ప్రధాన మంత్రి కార్యాలయం
ఎఫ్ఎఒ 75 వ వార్షికోత్సవ సూచకంగా 75 రూపాయల విలువ గల ఒక స్మారక నాణేన్ని ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి
ఇటీవల అభివృద్ధి చేసిన 8 పంటల తాలూకు బయోఫోర్టిఫైడ్ వెరయిటీలను కూడా ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు
Posted On:
14 OCT 2020 11:13AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16న ఆహార- వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఒ) 75 వ వార్షికోత్సవం సందర్భం లో, 75 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేయనున్నారు. ఎఫ్ఎఒ తో భారతదేశానికి గల దీర్ఘకాలిక సంబంధాలకు గుర్తుగా ఈ నాణేన్ని ఆయన విడుదల చేస్తారు. అలాగే, 8 పంటలకు సంబంధించి ఇటీవల అభివృద్ధిపరచిన 17 బయోఫోర్టిఫైడ్ వెరయిటీలను ప్రధాన మంత్రి దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు.
వ్యవసాయానికి, పోషణ విజ్ఞానానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అత్యధిక ప్రాధాన్యానికి సూచికగాను, ఆకలిని, పౌష్టికాహారం అవసరమైన దాని కన్నా తక్కువగా అందుతున్న సమస్యను, పోషకాహార లోపాన్ని పూర్తిగా తొలగించాలన్న ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగాను ఈ కార్యక్రమం ఉంది. దేశం అంతటా విస్తరించిన ఆంగన్‌వాడీలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె లు), ఆర్గానిక్ మిషన్, హార్టికల్చర్ మిషన్ లు ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నాయి. ఈ కార్యక్రమం లో కేంద్ర వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, మహిళలు, బాలల అభివృద్ధి శాఖ మంత్రి కూడా పాల్గొననున్నారు.
భారతదేశం, ఎఫ్ఎఒ ల బంధం
సామాన్య ప్రజలను, దుర్భల వర్గాల వారిని ఆర్థికం గా, పోషణ పరంగా మరింత బలవత్తరంగా మార్చేందుకు ఎఫ్ఎఒ మొదలుపెట్టిన ప్రయాణం సాటి లేనిదిగా కొనసాగుతోంది. ఎఫ్ఎఒ తో భారతదేశం అనుబంధం చరిత్రాత్మకమైంది. ఇండియన్ సివిల్ సర్వీసు కు చెందిన అధికారి డాక్టర్ బినయ్ రంజన్ సేన్ 1956-1967 మధ్య కాలంలో ఎఫ్ఎఒ కు డైరెక్టర్ జనరల్ గా సేవలను అందించారు. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి ని గెలుచుకొన్న వరల్డ్ ఫూడ్ ప్రోగ్రామ్ ను (డబ్ల్యుఎఫ్ పి) ఆయన పదవీకాలంలోనే స్థాపించడమైంది. 2016 లో అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరాన్ని జరపాలని, అలాగే 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం గా జరపాలని భారతదేశం చేసిన ప్రతిపాదనల కు ఎఫ్ఎఒ ఆమోదం తెలిపింది.
పోషకాహార లోపంతో పోరాటం
ఎదుగుదల మందగించడం, అవసరమైన దాని కన్నా తక్కువ స్థాయి లో పోషకాహారం లభించడం, రక్తహీనత, తక్కువ బరువు తో శిశువుల పుట్టుకలు.. ఈ సమస్యల ను పరిష్కరించే ధ్యేయం తో 100 మిలియన్ మంది ప్రజలకు సేవలను అందించాలన్న మహత్త్వాకాంక్షతో భారతదేశం ‘పోషణ్ అభియాన్’ ను ప్రారంభించింది. పోషకాహార లోపం అనేది ప్రపంచం అంతటా ఒక పెద్ద సమస్య లా తయారైంది. రెండు బిలియన్ మంది ప్రజానీకం సూక్ష్మ పోషక విలువల లోటు తో బాధపడుతున్నారు. బాలల్లో సంభవిస్తున్న మరణాల లో దాదాపు 45 శాతం మరణాలకు ఆహార లోపం వల్ల చిక్కిపోవడమే కారణంగా ఉంది. ఐక్య రాజ్య సమితి నిర్ధేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల లో (ఎస్ డిజి స్) ఈ సమస్య ఒకటి గా చోటు చేసుకోవడం సమంజసమే అని చెప్పాలి.
అంతర్జాతీయ ప్రాథమ్యానికి అనుగుణంగా ఇనుము, జింకు, కాల్షియమ్, సంపూర్ణ మాంసకృత్తులు, తదితర సూక్ష్మ పోషకాల స్థాయిలను పెంపొందించిన పంట రకాలను, అలాగే పోషకాహార వ్యతిరేక ధాతువులను తగ్గించిన పంట రకాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత అయిదు సంవత్సరాల్లో ఈ తరహా పంట రకాలను నేషనల్ అగ్రికల్చరల్ రిసర్చ్ సిస్టమ్ యాభై మూడింటిని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) నాయకత్వం లో అభివృద్ధిపరచింది. 2014 వ సంవత్సరానికి పూర్వం, ఒకే ఒక బయోఫోర్టిఫైడ్ వెరైటీ ని అభివృద్ధిపరచడం జరిగింది.
భారతీయ థాలీ ని బలవర్దక థాలీ గా మార్చడం
ఇటీవల అభివృద్ధిపరచిన, ప్రధాన మంత్రి దేశ ప్రజలకు అంకితం చేయనున్న 8 పంటల తాలూకు 17 బయోఫోర్టిఫైడ్ వెరైటీలు పోషక విలువలను మూడు రెట్లు పెంచనున్నాయి. సిఆర్ ధాన్ 315 రకం బియ్యం లో జింక్ ఎక్కువగా ఉంటుంది; HI 1633 రకం గోధుమల లో మాంసకృత్తులు, ఇనుము, జింకు పుష్కలంగా ఉంటాయి; అలాగే, HD 3298 రకం గోధుమలలో మాంసకృత్తులు, ఇనుము సమృద్ధిగా ఉంటాయి ; DBW 303, DDW 48 రకం గోధుమల్లో మాంసకృత్తులు ఎక్కువ పాళ్ళ లో లభిస్తాయి; లధోవాల్ క్వాలిటీ ప్రొటీన్ మొక్కజొన్న లోని 1వ, 2వ, 3వ హైబ్రిడ్ రకాల్లో లైసీన్, ట్రిప్టోఫాన్ కావలసినంతగా దొరుకుతాయి; ఫింగర్ మిలెట్ సిఎఫ్ఎమ్‌వి 1, 2 రకాల్లో కాల్షియమ్, ఇనుము, జింకు; సిఎల్ఎమ్‌వి 1 రకం లిటిల్ మిలెట్ లో ఇనుము, జింకు; పూసా మస్టర్డ్ 32 రకం లో ఎరూసిక్ యాసిడ్ స్వల్పంగా ఉంటాయి; వేరు శనగ పంటలో గిర్నార్ 4, 5 రకాలను ఒలేయిక్ యాసిడ్ పాళ్ళను పెంచి తీర్చిదిద్దడమైంది. అలాగే శ్రీ నీలిమ, ఇంకా DA 340 రకాల పెండలం లలో జింక్, ఇనుము, యాంతోసియానిన్ లను వృద్ధిచేయడం జరిగింది.
ఈ రకాలు, ఇతర ఆహార మూలకాలతో పాటు సాధారణ భారతీయ థాలీ ని పోషక విలువలు ఎక్కువగా ఉండే థాలీ గా మార్చనున్నాయి. రైతులు పండించే రకాలతో పాటు, స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రజాతులను వాడి ఈ రకాల ను అభివృద్ధిచేయడం జరిగింది. జింకు ఎక్కువగా ఉండే బియ్యం రకాన్ని గారో పర్వత ప్రాంతాల నుంచి సేకరించిన అసమ్ బియ్యం ప్రజాతుల నుంచి అభివృద్ధిపరచగా, ఫింగర్ మిలెట్స్ వినూత్న రకాలను గుజరాత్ కు చెందిన డాంగ్ జిల్లాలో పండే ఫింగర్ మిలెట్స్ నుంచి రూపొందించడమైంది.
వ్యవసాయాన్ని పోషణ విజ్ఞానంతో ముడిపెట్టిన కుటుంబసేద్యాన్ని ప్రోత్సహించడానికి, పోషణ విజ్ఞాన సంబంధిత భద్రత ను పెంచడానికి న్యూట్రి స్మార్ట్ విలేజెస్ ను రూపొందించడానికి న్యూట్రి- సెన్సిటివ్ అగ్రికల్చరల్ రిసోర్సెస్ ఎండ్ ఇన్నోవేషన్స్ (ఎన్ఎఆర్ఐ) కార్యక్రమాన్ని ఐసిఎఆర్ మొదలుపెట్టింది. స్థానికంగా లభ్యం అయ్యే ఆరోగ్యదాయక వివిధ పదార్థాలతో కూడిన నియతాహారాన్ని తగినంత స్థూల పోషక విలువలు, తగినంత సూక్ష్మ పోషక విలువల సహితంగా అందుబాటు లోకి తీసుకురావడం కోసం ఆయా ప్రాంతాలవారీ పోషణ విజ్ఞాన ఉద్యాన నమూనాలను కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె స్) అభివృద్ధిపరచడం తో పాటు వాటిని వ్యాప్తి లోకి కూడా తీసుకు వస్తున్నాయి.
పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం, సహజంగా వర్ధిల్లజేసిన ఆహారపదార్థాలతో భారతదేశాన్ని కుపోషణ్ ముక్త్ భారత్ గా ఆవిష్కరించడం కోసం బయో- ఫోర్టిఫైడ్ పంట రకాల ఉత్పత్తి ని పెంపొందించి, వాటిని మధ్యాహ్న భోజన పథకం, ఆంగన్‌వాడీ మొదలైన ప్రభుత్వ కార్యక్రమాలకు జతపరచడం జరుగుతుంది. ఇది రైతులకు అధిక ఆదాయాన్ని సంపాదించిపెట్టడంతో పాటు నవపారిశ్రామికత్వం పురోగతికి సరికొత్త దారులను కూడా తెరుస్తుంది.
***
(Release ID: 1664276)
Visitor Counter : 446
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam