ప్రధాన మంత్రి కార్యాలయం

పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌ లో మూడు కీలక పథకాలను జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి


Posted On: 13 SEP 2020 2:47PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పెట్రోలియం రంగానికి సంబంధించి బీహార్‌లో మూడు కీలక పథకాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జాతికి అంకితం చేశారు. ఈ పథకాల్లో పారాదీప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ అభివృద్ధి పథకం పరిధిలోగల దుర్గాపూర్-బంకా విభాగం పైప్‌లైన్‌ నిర్మాణంసహా రెండు వంటగ్యాస్‌ బాట్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు కూడా అంతర్భాగంగా ఉంది. పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ‘ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్‌’ వీటిని చేపట్టాయి.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- బీహార్ కోసం కొన్నేళ్ల కిందట ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై అధికశాతం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీలో పెట్రోలియం, గ్యాస్‌కు సంబంధించి రూ.21 వేల కోట్ల విలువైన 10 పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిలో భాగంగా నేడు ఇది బీహార్ ప్రజలకు అంకితం చేస్తున్న 7వ పథకమని ప్రధాని గుర్తుచేశారు.  అలాగే బీహార్‌లో ఇప్పటికే పూర్తయిన ఆరు ఇతర పథకాల జాబితాను కూడా ఆయన ఉటంకించారు. ఈ నేపథ్యంలో ఒక కీలక గ్యాస్ పైప్‌లైన్‌ పథకంలో భాగంగా ఏడాదిన్నర కిందట తాను శంకుస్థాపన చేసిన దుర్గాపూర్-బంకా విభాగాన్ని (సుమారు 200 కిలోమీటర్లు) నేడు ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సంక్లిష్ట భూభూగం గుండా ఈ పైప్‌లైన్‌ నిర్మించడం సవాలుతో కూడుకున్నదైనప్పటికీ  సకాలంలో పనులను పూర్తిచేయడంలో కఠోరంగా శ్రమించిన ఇంజనీర్లు, సిబ్బంది కృషికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు మద్దతునిచ్చిందని ఆయన ప్రశంసించారు. ఒక తరం పని ప్రారంభిస్తే మరో తరంలోగానీ పనులు పూర్తికాని సంస్కృతి నుంచి బీహార్‌ను సమున్నత స్థితికి తేవడంలో ఎంతో గొప్ప పాత్ర పోషించారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కొనియాడారు. ఈ కొత్త పని సంస్కృతి ఇలాగే కొనసాగుతూ మరింత బలోపేతమై బీహార్‌ను, తూర్పు భారతాన్ని ప్రగతిపథంలో నడపాలని ఆకాంక్షించారు.

ఏ దేశంలోనైనా స్వేచ్ఛకు మూలం సామర్థ్యం కాగా, ప్రగతికి పునాది కార్మికశక్తేనని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఇతిహాస వాక్యాన్ని ఉటంకించారు. ఆ మేరకు బీహార్‌సహా తూర్పు భారతంలో కార్మికశక్తికిగానీ, సహజ వనరులకుగానీ ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ బీహార్, తూర్పు భారత ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ, ఆర్థిక కారణాలతోపాటు ఇతరత్రా ప్రాథమ్య వ్యత్యాసాలవల్ల ఈ ప్రాంత ప్రగతిలో ప్రజలు అంతులేని ఆలస్యానికి గురయ్యారని వివరించారు. రోడ్డు-రైలు-గగన మార్గాలతోపాటు ఇంటర్నెట్ అనుసంధానానికి లోగడ ప్రాధాన్యం ఉండేది కాదన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నపుడు బీహార్‌లో గ్యాస్ ఆధారిత పరిశ్రమ, పెట్రో అనుసంధానం వంటివాటిని కలనైనా ఊహించడం అసాధ్యమేనని పేర్కొన్నారు. కాగా, బీహార్‌కు అన్నివైపులా భూ సరిహద్దులున్నందున సముద్ర తీర రాష్ట్రాలకుగల సౌలభ్యం లేకపోవడంతో రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి పెను సవాలుగా ఉందన్నారు.

ఏ రాష్ట్రంలోనైనా గ్యాస్ ఆధారిత పరిశ్రమ, పెట్రో సంధానాలు జనజీవనంపై వారి జీవన ప్రమాణాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి వివరించారు. వీటిద్వారా లక్షలాది కొత్త ఉపాధి అవకాశాల సృష్టి సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో నేడు సిఎన్జీ, పీఎన్‌జీలు బీహార్‌, తూర్పు భారతంలోని అనేక నగరాలకు చేరువ కావడంవల్ల ఇకపై ఇక్కడి ప్రజలు ఈ సౌకర్యాలను సులభంగా పొందగలగాలని పేర్కొన్నారు. ఆ మేరకు ‘ప్రధానమంత్రి ఊర్జా గంగా యోజన’ కింద తూర్పు సముద్రతీరంలోని పారాదీప్‌ రేవుతో పశ్చిమ సముద్ర తీరంలోగల కాండ్లా రేవును అనుసంధానించే భగీరథ ప్రయత్నం ప్రారంభమైందని తెలిపారు. ఇందులో భాగంగా 3000 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్‌లైన్ ద్వారా 7 రాష్ట్రాలు అనుసంధానం కాగలవని, వాటిలో బీహార్‌ రాష్ట్రానికీ ప్రముఖ పాత్ర ఉంటుందని వివరించారు. తదనుగుణంగా పారాదీప్‌-హల్దియా నుంచి వచ్చే మార్గం ఇప్పుడు పాట్నా, ముజఫర్‌పూర్ దాకా విస్తరించబడుతుందని చెప్పారు. అలాగే కాండ్లా నుంచి వచ్చే పైప్‌లైన్‌ పనులు గోరఖ్‌పూర్‌దాకా పూర్తయినందున దీనికి అనుసంధానిస్తామని తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన పైప్‌లైన్ ప్రాజెక్టులలో ఒకటిగా కాగలదని ఆయన అన్నారు.

ఈ గ్యాస్ పైప్‌లైన్ల అందుబాటులోకి వస్తున్నందున బీహార్‌లో వంటగ్యాస్‌ నింపే పెద్ద ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా రెండు కొత్త బాట్లింగ్ ప్లాంట్లను ఇవాళ బంకా, చంపారన్‌లలో ప్రారంభించామని ప్రధాని ప్రకటించారు. ఈ రెండు ప్లాంట్లకూ ఏటా 125 మిలియన్ సిలిండర్లకుపైగా గ్యాస్‌ నింపగల సామర్థ్యం ఉంటుందన్నారు. దీంతో గొడ్డా, దేవ్‌గఢ్‌, డుమ్కా, సాహిబ్‌గంజ్, పాకూర్ జిల్లాలతోపాటు జార్ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల వంటగ్యాస్‌ అవసరాలను కూడా ఈ ప్లాంట్లు తీర్చనున్నాయి. ఈ గ్యాస్ పైప్‌లైన్ వేయడంవల్ల తద్వారా అందుబాటులోకి వచ్చే ఇంధన శక్తి ఆధారంగా కొత్త పరిశ్రమలతోపాటు వేలాది కొత్త ఉద్యోగాలను కూడా బీహార్‌ సృష్టించగలదని ఆయన అన్నారు. ఆ మేరకు సదరు గ్యాస్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తికాగానే లోగడ మూతపడిన బరౌనీ ఎరువుల కర్మాగారం కూడా తిరిగి ప్రారంభం కాగలదని ప్రధాని ప్రకటించారు. దేశంలో ఇవాళ ఉజ్వల పథకం కింద 8 కోట్ల పేద కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్ సమకూరిందన్నారు. కరోనా కాలంలో ఇది పేదల జీవితాలను మార్చివేసిందని, ఈ పథకంవల్ల వారు కట్టెలు, ఇతర వంటచెరకు కోసం సుదూరం వెళ్లిరావాల్సిన అవస్థలు తప్పాయని చెప్పారు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో లక్షలాది పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన ఉజ్వల పథకం కింద లక్షలాది సిలిండర్లను ఉచితంగా సరఫరా చేసినట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ కృషిలో పాలుపంచుకున్న పెట్రోలియం-గ్యాస్ విభాగాలు, చమురు సంస్థలతోపాటు లక్షలాది సరఫరా సిబ్బంది కట్టుబాటును ఆయన ప్రశంసించారు. కరోనా మహమ్మారి సంక్రమించే ముప్పు ఉన్నప్పటికీ ఈ భాగస్వాములంతా చిత్తశుద్ధితో సేవలందిస్తూ ప్రజలకు వంటగ్యాస్‌ కొరత రాకుండా చూసుకున్నట్లు గుర్తుచేశారు. బీహార్‌లో వంటగ్యాస్‌ కనెక్షన్‌ సంపన్నులకు మాత్రమే పరిమితమన్న పరిస్థితి ఒకనాడు ఉండేదని, అప్పట్లో గ్యాస్‌ కనెక్షన్‌ కోసం ఉన్నతస్థాయిలో సిఫారసు అవసరమయ్యేదని గుర్తుచేశారు. కానీ ఉజ్వల పథకం వల్ల బీహార్‌లో ఇప్పుడా పరిస్థితి లేదని, రాష్ట్రంలో సుమారు 1.25 కోట్ల పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వబడిందని వివరించారు. ఈ గ్యాస్ కనెక్షన్ బీహార్‌లోని కోట్లాది పేద ప్రజల జీవితాలను మార్చివేసింది.

బీహార్ యువతను ప్రధానమంత్రి ప్రశంసిస్తూ ఈ రాష్ట్రం దేశ ప్రతిభాశక్తికి కేంద్రమని పేర్కొన్నారు. దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రం అభివృద్ధిలోనూ బీహార్ కార్మిక శక్తి, సామర్థ్యం ముద్ర, ప్రస్ఫుటంగా కనిపిస్తాయన్నారు. ముఖ్యంగా గత 15 ఏళ్లలో సరైన ప్రభుత్వం, సరైన నిర్ణయాలు, విస్పష్ట విధానాలతో ప్రగతిని ప్రతి ఒక్కరికీ చేరువ చేయడం ద్వారా తన విలువేమిటో బీహార్‌ చాటిచెప్పిందన్నారు. బీహార్‌ ప్రజలు పొలం పనులు చేసుకుంటారు గనుక వారికి చదువు అవసరం లేదన్న ఒక ఆలోచన ఉండేదని ప్రధాని గుర్తుచేశారు. దీంతో ఈ రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభించడానికి పెద్దగా కృషి సాగలేదన్నారు. ఫలితంగా బీహార్ యువతరం చదువుకోసం, పనికోసం రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వాస్తవానికి పొలంలో పనిచేయడం, వ్యవసాయం చేయడం అత్యంత కష్టమైన పనులేగాక గర్వించదగినవేనన్నారు. అయితే, ఈ రంగంలో యువతకు అవకాశాలు లభించకపోవడం, అటువంటి ఏర్పాట్లేవీ జరగకపోవడం సముచితం కాదన్నారు.

బీహార్‌లో నేడు పెద్దపెద్ద విద్యా కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే వ్యవసాయ, వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాలల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రంలోని ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీవంటి ఉన్నతస్థాయి విద్యాసంస్థలు బీహార్ యువత స్వప్న సాకారానికి సాయపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ సంస్థల సంఖ్యను మూడు రెట్లు చేయడంతోపాటు బీహార్‌లో రెండు పెద్ద విశ్వవిద్యాలయాలు, ఒక ఐఐటి, ఒక ఐఐఎం, ఒక నిఫ్ట్, ఒక జాతీయ న్యాయవిద్యా సంస్థ ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

‘స్టార్టప్‌ ఇండియా, ముద్ర యోజన’సహా అనేక ఇతర పథకాలు బీహార్ యువతకు అవసరమైన స్వయం ఉపాధిని అందుబాటులోకి తెచ్చాయని ప్రధాని చెప్పారు. బీహార్ నగరాలు, గ్రామాల్లో విద్యుత్ లభ్యత గతంలో కంటే ఎక్కువేనని పేర్కొన్నారు. అలాగే ఆధునిక మౌలిక వసతుల కల్పనసహా విద్యుత్, పెట్రోలియం, గ్యాస్ రంగాలలో పలు పథకాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. సంస్కరణలు తెస్తున్నామని, తద్వారా ప్రజలకు జీవన సౌలభ్యంతోపాటు పరిశ్రమలకు, ఆర్థిక వ్యవస్థకు ఇవి ప్రేరణగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. ప్రస్తుత కరోనా సమయంలోనూ చమురుశుద్ధి కర్మాగారాలు, ముడి చమురు అన్వేషణ లేదా ఉత్పత్తి సంబంధిత ప్రాజెక్టులు, పైప్‌లైన్లు, నగర గ్యాస్ సరఫరా వంటి పెట్రోలియం సంబంధిత మౌలిక వసతుల ప్రాజెక్టుల పనివేగం ఊపందుకున్నదని చెప్పారు. మొత్తంమీద 8 వేలకుపైగా పథకాలుండగా వీటిపై రానున్న కాలంలో రూ.6 లక్షల కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. ఇక వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగివచ్చిన నేపథ్యంలో వారందరికీ కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించినట్లు ప్రధానమంత్రి చెప్పారు.

ఇంతటి భారీ ప్రపంచ మహమ్మారి ఉత్పాత సమయంలోనూ దేశం ఎక్కడా వెనకడుగు వేయలేదని, ముఖ్యంగా బీహార్‌ ముందడుగుకు ఎక్కడా అంతరాయం లేదని ప్రశంసించారు. మరోవైపు రూ.100 లక్షల కోట్లకుపైగా విలువైన జాతీయ మౌలిక పైప్‌లైన్‌ పథకం కూడా ఆర్థిక కార్యకలాపాలు ఇనుమడించడంలో సహాయపడుతుందని ప్రధాని అన్నారు. ఇక బీహార్‌ను,   తూర్పు భారతాన్ని కీలక ప్రగతి కేంద్రంగా రూపుదిద్దడంలో ప్రతి ఒక్కరూ వేగంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

****

 



(Release ID: 1653785) Visitor Counter : 268