ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2020 2:33PM by PIB Hyderabad
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ ఉద్ధవ్ ఠాక్రే జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీ, శ్రీ చంద్రకాంత్ పాటిల్ జీ, శ్రీ రాధాకృష్ణ పాటిల్ జీ, సుజయ్ విఖే పాటిల్ జీ, కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, నా రైతు సోదరులు, సోదర సోదరీమణులారా.. ఛత్రపతి శివాజీ మహరాజ్ వంటి వీరులు, మరెందరో వీరమాతలు పుట్టిన మహారాష్ట్ర గడ్డకు మన:పూర్వక నమస్కారాలు చేస్తున్నాను.
ఇంతమంచి సందర్భంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన రాధాకృష్ణ విఖే పాటిల్ జీ, వారి కుటుంబసభ్యలకు, అహ్మద్ నగర్ లోని మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నేను ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. కానీ కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్ వేదిక ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది.
మిత్రులారా, డాక్టర్ బాలాసాహెబ్ విఖేపాటిల్ ఆత్మకథ ఇవాళ ఆవిష్కరణ అయిది. కానీ వారి జీవితకథలు మహారాష్ట్రలో అందరికీ సుపరిచితమే. డాక్టర్ విఠల్ రావ్ విఖే పాటిల్ గారి అడుగుజాడల్లో పయనిస్తూ డాక్టర్ బాలాసాహెబ్ విఖేపాటిల్ మహారాష్ట్ర అభివృద్ధికోసం తన జీవితాన్ని సమర్పించిన విషయాన్ని నేను దగ్గరుండి గమనించాను. గ్రామాలు, పేదలు, రైతుల జీవితాలను మరింత సులభతరం, సౌకర్యవతం చేయడమే మూలమంత్రంగా వారి జీవితం కొనసాగింది. ‘నేను అధికారం నుంచి రాజకీయాలనుంచి దూరంగా లేను. కానీ సమాజం కోసమే అధికారం, రాజకీయం జరగాలనే నియమాన్ని పాటిస్తూనే ఉన్నాను. రాజకీయాలు చేస్తున్నప్పుడు కూడా అది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయం మాత్రమే ఆలోచిస్తాను’ అన్న శ్రీ బాలాసాహెబ్ విఖే పాటిల్.. అధికారాన్ని, రాజకీయాన్ని ప్రతిక్షణం సమాజ శ్రేయస్సుకే వినియోగించారు.
సమాజ ఉద్ధారణకు చేసేందుకు రాజకీయాలను ఎలా వినియోగించాలి, గ్రామాలు, పేదల సమస్యలకు ఎలా పరిష్కారం కనుగొనాలి అనేదానిపైనే వారు నిరంతరం కృషిచేశారు. ఈ గొప్ప ఆలోచనే మిగిలిని వారితో వారిని విభిన్నంగా చూసేందుకు వీలుకల్పించింది. ఈ కారణంతోనే ప్రతి పార్టీలో వారికి విశేషమైన గౌరవం ఉంది. గ్రామాలు, పేదల శ్రేయస్సు కోసం, మంచి విద్యనందించేందుకు మహారాష్ట్రలో సహకార పద్ధతిలో విజయవంతం చేసేందుకు వారు చేసిన కృషి.. భవిష్యత్ తరాలకు ప్రేరణాత్మకంగా నిలుస్తుంది. బాలాసాహెబ్ విఖే పాటిల్ గారి ఈ ఆత్మకథ మనందరికీ ఓ విలువైన పుస్తకం.
మిత్రులారా, డాక్టర్ బాలాసాహెబ్ విఖేపాటిల్ గారు గ్రామాలు, పేదలు, రైతుల సమస్యలను, బాధలను చాలా దగ్గర్నుంచి చూశారు, అర్థం చేసుకున్నారు. అందుకే రైతులందరికీ ఒకచోట చేర్చి సహకార వ్యవస్థతో వారిని అనుసంధానం చేశారు. వీరి కృషి కారణంగా లేమితో బాధపడుతున్న ప్రాంతం ముఖచిత్రమే మారిపోయింది. సహకార వ్యవస్థ గొప్పదనంపై వారు ‘సహకార ఉద్యమమే.. అందరినీ కలుపుకుని పోయే ఉద్యమం. ఇది ఏ జాతి, వర్గం, మతానితో సంబంధం లేనిది. ఇప్పటివరకు మన సమాజానికి ఏ మతం ప్రాతినిధ్యం వహించలేదు’ అని పేర్కొన్నారు. సహకారం అనే పదానికి నిష్పక్షం అనే అర్థముంది. దీనికి ఏ వర్గం, ఏ పార్టీతో సంబంధం లేదు. ఇందులో సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందుకోసం వారి దృష్టిలో సహకార వ్యవస్థ అందరితోపాటు, అందరి అభివృద్ధికి మార్గంగా నిలిచింది. కేవలం మహారాష్ట్రలోనే కాదు.. అటల్ జీ మంత్రిమండలిలో సభ్యులుగా ఉన్న సమయంలో దేశమంతా సహకార వ్యవస్థ బలోపేతానికి వారు కృషిచేశారు. అంతటి మహనీయుడి ఆత్మకథకు ‘మన జీవితానికో అర్థం ఉండాలి’ అనే భావంతో కూడిన శీర్షిక చక్కగా సరిపోయింది. సందర్భోచితం, యోగ్యం కూడా. సంత్ తుకారామ్ మహరాజ్ గారి ఈ సుభాషితాల ప్రభావాన్ని బాలాసాహెబ్ విఖే పాటిల్ గారి జీవితంలో గమనించవచ్చు.
మిత్రులారా, దేశంలో విద్య గురించి పెద్దగా చర్చ జరగని సమయంలోనే.. ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో వారు గ్రామాల్లో విద్యాభివృద్ధికి కృషిచేశారు. ఈ సొసైటీ ద్వారా గ్రామాల్లో యువకులకు విద్యనందించడంతోపాటు వారి నైపుణ్యాభివృద్ధికి పాటుపడ్డారు. గ్రామాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అందుకే నేడు ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ తోపాటు శ్రీ బాలాసాహెబ్ గారి పేరు జోడించడం సందర్భోచితం అవుతుంది. వారికి గ్రామాల్లో, పొలాల్లో శిక్ష అవసరాన్ని వారు గుర్తించారు. వారు తన ఆత్మకథలో ‘వ్యవసాయ నైపుణ్యం లేకపోతే మనుషులు కూడా సహజమైన వ్యవసాయాన్ని చేయలేరు. అలాంటప్పుడు వ్యవసాయాన్ని ఎంటర్ ప్రైజ్ అని ఎందుకు అనము?’ అని రాసుకున్నారు. మనిషి ఎంత చదువుకున్నవాడయినా.. అతనికి వ్యవసాయంలో అనుభవం, నైపుణ్యం లేకపోతే వారు వ్యవసాయం చేయలేరు. అలాంటప్పుడు మనం వ్యవసాయాన్ని ఎంటర్ ప్రైజ్ అని ఎందుకు అనకూడదు?
మిత్రులారా, బాలాసాహెబ్ విఖే పాటిల్ జీ మనస్సులో ఈ ప్రశ్నలు ఊరికే తలెత్తలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై దశాబ్దాల తరబడి ఉన్న అనుభవం ద్వారా వారు ఈ అంశాలపై మనకు తెలిపారు. వారి విస్తృతానుభవంతో గడించిన దాన్ని ఈరోజు మనం చారిత్రక వ్యవసాయ సంస్కరణల్లో గమనిస్తున్నాం. ఇవాళ వ్యవసాయాన్ని, అన్నదాత పాత్రను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం జరుగుతోంది. వ్యవసాయాన్ని ఉద్యమంగా, ఓ వ్యాపారంగా మార్చేందుకు అవసరమైన అవకాశాలను కల్పిస్తున్నాం. మహారాష్ట్రలో చక్కెర విప్లవం, గుజరాత్ లో పాల విప్లవం, పంజాబ్ లో గోధుమల విప్లవం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను, స్థానిక వ్యాపారసామర్థ్యాన్ని ప్రోత్సాహపరిచిన పరిస్థితులు, ఉదాహరణలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయి.
మిత్రులారా, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాల్లో దేశవాసులకు కడుపునిండా తిండి తినేందుకు కూడా అన్నం కరువైన పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థిత్లులో ప్రభుత్వం ముందు వ్యవసాయ ఉత్పత్తి పెంచడం మినహా ఇతర ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అందుకే రైతు ఏ పంట వేయాలి? ఎంత ఉత్పత్తి చేయాలి అనేదానిపైనే ఎక్కువ దృష్టి ఉండేది. మన అన్నదాతలు కూడా అహర్నిషలు శ్రమించారు. దేశ అవసరాలను మించి పంట ఉత్పత్తి చేసిచ్చారు. కానీ ఈ ఉత్పత్తిని పెంచే క్రమంలో ప్రభుత్వం ఆలోచన.. రైతుల ఆదాయాన్ని, లాభాన్ని పెంచే విషయంపైకి వెళ్లలేదు. రైతు ఆదాయాన్ని ప్రజలు మరిచిపోయారు. కానీ మొదటిసారిగా ఈ ఆలోచనలో మార్పువచ్చింది.
దేశం తొలిసారిగా రైతు ఆదాయం గురించి ఆలోచించింది. రైతు ఆదాయం పెంచేందుకు నిరంతంర కృషిచేస్తోంది. కనీస మద్దతు ధర నిర్ణయించడం, దాన్ని పెంచడం, యూరియాకు వేపపూత కావొచ్చు, సరైన పంట బీమా కావొచ్చు.. ప్రభుత్వం రైతులకు సంబంధించిన చిన్న చిన్న అంశాలను కూడా పరిష్కరించడంపై దృష్టిపెట్టింది. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతుల చిన్న చిన్న ఖర్చులకోసం ఇతరుల వద్దకు వెళ్లకుండా ముక్తి కల్పించింది. ఈ పథకం ద్వారానేరుగా లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి. ఇంతే కాదు.. కోల్డ్ చైన్స్, మెగా ఫుడ్ పార్కులు, ఆగ్రో-ప్రాసెసింగ్ మౌలిక వసతులపైనా విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఊళ్లలోని చిన్న మార్కెట్లను పెద్ద మార్కెట్ల లాగా ఆధునీకరించడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతోంది.
మిత్రులారా, బాలా సాహెబ్ విఖేపాటిల్ ‘వ్యవసాయం సంప్రదాయ పద్ధతిలో జరిగేది. ఇవాళ ఆ జ్ఞానాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకోవాల్సిన అవసరముంది. అంతకుమించిన పురాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చినా.. వాటి జ్ఞానాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరముంది’ అని చెప్పేవారు. గతంలో వ్యవసాయం ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని జరిగేది. అలాంటి ప్రకృతి, వ్యవసాయ జ్ఞానాన్ని మనం మనసులో ఉంచుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుత వ్యవసాయంలో పురాతన జ్ఞానానికి ఆధునిక పద్ధతులను మేళవించాల్సిన అవసరముంది. ఈ రెండు పద్ధతుల మేళవింపునకు చెరకు పంట ఓ చక్కటి ఉదాహరణ. అహ్మద్ నగర్, పూణే పరిసర ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత సానుకూలంగా, స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు చెరకు నుంచి చక్కెరతోపాటు ఇథనాల్ సేకరణ కూడా ఉపాధికల్పన కు ఊతమిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పుడు దాదాపు 100కు పైగా సంస్థలు నడుస్తున్నాయి. చాలా మందికి ఉపాధి కూడా లభిస్తోంది. పెట్రోల్ లో ఇథనాల్ కలిపే సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ.. ఇంధనం కోసం విదేశాలకు చేరుతున్న మొత్తం నేరుగా రైతుల జేబుల్లోకి వెళ్తుంది.
మిత్రులారా, డాక్టర్ బలాసాహెబ్ విఖే పాటిల్ మహారాష్ట్ర గ్రామాల్లో పలు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేశారు. గ్రామాల్లో తాగునీరు, సాగునీటి సమస్య అందులో ఒకటి. మహారాష్ట్రలో నీటి సంస్థల ద్వారా ఈ సమస్య పరిష్కారానికి ప్రజా ఉద్యమాలను నిర్మించారు. 2014 తర్వాత ఇలాంటి ప్రయత్నాలకు మరింత ప్రోత్సాహం ఇచ్చే దిశగా మేం పనిచేస్తున్నామని గర్వంగా చెబుతున్నాం. గ్రామ, గ్రామాలకు, ఇంటింటికీ నీటిని అందించడం ద్వారానే దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా మహారాష్ట్రలో ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 26 ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసే కార్యక్రమాలు ప్రారంభించాం. ఇందులో 9 ప్రాజెక్టులు ఈ పాటికే పూర్తయ్యాయి. వీటి ద్వారా దాదాపు 5లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతోంది. ఇదే విధంగా 2018 జూలైలో మహారాష్ట్రలో దాదాపు 90 వరకు చిన్నపెద్ద ఇలాంటి ప్రాజెక్టులు ప్రారంభించాం. వచ్చే 2-3 ఏళ్లలో వీటి పని పూర్తయినపుడు.. దాదాపు 4 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించవచ్చు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఈ జిల్లాల్లో అటల్ భూగర్భ జలయోజన కొనసాగుతోంది.
మిత్రులారా, సాగునీరు ఒక్కటే కాదు.. గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేం కార్యక్రమాలు కూడా మహారాష్ట్రలో చాలా వేగంగా కొనసాగుతున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా గతేడాది మహారాష్ట్రలోని 19 లక్షల కుటుంబాలకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇందులో 13 లక్షల పేదల కుటుంబాలు కరోనా సమయంలో కూడా తాగునీరు అందింది. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించి మన తల్లులు, సోదరీమణుల గౌరవాన్ని కాపాడగలిగామో.. అలాగే ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరిచ్చి వారి శ్రమను తగ్గించాలనేదే తద్వారా వారికి సరైన ఆరోగ్యం చేకూరాలనేదే మా ఆశయం.
మిత్రులారా, గ్రామాల ఆర్థిక, సామాజిక వ్యవస్థలో మైక్రో ఫైనాన్స్ పాత్ర కీలకం. ముద్ర వంటి పథకాల ద్వారా గ్రామాల్లో స్వయంఉపాధి అవకాశాలు పెంచాం. ఇంతేకాదు గ్రామాల్లోని స్వయం సహాయక బృందాల్లోని 7కోట్ల మంది చెల్లెల్లకు 3లక్షలకోట్ల రూపాయలకు పైగా రుణాలు అందించాం. అన్నదాతలు, పాడి రైతులు, మత్స్యకారులకు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు అందుతున్నాయి. ఇందుకోసం వారికి కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. దాదాపు రెండున్నరకోట్ల రైతు కుటుంబాలకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ధి చేకూరుతోంది.
మిత్రులారా, గ్రామాల్లో, గ్రామస్తుల్లో, పేదల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, అది బలోపేతం అవుతుందో అప్పుడు ఆత్మనిర్భరత సంకల్పం మరింత బలోపేతం అవుతుంది. గ్రామాల్లో ఇలాంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని శ్రీ బాలాసాహెబ్ విఖే పాటిల్ జీ జీవితాంతం తీవ్రంగా కృషిచేశారు. అలాంటి వ్యక్తి ఆత్మకథను చదివితే.. ప్రతి వ్యక్తిలో నవచైతన్యం వెల్లివిరుస్తుంది. మరొక్కసారి శ్రీ బాలాసాహెబ్ విఖేపాటిల్ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ.. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
కానీ నా ప్రసంగాన్ని ముగించేముందు ఒక విషయాన్ని మీతో, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర వాసులతో పంచుకోవాలనుకుంటున్నాను. కరోనా ప్రమాదం ఇంకా ముగిసిపోలేదు. మహారాష్ట్రలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇందుకోసం మహారాష్ట్ర అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లతో మనవి చేస్తున్నా.. దయచేసి ముఖంపై మాస్కు తీయవద్దు, ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటూ రెండు గజాల దూరాన్ని పాటిస్తూ.. నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను. కరోనాకు మందు వచ్చేంతవరకు అలసత్వం వద్దు. ఈ పోరాటంలో మనం కచ్చితంగా గెలిచితీరతాం. అందులో సందేహం వద్దు. అప్పటివరకు జాగ్రత్తగా మాత్రం ఉండాలి.
నాలుగు తరాలుగా సమాజ సేవలో ఉన్నందుకు మరొక్కసారి శ్రీ బాలాసాహెబ్ విఖే పాటిల్ గారి కుటుంబసభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక తరం కంటే మరోతరం మరింత ఎక్కువ పనిచేయడం కూడా చాలా గొప్పవిషయం. కొన్నిసార్లు ఒక తరం సేవ చేస్తే.. తర్వాతి తరానికి దానిపై ఆసక్తి ఉండదు. తర్వాత మెల్లిగా ఇది తగ్గిపోతుందనే విషయాన్ని మనమంతా గమనిస్తుంటాం. కానీ ఇక్కడ పూర్తిగా విభిన్న వాతావరణాన్ని చూస్తున్నాం. అదంతా బాలాసాహెబ్ విఖేపాటిల్ అందించిన సంస్కార ఫలితమే. వారి తరాలకు తరాలు మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. అలాంటి కుటుంబానికి మన:పూర్వకంగా నమస్కారాలు చేయాల్సిన అవసరముంది.
మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు.
***
(రిలీజ్ ఐడి: 1664670)
సందర్శకుల సూచీ సంఖ్య : : 160
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam