కేంద్ర మంత్రివర్గ సచివాలయం

కాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన

జాతీయ సంక్షోభ యాజమాన్య సంఘ సమావేశం

దక్షిణ కోస్తా రాష్ట్రాలు, మంత్రిత్వశాఖల సంసిద్ధతపై చర్చ

సంసిద్ధత వివరించిన ఆంధ్ర, తమిళనాడు, పాండిచ్చేరి

Posted On: 23 NOV 2020 3:12PM by PIB Hyderabad

ముంచుకొస్తున్నతుపానును తట్టుకునే సంసిద్ధతను చర్చించటానికి ఈ రోజు జాతీయ సంక్షోభ యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన దక్షిణకోస్తా జిల్లాల సమీక్షా సమావేశానికి కేంద్ర కాబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షత వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి ప్రధనకార్యదర్శులు పాల్గొన్నారు. 

ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవటానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో జాతీయ సంక్షోభ యాజమాన్య సంఘానికి తెలియజేశారు. అదే సమయంలో ఎన్డీ ఆర్ ఎఫ్ తదితర సంస్థలతో కూడా సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు..

భారత వాతావరణ పరిశోధనాసంస్థ డైరెక్టర్ జనరల్  ఈ సమావేశంలో తుపాను పరిస్థితిని వివరించారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి వివరాలను సంబంధిత రాష్ట్రాలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల తీరప్రాంతాలను  ఈ నెల 24-26 తేదీలమధ్య ప్రభావితం చేస్తుందని చెప్పారు.

ఎలాంటి ప్రాణనష్టమూ జరక్కుండా చూడాలని, అదే విధంగా దెబ్బతినే ప్రాంతాలలో పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ధరణ జరగాలని కాబినెట్ కార్యదర్శి సూచించారు.  చేపలు పట్టటానికి సముద్రంలోకి వెళ్ళకుండా హెచ్చరించాలని, ముంపు ప్రాంతాల, చిన్నపాటి ఇళ్లలో ఉండేవాళ్ళను తగిన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.  

 హోం, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, పౌర విమనయాన, షిప్పింగ్, ఆరోగ్య మంత్రిత్వశాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డ్ చైర్మన్, ఎన్ డి ఎం ఎ సభ్య కార్యదర్శి, ఎన్ డి ఆర్ ఎఫ్ డైరెక్టర్ జనరల్, రక్షణమంత్రిత్వశాఖ ప్రతినిధి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొని ఆయా రాష్ట్రాలతో సమన్వయానికి సహాయానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు

***


(Release ID: 1675089) Visitor Counter : 205