ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కోవిడ్ కేసులు 50,000 లోపే

కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికీ మధ్య పెరుగుతున్న అంతరం

Posted On: 08 NOV 2020 11:04AM by PIB Hyderabad

భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కొత్త కోవిడ్ కేసులు 50,000 లోపే నమోదయ్యాయి. 45,674 మంది కోవిడ్ పాజిటివ్ గా తేలారు. అక్టోబర్ 15 నుంచి కోవిడ్19 కొత్త కేసులు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి.

 

కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం  స్పష్టంగా కనబడుతూనే ఉంది. గత 24 గంటలలో 49,082 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. నేటికి 37 రోజులుగా ఇదే ధోరణి కనబడుతోంది. దీనివలన చికిత్సపొందుతూ ఉన్నబాధితుల సంఖ్య తగ్గుతూ ఇప్పుడది 5.12 లక్షలకు చేరింది.

ఆ విధంగా దేశంలో ఇప్పుడు కోవిడ్ చికిత్సపొందుతున్నవారి సంఖ్య 5,12,665 గా నమోదైంది. ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసులలో ఇది  6.03%  మాత్రమే. దీన్నిబట్టి ఇది క్రమంగా తగ్గుతూ ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది. కోలుకున్నవారి సంఖ్య 78,68,968గా, కోలుకున్నవారి శాతం  92.49%  గా నమోదు కావడాన్ని బట్టి ఇది పెరుగుతున్న ధోరణి కూడా అర్థమవుతోంది. ఆ విధంగా చూసినప్పుడు కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా ప్రస్తుతం 73,56,303 కి చేరింది. ఈ అంతరం మరింత పెరుగుతూ వస్తోంది.

 

కొత్తగా కోలుకున్నవారిలో 76% మంది కేవలం  10  రాష్ట్రాలకు చెందినవారేనన్నది కనబడుతోంది. ఆ విధంగా కోలుకున్నవారిలో అత్యధికంగా మహారాష్ట్రలో ఒకే రోజు 7,120  మంది కోవిడ్ నుంచి బైట పడ్డారు. 6478 మంది కోలుకున్న కేరళ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది.

గత 24 గంటలలో జరిపిన కోవిడ్ పరీక్షల అనంతరం నిర్థారణ అయిన కేసుల్లో 76% కేవలం 10 రాష్ట్రాలకు చెందినవి గా గుర్తించారు. 7201 పాజిటివ్ కేసులతో కేరళ మొదటి స్థానంలో ఉండగా, 6953 కేసులు నమోదైన ఢిల్లీ రెండో స్థానంలోను, 3959 కేసులతో మహారాష్ట్ర మూడో స్థానంలోను ఉన్నాయి.  

 

 

గడిచిన 24 గంటలలో 559 కోవిడ్ మరణాలు సంభవించాయి. వాటిలో దాదాపు 79% మరణాలు 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. కొత్తగా నమోదైన మరణాలలో 26.8% (150 మరణాలు) ఒక్క మహారాష్ట్రలోనే సంభవించాయి, ఢిల్లీ (79), పశ్చిమ బెంగాల్ (58) ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.  

 

***



(Release ID: 1671205) Visitor Counter : 139