ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం

Posted On: 08 DEC 2020 11:42AM by PIB Hyderabad

కేంద్ర మంత్రివర్గం లో నా సహచరుడు శ్రీ రవి శంకర్ ప్రసాద్ గారు, టెలికమ్ పరిశ్రమ కు చెందిన నాయకులు మరియు ఇతర విశిష్ట ప్రముఖులారా,

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2020 కార్యక్రమం లో మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. టెలికమ్ రంగం లోని అత్యంత ప్రతిభావంతులందరిని ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో ఒక కీలక పాత్ర ను పోషించిన, ఈ రంగం లో కీలక భాగస్వాములైన వారందరు ఈ సమూహం లో ఉన్నారు. వారు భారతదేశాన్ని మరింత సుసంపన్న భవిష్యత్తు వైపు నడిపించగలరనే ఆశలు ఉన్నాయి.

మిత్రులారా,

రోజురోజు కు అత్యంత వేగం గా మెరుగవుతున్న సంధానాన్ని మనం గమనిస్తున్నాం. అంతలోనే అసలైన వృద్ధి వేగం ఇప్పుడే మొదలైంది అనే సంగతి కూడా మనకు తెలుసు. మొట్టమొదటి టెలిఫోన్ కాల్ చేసినప్పటి నుండి మనం చాలా దూరం పయనించాము. నిజానికి పది సంవత్సరాల క్రితం కనీసం మనం ఊహించడానికి కూడా కష్టమైన రీతిలో, ప్రస్తుతం, మొబైల్ విప్లవం మన దేశంపైన, సమాజంపైన, ప్రపంచం పైన అలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది. అలాగే, మన ముందున్న భవిష్యత్తు.. ప్రస్తుత వ్యవస్థ ను ప్రాచీనంగా కనబడేటట్టు చేయగలదు. ఈ నేపథ్యం లో, రాబోయే సాంకేతిక విప్లవాన్ని వినియోగించుకుని, మన జీవితాలను ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించడం, ప్రణాళికలను రూపొందించుకోవడం చాలా ముఖ్యం. వీటిలో - మెరుగైన ఆరోగ్య సంరక్షణ, మెరుగైన విద్య, మన రైతులకు మంచి సమాచారం, అవకాశాలు, చిన్న వ్యాపారాల కోసం మంచి మార్కెట్ అందుబాటు వంటివి మనం సాధించగల కొన్ని లక్ష్యాలు అని చెప్పవచ్చు.

మిత్రులారా,

మహమ్మారి ఉన్నప్పటికీ, మీ ఆవిష్కరణల ఫలితంగా, మీ కృషి ఫలితంగా ప్రపంచం తన కార్యకలాపాలను సాగిస్తున్నది. మీ కృషి ఫలితంగానే, ప్రయత్నాల వల్లనే ఒక కుమారుడు వేరే నగరం లో ఉన్న తన తల్లి తో మాట్లాడగలుగుతున్నాడు; తరగతి గది కి వెళ్లకుండానే ఒక విద్యార్థి తన గురువు వద్ద నుండి విద్య ను నేర్చుకోగలిగాడు; ఒక రోగి తన ఇంటి నుండే తన వైద్యుడి ని సంప్రదిస్తున్నాడు, ఒక వర్తకుడు, వేరే చోటులో ఉన్న వినియోగదారు తో జతపడుతున్నాడు.

మీ కృషి ఫలితంగా నే, మేము కూడా ప్రభుత్వపరంగా, ఐటి, టెలికమ్ రంగాల సామర్ధ్యాన్ని పూర్తి స్థాయి లో వినియోగించుకోడానికి ప్రయత్నిస్తున్నాము. భారతీయ ఐటి సేవల పరిశ్రమ నూతన శిఖరాలను అందుకోవడానికి నూలన ఇతర సేవల ప్రదాత సంస్థల తాలూకు మార్గదర్శకాలు సాయపడగలుగుతాయి. ఇది మహమ్మారి తొలగిపోయిన చాలా కాలం తరువాత కూడా ఈ రంగం వృద్ధి ని పెంపొందించగలుగుతుంది. ఈ కార్యక్రమం ఐటి సేవల పరిశ్రమను ప్రజాస్వామ్యీకరించడానికి, ఆ పరిశ్రమ ను మన దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకుపోవడానికి తోడ్పడుతుంది.

మిత్రులారా,

కేవలం కొన్ని సంవత్సరాల క్రితం రూపొందించిన యాప్ లు దశాబ్దాల నాటి నుండి ఉన్న కంపెనీ ల విలువ ను అధిగమిస్తున్న యుగం లో, ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది భారతదేశం తో పాటు మన యువ నూతన ఆవిష్కర్తలకు కూడా శుభ సంకేతమే. ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు లభించే అనేక ఉత్పత్తులపై మన యువతీయువకులు ప్రస్తుతం కృషి చేస్తున్నారు.

ఒక ఉత్పత్తి ని ప్రత్యేకమైందిగా చేసేది కోడ్ యే అనే సంగతి ని, చాలా మంది యువ టెకీలు నాతో చెప్తుంటారు. కొంతమంది నవ పారిశ్రామికవేత్తలు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాల్సింది భావన (కాన్సెప్ట్) కే అని నాతో అంటూ ఉంటారు. ఒక ఉత్పత్తి సత్తాను తెలుసుకోవడానికి మూలధనం ముఖ్యం అని ఇన్వెస్టర్ లు సూచిస్తారు. అయితే తరచు గా, చాలా ముఖ్యమైంది ఏమిటంటే, యువత కు వారి ఉత్పత్తి పైన ఉండే నమ్మకమే. కొన్నిసార్లు కేవలం లాభదాయకమైన తయారీకీ, వినూత్నమైన తయారీ కి మధ్య నిలబడేది ఈ నమ్మకమే. అందువల్ల, నా యువ స్నేహితులకు వారి సామర్థ్యం మీద, అలాగే వారి ఉత్పత్తుల మీద నమ్మకం పెట్టుకోవాలి అనే సందేశాన్ని నేనిస్తాను.

 

మిత్రులారా,

ప్రస్తుతం మన దేశం లో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ఫోను వినియోగదారులు ఉన్నారు. ఈ రోజు మన దేశం లో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ రోజు మన దేశం లో 750 మిలియన్లకు పైగా ఇంటర్ నెట్ వినియోగదారులు ఉన్నారు. ఈ రోజు ఇంటర్ నెట్ విస్తరిస్తున్న స్థాయిని, వేగాన్ని ఈ క్రింది వాస్తవాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజు భారతదేశం లోని మొత్తం ఇంటర్ నెట్ వినియోగదారులలో సగం మంది గత 4 సంవత్సరాలలోనే చేరారు. మొత్తం ఇంటర్ నెట్ వినియోగదారులలో సగం మంది మన గ్రామీణ ప్రాంతాల వారు. మన డిజిటల్ సైజు, మన డిజిటల్ ఆవశ్యకత లు ఇదివరకు కని విని ఎరుగనివి. ప్రపంచంలో సుంకాలు అతి తక్కువగా ఉన్న దేశం మనది. మొత్తం ప్రపంచం లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ యాప్ మార్కెట్ లలో మన దేశం ఒకటి. మన దేశం డిజిటల్ సామర్థ్యం అసమానమైంది, బహుశా మానవ జాతి చరిత్ర లోనే అద్వితీయమైందీనూ.

మొబైల్ సాంకేతికత కారణంగానే మనం బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ప్రయోజనాలను మిలియన్ల కొద్దీ ప్రజలకు అందించగలుగుతున్నాం. మహమ్మారి కాలంలో, మొబైల్ టెక్నాలజీ కారణంగానే పేదలు, బలహీన వర్గాల వారికి త్వరగా సహాయం చేయగలిగాము. మొబైల్ సాంకేతికత కారణంగానే క్రమబద్ధమైన, పారదర్శకత ను పెంచే బిలియన్ల కొద్దీ నగదు రహిత లావాదేవీలు సాధ్యపడ్డాయి. మొబైల్ టెక్నాలజీ కారణంగానే మనం ఈ రోజు న టోల్ బూత్ ‌ల వద్ద భౌతికంగా ఒకరికొకరు కలవకుండా లావాదేవీలను పూర్తి చేయగలుగుతున్నాము. మొబైల్ టెక్నాలజీ సహాయంతోనే, మనం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కోవిడ్ -19 టీకా పంపిణీ ప్రక్రియలలో ఒక దాన్ని ప్రారంభించబోతున్నాము.

మిత్రులారా,

భారతదేశం లో మొబైల్ ఫోన్ ల తయారీ లో మనం చాలా విజయాలను సాధించాం. మొబైల్ ఫోన్ ల తయారీ కి భారతదేశం అత్యంత అనుకూలమైన గమ్యస్థానాలలో ఒకటి గా అభివృద్ధి చెందుతోంది. భారతదేశం లో టెలికం పరికరాల తయారీ ని ప్రోత్సహించడానికి ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకాన్ని కూడా తీసుకువచ్చాము. టెలికమ్ పరికరాల రూపకల్పన కు, అభివృద్ధి కి, తయారీ కి భారతదేశాన్ని ఒక అంతర్జాతీయ కేంద్రం గా మార్చడానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం.

రాబోయే మూడేళ్ళ లో ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఫైబర్-ఆప్టిక్ కనెక్టివిటీ అందేటట్టు ఒక ప్రణాళిక ను ప్రారంభించే ప్రక్రియ ను మనం చేపడుతున్నాము. ఇప్పటికే అండమాన్-నికోబార్ ద్వీపాన్ని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ‌తో జోడించడం జరిగింది. అటువంటి కనెక్టివిటీ ని ఉపయోగించి- ఆశాజనక జిల్లాలు, వామపక్ష ఉగ్రవాద ప్రభావిత జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాలు, లక్షద్వీప్ దీవులు వంటి ప్రదేశాలలో చక్కని ఫలితాలను సాధించే కార్యక్రమాలతో మనం ముందుకు సాగుతున్నాము. ఫిక్స్ డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ తో పాటు సార్వజనిక స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా వై-ఫై హాట్‌స్పాట్‌ ల విస్తరణ కు పూచీపడడానికి మనం కంకణం కట్టుకున్నాం.

మిత్రులారా,

సాంకేతిక ఆధునీకరణ కారణంగా, హ్యాండ్ ‌సెట్ ‌లు, ఇతర ఉపకరణాలను తరచూ మార్చుకొనే సంస్కృతి మనకు ఉంది. ఈ నేపథ్యం లో, ఇటువంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నిర్వహించడానికీ, మెరుగైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికి అనువైన మంచి మార్గాల గురించి ఆలోచించడానికీ, ఒక టాస్క్-ఫోర్సు ‌ను పరిశ్రమ ఏర్పాటు చేయగలదా?

మిత్రులారా,

నేను ఇంతకు ముందే చెప్పినట్లు, ఇది ఆరంభం మాత్రమే. వేగవంతమైన సాంకేతిక పురోగతి తో భవిష్యత్తు కాలానికి ఒక గొప్పదైన సామర్ధ్యం ఉన్నది. భవిష్యత్తు లోకి మనం మరింత ముందుగానే పయనించడానికి, మిలియన్ల మంది భారతీయులను శక్తివంతం చేయడానికి, 5 జి ని సమయానుకూలంగా ప్రవేశపెట్టడానికి మనం అందరం కలసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ సమావేశం అటువంటి అన్ని విషయాల గురించి ఆలోచిస్తుందని, ఇటువంటి క్లిష్టమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో విజయవంతమైన ఫలితాలను సాధిస్తుందని నేను ఆశపడుతున్నాను.

మీ అందరికీ శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.

 

*****



(Release ID: 1679189) Visitor Counter : 267