ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకంలో భాగంగా నిర్మించిన 1.75 లక్షల ఇళ్ల గృహప్రవేశం సందర్భంగా ప్రధానమంత్రి గారి ప్రసంగపాఠం


Posted On: 12 SEP 2020 2:04PM by PIB Hyderabad

ఇవాళ పక్కా ఇళ్లు పొందిన, తమ పిల్లల భవిష్యత్తుపై నమ్మకం కలిగిన  కొందరు లబ్ధిదారులతో ఇంతకుముందే మాట్లాడాను. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని 1.75 లక్షల కుటుంబాలు ఇవాళ గృహప్రవేశం చేసుకుంటున్నాయి. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరందరూ మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలనుంచి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో అనుసంధానమై ఉన్నారు. దేశంలో గత ఆరేళ్లలో ఇళ్లు పొందిన వారి జాబితాలోకి ఇవాళ గృహప్రవేశం పొందిన వారు చేరిపోయారు. మీరంతా ఇక కిరాయి ఇళ్లలో, గుడిసెల్లో, కచ్చా ఇళ్లలో కాకుండా మీ సొంత ఇళ్లలో పక్కా ఇంటిలో ఉండబోతున్నారు.

మిత్రులారా,
ఈసారి మీ అందరి దీపావళి, ఇతర పండగలు గతం కంటే సంతోషంగా ఉంటాయి. కరోనా లేకపోయినట్లయితే.. మీ ఈ ఆనందరక క్షణాల్లో మీ కుటుంబసభ్యులతోపాటు పాలుపంచుకునేందుకు ఈ ప్రధానసేవకుడు మీ వద్దకే వచ్చుండేవాడు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా మీ అందరితో నేరుగా కలవలేకపోతున్నా. దూరం నుంచే మిమ్మల్ని చూస్తుండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ పరిస్థితుల్లో ఇదే సరైనది.

నేటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారికి, రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, కేంద్రమంత్రి మండలి సహచరులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారికి, నా సహ పార్లమెంటు సభ్యుడు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారికి, రాష్ట్ర మంత్రి మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, గ్రామపంచాయతి ప్రతినిధులతోపాటు వివిధ గ్రామాలనుంచి అనుసంధానమై ఉన్న మీ అందరికీ నమస్కారములు,
సోదర, సోదరీమణులారా,
ఇవాళ గృహప్రవేశం చేసుకుంటున్న మధ్యప్రదేశ్‌లోని 1.75 లక్షల కుటుంబాలవారికి ఇదో ఆనందభరితమైన క్షణం. దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లుండాలన్న సత్సంకల్పానికి ఇస్తున్న కార్యరూపానికి ఇదో ముందడుగు. మధ్యప్రదేశ్ తో పాటు దేశంలోని ఇళ్లులేని వారందరికీ ఈ క్షణం ఒక నమ్మకాన్ని కల్పిస్తుంది. ఇప్పటికీ ఇళ్లు లేని వారికి కూడా ఒకరోజు సొంతిల్లుకల సాకారమవుతుంది.
మిత్రులారా,
సరైన, చక్కటి ఉద్దేశాలతో చేపట్టే ప్రభుత్వ పథకాలు సాకారమవుతాయని, అవి లబ్ధిదారులకు మేలు చేస్తాయని ఇవాళ దేశ ప్రజలందరికీ నమ్మకం మరింత పెరిగింది. ఇవాళ ఇళ్లు పొందిన వారితో మాట్లాడాను. వారిని తెరపై కూడా చూస్తున్నాను. వారందరి ముఖాల్లో ఆ సంతోషం, ఆత్మవిశ్వాసాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ ఇల్లు మీకు మీ భవిష్యత్తుకు సరికొత్త ఆధారంగా మారుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పగలను. ఇకపై మీ నూతన జీవితాన్ని ప్రారంభించండి. మీ పిల్లలు, మీ కుటుంబసభ్యుల ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లండి. మీరు మందుడుగు వేస్తేనే దేశం ముందుకెళ్తుంది.
మిత్రులారా,
కరోనా సమయంలో అన్ని నిబంధనలను పాటిస్తూనే దేశవ్యాప్తంగా 18 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇళ్ల పనులు పూర్తయ్యాయి. ఇందులో 1.75 లక్షల ఇళ్లు ఒక్క మధ్యప్రదేశ్‌లోనే పూర్తయ్యాయి. ఇంత త్వరితగతిన పనులన్నీ పూర్తవడం కూడా ఓ రికార్డే. సాధారణంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఒక  ఇంటిని నిర్మించేందుకు మామూలుగా అయితే 125రోజుల సమయం పడుతుంది. కానీ నేనిప్పుడు చెప్పబోయే విషయం దేశానికి, మన మీడియాకు ఓ సానుకూలమైన వార్తను అందిస్తుంది. 125 రోజుల బదులుగా కరోనా కాలంలో 45 నుంచి 60 రోజుల్లోనే ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అపత్కాల పరిస్థితులను అవకాశాలుగా మార్చుకోవడానికి ఇదో చక్కటి ఉదాహరణ. 125 రోజుల్లో జరగాల్సింది 45 నుంచి 60 రోజుల్లో ఎలా సాద్యమైందని మీరు ఆశ్చర్యపోవచ్చు.
మిత్రులారా,
ఈ మహత్కార్యంలో పట్టణాలనుంచి తిరిగివచ్చిన మన కార్మికసోదరుల పాత్ర కీలకం. వారికి నైపుణ్యం ఉంది, పని చేయాలన్న ఆలోచన ఉంది. దీంతో వారు ఈ కార్యకంలో భాగమవగానే.. పనులు చకచకా జరిగిపోయాయి. ఈ కార్మిక సోదరులు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజనను సద్వినియోగం చేసుకుంటూనే కుటుంబాలను పోషించుకున్నారు. పేదలకోసం ఇళ్లను కట్టిచ్చారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అభియాన్ ద్వారా మధ్యప్రదేశ్‌తోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దాదాపు 23కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లోని పేదలకు ఇళ్ల నిర్మాణంతోపాటు ఇంటింటికీ మంచినీటిని అందించడం, అంగన్ వాడీ, పంచాయతీ భవనాలను నిర్మించడం, పశువుల కోసం షెడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడం, చెరువులు, కాలువల పూడిక తీయించడం వంటి కార్యక్రమాలు చాలా త్వరితంగా పూర్తయ్యాయి. దీని ద్వారా చాలా లాభం జరిగింది. పట్టణాలనుంచి గ్రామాలకు తిరిగి వచ్చిన కార్మిక సోదరులకు ఉపాధి లభించింది. నిర్మాణ సంబంధ సామాగ్రి వ్యాపారం కూడా కొనసాగింది. ఈ రకంగా ప్రధానమంత్రి కల్యాణ్ రోజ్ గార్ యోజన.. కరోనా సమయంలోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా వెన్నుదన్నుగా నిలిచింది.

మిత్రులారా,
గతంలో కూడా ప్రభుత్వాలు పథకాలు రూపొందించేవి, పేదలకు ఇళ్లు నిర్మించేవి. ఇందులో మీరు తీసుకొచ్చిన మార్పేంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నిజమే, పేదలకోసం ఇళ్లు నిర్మించే పథకాలు కొనసాగేవి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనూ సమాజ వికాసం కోసం కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత ప్రతి 10-15 ఏళ్లకు వాటి పేర్లను మారుస్తూ పోయారు. కానీ కోట్లమంది ఇళ్ల కల మాత్రం కలలాగే మిగిలిపోయింది. ఇందుకు కారణం గతంలో పథకాలను రూపొందించేవారు. ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉండేది. ఢిల్లీలోని ప్రభుత్వమే ఆ ఇళ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేది. ఆ ఇళ్లలో వారి అభిప్రాయాలు తెలుసుకునేది కాదు. పట్టణాల్లో ఉండేట్లుగానే ఆదీవాసీలు నివసించే ప్రాంతాల్లోనూ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందేవి. మన ఆదివాసీ సోదర, సోదరీమణులు నివసించే తీరు.. మన పట్టణాల్లో నివసించేవారితో భిన్నంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు నిర్మించే ఇళ్లలో వారు ఉండేందుకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అంతేకాదు గతంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి జరిగేది. పారదర్శకతకు చోటుండేది కాదు. నేను ఆ వివరాల్లోకి వెళ్లదలచుకోవడంలేదు. అందుకే ఆ ఇళ్లలో నాణ్యత చాలా దారుణంగా ఉండేది. పైనుంచి కరెంట్, నీళ్లు వంటి కనీస అవసరాలకోసం ప్రభుత్వ కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. వీటన్నింటి ఫలితంగా.. ఇళ్లు కట్టినా వాటిలో ఉండేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.

మిత్రులారా,
2014లో మా ప్రభుత్వం బాధ్యతలు తీసుకోగానే.. గతంలో జరిగిన పనులను వాటి అనుభవాలను అధ్యయనం చేసి.. పాత పథకాల్లో చాలా మార్పులు తీసుకొచ్చాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఇందులో లబ్ధిదారుల ఎంపికనుంచి వారి గృహప్రవేశం వరకు ప్రతీదీ పాదర్శకంగా జరిగేలా చూస్తున్నాం. గతంలో పేదలు ప్రభుత్వం వెనక పరిగెత్తేవారు. ఇంటికోసం సిఫారసులు ఎవరిస్తారని వెతికేవారు. కానీ మా పథకం ద్వారా ప్రభుత్వమే ప్రజలవద్దకు వెళ్తుంది. వారిని వెతికి వెతికి మరీ సౌకర్యాలు కలిపిస్తోంది. ఈ జాబితాలో చోటుకోసం ఎవరి చుట్టూ తిరగక్కర్లేదు. ఎవరి సిఫారసులు అక్కర్లేదు. ఎవరో చెప్పారని పేర్లు చేర్చడం, తొలగించడం జరగదు. ప్రతి అడుగులోనూ పారదర్శకత ఉంటుంది. అంతేకాదు, నిర్మాణ సామాగ్రి మొదలుకుని.. నిర్మాణం వరకు స్థానికంగా లభించే వనరులను సద్వినియోగపరుచుకోవాలనేదే మా ప్రాథమిక ఉద్దేశం. ఇళ్ల డిజైనింగ్ కూడా స్థానిక నిర్మాణ శైలికి అనుగుణంగానే జరుగుతుంది. పూర్తి పారదర్శకతతోపాటు ఇంటి నిర్మాణం జరిగే ప్రతిదాంటోల లబ్ధిదారుడి పాత్ర ఉంటుంది. ఇంటి నిర్మాణం నడుస్తున్న కొద్దీ ఆయన ఖాతాలో డబ్బులు జమఅవుతుంటాయి. ఒకవేళ ఎవరైనా అక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తే.. వారు పట్టుబడేందుకు  అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాము.
మిత్రులారా,

ఇంద్రధనస్సు స్వరూపం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన విశేషం. ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉన్నట్లే.. ఈ పథకంలో నిర్మితమవుతున్న ఇళ్లకు కూడా వేర్వేరు వర్ణాలున్నాయి. ఇప్పుడు పేదలకు ఇంటితోపాటు శౌచాలయం, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, సౌభాస్య పథకం ద్వారా విద్యుత్ కనెక్షన్, ఉజాలా తో బల్బు, నీటి కనెక్షన్ అన్నీ ఇంటితోపాటే లభిస్తాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆధారంగానే అన్ని సామాజిక పథకాల లాభాలు అందించబడుతున్నాయి. ఈ పథకానికి 27 సామాజిక భద్రత పథకాలను జోడించిన ముఖ్యమంత్రి శీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, వారి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయినా.. స్వచ్ఛభారత్ అభియాన్ అయినా.. దీని ద్వారా పేదలకు సౌలభ్యం దొరకడంతోపాటు ఉపాధికల్పన, సశక్తరణ జరుగుతోంది. మరీముఖ్యంగా మన గ్రామీణ మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఈ పథకాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకంలో భాగంగా నిర్మించి ఇస్తున్న ఇళ్ల రిజిస్ట్రేషన్ కూడా మహిళల పేరుపైన లేదా వారి పేరు చేరిస్తేనే జరుగుతోంది.  అదే ఇవాళ గ్రామాల్లో మహిళా మేస్త్రీలు లేదా రాణి మేస్త్రీలకోసం సరికొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ‌50వేలకు పైగా మేస్త్రీలకు శిక్షణ అందించారు. ఇందులో 9వేలకు పైగా మహిళా మేస్త్రీలున్నారు. దీని ద్వారా మన సోదరీమణుల ఆత్మవిశ్వాసం, ఆదాయం పెరుగుతోంది.

మిత్రులారా,
ఎప్పుడైతే పేదలు, గ్రామాల ఆత్మవిశ్వాసం, ఆదాయం పెరుగుతాయో.. అది ఆత్మనిర్భర భారత నిర్మించాలన్న మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇలాంటి ఆత్మవిశ్వాసం తీసుకురావడానికి గ్రామాల్లో అన్నిరకాల మౌలిక , ఆధునిక మౌలిక వసతులు కల్పించబడుతున్నాయి. 2019కి ముందు ఐదేళ్లు శౌచాలయం, గ్యాస్, విద్యుత్, రోడ్లు మొదలైన కనీస అవసరాలు గ్రామాలకు అందించేందుకు పనిజరిగింది. ఇప్పుడు ఈ కనీస మౌలిక వసతుల ఆధారంగా ఆధునిక మౌలిక వసతులను కూడా గ్రామాలను అందించి వాటిని బలోపేతం చేయడం జరుగుతోంది. ఈ 15 ఆగస్టుకు ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ.. వచ్చే వెయ్యిరోజులపాటు దేశంలోని 6లక్షల గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసే పనులు పూర్తవుతాయని చెప్పాను. ముందుగా దేశంలో రెండున్న లక్షల పంచాయతీలకు ఫైబర్ లైన్ ను అందించే లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని పంచాయతీలనుంచి కాస్త ముందుకెళ్లి గ్రామాలకు చేర్చాలని సంకల్పం తీసుకున్నాం.

 

కరోనా సమయంలోనూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ పథకం ద్వారా వేగంగా పనులు జరుగుతున్నాయి. మరికొద్ది వారాల్లో దేశంలోని 116 జిల్లాల్లో 5వేల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటుచేయడం జరిగింది. దాని ద్వారా పన్నెండున్న లక్షలకు పైగా గ్రామాల్లో 15లక్షలకు పైగా వైఫై హాట్ స్పాట్ లు దాదాపు 19వేల ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. మధ్యప్రదేశ్ లోని కొన్ని ఎంపికచేయబడిన జిల్లాల్లో 13 వందల కిలోమీట్లర మేర ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేశారు. ఇదంతా కరోనా సమయంలోనే జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతపెద్ద సంకట కాలంలోనే అది పూర్తయింది. గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ చేరుతుంతో.. గ్రామాలకు అనుసంధానమ సమస్య కూడా తగ్గుతుంది. దీంతోపాటు వైఫై హాట్ స్పాట్ ల కారణంగా.. గ్రామాల్లో విద్యార్థులు, యువకులకు విద్యతోపాటు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. అంటే గ్రామాలు ఆధునిక ప్రపంచం, వ్యాపారలావాదేవీలతో అనుసంధానం అయినట్లే.

మిత్రులరా,

ఇవాళ ప్రభుత్వాల ప్రతి సేవ, సౌకర్యం ఆన్ లైన్ వేదిక ద్వారానే జరగుతున్నాయి. దీంతోపాటు పథకాలు కూడా వేగంగా లబ్ధిదారులకు చేరుతున్నాయి. అవినీతికి తగ్గింది. ప్రతి చిన్న పనికి పట్టణాలకు వెళ్లే ప్రయాస కూడా యువకులకు తప్పింది. గ్రామగ్రామానికి ఫైబర్ ఆప్టికల్ చేరుకుందంటే.. ఆన్ లైన్ సేవలు, సౌకర్యాలు కూడా వేగవంతం అయినట్లే. మీరు మీ కొత్త ఇళ్లలోకి రాగానే డిజిటల్ భారత్  అభియాన్ ద్వారా మీ జీవితాలు మరింత సౌకర్యవంతమవుతాయి. గ్రామాలను, పేదలకు సాధికారత అందించాలన్న మా సంకల్సం మరింత వేగంవంతంగా పూర్తవుతుంది. అందుకోసం మరోసారి లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ ఒక్కవిషయం గుర్తుపెట్టుకోండి. పదే పదే చెబుతున్నాను. కరోనాకు మందు వచ్చేంతవరకు అలసత్వం వహించవద్దు. రెండు గజాల దూరం, మాస్క్ తప్పని సరిగా వినియోగించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

ఈ విన్నపంతో మీకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు.

 

 

 

 

*****



(Release ID: 1653922) Visitor Counter : 230