ప్రధాన మంత్రి కార్యాలయం
రాణీ లక్ష్మీబాయి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల, పాలనా భవనాలను వీడియోకాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
వ్యవసాయ సంస్థలు విద్యార్ధులకు నూతన అవకాశాలను సృష్టిస్తాయి. వ్యవసాయాన్ని పరిశోధన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసేందుకు ఉపకరిస్తాయని చెప్పిన ప్రధానమంత్రి.
ఆత్మనిర్భర్ అభియాన్ ను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి.
బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 10,000 కోట్ల రూపాయల విలువగల 500 నీటి సంబంధిత ప్రాజెక్టులకు ఆమోదం, 3000 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టుల పనులు ఇప్పటికే ప్రారంభం.
Posted On:
29 AUG 2020 3:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రాణీ లక్ష్మీబాయి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల, పాలనాభవనాలను వీడియోకాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి విశ్వవిద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు.
విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి అభినందించారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి విద్య పూర్తిచేసిన అనంతరం, విద్యార్ధులు దేశ వ్యవసాయరంగానికి సాధికారత కల్పించేందుకు చురుకుగా పనిచేయాల్సిందిగా ప్రధానమంత్రి వారికి సూచించారు. కొత్త భవనాల ద్వారా లభించిన కొత్త సదుపాయాలు విద్యార్దులు మరింత కష్టపడి పనిచేసేందుకు ప్రోత్సాహం, ప్రేరణను ఇవ్వగలవని ఆయన అన్నారు.
రాణీ లక్ష్మీ బాయి “ నేను ఝాన్సీని ఇచ్చేది లేదు”, అన్న మాటలను గుర్తుచేస్తూ ప్రధానమంత్రి, ఝాన్సీ, బుందేల్‌ఖండ్ ప్రజలు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ విజయవంతానికి వ్యవసాయరంగం పాత్ర కీలకమని ప్రధానమంత్రి అన్నారు. వ్యవసాయరంగ లక్ష్యాలతో స్వావలంబన సాధించి, రైతులను ఉత్పత్తిదారుగా, ఎంటర్‌ప్రెన్యూయర్‌గా మార్చాలని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తితో వ్యవసాయ రంగానికి సంబంధించి పలు సంస్కరణలు తీసుకువచ్చినట్టు ప్రధానమంత్రి తెలిపారు. పలు ఇతర పరిశ్రమల లాగే , ప్రస్తుతం రైతులు ఏ దేశంలో నైనా, వారికి మంచి ధరలు వచ్చే చోట తమ ఉత్పత్తులను అమ్మగలుగుతున్నారని ఆయన అన్నారు. క్లస్టర్ ఆధారిత విధానంలో పరిశ్రమలకు మెరుగైన సదుపాయాలు, ప్రోత్సాహం కల్పించేందుకు లక్ష కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
వ్యవసాయరంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసేందుకు స్థిరమైన ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన శాలలు కీలక భూమిక పోషిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో మూడు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, ఆరు సంవత్సరాల క్రితం దేశంలో ఒకే ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండేదని ఆయన అన్నారు. దీనికితోడు మరో మూడు జాతీయ సంస్థలు అంటే, ఎఐఆర్ ఐ ,ఝార్ఖండ్, ఐఎఆర్ ఐ అస్సాం, బీహార్‌లోని మోతిహరిలో మహాత్మాగాంధీ సమీకృత వ్యవసాయ సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ సంస్థలు విద్యార్ధులకు నూతన అవకాశాలను కల్పించడమే కాకుండా స్థానిక రైతులకు సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజనాలను అందించేందుకు వారి సామర్ధ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయన్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇటీవల మిడతల దండు దాడికి సంబంధించిన ఉదాహరణను ప్రస్తావించారు. మిడతల వ్యాప్తిని నియంత్రించి నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేసినట్టు ఆయన తెలిపారు. ఇందుకు డజన్ల కొద్దీ కంట్రోల్ రూమ్‌లను పలు నగరాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులను ముందుగానే హెచ్చరించేందుకు తగిన ఏర్పాట్లు జరిగాయని చెప్పారు . డ్రోన్ల ద్వారా మందులు చల్లడం, మిడతల దండును నాశనం చేసేందుకు డజన్ల కొద్దీ ఆధునిక స్ప్రేలు సేకరించి రైతులకు అందజేయడం జరిగిందన్నారు.
గడచిన ఆరు సంవత్సరాలలో ప్రభుత్వం పరిశోధనలకు , వ్యవసాయ దారులకు మధ్య అనుసంధానం ఏర్పరచేందుకు కృషి చేసిందని, రైతులకు క్షేత్ర స్థాయిలో గ్రామాలలో శాస్త్రీయ సలహాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. విశ్వవిద్యాలయాలనుంచి పంట పొలాలకు విజ్ఞానం, నైపుణ్య పరిజ్ఞానం చేరేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో విశ్వవిద్యాలయాల సహకారాన్ని ఆయన కోరారు.
పాఠశాల స్థాయిలో వ్యవసాయ సంబంధిత విజ్ఞానాన్ని , దాని వాస్తవ ఉపయోగాన్ని తెలియజెప్పాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. గ్రామాలలో మాధ్యమిక పాఠశాల స్థాయిలో వ్యవసాయాన్ని ఒక బోధనాంశంగా ప్రవేశపెట్టేందుకు కృషి జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయన్నారు. అందులో ఒకటి, వ్యవసాయానికి సంబంధించిన అవగాహన విద్యార్దులలో పెంపొందుతుందని, రెండోది వారి కుటుంబ సభ్యులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్, వ్యవసాయరంగానికి సంబంధించిన తాజా సమాచారం అందించడానికి ఉపకరిస్తుందని అన్నారు. ఇది దేశంలో ఆగ్రో ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ను అభివృద్ధి చేయగలదని అన్నారు.
కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రజల సమస్యలను తగ్గించేందుకు తీసుకున్న చర్యల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కోట్లాదిమంది పేద ప్రజలకు , ఉత్తర ప్రదేశ్‌లోని గ్రామీణ కుటుంబాలకు ఉచిత రేషన్ అందించినట్టు తెలిపారు. బుందేల్ ఖండ్ లో పది లక్షల మంది పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్‌లను కరోనా మహమ్మారి సమయంలో అందించినట్టు ప్రధాని చెప్పారు. గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కింద ఇప్పటివరకు 700 కోట్లరూపాయలను ఉత్తరప్రదేశ్‌లో ఖర్చుచేసినట్టు ఆయన తెలిపారు. దీనికింద లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన చెప్పారు.
గతంలో హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఇంటికి తాగునీటి సదుపాయం కల్పించే పనులు శరవేగంతో సాగుతున్నట్టు ప్రధానమంత్రి వెల్లడించారు.ఈ ప్రాంతంలో 10,000కోట్ల రూపాయల విలువగల సుమారు 500 నీటి సంబంధిత ప్రాజెక్టులు ఆమోదం పొందినట్టు ఆయన తెలిపారు. ఇది బుందేల్ ఖండ్ లోని లక్షలాది మందికి నేరుగా ప్రయోజనం కలిగిస్తుందని ఆయన అన్నారు. బుందేల్ ఖండ్‌లో భూగర్భ జల నీటిమట్టాన్ని పెంచేందుకు ఉద్దేశించిన అటల్ భూగర్బ జల పథకం పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఝాన్సీ, మహోబా, బండా, హమీర్‌పూర్, చిత్రకూట్, లలిత్‌పూర్ అలాగే, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వందలాది గ్రామాలలొ నీటిస్థాయి పెంచేందుకు 700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో చేపడుతున్న ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
బుందేల్ ఖండ్ చుట్టూ బెత్వా, కెన్, యమునా నదులు ఉన్నప్పటికీ ఈ నదులనుంచి ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా ప్రయోజనం పొందలేక పోతున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం గట్టి కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. కెన్- బెత్వా నదీ అనుసంధానప్రాజెక్టు ఈప్రాంత ప్రజల దశను మార్చగల శక్తి కలిగినదని , ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాప్రభుత్వాలకు సహకరిస్తూ వారితో కలిసి పనిచేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. బుందేల్‌ఖండ్‌కు తగినంత నీరు లభిస్తే ఈ ప్రాంత ప్రజల జీవనం పూర్తిగా మారిపొతుందని అన్నారు. వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో చేపడుతున్న బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే, డిఫెన్సు కారిడార్‌లు వేలాది మందికి ఇక్కడ కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదం బుందేల్‌ఖండ్ నలుమూలలా వినిపించాలన్నారు. బుందేల్‌ఖండ్ ప్రాచీన గుర్తింపును మరింత పెంచేందుకు యకేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు.
***
(Release ID: 1649581)
Visitor Counter : 174
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam