ప్రధాన మంత్రి కార్యాలయం

జె.ఎన్.‌యు. ప్రాంగణంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించిన - ప్రధానమంత్రి

జాతీయ ప్రయోజనాల ముందు ఎప్పుడూ భావజాలానికి ప్రాధాన్యతనివ్వకూడదు : ప్రధానమంత్రి



ఆలోచనలను పంచుకోవడం, కొత్త ఆలోచనల ప్రవాహం నిరంతరాయంగా ఉండాలి

Posted On: 12 NOV 2020 8:09PM by PIB Hyderabad

న్యూఢిల్లీ లోని జె.ఎన్.‌యు. ప్రాంగణంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆవిష్కరించారు.

జె.ఎన్.‌యు. విద్యార్థులను, దేశ యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జాతీయ ప్రయోజనాల కంటే భావజాలానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కలిగే నష్టాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.   ఇది మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో హాని కలిగించిన ఒక విషయమని ఆయన పేర్కొన్నారు.  "నా భావజాలం ఇలా చెబుతుంది కాబట్టి, జాతీయ ప్రయోజన విషయాలలో, నేను అదే చట్రంలో ఆలోచిస్తాను, నేను అదే పరిధిలో పని చేస్తాను, అనడం తప్పు", అని శ్రీ మోదీ చెప్పారు.  ఎవరి భావజాలం గురించి వారు గర్వపడటం సహజం, అయితే, జాతీయ ప్రయోజనం కలిగిన విషయాలపై, మన భావజాలం దేశానికి వ్యతిరేకంగా నిలబడకుండా చూడాలి, అని ఆయన నొక్కి చెప్పారు. 

దేశ చరిత్రలో, దేశం ముందు ఎప్పుడు ఏ కష్టకాలం వచ్చినా, ఏ భావజాలనికి చెందిన ప్రజలైనా, జాతీయ ప్రయోజనాల కోసం కలిసి వచ్చారని, ప్రధానమంత్రి, విద్యార్థులకు వివరించారు.  స్వాతంత్య్ర సంగ్రామంలో, వివిధ భావజాలలకు చెందిన ప్రజలందరూ మహాత్మా గాంధీ నాయకత్వంలో ఐక్యంగా నిలిచారు.  వారు దేశం కోసం కలిసి పోరాడారు. అత్యవసర సమయంలో దేశం అదే సంఘీభావం చూసింది.  అత్యవసర పరిస్థితులకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో మాజీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆర్.‌ఎస్.‌ఎస్. కార్యకర్తలు, జనసంఘ్ కార్యకర్తలు ఉన్నారు.  సోషలిస్టులు, కమ్యూనిస్టులు కూడా కలిసి వచ్చారు.

ఈ సంఘీభావంలో తమ తమ భావజాలంపై ఎవరూ రాజీ పడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  అందరిదీ ఒకే ఉద్దేశ్యం. అదే జాతీయ ప్రయోజనం.  అందువల్ల, జాతీయ ఐక్యత, సమగ్రత, జాతీయ ప్రయోజనం గురించి ప్రశ్న వచ్చినప్పుడు, ఏదైనా ఒక భావజాలం కింద నిర్ణయాలు తీసుకోవడం దేశానికి నష్టం కలిగిస్తుంది.  

ఆలోచనల భాగస్వామ్యం మరియు కొత్త ఆలోచనల ప్రవాహాన్ని నిరంతరాయంగా ఉంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.  మన దేశం వివిధ మేధో ఆలోచనల నుండి ఉద్భవించి, అభివృద్ధి చెందిన భూమి.  ఈ సంప్రదాయాన్ని బలోపేతం చేయడం యువతకు అవసరం.  ఈ సాంప్రదాయం కారణంగానే, భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.   

ప్రధానమంత్రి తన ప్రభుత్వ సంస్కరణ ఎజెండా విధానాన్ని విద్యార్థులకు వివరించారు.  ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచన 130 కోట్లకు పైగా భారతీయుల సమిష్టి స్పృహగా మారిందని, మన ఆకాంక్షల్లో భాగమైందని ఆయన చెప్పారు.  భారతదేశంలో సంస్కరణల గురించి కొనసాగిస్తూ, మంచి సంస్కరణలు చెడ్డ రాజకీయాలుగా, చెడ్డ రాజకీయాలు,  మంచి సంస్కరణలుగా, తిరిగి అవి మంచి రాజకీయాలుగా, ఎలా మారాయో ఆలోచించాలని ప్రధానమంత్రి జె.ఎన్.‌యు. విద్యార్థులను కోరారు.  ఈ రోజు, సంస్కరణల వెనుక, భారతదేశాన్ని అన్ని విధాలుగా మెరుగుపర్చాలనే సంకల్పం ఉందని ఆయన తెలియజేశారు.  ఈ రోజు జరుగుతున్న సంస్కరణలకు అంతర్లీనంగా ఉన్న ఉద్దేశ్యం మరియు సంకల్పం నిజాయితీగా ఉన్నాయని ఆయన అన్నారు.  కొనసాగుతున్న సంస్కరణలకు ముందు, ఒక భద్రతా వలయం సృష్టించబడుతోందనీ, ఈ భద్రతకు నమ్మకం ఆధారమనీ ఆయన అన్నారు.

చాలా కాలంగా పేదలను నినాదాలలో మాత్రమే ఉంచారని, దేశంలోని పేదలను వ్యవస్థతో కలిపే ప్రయత్నం లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  గతంలో పేదలు చాలా నిర్లక్ష్యానికి గురయ్యారు, ఎవరికీ చెందనివారుగా, ఆర్ధికంగా మినహాయించబడిన వారుగా మిగిలిపోయారు.  ఇప్పుడు పేదలకు సొంత పక్కా గృహాలు, మరుగుదొడ్లు, విద్యుత్, వంట గ్యాస్, స్వచ్ఛమైన తాగునీరు, డిజిటల్ బ్యాంకింగ్, సరసమైన మొబైల్ కనెక్టివిటీతో పాటు, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.  ఇది పేదల చుట్టూ అల్లిన భద్రతా వలయం, ఇది అతని ఆకాంక్షల సౌధానికి అవసరం.  అదేవిధంగా, మెరుగైన నీటిపారుదల మౌలిక సదుపాయాల ద్వారా, మండిస్ ఆధునికీకరణ, ఇ-నామ్, భూసార ఆరోగ్య కార్డులు, యూరియా మెరుగైన ఎం.ఎస్.‌పి. లభ్యత రైతుల చుట్టూ కూడా ఒక భద్రతా వలయం ఏర్పడింది.  మొదట ప్రజల అవసరాల కోసం పనిచేసిన ప్రభుత్వం,  ఇప్పుడు వారి ఆకాంక్షల  కోసం పనిచేస్తోంది.

జె.ఎన్.‌యు. లోని స్వామి జీ విగ్రహం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందనీ, స్వామి వివేకానంద ప్రతి వ్యక్తిలో చూడాలని కోరుకున్న ధైర్యాన్ని కలిగిస్తుందనీ, ప్రధానమంత్రి ఆకాంక్షించారు.   ఈ విగ్రహం కరుణను నేర్పుతుందనీ, ఇది స్వామీజీ తత్వశాస్త్రానికి ప్రధానమైనదనీ, ఆయన పేర్కొన్నారు.  ఈ విగ్రహం మనకు దేశం పట్ల అపారమైన అంకితభావాన్ని నేర్పుతుందని, స్వామీజీ జీవితానికి ప్రధాన సందేశం అయిన మన దేశం పట్ల తీవ్రమైన ప్రేమను నేర్పుతుందని ఆయన ఆకాంక్షించారు.  ఈ విగ్రహం ఏకత్వం యొక్క దృష్టి కోసం దేశాన్ని ప్రేరేపించాలని మరియు స్వామీజీ ఆశించిన యువత నేతృత్వంలోని అభివృద్ధి దృష్టితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.  బలమైన మరియు సంపన్నమైన భారతదేశం యొక్క స్వామీజీ కలను సాకారం చేయడానికి ఈ విగ్రహం మనకు స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

*****


(Release ID: 1672506) Visitor Counter : 218