సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్మూ కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పండిట్ మదన్ మోహన్ మాలవ్యా పేరుతో నూతన విద్యా భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


Posted On: 18 OCT 2020 8:44PM by PIB Hyderabad

జమ్మూ కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పండిట్ మదన్ మోహన్ మాలవ్యా పేరుతో నిర్మించే నూతన విద్యా భవన సముదాయానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ మాలవ్యా పేరు మీద ఇటువంటి విద్యా సముదాయాన్ని కలిగి ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి కేంద్ర విశ్వవిద్యాలయాలలో, జమ్మూ కేంద్ర విశ్వవిద్యాలయం ఒకటి అని పేర్కొన్నారు.

20 వ శతాబ్దం మొదటి అర్ధభాగంలోని ప్రముఖ విద్యావేత్తలలో పండిట్ మదన్ మోహన్ మాలవ్యా మరియు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఉన్నారనీ, అయితే, వారి సేవలకు రావలసినంత గుర్తింపు రాలేదనీ, అందువల్ల ఇది వారికి తగిన నివాళి అనీ, ఆయన అన్నారు.  ఇదే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరుతో నిర్మించిన హాస్టల్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించే గౌరవం కూడా ఇటీవల తనకు కలిగిందని, ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోల్‌కతా వెలుపల ఉన్న ఏదైనా ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ముఖర్జీ పేరు పెట్టబడిన మొదటి బ్లాక్ ఇదేనని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

జమ్మూ ఉత్తర భారతదేశ విద్యా కేంద్రంగా, జమ్మూ వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, 100 కిలోమీటర్ల కంటే తక్కువ వ్యాసార్థంలో, ఎయిమ్స్; ఐ.ఐ.టి; ఐ.ఐ.ఎం; సెంట్రల్ యూనివర్శిటీ మరియు జమ్మూ విశ్వవిద్యాలయం అనే రెండు ప్రధాన విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్ తో సహా నాలుగు వైద్య కళాశాలలు, ప్రభుత్వ నిర్వహణలోని రెండు ఇంజనీరింగ్ కళాశాలలతో సహా, డజనుకు పైగా ముఖ్యమైన ప్రొఫెషనల్ మరియు ఉన్నత విద్యాసంస్థలు వచ్చాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.  వీటితో పాటు, ఈశాన్య మంత్రిత్వ శాఖ ద్వారా రాబోయే ఉత్తర భారతదేశపు మొట్టమొదటి బయోటెక్ టెక్నాలజీ పార్క్ కమ్ రీసెర్చ్ సెంటర్ మరియు వెదురు టెక్నాలజీ శిక్షణా కేంద్రం కూడా ఉన్నాయి.

2019 ఆగష్టు, 5వ తేదీ తర్వాత జరిగిన రాజ్యాంగ మార్పులతో, ఈ విద్యా సంస్థల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ అధ్యాపకులను ఆకర్షించడంలో అతిపెద్ద అవరోధాన్ని అధిగమించినట్లయ్యిందని, డాక్టర్ జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.  బోధనా నియామకాన్ని చేపట్టడానికి అన్ని వైపుల నుండి ఉత్తమ అధ్యాపకులను సులభతరం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి సంస్థ సిద్ధంగా ఉన్నప్పుడు అదేవిధంగా, మొత్తం నైపుణ్యం మరియు ప్రతిభ ఆధారంగా పండితుల ఎంపికలో రాజీ లేనప్పుడు మాత్రమే ఏదైనా సంస్థ యొక్క ప్రమాణాన్ని కొనసాగించవచ్చునని ఆయన అన్నారు.  ఈ సందర్భంలో, ఆయన తిరిగి పండిట్ మదన్ మోహన్ మాలవ్యాను ప్రస్తావిస్తూఆ కాలంలో కూడా, ఆక్స్ ఫర్డ్ లో తన బోధనా ఉద్యోగాన్ని వదులుకోవాలని మరియు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బి.హెచ్.యూ) వైస్ ఛాన్సలర్ గా, బాధ్యతలు స్వీకరించడానికి తిరిగి రావాలని డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ ను ఒప్పించడంలో, మాలవ్యా విజయం సాధించారని గుర్తుచేసుకున్నారు.

జమ్మూ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఉత్తర భారతదేశం యొక్క మొట్టమొదటి అంతరిక్ష మరియు పరిశోధన అధ్యయన కేంద్రం ప్రారంభించబడిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.  మార్స్ మిషన్ పితామహునిగా కూడా పిలువబడే ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ కె. రాధాకృష్ణన్ ఈ కేంద్రానికి సలహాదారుగా నియమితులయ్యారు.

ఏదైనా విద్యాసంస్థకు విస్తృత గుర్తింపు లభించటానికి, తప్పనిసరిగా రెండు ముందస్తు అవసరాలు ఉండాలని, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.  అంతర్జాతీయ స్థాయి పరిశోధన ప్రచురణలను ఉత్పత్తి చేయగల అసాధారణ అధ్యాపకులు ఉండాలి లేదా సులభంగా అందుబాటులో లేని ప్రత్యేక అధ్యయన విభాగాలు ఉండాలి. 

గత కొన్ని సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం సాధించిన వివిధ రికార్డు స్థాయి విజయాల గురించి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అశోక్ ఐమా తమ స్వాగతోపన్యాసంలో వివరించారు.  కేంద్రంలో కొత్త ప్రాజెక్టులన్నింటినీ కొనసాగించడంలో డాక్టర్ జితేంద్ర సింగ్ నిరంతరం మద్దతు ఇస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇటీవల డి.ఆర్.డి.ఓ. ద్వారా భారత ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రం గురించి ప్రొఫెసర్ ఐమా కూడా ప్రస్తావించారు. 

*****



(Release ID: 1665731) Visitor Counter : 131