ప్రధాన మంత్రి కార్యాలయం

‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్, యాంటీ కరప్షన్‌’లో ప్రధానమంత్రి ప్రసంగపాఠం

Posted On: 27 OCT 2020 6:41PM by PIB Hyderabad

నమస్కారం !

మంత్రి మండలిలో నా సహచరుడు శ్రీమాన్ డాక్టర్ జితేంద్ర సింగ్ జీ, సీవీసీ, ఆర్బీఐ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, సీబీఐ అధికారులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల సీఐడీ బృందాల ప్రముఖులు, బ్యాంకులు కీలక అధికారులతో పాటు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ నిర్వహిస్తున్న సీబీఐ బృందానికి నా అభినందనలు.

నేటినుంచి విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే దేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సర్దార్ పటేల్ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’తోపాటు దేశంలోని కార్యనిర్వాహక, పరిపాలన వ్యవస్థకు రూపకల్పన చేశారు. దేశ తొలి హోం మంత్రి హోదాలో.. సామాన్య మానవుని కోసం, నైతిక పరమైన విలువల కోసం చక్కటి వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు కృషిచేశారు. కానీ తర్వాతి కాలంలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్న విషయాన్ని మనం చూశాం. వేల కోట్ల కుంభకోణాలు, డొల్ల కంపెనీల కుట్రలు, పన్ను వేధింపులు, పన్ను దొంగలు వంటివన్నీ ఏళ్ల తరబడి చర్చలో ఉన్న సంగతి మీకు గుర్తుండే ఉంటుంది.

మిత్రులారా, 2014 తర్వాత దేశంలో సరికొత్త మార్పు తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నాం. దేశం సరికొత్త దిశలో ముందుకెళ్తున్నప్పుడు గతంలో ఉన్న పరిస్థితిని మార్చడం పెను సవాల్ గా మారింది. ఇలా దేశాన్ని నడపగలమా? దేశంలో ఇలాగే అవుతుందనుకునే ఆలోచనను ముందుగా మార్చాల్సి వచ్చింది. ప్రమాణ స్వీకారంచేసిన తర్వాత మేం తీసుకున్న తొలి 2-3 నిర్ణయాల్లో నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయడం కూడా ఉంది. ఈ నిర్ణయం అవినీతి, కుంభకోణాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఆలోచనను స్పష్టపరిచింది.  కొన్నేళ్లుగా దేశంలో ఇదే విధంగా అవినీతిపై రాజీలేని పద్ధతిలో ముందుకెళ్తున్నాము. 2014 తర్వాత దేశంలోని పాలనా వ్యవస్థలో, బ్యాంకింగ్ వ్యవస్థలో, విద్య, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో ఇలా ప్రతి రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ సంస్కరణలను ఆధారం చేసుకునే నేడు దేశం ఆత్మనిర్భర భారత ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు సంపూర్ణ శక్తితో ఏకమైంది.

ప్రపంచంలోని అగ్రదేశాల్లో భారత్ ను ఒకటిగా నిలపడమే మా లక్ష్యం. కానీ మిత్రులారా, అభివృద్ధి కోసం మన పరిపాలన వ్యవస్థ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీగా , ప్రజలకు సమాధానం ఇచ్చేలా ఉండాల్సిన అవసరముంది. ఈ అన్ని వ్యవస్థలకు అవినీతే అసలైన శత్రువు. అవినీతి ఒక్క రూపాయికి సంబంధించిన విషయంకాదు. ఓవైపు అవినీతి దేశాభివృద్ధికి నష్టం పరుస్తుండగా.. మరోవైపు సామాజిక సామరస్యాన్ని తీవ్రంగా నష్టపరుస్తోంది. అన్నింటికీంటే ముఖ్యంగా దేశంలో మనమంతా ఒక్కటే అని ఉండాల్సిన భావనపై కూడా అవినీతి దాడిచేస్తోంది. అందుకే అవినీతిని అంతం చేయడం ఓ ప్రభుత్వ వ్యవస్థ బాధ్యత ఒక్కటే కాదు.. దీన్ని ఎదుర్కునేందుకు మనందరి సమిష్టి బాధ్యత అని గుర్తించాలి.

మిత్రులారా, ఈ సదస్సులో సీబీఐతోపాటు వివిధ ఏజెన్సీలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. మూడ్రోజులపాటు జరిగే కార్యక్రమంలో భాగస్వామ్యమవుతున్న సంస్థలన్నీ ‘సతర్క్ భారత్, సమృద్ధ్ భారత్’ నిర్మాణంలో కీలక భూమిక పోషించే సంస్థలే. ఈ మూడ్రోజులు మనకోసం చాలా కీలకం. ఎందుకంటే అవినీతి దానికదే ఏర్పడిన ఓ సమస్య కాదు. దేశానికి సంబంధించిన ప్రశ్న తలెత్తినపుడు అప్రమత్తత పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. అవినీతైనా, ఆర్థిక నేరాలైనా, మత్తుమందుల నెట్ వర్క్ అయినా.. మనీ లాండరింగ్ అయినా, ఉగ్రవాదమైనా, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించడమైనా.. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. అందుకే మనమంతా అవినీతికి వ్యతిరేకంగా.. వ్యవస్థీకృత తనిఖీలు, సమర్థవంతమైన ఆడిట్లు, సామర్థ్య నిర్మాణం, శిక్షణ పేరుతో కలిసి ఓ పరిపూర్ణ విధానంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అన్ని విచారణ సంస్థల మధ్య సమిష్టితత్వం, పరస్పర సహకార స్ఫూర్తి ఉండాల్సిన అవసరముంది. ఈ సదస్సు ఇలాంటి అవసరానికి ఓ సరైన వేదికగా నిలుస్తుందని, ‘సతర్క్ భారత్, సమృద్ధ్ భారత్’కు ఓ సరికొత్త మార్గంలో తీసుకెళ్లే దిశగా ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా, 2016లో విజిలెన్స్ అవేర్నెస్  లో భాగంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమం సందర్భంగా నేను మాట్లాడుతూ.. పేదరికంతో పోరాడుతున్న మన దేశంలో అవినీతికి ఇసుమంతైనా అవకాశం ఉండకూడదని పేర్కొన్నాను. అవినీతికి అసలైన బాధితుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ దేశంలోని పేదలే. న్యాయంగా ఉండే వ్యక్తికి ఇబ్బందులొస్తాయి. దశాబ్దాలుగా మన దేశంలో ఇదే పరిస్థితి ఉన్న విషయాన్ని మీరు కూడా గమనించారు. గతంలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కానీ ప్రత్యక్ష నగదుబదిలీ (డీబీటీ) విధానంలో నేరుగా పేదవారి అకౌంట్లలోకి వందశాతం లబ్ధిని బదిలీ చేస్తున్నాం. ఒక్క డీబీటీ ద్వారానే లక్షా 70వేల కోట్ల రూపాయలు అవినీతిపరుల చేతుల్లోకి చేరకుండా ఆపగలిగాం. వేలకోట్ల రూపాయల కుంభకోణాలు జరిగిని ఆ కాలాన్ని దేశం ఎప్పుడో వెనక్కు నెట్టేసి.. ముందుకెళ్తోందని గర్వంగా చెప్పుకోవచ్చు. దేశంలోని వ్యవస్థలపై సామాన్య ప్రజలకు మళ్లీ విశ్వాసం పెరుగుతుండటం సంతోషాన్ని కలిగిస్తోంది. తద్వారా సానుకూల వాతావరణం ఏర్పడుతోంది.

మిత్రులారా, ఈ విషయంలో ఎక్కడా ఎవరిపైనా ప్రభుత్వం ఒత్తిడి ఉండకూడదు.. అలాగని ప్రభుత్వం లేదనే లోటుండకూడదు.. అనేదానిపైనా మా ప్రభుత్వం ఎక్కువ దృష్టిపెడుతోంది. ప్రభుత్వం అవసరం ఎక్కడ, ఎంతమేర అవసరమో అంతవరకే ఉండాలి. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండకూడదు.. అలాగని ప్రభుత్వం లేదనే లోటు కనిపించకూడదు.  అందుకే కొన్నేళ్లుగా 1500కు పైగా చట్టాలను రద్దుచేశాం. వాటి నిబంధలను సరళీకృతం చేశాం. పింఛను అయినా, స్కాలర్ షిప్ అయినా.. నీటి బిల్లు చెల్లించాలన్నా, విద్యుత్ బిల్లు కట్టేదున్నా.. బ్యాంకనుంచి లోన్ తీసుకోవాలనుకున్నా, పాస్ పోర్టు కావాలానుకున్నా.. లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవాలనుకున్నా.. ఎలాంటి సహాయం అవసరమైనా సరే.. కొత్త కంపెనీ పెట్టాలనుకున్నా.. ఇప్పుడు వేరేవాళ్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. గంటల తరబడి పొడవైన లైన్లలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ పనులన్నింటికోసం డిజిటల్ వేదికలు వాళ్ల వద్ద అందుబాటులో ఉన్నాయి.

మిత్రులారా, ‘ప్రక్షళానాద్ధి పంకస్య దూరాత్ స్పర్షనమ్ వరమ్’ అని చెబుతుంటారు. అంటే.. అశుద్ధం తగిలినపుడు దాన్ని కడుక్కోవాలి. కానీ దానికంటే మంచిది.. అసలు అశుద్ధం తగలకుండా ఉండటమే మంచిది. దండనాత్మక నిఘా గురించి మాట్లాడటం కన్నా.. దండనాత్మక నిఘాపై పనిచేయడం చాలా ముఖ్యం. ఏ పరిస్థితుల కారణంగా అవినీతి రాజ్యమేలుతుంతో.. ఆ పరిస్థితులపై యుద్ధం చేయడం అత్యంత ఆవశ్యకం. కొన్ని పరిస్థితుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని బదిలీ చేయడం ఎంత పెద్ద అంశంగా కనిపించేదో మీకు తెలుసు. అందుకోసం ఓ ప్రత్యేకమైన పరిశ్రమే నడిచేది.

మిత్రులారా, కౌటిల్యుడు.. ‘న భక్షయంతి యే త్వర్థాన్ వర్ధయంతి చ, నిత్యాధికారా: కార్యాస్తే రజ్ఞ్ ప్రియహితే రతా:’ అని చెప్పాడు. అంటే.. ఎవరైతే ప్రభుత్వ ధనాన్ని చోరీ  చేయకుండా దాన్ని అవసరమైన చోట వినియోగిస్తూ.. దాన్ని వృద్ధి చేసేందుకు పనిచేస్తారో.. అలాంటి వారిని ఉన్నతపదవుల్లో నియమించాల్సిన అవసరముందని అర్థం. కానీ కొన్నేళ్లకు ముందు ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. దీని వల్ల జరిగిన తీవ్రమైన నష్టాన్ని దేశం గమనించింది. ఈ పరిస్థితి మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేసింది. అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ఉన్నతస్థానాల్లో పనిచేసేందుకు ఎవరి సిఫారసులు అవసరం లేదు. ఎవరితో ఒత్తిడి చేయించాల్సిన పనీలేదు. ఇంతకుముందే డాక్టర్ జితేంద్ర సింగ్ జీ చెప్పినట్లు.. ప్రభుత్వ ఉద్యోగాల్లోని గ్రూప్ బీ, గ్రూస్ సీ ఉద్యోగాలకోసం ఇంటర్వ్యూలను రద్దుచేయడం జరిగింది. అభ్యర్థనే లేనప్పుడు.. వివిధ రకాల ఆటలు కూడా తగ్గిపోయాయి. బ్యాంకు బోర్డు బ్యూరో ఏర్పాటు ద్వారా బ్యాంకుల్లోని ఉన్నత పదవుల్లో నియమకాలు పారదర్శకంగా జరుగుతున్నాయి.

మిత్రులా, దేశంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు చట్టపరమైన సంస్కరణలు తీసుకొచ్చాం. కొత్త చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. నల్లధనం, బినామీ ఆస్తులు తదితర అంశాలపై తీసుకొచ్చిన చట్టాలు, తీసుకున్న చర్యల ప్రభావం ప్రపంచంలోని వివిధ దేశాల్లో కనబడుతోంది. దండనాత్మక ఆర్థిక ఎగవేతదారుల చట్టం ద్వారా అవినీతి పరులపై విచారణకు చాలా సహాయం లభిస్తోంది. ఇప్పుడు భారతదేశం.. ప్రపంచంలోని ఫేస్ లెస్ టాక్స్ అసెస్మెంట్ వ్యవస్థ అమల్లో ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. అవినీతిని ఆపేందుకు సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్న దేశాల సరసన భారత్ నిలిచింది. విజిలెన్స్ తో అనుసంధానమైన అన్ని ఏజెన్సీలకు అద్భుతమైన సాంకేతికత అందుబాటులోకి తీసుకురావడం, సామర్థ్యాభివృద్ధికి సహకరిచడం, అధునాతన మౌలికవసతులు, పరికరాల కల్పన ప్రభుత్వాల ప్రాథమిక లక్ష్యం.  

మిత్రులారా, ఈ ప్రయత్నాలతోపాటు.. అవినీతిపై పోరాటం ఒకరోజుదో.. ఒక వారానికి పరిమితమో కాదనే విషయాన్ని కూడా మనమంతా గుర్తుంచుకోవాలి. ఈసందర్భంగా మీముందు ఓ పెద్ద సవాల్ ను ఉటంకించాలను అనుకుంటున్నాను. ఇది దశాబ్దాలుగా దేశంలో మెల్లిమెల్లిగా విస్తరిస్తూ.. దేశం ముందు ఓ పెను సవాల్ గా నిలిచింది. అదే.. వంశపారంపర్య అవినీతి. కుటుంబంలోని ఒక తరం నుంచి మరోతరానికి బదిలీ అయిన అవినీతి.

మిత్రులారా, ఓ తరం అవినీతికి పాల్పడినా శిక్షను అనుభవించని కారణంగా.. తర్వాతి తరం మరింత ఉత్సాహంగా అవినీతికి పాల్పడుతోందనే విషయాన్ని గత కొన్ని దశాబ్దాలుగా మనం గమనిస్తూనే ఉన్నాం. ఒక ఇంట్లోనే.. కోట్ల రూపాయల నల్లధనాన్ని సంపాదించినవాడికి ఏమీ కాలేదని తెలిస్తే.. లేదా చిన్న శిక్షతో బయటపడ్డాడనే విషయం అర్థమైతే.. తర్వాతి తరం ధైర్యం మరింత పెరుగుతుంది. అందుకే కొన్ని రాష్ట్రాల్లో అవినీతి రాజకీయ కుటుంబ పరంపరగా మారిపోయింది. తరం తర్వాత తరం ఇలా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఇలాంటి కుటుంబ అవినీతి దేశాన్ని చెదపురుగులా ఖాళీ చేస్తోంది.

అవినీతికి వ్యతిరేకంగా ఒక్క కేసులో అలసత్వం వహించినా అది.. ఆ ఒక్క కేసుకే పరిమితం కాకుండా.. ఒక శృంఖలంగా మారి బలమైన పునాదులు ఏర్పర్చుకుంటుంది. భవిష్యత్తులో అవినీతి, కుంభకోణాలకు పాల్పడేందుకు దోహదపడుతుంది. సరైన విచారణ జరగకపోతే.. సమాజంలో, మీడియాలో అది తప్పదు అనే చర్చ జరగదు. సదరు వ్యక్తి వేలకోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించాడని సమాజానికి, మీడియాకూ తెలుసినా వారు దీన్ని చాలాచిన్న అంశంగా భావిస్తారు. ఈ పరిస్థితి దేశాభివృద్ధికి పెద్ద అవరోధంగా మారుతుంది. ఇది సమృద్ధ భారత్, ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి ఓ అడ్డంకిగా మారుతుంది.

మీకు మరోమాట కూడా చెప్పదలచుకున్నాను. మనలో ఎవరో పీడబ్ల్యూడీలో పనిచేస్తున్నారనుకుందాం.. ఇంజనీరింగ్ పని చూసే వ్యక్తి.. ఎక్కడో బ్రిడ్జ్ పని జరుగుతున్నప్పుడు డబ్బుల వ్యామోహంలో పడి.. కాస్త అలసత్వం వహిస్తే.. తనవారిలో కొందరికీ డబ్బుల పంచి.. కాంట్రాక్టర్ తో భయ్యా.. నీకూ లాభం, నాకూ లాభం.. బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి అవసరమైన హంగు, ఆర్భాటాలుండేలా నిర్మాణం చేస్తే చాలు అనుకుంటే. కాంట్రాక్టర్ ఇచ్చే డబ్బులు ఇంటికి చేరతాయి. తర్వాత రిటైర్ కూడా అయిపోతారు. కానీ ఎవరికీ పట్టుబడలేదు. అయితే.. ఓ రోజు మీ కుమారుడు.. ఆ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుండగా.. బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు మీకు.. నేను నాకోసం అవినీతికి పాల్పడ్డాను. కానీ నా ఏకైక కుమారుడు చనిపోయాడే అని ఎంతగా బాధపడతారో అర్థం చేసుకోండి. అవినీతి ప్రభావం ఆ స్థాయిలో ఉంటుందని మీరు అర్థం చేసుకోండి.

ఇలాంటి పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మీపై మరింత ఎక్కువగా ఉంది. ఈ జాతీయసదస్సులో ఈ అంశంపై కూడా చర్చిస్తారని అనుకుంటున్నాను. దీంతోపాటు మీకు మరో మాట కూడా చెప్పదలచుకున్నాను. అవినీతి విషయం మీడియా ద్వారా అందరికీ చేరుతుంది. కానీ.. అవినీతికి వ్యతిరేకంగా కఠినమైన విచారణ జరుగుతుందన్న విషయాన్ని కూడా.. ప్రముఖంగా మీడియాలో ప్రచురించాల్సిన అవసరముంది. దీని ద్వారా సమాజానికి మన వ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుంది. దీంతోపాటు అవినీతి పరులకు కూడా .. ఇక మనం తప్పించుకోలమనే ఓ కఠినమైన సందేశాన్ని ఇచ్చినట్లువుతుంది. ఈ కార్యక్రమ వేదిక ద్వారా దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ‘అవినీతి వర్సెస్ భారతదేశం’గా జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఎప్పటిలాగే దేశాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తున్నారు. అవినీతిని మనమంతా కలిసి ఓడిద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుకన్న భారతదేశ నిర్మాణం దిశగా.. సమృద్ధ, ఆత్మనిర్భర భారత నిర్మాణాన్ని మనం సాకారం చేసుకుంటామనే విశ్వాసం నాకుంది.

రానున్న పండగల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఆరోగ్యంగా ఉండండి.. జాగ్రత్తగా ఉండండి.

ధన్యవాదములు.

***



(Release ID: 1668287) Visitor Counter : 223