ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ‘పిఎం స్వనిధి యోజన’ లబ్ధిదారుల తో సంభాషించిన ప్రధాన మంత్రి
Posted On:
27 OCT 2020 1:57PM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ‘పిఎం స్వనిధి యోజన’ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు.
లబ్ధిదారుల తో మాట్లాడే క్రమంలో డిజిటల్ చెల్లింపుల తాలూకు ప్రయోజనాలపై ప్రధాన మంత్రి కొన్ని సూచనలు చేశారు; అలాగే, నగదును తిరిగి ఎలా పొందవచ్చో చెప్పారు. ఈ డబ్బు తో సరైన విద్య ను, మెరుగైన జీవనోపాధిని కూడా దక్కించుకోవచ్చని ఆయన అన్నారు.
రుణాల కోసం బ్యాంకులను సంప్రదించడమనేది ఇదివరకు జీతం అందుకొనే వ్యక్తులకు కూడా కష్టంగా ఉండేది; ఇక పేదలు, వీధుల లో తిరుగుతూ వస్తువులను అమ్ముకొనేవారు అయితే బ్యాంకుకు వెళ్ళాలనే ఆలోచన అయినా చేయలేని పరిస్థితి ఉండేదని ప్రధాన మంత్రి అన్నారు. కానీ, ఇప్పుడు బ్యాంకులు ప్రజల ముంగిటకు వస్తూ, వారు వారి యొక్క వ్యాపారాలను ఆరంభించుకోవడానికి రుణాలను అందించడానికి సాయపడుతున్నాయని ఆయన చెప్పారు.
లబ్ధిదారులకు మేలు జరగాలని ప్రధాన మంత్రి కోరుకుంటూ, బ్యాంకర్లు చేస్తున్న కృషి ని ప్రశంసించారు. బ్యాంకర్ల ప్రయత్నాలు పేద ప్రజలు పండుగలను జరుపుకోవడంలో సహాయకారిగా ఉంటాయి అని ఆయన అన్నారు. ఈ రోజున ‘ఆత్మ నిర్భర్ భారత్’ కు ఒక ముఖ్యమైన రోజు, ఇది వీధుల్లో తిరుగుతూ వస్తువులను అమ్ముకొనే వారిని గౌరవించుకొనే రోజు కూడా అని ఆయన అన్నారు. స్వయంసమృద్ధియుత భారతదేశం కోసం వారు అందిస్తున్న తోడ్పాటును దేశం గుర్తిస్తోందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి చెలరేగినప్పుడు, తమ శ్రామిక లోకం ఎలా నెగ్గుకు వస్తుందో అని ఇతర దేశాలు ఆందోళన చెందాయి; అయితే మన దేశంలో మన శ్రామికులు ఎలాంటి సవాలునైనా అధిగమించగలమని, దానికి ఎదురొడ్డి నిలచి పోరాడి, గెలువగలం అని వారు నిరూపించారని ఆయన అన్నారు.
మహమ్మారి ప్రబలిన కాలం లో పేదల కష్టాలను తగ్గించడానికి గాను 1 లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజి తో ‘గరీబ్ కళ్యాణ్ యోజన’ ను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రధాన మంత్రి అన్నారు. 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ ఆర్థిక ఉద్దీపన చర్యల్లో పేదల పట్ల శ్రద్ధ వహించడం జరిగిందని ఆయన అన్నారు. వీధుల్లో తిరుగుతూ అనేక రకాల వస్తువులను అమ్మే వ్యాపారస్తులు వారి కార్యకలాపాలను మళ్ళీ మొదలుపెట్టి మరో మారు సొంత కాళ్ళ మీద నిలబడ‌్డందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా జోరుగా అమలుపరుస్తూ ఉన్నందుకు శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘స్వనిధి పథకం’ లో భాగంగా ఇచ్చే రుణాలకు ఒక హామీదారు అంటూ ఉండనక్కరలేదు, మరి రుణాల మంజూరు ప్రక్రియలో కూడా ఎలాంటి అడ్డంకులకు తావు లేదు అని ప్రధాన మంత్రి చెప్పారు. ఒక వ్యక్తి ఏదైనా ఒక కామన్ సర్వీస్ సెంటర్ లో గాని, లేదా పురపాలక కార్యాలయం లో గాని, ఒక బ్యాంకు కు వెళ్ళి గాని దరఖాస్తు ను స్వయంగా ఆన్ లైన్ లో దాఖలు చేయవచ్చు అని ఆయన అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా వీధి వ్యాపారులు హామీ లేని, తక్కువ ఖర్చుతో కూడిన రుణాలను పొందగలుగుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు. పట్టణ ప్రాంతాల వీధి వ్యాపారస్తుల నుండి అందిన దరఖాస్తుల్లో ఎక్కువ గా ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చినవే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పథకంలో దేశవ్యాప్తంగా 25 లక్షల రుణ దరఖాస్తులు వస్తే 6.5 లక్షలకు పైగా దరఖాస్తులు ఒక్క ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చాయన్నారు. యుపి నుంచి అందిన 6.5 లక్షల దరఖాస్తుల్లో 4.25 లక్షల దరఖాస్తులకు ఆమోద ముద్ర వేయడమైందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ‘స్వనిధి యోజన’ రుణ ఒప్పందానికి స్టాంపు డ్యూటీని మినహాయించడమైంది అని ఆయన గుర్తు చేశారు.
మహమ్మారి కాలంలో 6 లక్షల మంది వీధి విక్రేతలకు 1000 రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందించినందుకు గాను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.
స్వనిధి స్కీము ద్వారా రుణాన్ని అందించిన వీధి వ్యాపారుల్లో ఎక్కువ మంది వారి రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారని, ఇది స్వల్పకాలిక రుణ గ్రహీతలు వారి నిజాయితీ, చిత్తశుద్ధిల విషయం లో రాజీ పడబోరని నిరూపిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ పథకానికి సంబంధించిన జాగృతి ని వీలయినంత ఎక్కువ మంది కి చేరవేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ పథకం లో భాగంగా సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించే పక్షంలో వడ్డీ లో 7 శాతం తగ్గింపు కూడా వర్తిస్తుందని, అలాగే డిజిటల్ లావాదేవీలపై నెలవారీ 100 రూపాయల నగదును వెనుకకు ఇచ్చే సదుపాయం కూడా ఉందని ఆయన చెప్పారు.
జన్ ధన్ ఖాతా ల ప్రభావం ఎంతవరకు ఉంటుందో అనే అనుమానం వ్యక్తం అయిందని, కానీ ఆ ఖాతాలే ప్రస్తుతం సంకట కాలంలో పేదలను ఆదుకొంటున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను ఒక్కటొక్కటిగా ఆయన వివరించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి వీధి వ్యాపారస్తులు, శ్రామికులు, రైతుల వ్యాపారాలను ముందుకు తీసుకు పోతూ వారి జీవితాన్ని మెరుగుపర్చడానికి దేశం సకల విధాలుగా పాటుపడుతుందంటూ హామీని ఇచ్చారు.
***
(Release ID: 1667823)
Visitor Counter : 241
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam