ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ గా శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక కావడం పై ప్రధాన మంత్రి ప్రతిస్పందన
Posted On:
14 SEP 2020 7:32PM by PIB Hyderabad
శ్రీ హరివంశ్ జీ ఈ సభ కు డిప్యూటీ చైర్ మన్ గా రెండో సారి ఎన్నికైనందుకు యావత్తు సభ పక్షాన, దేశ ప్రజలందరి తరఫున శ్రీ హరివంశ్ గారిని నేను అభినందిస్తున్నాను.
సామాజిక సేవ, పత్రికా రచన రంగాల్లో హరివంశ్ గారు తనదైన నిజాయతీపూర్వక ఇమేజ్ ను సంపాదించుకున్న తీరు పట్ల నా మనసు లో ఆయనను నేను ఎంతో గౌరవిస్తున్నాను. ఆయన తో అతి సన్నిహిత పరిచయం ఉన్న వారికి కూడా ఆయన అంటే నాకు ఉన్న గౌరవం, అభిమానాలు ఉండి ఉంటాయని నేను అనుకుంటున్నాను; అలాగే ఈ సభ లో సభ్యులందరికి కూడా ఇవే భావన లు ఉండి ఉంటాయని నేను తలుస్తాను. ఈ గౌరవాపేక్షలను హరివంశ్ గారు స్వయంగా సంపాదించుకున్నారు. ఆయన పని చేసే విధానాన్ని బట్టి, సభ కార్యకలాపాల ను ఆయన నిర్వహించే తీరును బట్టి చూస్తే ఇది స్వభావికమే. సభ లో మీరు పోషించిన నిష్పక్షపాత భూమిక ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తోంది.
చైర్‌మన్ గారూ, ఇది వరకు ఎన్నడూ గమనించనంతటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ సారి సభ కార్యకలాపాల ను నిర్వహించడం జరుగుతోంది. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితుల లో ఈ సభ తన విధుల ను నిర్వహించి, దేశం పట్ల తనకు ఉన్న ముఖ్యమైన కర్తవ్యాల ను నెరవేర్చేలా చూడటం మన అందరి భద్రత. మనం అన్ని ముందు జాగ్రత్తల ను తీసుకొంటూ, మార్గదర్శక సూత్రాల ను పాటిస్తూ, విధుల ను నెరవేర్చుతామని నేను విశ్వసిస్తున్నాను.
చైర్‌మన్ గారు, సభ ను సాఫీగా నడపడం లో డిప్యూటీ చైర్ మన్ కు రాజ్య సభ్య సభ్యులు ఎంత ఎక్కువగా సహకరిస్తే అంత ఎక్కువగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది; ప్రతి ఒక్కరూ కూడా సురక్షితంగా ఉండగలుగుతారు.
చైర్‌మన్ సర్, పార్లమెంటు ఎగువ సభ బాధ్యతల ను నిర్వహించడానికి శ్రీ హరివంశ్ గారి పట్ల మనం కనబరచిన విశ్వాసాన్ని ఆయన ప్రతి స్థాయి లోనూ నిలబెట్టుకొన్నారు. నేను క్రితం సారి చేసిన ప్రసంగం లో, దైవం ఎలా అయితే ప్రతి ఒక్కరి కోసం ఉన్నారన్న విషయం లో నాకు గట్టి నమ్మకం ఉందో అదే మాదిరిగా ఈ సభ యొక్క దైవం కూడా అధికార పక్ష సభ్యుల తో పాటు ప్రతిపక్ష సభ్యులకు కూడా అండగా ఉంటారని నాకు ఒక బలమైన నమ్మకం ఉందని నేను అన్నాను. మన సభ యొక్క దైవం అయిన హరివంశ్ గారు ప్రతి ఒక్కరి పట్ల ఎలాంటి వివక్ష ను చూపకుండా పక్షపాతం లేకుండా వ్యవహరించాలి, ఆయన అధికార పక్షానికో, లేక ప్రతిపక్షాలకో వంత పాడకుండా నడుచుకోవాలి.
సభ అనే మైదానం లో ఆటగాళ్ళ కంటే ఎక్కువగా సమస్యల ను ఎదుర్కొనేది అంపైర్లే అని కూడా నేను చెప్పాను. పార్లమెంటు సభ్యల ను నియమాలకు అనుగుణంగా ఆట ఆడవలసిందిగా కట్టడి చేయడం ఎంతో సవాలుతో కూడుకొన్న పని. ఆయన ఉత్తమ అంపైర్ అవుతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ, హరివంశ్ గారు ఆయన అంటే బాగా పరిచయం లేని వారి విశ్వాసాన్ని సైతం తన నిర్ణయాల ద్వారా గెలుచుకున్నారు.
చైర్‌మన్ సర్, హరివంశ్ జీ తన బాధ్యత ను ఫలప్రదంగా ఎలా నిర్వహించారో అనే దానికి ఈ రెండు సంవత్సరాలు నిదర్శనంగా ఉన్నాయి. హరివంశ్ గారు ప్రధాన చట్టాలపై సమగ్ర చర్చల ను నిర్వహించడం ద్వారా, బిల్లులు వెంటవెంటనే ఆమోదం పొందేలా చూడటం ద్వారా ఈ సభ ను సమర్ధంగా నడిపారు. ఈ కాలం లో, దేశ భవిష్యత్తు కు సంబంధించిన ఎన్నో చరిత్రాత్మక బిల్లులు ఈ సభ ఆమోదానికి నోచుకున్నాయి. గత సంవత్సరమే, ఈ సభ పదేళ్ళ లో అత్యధిక పనితీరు ను కనబరచి, ఒక రికార్డును సృష్టించింది. అది కూడా, కిందటేడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతూ ఉన్న కాలం లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గరిష్ఠ బిల్లుల ను ఆమోదించడంతో పాటు మరింత ఎక్కువ సానుకూలత వ్యక్తం కావడం సభ్యులందరికీ గర్వకారణం. ప్రతి ఒక్కరూ వారి ఆలోచనల ను అరమరికలు లేకుండా వ్యక్తం చేయగలిగారు. సభ కు అంతరాయం ఏర్పడకుండా ఉమ్మడి ప్రయత్నాలు జరగడం అనుభవం లోకి వచ్చింది. ఇది సభ గౌరవాన్ని కూడా పెంచింది. ఎగువ సభ నుంచి రాజ్యాంగ శిల్పులు ఆకాంక్షించింది కూడా ఇదే. ప్రజాస్వామిక మర్యాదకు, అలాగే జెపి, కర్పూరి ఠాకూర్ లకు జన్మనిచ్చిన, బాపూ యొక్క చంపారణ్ ఒక భాగం గా ఉన్న బిహార్ గడ్డ నుంచి వచ్చిన ఒక ప్రజాస్వామ్య మార్గదర్శకుడు ముందంజ వేసి, తన బాధ్యతల ను ఏ రకంగా నెరవేర్చారో హరివంశ్ గారు చాటిచెప్పారు.
హరివంశ్ గారిని గురించి ఆయన కు బాగా సన్నిహితులైన వారితో మీరు చర్చించారంటే గనక, అప్పుడు ఆయన ఎందుకు ఇంత వినమ్రుడిగా ఉన్నదీ మీకు అర్థమవుతుంది. ఆయన ఊళ్లో ఒక వేప చెట్టు నీడన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక బడి లో తన మొట్టమొదటి చదువులు చదువుకున్నారు. క్షేత్ర వాస్తవాల తో ఆయన అనుబంధాన్ని పెంచుకోగలరన్న సంగతిని ఆయన చదువుకున్న తీరే తేటతెల్లం చేస్తుంది.
హరివంశ్ గారు జయప్రకాశ్ జీ మాదిరిగానే సీతాబ్ దియారా అనే ఊరి నుంచి వచ్చిన సంగతి మన అందరికీ ఎంతో బాగా తెలుసు. ఈ పల్లె జయప్రకాశ్ గారు పుట్టిన ఊరు. దియారా గ్రామం గంగానది, ఘాగ్రా నదుల మధ్య ఉంది. అంతేకాదు ఉత్తర్ ప్రదేశ్ కు, బిహార్ లోని ఆరా, బలియా, ఛప్రా జిల్లాలు మూడింటికి నడుమ ఉన్న దియారా గ్రామం వరద పోటెత్తితే ఓ దీవి గా మారిపోతుంటుంది. ఇక్కడ ఒక పంట ను పండించడమే గగనం. ఎక్కడికైనా వెళ్ళాలంటే పడవ లో నది ని దాటడం తప్ప వేరే దారి లేదు.
హరివంశ్ గారు తన గ్రామం లోని పరిస్థితుల ను అర్థం చేసుకొని, ఉన్నదానితో తృప్తి పడటం మేలు అనే ఆచరణాత్మక జ్ఞానాన్ని అందుకున్నారు. ఆయన నేపథ్యానికి సంబంధించిన ఒక సంఘటన ను ఎవరో ఒకసారి నాతో చెప్పారు. అదేమిటంటే, హరివంశ్ గారు ఉన్నత పాఠశాల కు మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు ఆయన కు పాదరక్షలు కావలిసొచ్చాయి. ఆయన దగ్గర పాదరక్షలు లేవు. ఎందుకంటే, ఆయన ఎప్పుడూ వాటిని కొనలేదు. దీంతో హరివంశ్ గారి కోసం పాదరక్షల ను సిద్ధం చేయాలంటూ పల్లెలో చెప్పులు కుట్టే పని ని చేసే వ్యక్తి ని కోరారు. ఆయన వద్దకు హరివంశ్ గారు తరచుగా వెళ్ళి పాదరక్షల తయారీ ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఉండే వారు. ఒక ధనికుడు తన భవంతి నిర్మాణ పనులు ఎలా సాగుతున్నదీ చూడటానికి పలుమార్లు అక్కడికి వెళ్తూ ఉంటాడో అలాగే హరివంశ్ గారు తన పాదరక్షల పని ఎంతవరకు వచ్చిందో పర్యవేక్షించడానికి అక్కడికి అనేకసార్లు వెళ్ళే వారు. ప్రతి రోజూ తన చెప్పులు ఎప్పటికి తయారవుతాయో ఆ చర్మకారుడిని హరివంశ్ అడుగుతూ ఉండే వారు. హరివంశ్ గారు ఎందుకు అంత నిరాడంబరంగా ఉండేవారన్న సంగతిని మీరు దీనిని బట్టి ఊహించవచ్చును.
ఆయన పై జెపి ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంది. ఆ కాలం లో పుస్తకాల పట్ల ఆయన ఇష్టం కూడా పెరిగిపోయింది. దీనికి సంబంధించిన ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది. హరివంశ్ గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉపకార వేతనాన్ని అందుకున్నప్పుడు స్కాలర్‌షిప్ డబ్బు అంతటినీ ఆయన ఇంటికి తీసుకువస్తాడని ఆయన కుటుంబసభ్యుల లో కొంత మంది ఆశించారు. స్కాలర్‌షిప్ డబ్బులను ఇంటికి తీసుకువచ్చే బదులు హరివంశ్ గారు ఆ డబ్బును పుస్తకాలు కొనేందుకు ఖర్చుపెట్టేశారు. కొన్ని ఆత్మకథలు, ఇతర సాహిత్యం సహా బోలెడన్ని పుస్తకాలను కొని ఇంటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి పుస్తకాలంటే హరివంశ్ గారికి ఉన్న ప్రేమ చెక్కుచెదరకుండా ఉండిపోయింది.
చైర్‌మన్ సర్, హరివంశ్ గారు సామాజిక సమస్యల తో కూడిన పాత్రికేయ వృత్తి లో దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు పని చేసి 2014 లో పార్లమెంటులో అడుగుపెట్టారు. సభ డిప్యూటీ చైర్ పర్సన్ గా ఆ పదవి యొక్క ఔచిత్యాన్ని హరివంశ్ గారు పరిరక్షించారు. పార్లమెంటు సభ్యునిగా ఆయన పదవీ కాలం కూడా అంతే సమ్మానపూర్వకంగా గడిచింది. ఒక సభా సభ్యుని గా హరివంశ్ గారు.. అది ఆర్థిక వ్యవస్థ కు సంబంధించి కావచ్చు, లేదా వ్యూహాత్మక భద్రత కు సంబంధించి కావచ్చు.. తన ఆలోచనల ను ఎంతో ప్రభావవంతమైన విధంగా వ్యక్తం చేశారు.
ఆయన తన అభిప్రాయాల ను హుందాగా వెల్లడి చేయడం ద్వారా తనకంటూ ఒక ముద్ర ను సంపాదించుకొన్నారనేది మన అందరికీ తెలుసు. ఆయన సభ లో ఒక సభ్యునిగా తన జ్ఞానంతో, తన అనుభవంతో దేశానికి సేవ చేయడానికి సకల ప్రయత్నాలు చేశారు. హరివంశ్ గారు అంతర్జాతీయ వేదికల లో.. అవి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కు చెందిన అనేక సమావేశాలు కావచ్చు, లేదా ఇతర దేశాల లో భారతీయ సాంస్కృతిక ప్రతినిధి వర్గాల లో ఒక సభ్యునిగా తన బాధ్యత ను నిర్వర్తించడం కావచ్చు.. భారతదేశం యొక్క గౌరవాన్ని, ఉన్నతిని పెంపొందించేందుకు కూడా కృషి చేశారు. ఆ తరహా వేదికలన్నిటిలో భారతదేశం యొక్క హోదాను, దేశ పార్లమెంటు గౌరవాన్ని హరివంశ్ గారు పెంచారు.
***
(Release ID: 1654404)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam