ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన మంత్రి తో భేటీ అయిన యుఎస్ఎ ర‌క్ష‌ణ శాఖ మంత్రి, యుఎస్ఎ విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి

Posted On: 27 OCT 2020 5:29PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ని  అమెరికా ర‌క్ష‌ణ శాఖ మంత్రి డాక్ట‌ర్ మార్క్ టి. ఎస్పర్, యుఎస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మైఖేల్ ఆర్. పోంపియో లు మంగ‌ళ‌వారం నాడు క‌లుసుకొన్నారు.

వారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్య‌క్షుని త‌ర‌ఫున ప్ర‌ధాన మంత్రి కి శుభాకాంక్ష‌లు అందజేశారు.  అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ శుభాకాంక్ష‌ల సందేశాన్ని ప్ర‌ధాన మంత్రి సహర్షంగా స్వీక‌రించి, బదులుగా తాను కూడా శ్రీ ట్రంప్ కు శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి లో అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్  జరిపిన భార‌త‌దేశ సంద‌ర్శ‌న స‌ఫ‌లం అయిన సంగ‌తిని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గుర్తుకు తెచ్చారు.
 
ఈ రోజున జ‌రిగిన ద్వైపాక్షిక సమావేశాలతో పాటు ఇండియా-యుఎస్ మూడో 2 ప్లస్ 2 సంభాష‌ణ కూడా ఫ‌ల‌ప్ర‌దంగా, నిర్మాణాత్మకంగా ముగిశాయని ప్ర‌ధాన మంత్రి దృష్టికి ఇరువురు మంత్రులు తీసుకు వ‌చ్చారు.  భార‌త‌దేశం తో ప‌టిష్టమైన సంబంధాల‌ నిర్మాణానికి, ఉమ్మ‌డి ల‌క్ష్యాలకు, దార్శ‌నిక‌తకు ఆచ‌ర‌ణ రూపాన్ని ఇవ్వడానికిగాను భార‌త్ తో క‌ల‌సి ప‌ని చేసేందుకు యుఎస్ ప్ర‌భుత్వం ఎంతో ఆస‌క్తి తో ఉందని కూడా వారు వెల్ల‌డించారు.

మూడో 2 ప్లస్ 2 సంభాష‌ణ విజయవంతంగా ముగిసినందుకు ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంస‌లను వ్య‌క్తం చేశారు.  ద్వైపాక్షిక సంపూర్ణ ప్ర‌పంచ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యంలో ఇటీవ‌ల కొన్నేళ్లుగా బ‌హుముఖీన వృద్ధి చోటు చేసుకోవడం పట్ల ఆయ‌న త‌న సంతృప్తిని చాటిచెప్తూ, ఉభ‌య దేశాల మ‌ధ్య విశ్వాసం, ప్ర‌జాసంబంధాలు, ఉమ్మ‌డి విలువ‌ల తాలూకు బలమైన పునాది ఏర్ప‌డిందన్నారు.  
 

***



(Release ID: 1667881) Visitor Counter : 224