PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 17 AUG 2020 6:26PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • భారత్‌లో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 57,584 మందికి వ్యాధి నయం.
 • దేశంలో 72 శాతం దాటి దూసుకెళ్లిన కోలుకునే సగటు; త్వరలో 20 లక్షలు దాటనున్న కోలుకునేవారి సంఖ్య.
 • ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసులు 6,76,900; మొత్తం కేసులలో కేవలం 25.57 శాతం.
 • రోగ నిర్ధారణ పరీక్షల్లో 3 కోట్ల స్థాయి దాటి కొత్త మైలురాయి చేరిన భారత్‌; ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు నేడు 21,769కి చేరిక.
 • దేశంలో ప్రజారోగ్య మౌలిక వసతుల నిర్మాణాత్మక పెంపుదిశగా పునఃపరిశీలనకు అవకాశం కల్పించిన మహమ్మారి: డాక్టర్‌ హర్షవర్ధన్‌
 • క్వారంటైన్‌, ఏకాంత చికిత్స కేంద్రాల కోసం దేశంలోని 16 హజ్‌ హౌజ్‌లు రాష్ట్రాలకు అప్పగింత: శ్రీ నఖ్వీ వెల్లడి.

భారత్‌లో ఒకేరోజు అత్యధికంగా 57,584 మందికి వ్యాధి నయం; 72 శాతం దాటిన కోలుకునే సగటు; త్వరలో 20 లక్షలు దాటనున్న కోలుకునేవారి సంఖ్య

దేశంలో ఒకేరోజు అత్యధికంగా 57,584 మంది కోలుకోగా ఈ ఘనత సాధించడం ద్వారా భారత్‌ కొత్త మైలురాయిని అధిగమించి కోలుకునేవారి జాతీయ సగటు 72 శాతం దాటింది. రోజురోజుకూ మరింత మందికి వ్యాధినయమై ఇళ్లకు వెళ్లుతున్నారు. అలాగే (సల్ప, ఓ మోస్తరు లక్షణాలున్న) మరికొంతమంది ఏకాంత గృహవాసంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోలుకునేవారి సంఖ్య త్వరలోనే 20 లక్షలు దాటనుంది. ఆ మేరకు ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య అంతరం మరింత విస్తరించి ఇవాళ 12,42,942కు పెరిగింది. దేశంలో ప్రస్తుత కేసులు (6,76,900) కాగా, నేటిదాకా నమోదైన మొత్తం కేసులలో ఇవి కేవలం 25.57 శాతం మాత్రమే కావడం గమనార్హం. తరుణదశలో కేసుల గుర్తింపు ఫలితంగా సకాలంలో స్వల్ప, ఓ మోస్తరు లక్షణాలున్నవారి ఏకాంతీకరణ, తీవ్ర-విషమ స్థితిలోని కేసులలో సమర్థ చికిత్స, నిర్వహణ వంటివి సాధ్యమయ్యాయి. దీంతో కోవిడ్ మరణాలు బాగా తగ్గుముఖం పడుతూ ఇవాళ జాతీయ సగటు 1.92 శాతానికి పతనమైంది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646443

రోగ నిర్ధారణ పరీక్షల్లో 3 కోట్ల స్థాయిని దాటి కొత్త మైలురాయి చేరిన భారత్‌; ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు నేడు 21,769కి చేరిక

భారత్‌ ఇవాళ 3 కోట్ల కోవిడ్‌ రోగ నిర్ధారణ పరీక్షల మైలురాయిని అధిగమించింది. ఈ మేరకు రోజువారీ 10 లక్షల పరీక్షల నిర్వహణ సంకల్పానికి చేరువయ్యే దిశగా గత 24 గంటల్లో 7,31,697 పరీక్షలు నిర్వహించింది. ఈ ఘనత సాధించడంతో ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ పరీక్షల సగటు 21,769కి పెరిగింది. తదనుగుణంగా 2020 జూలై 14 న 1.2 కోట్ల స్థాయి నుంచి 2020 ఆగస్టు 16నాటికి 3 కోట్లకు దూసుకెళ్లింది. అదే సమయంలో నిర్ధారిత రోగుల శాతం 7.5 శాతం నుంచి 8.81 శాతానికి పెరిగింది. అభివృద్ధి చెందుతున్న పరీక్షా వ్యూహం మేరకు నానాటికీ విస్తరిస్తున్న ప్రయోగశాలల నెట్‌వర్క్‌ ఇందుకు ప్రముఖంగా తోడ్పడుతోంది. ఈ మేరకు 2020 జనవరి ప్రారంభంలో పుణెలోని ఏకైక ప్రయోగశాల స్థాయినుంచి నేడు ప్రభుత్వ రంగంలో 969, ప్రైవేట్‌ రంగంలో 501 వంతున మొత్తం 1470 ప్రయోగశాలలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646456

సీఐఐ నిర్వ‌హించిన ప్రజారోగ్య సదస్సు ప్రారంభ సమావేశంలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించిన డాక్టర్ హర్షవ‌ర్ధ‌న్‌

ప్రజారోగ్యంపై సీఐఐ నిర్వహించే రెండు రోజుల సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా అధ్యక్షత వహించారు. కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నడుమ ఈ సదస్సును నిర్వహించడంపై సీఐఐకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “దేశంలో బలమైన ప్రజారోగ్య మౌలిక వసతుల నిర్మాణాత్మక పెంపుదిశగా పునఃపరిశీలనకు కోవిడ్ మహమ్మారి మనకో అవకాశమిచ్చింది” అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ సరికొత్త ఆరోగ్య ముప్పును ఎదుర్కొనడం, నయం చేయడంలో భారత్‌ అనుసరించిన విజయవంతమైన విధానాన్ని ఉదాహరించారు. ప్రభుత్వ పథకాలను విస్తృత సామాజిక ఉద్యమాలుగా మలచే మన దేశ సామర్థ్యాన్ని కొనియాడుతూ- “మొత్తం ప్రపంచంలోని పోలియో కేసులలో 60 శాతం భారత్‌లోనే నెలకొన్న కాలం నుంచి నేడు మసూచి, పోలియోలను పూర్తిగా నిర్మూలించే స్థాయికి చేరింది” అని గుర్తుచేశారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646495

సామాజిక సమస్యలపై పరిశోధనలు చేయాలి: ఐఐటీలు, ఉన్నత విద్యా సంస్థలకు ఉప రాష్ట్రపతి పిలుపు

ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు పరిశోధనలు సమాజ సంబంధితంగా, వాతావరణ మార్పుల నుంచి ఆరోగ్య సమస్యలదాకా మానవాళి ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాన్వేషణ  దిశగా సాగాలని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు నొక్కిచెప్పారు. ఢిల్లీలోని ఐఐటీ 60వ వార్షికోత్సవాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆయన ప్రారంభించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సముచిత, స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడంద్వారా పరిసర సమాజాలను ప్రభావితం చేసినప్పుడే భారతీయ సంస్థలు ప్రపంచంలోని ఉత్తమమైనవి పరిగణించబడతాయని పేర్కొన్నారు. “దేశవ్యాప్తంగాగల ఐఐటీలు కృత్రిమ మేధస్సు అభివృద్ధితోపాటు వెంటిలేటర్లు, పీపీఈలు, పరీక్ష కిట్లు, పరిశుభ్రకాలు, మరమనుషులు తదితర పరికరాలను చౌకగా అభివృద్ధి చేయడంవంటి అనేక పథకాలను చేపట్టడం ఆనంద దాయకం” అన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646473

గిరిజన ఆరోగ్యం-పోషకాహార పోర్టల్ స్వస్థియాతోపాటు జాతీయ విదేశీ పోర్టల్- జాతీయ గిరిజన ఫెలోషిప్ పోర్టల్‌కు శ్రీకారం

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇవాళ వరుసగా పలు కార్యక్రమాలను ప్రకటించింది. ఈ మేరకు ‘గిరిజన ఆరోగ్య మరియు పోషకాహార పోర్టల్ స్వస్థియా,  ఆరోగ్యం-పోషణపై ఈ-వార్తాలేఖ (ALEKH); జాతీయ విదేశీ పోర్టల్, జాతీయ గిరిజన ఫెలోషిప్ పోర్టళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ- అందరికీ ఆరోగ్య సంరక్షణ లభ్యత మన ప్రధానమంత్రికి అగ్రప్రాధాన్యంగల అంశాల్లో ఒకటి కాలక్రమేణా ప్రజారోగ్య ప్రమాణాలు మెరుగుపడినా ఈ విషయంలో గిరిజన, గిరిజనేతరుల మధ్య వ్యత్యాసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమతౌల్యం సాధించే దిశగా అంతరాన్ని పూడ్చేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది” అని ప్రకటించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646542

భారతీయులకు “మహమ్మారి విపత్తు సంరక్షణ, నిబద్ధత, విశ్వాసాల సానుకూల కాలమని నిరూపితమైంది”; ఇది ప్రపంచ మానవాళి మొత్తానికీ ఉదాహరణగా నిలిచింది: ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

