రక్షణ మంత్రిత్వ శాఖ
'సాగర్-2' మిషన్‌లో భాగంగా, ఐఎన్‌ఎస్ ఐరావత్ ద్వారా 'జిబౌటి' దేశానికి ఆహార సాయం
Posted On:
12 NOV 2020 12:38PM by PIB Hyderabad
మానవత మిషన్ 'సాగర్-2'లో భాగంగా, ఆఫ్రికాలోని జిబౌటి దేశానికి భారత నావికాదళ నౌక ఐరావత్ ఈనెల 10వ తేదీన చేరుకుంది. ప్రకృతి విపత్తులు, కొవిడ్‌ను అధిగమించడానికి మిత్రదేశాలకు మన దేశం సాయం అందిస్తోంది. అందులో భాగంగానే, జిబౌటి ప్రజల కోసం ఆహార పదార్థాలు తీసుకుని ఐఎన్‌ఎస్ ఐరావత్ ఆ దేశాన్ని చేరింది.
ఆహార పదార్థాల అప్పగింత కార్యక్రమాన్ని జిబౌటి నౌకాశ్రయంలో నిర్వహించారు. జిబౌటి సామాజిక వ్యవహారాల శాఖ సెక్రటరీ జనరల్ ఇఫ్రాత్ అలీ అహ్మద్, జిబౌటిలోని భారత రాయబారి అశోక్ కుమార్ నుంచి భారత సాయాన్ని స్వీకరించారు. ఐఎన్‌ఎస్ ఐరావత్ కమాండింగ్ అధికారి, కమాండర్ ప్రసన్న కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని విజన్ అయిన 'సాగర్' (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్)లో సాగర్-2 మిషన్ భాగం. భారత నౌకాదళం ద్వారా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆధారపడదగిన భాగస్వామిగా భారత్ స్థానాన్ని మిషన్ సాగర్ సుస్థిరం చేస్తుంది. పొరుగు దేశాలకు మన దేశం ఇస్తున్న ప్రాముఖ్యతను స్పష్టంగా చెప్పడంతోపాటు, ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల సమన్వయంతో మిషన్ సాగర్‌ను నౌకాదళం చేపడుతోంది.
***
(Release ID: 1672233)
Visitor Counter : 187