ప్రధాన మంత్రి కార్యాలయం

కటక్‌లో ఆదాయపు పన్ను శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ కార్యాలయ, నివాస సముదాయాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 11 NOV 2020 7:01PM by PIB Hyderabad

జై జగన్నాథ్!


ఒడిశా ముఖ్యమంత్రి, మా సీనియర్ మిత్రుడు, శ్రీమాన్ నవీన్ పట్నాయక్ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ రవిశంకర్ ప్రసాద్ జీ, ఒడిశా ముద్దుబిడ్డ, కేంద్ర కేబినెట్ సహచరుడు శ్రీమాన్ ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఇన్‌కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు గౌరవనీయులైన జస్టిస్ పీపీ భట్ జీ, ఒడిశా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యక్రమానికి హాజరైన మహానుభావులు, మిత్రులారా,

భగవంతుడు జగన్నాథుని ఆశీర్వాదంతో ఇన్‌కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యులన్ (ఐటీఏటీ) కటక్ బెంచ్ నవీన సముదాయంలోకి షిఫ్ట్ అవుతోంది. ఇన్నేళ్లుగా బాడుగ భవనంలో కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తన సొంత భవనంలోకి  మారడం చాలా సంతోషకరం. మీ ముఖాలను చూస్తే ఆ ఆనందం నాకు అర్థమవుతోంది. ఈ ఆనందకర సమయంలో మీ అందరితో మాట్లాడుతున్నందుకు.. అందరు అప్పీలేట్ ట్రిబ్యునల్ అధికారులు, ఉద్యోగులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కటక్ లోని ఈ బెంచ్ ఒక్క ఒడిశాకే కాదు.. ఈశాన్యభారతంలోని కోట్ల మంది పన్ను చెల్లింపు దారలకు ఆధునిక సేవలు అందించనుంది. ఆధునిక సేవలతోపాటు కోల్‌కతా జోన్ లోని రెండో బెంచ్ వద్దనున్న పెండింగ్ అప్పీల్స్ ను కూడా ఈ బెంచ్ నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పొందగలుగుతుంది. అందువల్ల అందరు రుణదాతలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సేవల వల్ల వివిధ కేసుల విచారణ కూడా వేగంగా జరుగుతుంది.
మిత్రులారా,
ఈ సమయంలో మరో గొప్ప వ్యక్తిని కూడా మనం గుర్తుచేసుకోవాలి. వారి కృషి కారణంగానే ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ కటక్ బ్రాంచ్ ఈ స్థాయికి చేరుకోవడం సాధ్యమైంది. ఒడిశాకోసం, ఒడిశా ప్రజలకు సేవ చేసేందుకే జీవితాన్ని సమర్పించిన శ్రీ బీజూ పట్నాయక్ జీ.. బీజూ బాబూ గారికి ఈ సందర్భంగా శ్రధ్దాంజలి ఘటిస్తున్నాను.
మిత్రులారా,
మనం సాంకేతిక ప్రపంచంలో ఉన్నాం. ఇక్కడ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాల్సి ఆవశ్యకత ఉంది. మరీ ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థను ఆధునీకరించుకోవడం, సాంకేతికతను వీలైనంత ఎక్కువగా వినియోగించడం ద్వారా దేశ ప్రజలకు సరికొత్త సౌకర్యాన్ని కలిగించినట్లయింది. నిష్పక్ష, సులభమైన, సత్వరమైన న్యాయకోసం మీరు ఏ ఆదర్శాలనైతే ముందుకు తీసుకెళ్తున్నారో.. అవి ఆధునికత, సాంకేతికత ద్వారా మరింత బలోపేతం అవుతాయి. ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ దేశవ్యాప్తంగా ఉన్న తన బెంచ్ ల ద్వారా కేసులను ఆన్ లైన్ (వర్చువల్ వేదిక) ద్వారా విచారించేలా కూడా ఆధునీకరించడటం హర్షదాయకం. ఇంతకుముందు శ్రీమాన్ పీపీ భట్ గారు చెప్పినట్లు.. కరోనా సమయంలోనే ఈ భారీ కార్యక్రమం పూర్తవడం, వర్చువల్ వేదికలు సిద్ధమవడం సంతోషకరం. రవి శంకర్ జీ దేశం మొత్తానికి సంబంధించిన వివరణ అందిస్తున్నారు.
మిత్రులారా,
సుదీర్ఘమైన బానిసత్వ కాలం.. పన్ను చెల్లింపుదారుడిని, పన్నులు సేకరించే వారిని శోషితుడు, దోపిడీ దారుడిగా చూపించింది. దురదృష్టవశాత్తూ స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా.. ఈ పరిస్థితులను మార్చేందుకు అవసరమైన ప్రయత్నాలేమీ జరగలేదు. వాస్తవానికి దేశంలో పురాతన కాలం నుంచే పన్నుల అవసరం, ఇచ్చిపుచ్చుకోవాల్సిన అంశాల సందర్భంలో ఓ ఆరోగ్యకరమైన వ్యవస్థ ఉంది.

గోస్వామీ తులసీ దాస్..
బర్సత్ హర్సత్ సబ్ లఖే, కర్సత్ లఖే న కోయ్
తులసీ ప్రజా సుభాగ్ సే, భూప్ భానూ సో హోయ్
అని వివరించారు.

అంటే, మేఘాలు వర్షించినపుడు దానివల్ల మనందరికీ లాభం జరుగుతుంది. మేఘాలు ఏర్పడినపుడు సూర్యుడు అందులోని తేమను ఆవిరిగా మార్చేస్తాడు. దాని వల్ల ఎవరికీ నష్టముండదు. ఇదే విధంగా పాలన జరగాలి. సామాన్యుల వద్దనుంచి కూడా పన్ను తీసుకుంటున్నప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండకూడదు. అవే డబ్బులు దేశ ప్రజలకు చేరుతున్నప్పుడు వాటిని తమ జీవితాల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలనేది దాని తాత్పర్యం. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఈ దృష్టితోనే ముందుకెళ్తోంది.
మిత్రులారా,
ఇవాళ పన్ను చెల్లింపుదారుడు.. పన్నుల వ్యవస్థలో జరుగుతున్న భారీ సంస్కరణలకు సాక్షీభూతుడిగా ఉన్నాడు. ఇప్పుడు రీఫండ్ కోసం నెలలపాటు వేచి చూడాల్సిన అవసరం ఉండటం లేదు. వారాల్లోనే వారికి రీఫండ్ లభిస్తోంది. అప్పుడు వారు పారదర్శకతను తెలుసుకుంటున్నారు. పన్నుల విభాగం పాత వివాదాలను పరిష్కరిస్తున్న విషయన్ని గమనిస్తున్నప్పుడు ఆయనకు పారదర్శకత అనుభవానికి వస్తోంది. తను నేరుగా వెళ్లకుండా అప్పీల్ చేసుకునే అవకాశం కల్గినపుడు వారు పన్ను పారదర్శకతను మరింత బాగా తెలుసుకుంటాడు. ఆదాయపు పన్ను నిరంతరం తగ్గుతూ వస్తున్న సంగతి చూస్తున్నప్పుడు అప్పుడు అందరికంటే ఎక్కువగా పారదర్శకత ఆయన అనుభవానికి వస్తుంది. గతంలో ప్రభుత్వాల సమయం ఫిర్యాదులకే సరిపోతుంటే.. అన్నిచోట్లా టాక్స్ టెర్రరిజం (పన్ను ఉగ్రవాదం) పేరు వినిపిస్తూ ఉండేది. కానీ నేడు దేశం ఈ పదాన్ని పక్కనపెట్టి టాక్స్ ట్రాన్స్ పరెన్సీ (పన్ను పారదర్శకత)వైపు పయనిస్తోంది. మేం రిఫార్మ్ (సంస్కరణలు), పర్‌ఫార్మ్ (అమలు), ట్రాన్స్‌ఫామ్ (పరివర్తన) మంత్రంతో మేం ముందుకు వెళ్తున్నందునే దేశం టాక్స్ టెర్రరిజం నుంచి టాక్స్ ట్రాన్స్ ట్రాన్స్‌పరెన్సీ వైపు పరివర్తనం చెందుతోంది. స్పష్టమైన ఆలోచనలతోపాటు టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (పన్ను నిర్వహణ) అనే మైండ్ సెట్ ను కూడా మేం పరివర్తనం చేస్తున్నాం.
మిత్రులారా,
నేడు దేశంలో రూ.5లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు. దీని వల్ల మధ్యతరగతి ప్రజలకు, యువతరానికి ఎక్కువగా లబ్ధి చేకూరతోంది. ఈ ఏడాది బడ్జెట్ లో పన్న చెల్లింపుదారులకు ఇచ్చిన సౌలభ్యాల ద్వారా మరింత సరళమైన వ్యవస్థతోపాటు వారిపై అనవసర ఒత్తిడి తగ్గుతుంది. దీంతోపాటు దేశ పురోగతిని మరింత వేగవంతం చేసుందుకు పెట్టుబడి సహకార వ్యవస్థను పెంపొందించేందుకు కార్పొరేట్ టాక్స్ లో చరిత్రాత్మక స్థాయిలో మినహాయంపు కూడా తీసుకొచ్చాం. భారతదేశ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులను పెంచేందుకు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును రద్దుచేశాం. జీఎస్టీ ద్వారా డజన్లకొద్దీ ఉన్న పాత పన్నులన్నీ రద్దయ్యాయి. దీంతోపాటు చాలామటుకు వస్తువులు, సేవల్లో పన్నులు చాలా తగ్గాయి.
మిత్రులారా,
ఇవాళ్టికి ఐదారేళ్ల ముందు.. ఒకవేళ్ ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్.. రుణదాతలకు రూ.3లక్షల ఉపశమనాన్ని ఇస్తే.. దాన్ని ఐటీఏటీలో సవాల్ చేసే పరిస్థితులుండేవి. ఈ పరిమితిని మా ప్రభుత్వం రూ.3లక్షలనుంచి రూ.50 లక్షలకు పెంచేసింది. దీని వల్ల ఇప్పుడు కనీసం రూ.2కోట్ల కంటే  ఎక్కువ పన్ను అప్పీల్ లు సుప్రీంకోర్టు వద్దకు వెళ్తాయి. ఈ ప్రయత్నాల వల్ల వ్యాపారానుకూల పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతోపాటు చాలాసంస్థలపై వివాదాస్పద కేసుల భారం కూడా తగ్గింది.
మిత్రులారా,
పన్ను తగ్గింపు, ప్రక్రియల మరింత సరళతరం చేయడంతోపాటు తీసుకొస్తున్న సంస్కరణలు న్యాయంగా పన్ను చెల్లిస్తున్న వారందరికీ అనుకూలంగా ఉంటున్నాయి. వారికి ఇతర ఇబ్బందులేవీ రాకుండా కాపాడుతున్నాయి. పన్ను చెల్లింపుదార్ల అధికారాలను, కర్తవ్యాలను కోడిఫై చేసి.. వారికి చట్టబద్ధమైన గౌరవాన్ని కల్పించే దేశాల సరసన నేడు భారతదేశం కూడా నిలబడింది. పన్ను చెల్లింపుదారుడు, పన్న వసూలుదారుడి మధ్య విశ్వాసాన్ని పెంచడంతోపాటు, పారదర్శకతను కల్పించడం చాలా పెద్ద ముందడుగు. ఎవరైతే తమ కష్టాన్ని, చెమటను దేశాభివృద్ధికి వినియోగిస్తాడో.. చాలా మంది దేశవాసులకు ఉపాధికల్పిస్తాడో అలాంటి వారంతా గౌరవానికి అర్హులే. దేశంలో సంపదను సృష్టించేవారి సమస్యలను తగ్గినపుడు, వారిని  కాపాడుకున్నప్పుడు, వారికి వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని.. ఈ ఏడాది 15 ఆగస్టున ఎర్రకోటననుంచి ఇచ్చిన ప్రసంగంలో నేను పేర్కొన్నాను. దాని పరిణామంగానే.. నేడు వీలైనంత ఎక్కువమంది దేశాభివృద్ధి కోసం పన్ను చెల్లింపు వ్యవస్థతో అనుసంధానమవుతున్నారు. ప్రభుత్వం పన్ను వసూళ్లపై ఏ విధంగా విశ్వాసం ఉంచుతున్నారో.. నేడు మీకు నేను మరో ఉదాహరణ ద్వారా వివరించాలనుకుంటున్నాను.
మిత్రులారా,
అప్పట్లో ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసే ఉద్యోగులు, వ్యాపారులకు ఆదాయపు పన్ను శాఖ అధికారుల పరిశీలన తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆదాయపు పన్ను దాఖలు చేసే వారిని పూర్తిగా విశ్వసించాలనేదే భారత ప్రభుత్వం ఆలోచన. దీని కారణంగా.. దేశంలో పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్న వాటిలో దాదాపు 99.75 శాతం రిటర్న్స్ ఎలాంటి అభ్యంతరాల్లేకుండా తీసుకుంటున్నవే. కేవలం 0.25 శాతం అంశాల్లోనే పరిశీలన జరుగుతోంది. దేశ పన్ను వ్యవస్థలో వచ్చిన చాలా పెద్ద మార్పు ఇది.
మిత్రులారా,
దేశంలో తీసుకొస్తున్న పన్ను సంస్కరణల లక్ష్యాలను చేరుకోవడంలో.. మీ వంటి ట్రిబ్యునల్ పాత్ర అత్యంత కీలకం. మీరు వర్చువల్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని విచారణ జరుపుతున్నట్లుగానే.. మనం ఫేస్ లెస్‌సిస్టమ్ (నేరుగా కలవాల్సిన అవసరం లేకుండా అప్పీల్ చేయడం వంటి) వైపు వెళ్తున్నాం. ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్, అప్పీల్ లాగే.. భౌతికంగా విచారించాల్సిన అవసరం లేకుండా.. ఈ-విచారణ వైపు వెళ్లేందుకు వీలవుతుందా అని ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆలోచించాలి. కరోనా కాలంలో చేసిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లగలమా? అనేదానిపై దృష్టిపెట్టాలి.
మిత్రులారా,
కరోనా సమయంలో తలెత్తిన పరిస్థితుల కారణంగా నేర్చుకున్న.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా అన్ని పనులను అంతే పారదర్శకత, అంతే ప్రభావవంతంగా నిర్వహిస్తున్నాం. నేడు దేశవ్యాప్తంగా ఉన్న బెంచ్‌లను ఆధునీకరించుకుంటూ.. ముందుకెళ్తున్నారు. అలాంటప్పుడు ఈ సంస్కరణలు మీకేం పెద్ద కష్టం కాదు. దీని వల్ల పన్ను చెల్లింపుదారుడి సమయం, ధనం, శక్తి వ్యర్థం కాకుండా ఉంటాయి. వివాదాల పరిష్కారం కూడా జోరందుకుంటుంది.
మిత్రులారా,
‘న్యాయమూలం సురాజ్యం స్తాత్, సంఘమూలం మహాబలం’ అని పెద్దలు చెప్పారు.
న్యాయం అనేది సురాజ్యానికి మూలం. దీంతోపాటు సంఘటనంలోనే మహాశక్తికి బలం అని దానర్థం. అందుకే న్యాయం, సంఘటనం ద్వారా.. ఆత్మనిర్భర భారత నిర్మాణానికి శక్తినిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశంలో ఒకదాని తర్వాత మరో సంస్కరణ అమలవుతూనే ఉంది.  ఈ సంస్కరణలకు కూడా ఈ మంత్రమే ప్రేరణ. మనమంతా కలిసి పనిచేస్తే మనం చేసే ఈ పనులన్నీ విజయవంతం అవుతాయనే విశ్వాసం నాకుంది. ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధికారులు, ఉద్యోగులకు, సమస్త ఒడిశా ప్రజలకు ఈ ఆధునిక కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ దీపావళితోపాటు రానున్న పండగల సందర్భంగా శుభాకాంక్షలు. కరోనా సమయంలో ఈ మహమ్మారిని తేలికగా తీసుకొవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మాస్కులు ధరించడం, సురక్షిత దూరాన్ని పాటించడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. ఒడిశా ప్రజలకు ఓ విషయాన్ని గుర్తుచేద్దామనుకుంటున్నా. ఒడిశా కళలు, సంస్కృతికి ఓ తపోభూమి వంటిది. నేడు దేశమంతా ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రం ప్రతిధ్వనిస్తోంది. భారతదేశంలో తయారయ్యే ప్రతి వస్తువులో నా దేశ ప్రజల చెమట ఉంది. ఇందులో నా దేశ ప్రజల, యువకుల నైపుణ్యం ఉంది. ఈ అంశాలపై దృష్టిపెట్టి.. స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని కోరుతున్నాను. మన మట్టి, మన చెమటతో తయారయ్యే వస్తువులనే కొనండి. ఈ విషయాన్ని భగవాన్ జగన్నాథుడి గడ్డపైనుంచి యావత్ ఒడిశా ప్రజలకు, యావత్ భారతీయులకు విన్నవిస్తున్నాను. దీపావళి ఒక్కరోజే కాదు.. సంవత్సరంలోని 365 రోజులు దీపావళి జరగాలి.. అన్ని రోజులూ మన వస్తువులనే కొందాం. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పరిగెట్టడం ప్రారంభం అవుతుంది. మన శ్రామికులు, కళాకారుల చెమటకు.. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఉంది. ఈ విశ్వాసం తోనే ఈ శుభ సందర్భంగా మరోసారి మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదములు!

 

***



(Release ID: 1672251) Visitor Counter : 235