ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ నిర్థారణలో సరికొత్త మైలురాయి దాటిన భారత్
9 కోట్లు దాటిన మొత్తం కోవిడ్ పరీక్షలు
20 రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ పాజిటివ్ కేసుల నమోదు
Posted On:
14 OCT 2020 11:50AM by PIB Hyderabad
భారతదేశంలో జరిగిన మొత్తం కోవిడ్ నిర్థారణ పరీక్షలు 2020 జనవరి నుంచి క్రమంగా పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజుకు వాటి సంఖ్య 9 కోట్లకు పైబడింది. గడిచిన 24 గంటల్లో 11,45,015 పరీక్షలు జరగగా ఇప్పటివరకు మొత్తం 9,00,90, 122 శాంపిల్స్ పరీక్షించారు. దేశంలో కోవిడ్ పరీక్షల సామర్థ్యం పెరుగుతూ వచ్చి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1900 లాబ్ లు ఉన్న స్థితికి చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగా ఈ రోజు దేశంలో రోజుకు 15 లక్షల శాంపిల్స్ పరీక్షించగలిగే పరిస్థితి వచ్చ్చింది.
కోవిడ్ పరీక్షల మౌలిక సదుపాయాలు క్రమంగా పెరుగుతూ రావటం పరీక్షల సంఖ్య పెరుగుదలలో కీలకపాత్ర పోషించింది. దేశంలో మొత్తం 1935 లాబ్ లు ఉండగా వాటిలో 1112 ప్రభుత్వ లాబ్ లు కాగా ప్రైవేట్ రంగంలో 823 ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు రోజువారీ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచగలిగే పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా ఇలా అత్యధిక సంఖ్యలో పరీక్షలు జరపటం వలన పాజిటివ్ కేసుల సంఖ్యను క్రమంగా తగ్గించటం సాధ్యమైంది. ఆ విధంగా వ్యాధి వ్యాప్తిని సమర్థంగా అదుపు చేయగలిగారు.
20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే తక్కువ శాతం పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనించవచ్చు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పాజిటివ్ కేసుల శాతం 8.04 ఉండగా అది క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరపటం వలన తొలిదశలోనే బాధితులను గుర్తించగలుగుతున్నారు. సమర్థవంతమైన నిఘా ద్వారా కోవిడ్ బాధితులు కావటానికి అవకాశమున్న వారిని గుర్తించటం, స్వల్ప లక్షణాలున్నవారిని సకాలంలో హోమ్ క్వారంటైన్ లో ఉంచటం లేదా తీవ్ర లక్షణాలుంటే ఆస్పత్రికి తరలించటం, మెరుగైన చికిత్స అందించటం సాధ్యమవుతున్నాయి. ఈ చర్యలన్నిటి ఫలితంగా మరణాల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది.
భారతదేశంలో కొత్తగా కోలుకుంటున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా, చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు 8,26,876 మంది. మొత్తం నమోదైన పాజిటివ్ కేసులలో వీరి వాటా 11.42% మాత్రమే.
74,632 మంది కోవిడ్ బాధితులు గడిచిన 24 గంటలలో కోలుకున్నారు. కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ జరిగిన కేసుల సంఖ్య 63,509. ఇలా కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం వల్ల జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 87.05 కు చేరుకోవటంతోబాటు ఇంకా పెరుగుదలబాట కొనసాగిస్తూ ఉంది.
ఇప్పటిదాక మొత్తం కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 63,01, 927 కు చేరింది. కోలుకున్నవారికీ, చికిత్స పొందుతున్నవారికీ మధ్య తేడా 54,75,051 ఉంది. ఇలా కోలుకుంటున్నవారు పెరుగుతున్న కొద్దీ అంతరం కూడా విస్తరిస్తూ వస్తోంది. కోలుకున్నవారిలో 79% మంది 10 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైనట్టు తెలుస్తోంది. అవి మహారాష్ట, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్, ఒడిశా, ఢిల్లీ, వీటిలో మహారాష్ట్ర ఒక్కరోజులో 15,00 కు పైగా కోలుకున్నవారిని నమోదు చేసుకొని మొదటి స్థానంలో ఉంది.
గడిచిన 24 గంటల్లో 63,509 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కెసుల్లో 77% కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచే కావటం గమనార్హం. కొత్తగా నమోదవుతున్న కేసులలో కేరళ రాష్ట్రం మహారాష్ట్రను దాటిపోయింది. కేరళ, మహారాష్ట్ర, కర్నాటక 8,000 కు పైగా కేసులు నమోదవుతూ ఉండగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 4,000 కు పైగా కేసులు నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 730 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 80% మరణాలు కేవలం 10 రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 187 మరణాలు ( 25%) నమోదయ్యాయి.
దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ ప్రభావానికి గురయ్యాయి. సీజన్లవారీగా వచ్చే డెంగ్యూ, మలేరియా, ఇన్ఫ్లూయెంజా. లెప్టోస్పైరోసిస్, చికున్ గున్యా, విష జ్వరాలు లాంటి అంటువ్యాధులు కరోనాతో కలిసి బాధించే అవకాశాలున్నాయి. ఇది ఒక సవాలుగా మారబోతోంది. చికిత్సకు కుడా ఇది ఇబ్బంది కలిగించే విషయమే. కోవిడ్ తో బాటు రావటానికి అవకాశమున్న ఇలాంటి సహవ్యాధుల చికిత్సకు సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీచేసింది.
వాటిని ఇక్కడ చూడవచ్చు:
https://www.mohfw.gov.in/pdf/GuidelinesformanagementofcoinfectionofCOVID19withotherseasonalepidemicpronediseases.pdf
***
(Release ID: 1664297)
Visitor Counter : 262
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam