ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మార్చి 22 తరువాత నేడు అతి తక్కువగా నమోదైన మరణాలశాతం
గత 24 గంటల్లో మరణాలు 500 లోపు
1% కంటే తక్కువ నమోదైన రాష్ట్రాలు 14
Posted On:
26 OCT 2020 12:01PM by PIB Hyderabad
కోవిడ్ నిర్థారణ జరిగి చికిత్సపొందుతున్నవారి విషయంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలు, నాణ్యమైన చికిత్స కారణంగా దేశంలో మరణాల శాతం క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 1.5 శాతానికి చేరింది. నివారణకు, నియంత్రణలు అనుసరిస్తున్న వ్యూహం, దూకుడుగా నిర్థారణ పరీక్షలు జరపటం, అటు ప్రభుత్వాసుపత్రులలోను, ఇటు ప్రైవేట్ ఆస్పత్రులలోను చికిత్సా విధానాల ప్రామాణీకరణ కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 500 కు లోపే (480) మరణాలు నమోదు కావటం గమనార్హం.
ప్రపంచంలో అతి తక్కువ కోవిడ్ మరణాలు నమోదైన దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. 22 మార్చి మొదలుకొని మరణాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. అదే ధోరణి కొనసాగుతోంది.
కోవిడ్ నిర్వహణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కేవలం కోవిడ్ నివారణ, నియంత్రణ మీద మాత్రమే కాకుండా మరణాలను అదుపుచేయటం మీద కూడా ప్రధానంగా దృష్టి సారించింది. తీవ్రలక్షణాలున్న వారికి నాణ్యమైన చికిత్స అందేలా చూసింది. కేంద్ర ప్రభుత్వంతోబాటు రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సమన్వయంతో చేసిన కృషి సానుకూల ఫలితాలనిచ్చింది. వైద్య సదుపాయాలు పెంచుకోవటం కూడా సాధ్యమైంది.ఇప్పుడు 2218 కోవిడ్ ఆస్పత్రులు నాణ్యమైన చికిత్స అందిస్తున్నాయి.
ఐసియు లలో క్లిష్ట పరిస్థితిలో ఉన్న బాధితులకు చికిత్స అందించే డాక్టర్లకు మార్గదర్శనం చేయటానికి, తద్వారా మరణాలను తగ్గించటానికి వీలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఈ-ఐసియు ఏర్పాటు చేసింది. వారానికి రెండు సార్లు- మంగళ, శుక్రవారాల్లో టెలీ/వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిపుణులచేత సలహాలు ఇప్పించింది. రాష్ట్రాల్లోని ఆస్పత్రులు ఈ ఏర్పాటు ద్వారా లబ్ధిపొందాయి. 2020 జులై 8న ఈ సంప్రదింపులు మొదలయ్యాయి.
ఇప్పటివరకు 25 టెలీ సెషన్లు జరిగాయి. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 393 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అదే విధంగా చికిత్సను మరింత సమర్థవంతంగా అందించేందుకు వీలుగా ఆరోగ్య మంత్రిత్వశాఖతో కలిసి ఎయిమ్స్ సంస్థ కొన్ని తరచు అడిగే ప్రశ్నలకు జవాబులు తయారుచేసింది. వాటిని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో పెట్టింది. అది చూడదలచుకున్నవారికోసం వెబ్ లింక్ ను కూడా అందించింది. https://www.mohfw.gov.in/pdf/AIIMSeICUsFAQs01SEP.pdf
అదే విధంగా అనేక రాష్ట్రాలు సర్వేల ద్వారా కోవిడ్ రిస్క్ ఎక్కువగా ఉండే వృద్ధులు, ఇతర దీర్ఘకాల వ్యాధులున్నవారు, గర్భిణులను గుర్తించాయి. దీనికి తోడు మొబైల్ యాప్స్ లాంటి సాంకేతిక పరిష్కార మార్గాలు కూడా వాడుకుంటూ అలాంటి అధిక రిస్క్ తో కూడుకున్నవారి మీద ఒక కన్నేసి ఉంచటం ద్వారా నియంత్రణకు కృషి చేయగలిగాయి. అలా సకాలంలో గుర్తించి చికిత్స అందించటం వలన మరణాలను బాగా తగ్గించగలిగారు. క్షేత్ర స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఎ ఎన్ ఎం లు, చేసిన కృషి అభినందనీయమైనది. ముఖ్యంగా వలస కార్మికుల ఆనవాలు కనిపెడుతూ పరీక్షలు చేయించటం సహా అనేక విధాలుగా భాగస్వాములయ్యారు. దీనివల్లనే ద్14 రాష్ట్రాలలో మరణాలు 1% లోపే ఉన్నాయి.
గత 24 గంటలలో కొత్తగా కోలుకున్నవారి సంఖ్య 59,105 కాగా ఇప్పుడు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 71 లక్షలు దాటి 71,37,228 గా నమోదైంది. ఇలా ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో కోలుకోవటంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 90.23% కు చేరింది.
చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య భారత్ లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం కోవిడ్ పాజిటి కేసులలో చికిత్సలో ఉన్నవారు 8.26% మాత్రమే. వీరి సంఖ్య 6,53,717. ఆగస్టు 13 తరువాత ఇంత తక్కువ సంఖ్యలో బాధితులుండటం ఇదే మొదటి సారి. ఆ రోజు 6,53,622 మంది చికిత్సలో ఉన్నారు.
కొత్తగా కోలుకున్నవారిలో 78% మంది కేవలం 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. కర్నాటకలో అత్యధికంగా ఒక్క రోజులో 10 వేలమందికి పైగా కోలుకోగా 7 వేలకు పైగా కోలుకున్నవారున్న కేరళ రెండో స్థానంలో ఉంది.
గత 24 గంటలలో కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు 45,148 నమోదయ్యాయి. జౌలిఅ 22 తరువాత ఇంత తక్కువ స్థాయిలో నమోదవటం ఇదే ప్రథమం. ఆ రోజు 37 వేల కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమొదైన పాజిటివ్ కేసులలో 82% కేసులు కేవలం 10 రాష్ట్రాలకు చెందినవే కాగా అందులో కేరల, మహారాష్ట్ర ఆరేసి వేలకు పైగా నమోదు చేసుకోగా, ఆ తరువాత స్థానంలో ఉన్న కర్నాటక, పశ్చిమబెంగాల్, ఢిల్లీ నాలుగేసి వేలకు పైగా కొత్త కేసులు నమోదు చేసుకున్నాయి.
గడిచిన 24 గంటలలో 480 మరణాలు నమోదయ్యాయి. వాటిలో దాదాపు 80% కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ మరణాలలో 23% పైగా ( 112 మరణాలు) ఒక్క మహారాష్ట్రలొనే నమోదయ్యాయి.
****
(Release ID: 1667595)
Visitor Counter : 270
Read this release in:
Odia
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam