గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
‘ఆరేళ్ల స్వచ్ఛభారత్, సాటిలేని పథకం’
స్వచ్ఛ భారత్ పథకం ఆరవ వార్షికోత్సవాన్ని గాంధీ జయంతి నాడు
జరుపుకోనున్న కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఘనవ్యర్థాల పటిష్ట నిర్వహణపై సృజనాత్మక పద్థతులతో ప్రత్యేక సంచికను, యాక్టివ్ జి.ఐ.ఎస్. పోర్టల్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి హర్ దీప్ పూరి
కోవిడ్-19కు భారతీయ నగరాల ప్రతిస్పందన,
పారిశుద్ధ్య దృక్పథంపై విడుదల కానున్న సమాచార పత్రం
అనుభవాలను వెబినార్ ద్వారా పంచుకుని, స్వచ్ఛతమ్ భారత్ వైపుగా
తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్న రాష్ట్రాలు, నగరాలు.
పట్టణప్రాంతపు స్వచ్ఛభారత్ కింద 4,327 నగరాలు ఒ.డి.ఎఫ్.గా ప్రకటన
66లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, ఆరు లక్షల సామాజిక మరుగుదొడ్లు పూర్తి
ఇప్పటివరకూ ఒ.డి.ఎఫ్.+గా 1,319 నగరాలు, ఒ.డి.ఎఫ్.++గా 489 నగరాలు
గూగుల్ మ్యాప్స్ లో లైవ్ గా 2900 నగరాల్లోని 59,900 మరుగుదొడ్లు
97శాతం వార్డుల్లో ఇంటింటి ఘనవ్యర్థాల సేకరణ పూర్తి
77శాతం వార్డుల్లో వ్యర్థాల వర్గీకరణ, 67శాతం వార్డుల్లో సాగుతున్న వ్యర్థాల ప్రాసెసింగ్
దాదాపు 4రెట్లు పెరిగిన ప్రాసెసింగ్ ప్రక్రియ
చెత్త నిర్మూలనలో 5 స్టార్ నగరాలుగా ఇండోర్, అంబికాపూర్,
నవీ ముంబై, సూరత్,
Posted On:
01 OCT 2020 11:13AM by PIB Hyderabad
పట్టణ ప్రాంతపు స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్.బి.ఎం.-యు) ఆరవ వార్షికోత్సవాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ‘ఆరేళ్ల స్వచ్ఛభారత్, సాటిలేనిది’ అన్న శీర్షికతో ఒక వెబినార్ సదస్సును, 2020 అక్టోబర్ 2న జాతిపిత మహాత్మాగాంధీ 151 జయంతి సందర్భంగా నిర్వహిస్తోంది. స్వచ్ఛ భారత్ పథకం గత ఆరేళ్లలో సాధించిన విజయాలను, పథకం అమలులో రాష్ట్రాలు, నగరాలు, భాగస్వామ్య సంస్థల అనుభవాలను ఈ సందర్భంగా పరస్పరం పంచుకోనున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ఈ వెబినార్ కు అధ్యక్షత వహిస్తారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, అదనపు కార్యదర్శి కుమరన్ రిజ్వి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను, ఘన వ్యర్థాల పటిష్ట నిర్వహణకు దేశవ్యాప్తంగా పాటించే సృజనాత్మక విధానాలను వివరించే జి.ఐ.ఎస్. పోర్టల్ ను కేంద్ర మంత్రి ఆవిష్కరిస్తారు. దీనితోపాటుగా,.. కోవిడ్-19పై భారతీయ నగరాల ప్రతిస్పందన- పారిశుద్ధ్య దృక్కోణంపై జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ (ఎన్.ఐ.యు.ఎ) తయారు చేసిన ఒక సమాచార పత్రాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ‘ముందు వరసలో ప్రతిఘటనా పోరు: భారతదేశపు పారిశుద్ధ్య విజేతలు’ అనే శీర్షికతో,..పారిశుద్ధ్య కార్మికుల స్ఫూర్తిదాయక గాథల సంకలనాన్ని కూడా ఆవిష్కరిస్తారు. మానవ విసర్జిత మల సంబంధమైన వ్యర్థాల, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల జాతీయ నిర్వహణా వ్యవస్థ (ఎన్.ఎఫ్.ఎస్.ఎస్.ఎం.) ఈ సమాచారాన్ని పొందుపరిచింది. ఇంతేకాక...పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కోసం పట్టణ వ్యవహారాల నిర్వహణా కేంద్రం (యు.ఎం.సి.) తయారు చేసిన
ఉపకరణాల కిట్ ను కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు.
గత ఆరేళ్లలో రాష్ట్రాలు, ఎంపిక చేసిన కొన్ని నగరాల స్వచ్ఛ భారత్ అనుభవాలపై వెబినార్ ద్వితీయార్థంలో దృష్టిని కేంద్రీకరిస్తారు. అనంతరం స్వచ్ఛతమ్ భారత్ లక్ష్య సాధనకోసం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. స్వచ్ఛ భారత్ పథకం అమలులో భాగస్వామ్య వర్గాలన్నీ తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి, తదుపరి దశలో పథకాన్ని ఎలా నడిపించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఈ వెబినార్ దోహదపడుతుంది.
