్యవస్థ ను బలపరచాలన్న ధ్యేయం తోను, ప్రపంచ సరఫరా వ్యవస్థ లో భారతదేశం పాత్ర ను ఎలా విస్తరించగలమన్న ధ్యేయం తోను మనం పనిచేయాలి అని ఆయన అన్నారు.  ‘‘భారతదేశం చేతిలో మార్కెటు, జన శక్తి , ఉద్యమ తరహా లో పనిచేయగల సత్తా కూడా ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు. 

జన్ ధన్, ఆధార్, మొబైల్ (జెఎఎమ్) త్రయం ద్వారా అన్ని వర్గాలను ఆర్థిక సేవల రంగం పరిధి లోకి చేర్చడం లో సాధించిన సాఫల్యం ఈ ప్రభుత్వం ఆధ్వర్యం లో సంస్కరణల పట్ల ప్రణాళికయుతమైన, ఏకీకృత‌మైన దృష్టికోణానికి ఒక ఉదాహరణ గా నిలచింది అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు పద్ధతి అని,  మహమ్మారి కాలం లో ఒక బటన్ ను ఒత్తినంతనే కోట్లాది ఖాతాలలోకి డబ్బు ను దేశం మార్పిడి చేయగలగడంతో ఇది ప్రశంసలకు నోచుకొందని ఆయన వివరించారు. 

రైతులకు, వ్యవసాయ రంగానికి సాయపడేందుకు తీసుకొన్న చర్యలను గురించి ప్రధాన మంత్రి పూస గుచ్చినట్టు  వివరించారు.  ‘‘ప్రభుత్వం విధానాలు, ఉద్దేశ్యాల ద్వారా  రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు.  వ్యవసాయ రంగం లో పెరుగుతున్న హుషారు ను శ్రీ మోదీ స్పష్టం చేస్తూ, రైతులకు వారి ఉత్పత్తి ని మండీల బయట అమ్ముకోవడానికి కొత్త ప్రత్యామ్నాయం అందుబాటులోకి రావడాన్ని గురించి, మండీలకు కొత్త రూపు ను ఇవ్వడాన్ని గురించి, రైతు ఉత్పత్తి ని ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫార్మ్ మీద విక్రయించే ఐచ్ఛికాన్ని గురించి మాట్లాడారు.  ఇవన్నీ రైతు ను సమృద్ధం  చేసేందుకు చేపట్టినవేనని, రైతు సంపన్నుడైతే దానికి అర్థం దేశం సంపన్నం అయినట్లే అని ఆయన చెప్పారు.

వ్యవసాయ రంగంలో ప్రైవేటు రంగం పెట్టుబడి సంతోషజనకమైనటువంటి స్థాయి లో లేదు అని శ్రీ మోదీ అన్నారు.  సరఫరా వ్యవస్థ, శీతలీకరణ నిలవ సదుపాయాలు, ఎరువులు వంటి రంగాలలో ప్రైవేటు రంగం ఆసక్తి ని చూపవలసిన అవసరం తో పాటు పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.  గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు భారీ అవకాశం ఉందని, దీనికి గాను ఒక స్నేహపూర్వక విధానపరమైన పరిపాలన విధానం కూడా అమలులో ఉందని శ్రీ మోదీ తెలిపారు.  

గ్రామీణ ప్రాంతాలలోను, సెమీ-రూరల్ ప్రాంతాలలోను, రెండో శ్రేణి నగరాలు, మూడో శ్రేణి నగరాలలలో ఒక సకారాత్మకమైనన మార్పు రావాలని ప్రధాన మంత్రి గట్టిగా సూచిస్తూ, ఆ కోవకు చెందిన రంగాలలో అవకాశాల తాలూకు లబ్ధి ని పొందవలసిందిగా వ్యాపార రంగ ప్రముఖులను, పరిశ్రమ రంగ ప్రముఖులను ఆహ్వానించారు.  గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్ నెట్ ను వినియోగించే వారి సంఖ్య నగరాలలో ఇంటర్ నెట్ ను వినియోగించే వారి సంఖ్య ను మించిపోయిందని, భారతదేశం లో సగానికి పైగా అంకుర సంస్థ లు రెండో శ్రేణి నగరాలు, మూడో శ్రేణి నగరాలలోనే ఉన్నాయని తెలిపారు.  సార్వజనిక వై-ఫై హాట్ స్పాట్ ల కోసం ఇటీవల ఆమోదించిన పిఎమ్-వాణి ని గురించి ఆయన ప్రస్తావించి, నవ పారిశ్రామికవేత్త లు గ్రామీణ సంధాన యత్నాలలో భాగస్వాములు కావాలన్నారు.  ‘‘21వ శతాబ్దం లో, భారతదేశ వృద్ధి కి గ్రామాలు, చిన్న నగరాలే చోదక శక్తులుగా ఉంటాయనేది తథ్యం. మరి మీ వంటి నవ పారిశ్రామికవేత్త లు పల్లెలలోను, చిన్న నగరాలలోను పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పోగోట్టుకోకూడదు.  మీ పెట్టుబడి గ్రామీణ ప్రాంతాలలోని మన సోదరీమణులకు, మన సోదరులకు, వ్యవసాయ రంగానికి కొత్త తలుపులను తెరుస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

***
 


(Release ID: 1680328) Visitor Counter : 196