భారతీయులకు ఈ మహమ్మారి కష్టకాలం...  సంరక్షణ, నిబద్ధత, విశ్వాసాల సానుకూల కాలమని నిరూపితమైందని, ఇది ప్రపంచ మానవాళి మొత్తానికీ ఒక ఉదాహరణగా నిలిచిందని కేంద్ర అల్పసంఖ్యాకవర్గాల శాఖ మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. న్యూ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ అల్పసంఖ్యాక వర్గాల ఆర్థికాభివృద్ధి సంస్థ- సీఎస్‌ఆర్ కింద అందజేసిన సంచార ఆస్పత్రిని జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల జీవనశైలి, పని సంస్కృతిలో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలు నేడు సమాజ సేవ, బాధ్యతలకు మరింత అంకితమయ్యారని శ్రీ నఖ్వీ అన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646444

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • హర్యానా: రాష్ట్రంలో వ్యవసాయాన్ని నష్ట భయరహితం చేయడంతోపాటు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా విధివిధానాల సరళీకరిస్తూ హర్యాన ప్రభుత్వం “మేరీ ఫసల్ – మేర బ్యోరా పోర్టల్”ను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో రబీ పంటల్లో ప్రతి గింజనూ ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే పారదర్శకతకు భరోసా ఇస్తూ పంటల విక్రయించగా వచ్చిన సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవల మెరుగుకు సమర్థ చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవటానికి తగిన సంఖ్యలో ప్రత్యేక ఆస్పత్రులు, ప్రయోగశాలలు, ఏకాంత వార్డులు, ప్లాస్మా బ్యాంకులు, వైద్య పరికరాల సరఫరా తదితరాలు సవ్యంగా అమర్చినట్లు తెలిపారు. దీంతో మొత్తం రోగులలో 83 శాతంకన్నా అధికంగా కోలుకున్నారని వివరించారు.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 43 కొత్త కేసులు నమోదవగా, 37మంది కోలుకున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం 888 క్రియాశీల కేసులున్నాయి.
 • అసోం: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ప్రత్యేక పథకం 'ఓరునోడోయి' అమలుకు అసోం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. దీనికింద 19 లక్షలకుపైగా పేద కుటుంబాలకు నెలకు రూ.830 వంతున ప్రత్యక్ష లబ్ధి బదిలీకింద వారి ఖాతాలకు జమ చేయనుంది. ఇందుకోసం ప్రతి శాసనసభ స్థానం నుంచి 15,000 కుటుంబాలను ఎంపిక చేస్తారు.
 • మణిపూర్: రాష్ట్రంలో 179 కొత్త కేసులు నమోదవగా వీరిలో 111 మంది సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది. ఇక మణిపూర్‌లో కోలుకునేవారి సగటు 57 శాతం కాగా, ప్రస్తుతం 1,921 క్రియాశీల కేసులున్నాయి.
 • మిజోరం: రాష్ట్రంలో నిన్న మరో 12 కేసులు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 789కి పెరిగింది. ప్రస్తుతం మిజోరంలో 418 చురుకైన కేసులున్నాయి.
 • నాగాలాండ్: రాష్ట్రంలో 15,843 మంది సామర్థ్యంగల 261 నిర్బంధవైద్య పరిశీలన కేంద్రాలు ఉన్నాయని నాగాలాండ్ ఆరోగ్య మంత్రి పంగ్న్యూ ఫోమ్ చెప్పారు. వీటిలో 206 ప్రభుత్వ కేంద్రాలు కాగా, 55 చెల్లింపు కేంద్రాలు ఉన్నాయన్నారు.
 • సిక్కిం: రాష్ట్రంలో 19 కొత్త కేసులు నమోదవగా చురుకైన కేసుల సంఖ్య 493కు చేరింది. దీంతో సిక్కింలో మొత్తం కేసుల సంఖ్య 1,167కు చేరింది. ఇప్పటిదాకా 673 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
 • కేరళ: రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు 9 మంది మరణించగా మృతుల సంఖ్య 165కి చేరింది. రాజధానిలోని సెంట్రల్ జైలులో మరో 110 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. వారితోపాటు మరో నలుగురు అధికారులకూ వ్యాధి సోకడంతో జైలులో రోగుల సంఖ్య మొత్తం 477కు చేరింది. రాజధాని శివార్లలోనూ కేసులు పెరుగుతుండగా వివిధ క్లస్టర్లలో పోలీసులుసహా 25 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నిన్న 1,530 కొత్త కేసులు నమోదవగా చికిత్స పొందే రోగుల సంఖ్య 15 వేలు దాటింది. వివిధ జిల్లాల్లో 1,62,217 మంది పరిశీలనలో ఉన్నారు.
 • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కేసుల సంఖ్య 8000 దాటింది. కాగా, చురుకైన కేసులలో ప్రస్తుతం 1,596 మంది ఆస్పత్రులలో, మరో 1,692 మంది ఇళ్లవద్ద ఏకాంత చికిత్స పొందుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల సీబీ-సీఐడీ కార్యాలయంలో ఇద్దరికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో రోగకారక నిర్మూలన కోసం కార్యాలయాన్ని మూసివేశారు. రాష్ట్రంలో నిన్న 5950 కొత్త కేసులు, 125 మరణాలు నమోదవగా  6019 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,38,055; క్రియాశీల కేసులు: 54,109; మరణాలు: 5766; డిశ్చార్జి: 2,78,270; చెన్నైలో చురుకైన కేసులు: 11,498గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19 వ్యూహ మందిరం నుంచి అందిన సమాచారం ప్రకారం- రోగ లక్షణాలున్నవారిలో 34.8 శాతం, లక్షణరహిత వ్యక్తులలో 13.4 శాతం వంతున నిర్ధారిత కేసులు నమోదవుతున్నట్లు తేలింది. కాగా, కర్ణాటకలో ఆదివారం 124 మరణాలు నమోదవగా మృతుల సంఖ్య 3,947కు చేరింది. ఇక 7,040 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2,26,966 గా ఉంది. ఆదివారం నమోదైన 7,040 కేసులలో 2,131 బెంగళూరు అర్బన్‌లో నమోదయ్యాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో చేపట్టాల్సిన ప్రామాణిక విధాన ప్రక్రియలకు ఆమోదాన్ని ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచినందున, కరోనావైరస్ కేసుల పెరుగుదలవల్ల పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతులు నిలిపివేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. కాగా, పర్యాటక ప్రాంతాలు ఆగస్టు తొలివారంలో తెరిచి ఉంటాయని జూలైలో పర్యాటక మంత్రి ప్రకటించారు. ఇక కడప జిల్లాలో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండగా ఇప్పటిదాకా 187 మంది మరణించారు. వీరిలో 72 మంది రెండువారాల వ్యవధిలోనే వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కేసుల సంఖ్య 16 వేలు దాటింది. ఇక రాష్ట్రంలో నిన్న 8012 కొత్త కేసులు, 88 మరణాలు నమోదవగా 2,01,234 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,89,829; క్రియాశీల కేసులు: 85,945; మరణాలు: 2650గా ఉన్నాయి.
 • తెలంగాణ: హైదరాబాద్‌లో వెంటిలేటర్ల తయారీలో వినూత్న ఆవిష్కరణలు సాగుతున్నాయి. దీంతో మహమ్మారి ప్రారంభంలో వాటిని దిగుమతి చేసుకోవాల్సిన స్థితి ఉండగా, నేడు ఎగుమతి చేసే స్థాయికి చేరినట్లు రాష్ట్ర ఐటీ-పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. కాగా, తెలంగాణలో గత 24 గంటల్లో 894 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 2006మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 147 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 92,255; క్రియాశీల కేసులు: 21,420; మరణాలు: 703; డిశ్చార్జి: 70,132గా ఉన్నాయి.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలోని మారుమూల జిల్లాల్లో కేసులు పెరుగుతుండటంతో రోగులకు చికిత్సకోసం మంకాపూర్ వద్ద 1,000 పడకల భారీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 5.95 లక్షల కేసులలో ఇప్పటిదాకా4.17 లక్షల మంది కోలుకోగా ప్రస్తుతం 1.58 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.
 • రాజస్థాన్: రాజస్థాన్ హైకోర్టు మూడు రోజులపాటు (బుధవారందాకా) అన్ని కార్యకలాపాలనూ నిలిపివేసింది. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతికి నిర్వహించిన పరీక్షలో ఆయనకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో తాత్కాలిక నిలిపివేత ఉత్తర్వు జారీ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 14,451 చురుకైనా కేసులున్నాయి.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఆదివారం 1,022 కొత్త కేసులు నమోదవగా 685మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 10,312గా ఉంది.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో ఆదివారం 576 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 15,621కి చేరింది. కాగా, 8 మంది మరణించడంతో మృతుల సంఖ్య 142కు పెరిగింది.

***(Release ID: 1646555) Visitor Counter : 14