2014వ సంవత్సరంలో ప్రారంభించనప్పటి నుంచి, పట్టణ ప్రాంతపు స్వచ్ఛ భారత్ పథకం పారిశుద్ధ్య కార్యక్రమాల్లో, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఇప్పటివరకూ,.. 4,327 పట్టణ స్థానిక పరిపాలనా సంస్థలను బహిరంగ మల విసర్జన రహిత (ఒ.డి.ఎఫ్.) ప్రాంతాలుగా ప్రకటించారు. 66లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను, ఆరు లక్షలకు పైగా సామాజిక/ప్రజా మరుగుదొడ్లను నిర్మించడంతో ఈ పథకం లక్ష్యాలను మించి ఫలితాలను లభించాయి. ప్రస్తుతం ఒ.డి.ఎఫ్+, ఒ.డి.ఎఫ్++ ప్రమాణాల ద్వారా, సంపూర్ణస్థాయి పారిశుద్ధ్య సాధనపై స్వచ్ఛభారత్ పథకం కింద దృష్టిని కేంద్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకూ, మొత్తం 1,319 నగరాలు ఒ.డి.ఎఫ్+ స్థాయిని, 489 నగరాలు ఒ.డి.ఎఫ్++ స్థాయిని సాధించినట్టుగా ధ్రువీకరించారు. అదనంగా 2,900కు పైగా నగరాల్లో 59,900కు పైగా మరుగుదొడ్లను గూగుల్ లైవ్ మ్యాపులలో పొందుపరిచారు.
ఇక, ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణా రంగానికి సంబంధించి వివిధ నగరాల్లో 97శాతం వార్డుల్లో ఇంటింటి వ్యర్థాల సేకరణ పూర్తయింది. 77శాతం వార్డులకు సంబంధించి వ్యర్థాల వర్గీకరణ జరుగుతోంది, సేకరించిన వ్యర్థాల్లో 67శాతానికి సంబంధించి ప్రాసెసింగ్ జరుగుతోంది. అంటే,..2014లో (18శాతం) కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ప్రాసెసింగ్ జరిగింది. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్టార్ రేటింగ్ ప్రమాణాల మేరకు చెత్త నిర్మూలన ప్రక్రియ నిర్వహణ ప్రాతిపదికపై మొత్తం 6నగరాలను (ఇండోర్, అంబికాపూర్, నవీ ముంబై, సూరత్, రాజ్.కోట్, మైసూరు) ఫైవ్ స్టార్ నగరాలుగా వర్గీకరించారు. 86 నగరాలకు త్రీస్టార్ నగరాలుగా, 64 నగరాలకు సింగిల్ స్టార్ నగరాలుగా రేటింగ్ ఇచ్చారు.
అంతేకాక స్వచ్ఛ భారత్ పథకం ప్రజా కార్యక్రమంగా సిసలైన ‘జన ఉద్యమం’ గా రూపొంతరం చెందింది. 2020 సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన చివరి విడత వార్షిక పారిశుద్ధ్య కార్యక్రమంలో 12కోట్ల మందికిపైగా ప్రజలు పాలుపంచుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, అసంఘటితంగా వ్యర్థాలను సేకరించే వారికి,.. అందరికీ సమానస్థాయిలో గౌరవ ప్రదమైన జీవనోపాధి కల్పించడానికి స్వచ్ఛ భారత్ పథకం ప్రాధాన్యం ఇచ్చింది. సమానత్వం అమలు, అన్ని వర్గాలవారికి స్థానం కల్పించడం అన్న జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. చివరకు, అసంఘటితంగా వ్యర్థాలను సేకరించే 84వేల మందికిపైగా పనివారిని ప్రధాన పారిశుద్ధ్య కార్మిక స్రవంతిలోకి తీసుకువచ్చారు. ఐదున్నర లక్షల మందికిపైగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ పరిధిలోని అనేక సంక్షేమ పథకాలతో అనుసంధానం కల్పించారు
పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల అధికారులు, సిబ్బంది సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, స్వచ్ఛ భారత్ పథకంలో ఒక అంతర్గత భాగం. ఈ కార్యక్రమంలో భాగంగా, జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ సహాయంతో దేశ్యాప్తంగా 150 చర్చా గోష్టులను గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఆ చర్చా గోష్టిలో 3,200 పట్టణ స్థానిక పరిపాలనా సంస్థలకు చెందిన 6వేల మందికిపైగా అధికారులు పాలుపంచుకున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2న న్యూఢిల్లీలోని రాజఘాట్ నుంచి ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి రోజైన 2019 అక్టోబరు 2 నాటికి ‘పరిశుద్ధమైన భారత్’ అన్న లక్ష్యాన్ని సాధించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణ ప్రాంతపు స్వచ్ఛ భారత్ పథకానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సారథ్యం వహిస్తోంది. పట్టణ ప్రాంతాలను బహిరంగ మల విసర్జన రహితం (ఒ.డి.ఎఫ్.)గా తీర్చిదిద్దడంతోపాటుగా, పౌరుల ఆలోచనా విధాననాన్ని మార్చడం ద్వారా ఘన వ్యర్థాలను నిర్మూలించాలన్న విశాల దృక్పథంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు
***
(Release ID: 1660650)
Visitor Counter : 222
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam