PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 13 AUG 2020 6:31PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో ఇవాళ రికార్డుస్థాయిలో ఒకేరోజు 56,383 మందికి కోవిడ్‌ వ్యాధి నయం.
 • ఇప్పటిదాకా కోలుకున్నవారు సుమారు 17 లక్షలమంది; కోలుకునే సగటు 70 శాతానికిపైగా నమోదు.
 • స్థిరంగా పతనమవుతూ 1.96 శాతంగా నమోదైన మరణాల సగటు.
 • దేశంలో నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుత (6,53,622) కేసులు 27.27 శాతానికి తగ్గుదల.
 • దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/కేంద్రీయ సంస్థలకు ఇప్పటిదాకా 3.04 కోట్ల N95  మాస్కులు, 1.28 కోట్ల పీపీఈ కిట్లు ఉచితంగా పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
 • భారత్‌లో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 8.3 లక్షల రోగ నిర్ధారణ పరీక్షలు; ఇప్పటిదాకా మొత్తం 2.68 కోట్ల నమూనాల పరీక్ష

దేశంలో ఇవాళ రికార్డుస్థాయిన 56,383 మందికి వ్యాధి నయం; నేటిదాకా కోలుకున్నవారు సుమారు 17 లక్షలు; మరణాలు 1.96 శాతానికి పతనం

దేశవ్యాప్తంగా ఒకేరోజు అత్యధికంగా 56,383 మంది కోలుకోవడంతో కొత్త రికార్డు నమోదైంది. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ సుమారు 17 లక్షలకు (16,95,982) పెరిగింది. కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల నిశిత దృష్టితోపాటు సమష్టి, సంయుక్త కృషితోపాటు లక్షలాది ముందువరుస యోధుల సహకారంతో మహమ్మారిపై పోరులో భాగంగా సమర్థ త్రిముఖ నియంత్రణ వ్యూహం అమలుతోపాటు ప్రామాణిక వైద్య నిర్వహణ విధానాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో కోలుకునేవారి సగటు ఇవాళ 70.77 శాతానికి దూసుకెళ్లింది. తదనుగుణంగా మరణాల సగటు 1.96 శాతానికి పతనం మరింత తగ్గుముఖం పడుతోంది. కోవిడ్‌ సోకినవారు రికార్డుస్థాయిలో కోలుకుంటున్న నేపథ్యంలో మొత్తం నమోదైన కేసులలో ప్రస్తుత కేసులు 27.27 శాతానికి తగ్గాయి. ఆ మేరకు ప్రస్తుత (6,53,622) కేసులతో పోలిస్తే అంతరం 10 లక్షల స్థాయిని దాటింది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645489

దేశంలోని వివిధ రాష్ట్రాలకు 3 కోట్లకుపైగా N95 మాస్కులు, 1.28 కోట్లకుపైగా పీపీఈ కిట్లు, 10 కోట్ల హెచ్‌సీక్యూ మాత్రల ఉచిత పంపిణీతో కొత్త మైలురాయి దాటిన కేంద్ర ప్రభుత్వం

కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణలో రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్విరామంగా శ్రమిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారి కృషికి తోడ్పాటుగా వైద్య సామగ్రిని ఉచితంగా అందజేస్తోంది. అయితే, భారత ప్రభుత్వం సరఫరా చేసే చాలా ఉత్పత్తులు తొలినాళ్లలో దేశంలో తయారైనవి కాకపోవడం గమనార్హం. మహమ్మారి విజృంభణవల్ల ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగి విదేశీ విపణులలోనూ ఈ సామగ్రికి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW)తోపాటు జౌళి, ఔషధ మంత్రిత్వ శాఖలతోపాటు పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య  ప్రోత్సాహక విభాగం, డీఆర్‌డీవో (DRDO) సహా ఇతరత్రా సంస్థల సంయుక్త ప్రయత్నాల ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాయి. అంతేకాకుండా అత్యవసర మందుల తయారీ-సరఫరాకు సౌలభ్యం కల్పించాయి. ఫలితంగా ‘స్వయం సమృద్ధ భారతం, మేక్‌ ఇన్‌ ఇండియా’ సంకల్పం మరింత బలోపేతమై కేంద్ర సరఫరా చేస్తున్న అనేక ఉపకరణాలు దేశంలోనే తయారవుతున్నాయి. ఆ మేరకు 2020 మార్చి 11 నుంచి కేంద్ర ప్రభుత్వం 3.04 కోట్లకుపైగా N95 మాస్కులు, 1.28 కోట్లకుపైగా పీపీఈ కిట్లను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/కేంద్రీయ సంస్థలకు ఉచితంగా పంపిణీ చేసింది. వీటితోపాటు 10.83 కోట్లకుపైగా హెచ్‌సీక్యూ మాత్రలను అందజేసింది. వీటితోపాటు 22533మేక్ ఇన్ ఇండియావెంటిలేటర్లను పంపిణీ చేయడమేగాక వాటిని అమర్చేందుకు సహాయ సహకారాలు అందించిచంది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645483

భారత్‌లో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 8.3 లక్షల రోగ నిర్ధారణ పరీక్షలు; నేటివరకూ 2.68 కోట్ల నమూనాల పరీక్ష; ప్రతి 10 లక్షల జనాభాకు సగటు పరీక్షల సంఖ్య 19,453కు చేరిక

దేశంలో రోజువారీ రోగ నిర్ధారణ పరీక్షలు 8 లక్షల మైలురాయిని దాటిన నేపథ్యంలో గడచిన 24 గంటల్లో ఒకేరోజు అత్యధికంగా 8,30,391 పరీక్షలు నిర్వహించబడ్డాయి.  “పరీక్ష, అన్వేషణ, చికిత్స” పేరిట భారత అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహంతో రోజువారీ 10 లక్షల పరీక్ష నిర్వహణ లక్ష్యం చేరువవుతోంది. ఈ మేరకు ప్రతి వారం నమోదయ్యే రోజువారీ సగటు పరీక్షలు 2020 జూలై తొలివారంలో 2.3 లక్షలు కాగా, ప్రస్తుత వారంలో 6.3 లక్షలకుపైగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 8 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 2,68,45,688కి చేరింది. అలాగే ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు కూడా ఒక్కసారిగా పెరిగి 19,453కు దూసుకెళ్లింది. కాగా, 2020 జనవరినాటికి దేశంలో ఒకేఒక ప్రయోగశాల ఉండగా, ఈ నెట్‌వర్క్‌ స్థిరంగా విస్తరిస్తూ ప్రభుత్వ రంగంలో 947, ప్రైవేటు రంగంలో 486 వంతున నేడు 1433 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645581

“పారదర్శక పన్ను విధానం-నిజాయితీకి నిండు గౌరవం” వేదికను ప్రారంభించిన ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ “పారదర్శక పన్ను విధానం-నిజాయితీకి నిండు గౌరవం” వేదికను దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- దేశంలో పునాదిస్థాయి సంస్కరణలు నేడు కొత్త శిఖరాలకు చేరాయన్నారు. భారత్‌లో 21వ శతాబ్దపు పన్ను వ్యవస్థ అవసరాలు తీర్చేదిశగా “పారదర్శక పన్ను విధానం-నిజాయితీకి నిండు గౌరవం” వేదికను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా “హాజరీ నిరపేక్ష మదింపు, హాజరీ నిరపేక్ష పునరాభ్యర్థన, పన్ను చెల్లింపుదారు సేవల పత్రం” వంటివి అమలవుతాయని వివరించారు. ఇందులో ‘హాజరీ నిరపేక్ష మదింపు, పన్ను చెల్లింపుదారు సేవల పత్రం’ నేటినుంచే అమలులోకి వచ్చాయని, ‘హాజరీ నిరపేక్ష పునరాభ్యర్థన’ సదుపాయం మాత్రం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సెప్టెంబరు 25 నుంచి ప్రారంభం కాగలదని పేర్కొన్నారు. ఈ కొత్త వేదిక హాజరీ నిరపేక్షం మాత్రమేగాక పన్ను చెల్లింపుదారులలో భయాన్ని తొలగించి విశ్వాసం నింపుతుందని పేర్కొన్నారు. గడచిన ఆరేళ్లుగా ప్రభుత్వం ప్రధానంగా “బ్యాంకు ఖాతాలు లేనివారికి బ్యాంకింగ్‌ సేవలు, భద్రతలేనివారికి రక్షణ, నిధుల్లేనివారికి నిధులందించడం”పై దృష్టి కేంద్రీకరించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. నేడు ‘నిజాయితీకి నిండు గౌరవం’ ఇచ్చే వేదిక కూడా ఇలాంటి వాటిలో ఒక భాగమని తెలిపారు. జాతి నిర్మాణంలో నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారుల పాత్ర ప్రశంసనీయమైనదని ప్రధాని కొనియాడారు. అలాంటి పన్ను చెల్లింపుదారుల జీవితాలను సులభతరం చేయడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. తాజా చట్టాలు పన్ను వ్యవస్థలో చట్టపరమైన భారాన్ని తగ్గించాయని చెప్పారు. ఆ మేరకు ఇకపై హైకోర్టులో కేసు దాఖలు పరిమితిని రూ.కోటికి, సుప్రీంకోర్టులో దాఖలు పరిమితిని రూ.2 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ‘వివాదాల నుంచి  విశ్వాసం వైపు’ పథకంవంటి కార్యక్రమాలు చాలా కేసులను కోర్టు వెలుపలే పరిష్కరించుకునే వీలు కల్పించాయని చెప్పారు. ఇప్పుడు రూ.5 లక్షలదాకా వ్యక్తిగత ఆదాయంపై పన్ను లేనందున ప్రస్తుత సంస్కరణల్లో భాగంగా పన్ను శ్లాబులను హేతుబద్ధం చేసినట్లు చెప్పారు. అదే సమయంలో మిగిలిన శ్లాబులలోనూ పన్ను శాతం తగ్గిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచంలో అత్యల్ప కార్పొరేట్ పన్నుగల దేశాల్లో భారత్‌ కూడా ఒకట ఆయన అన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645578

“పారదర్శక పన్ను విధానం-నిజాయితీకి నిండు గౌరవం” ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645454

సేంద్రియ సాగు రైతుల సంఖ్యరీత్యా ప్రపంచంలో అగ్రస్థానంలో భారత్‌; సేంద్రియ సాగు విస్తీర్ణంరీత్యా 9వ స్థానం

సేంద్రియ వ్యవసాయం ప్రగతి గాథ జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మారుమోగుతోంది. కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్నవేళ ఆరోగ్యకరం, సురక్షితమైన ఆహారం కోసం డిమాండ్‌ పెరిగింది. అంతేగాక ఈ ధోరణి వేగంగా పెరుగుతోంది. అందువల్ల మన రైతులకు-వినియోగదారులకు ఉభయతారకం కాగల, పర్యావరణానికీ మేలుచేసే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన తరుణం ఇదే. ఈ నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల సంఖ్యరీత్యా భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అలాగే సేంద్రియ సాగు విస్తీర్ణం రీత్యా 9వ స్థానంలో నిలిచింది. కాగా, ప్రపంచంలో సంపూర్ణ సేంద్రియ సాగు లక్ష్యం సాధించిన రాష్ట్రంగా సిక్కిం అంతర్జాతీయ రికార్డులకెక్కిన నేపథ్యంలో త్రిపుర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు నేడు అదే బాటలో సాగుతున్నాయి. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య భారతంలో సంప్రదాయక సేంద్రియ సాగు కొనసాగుతుండగా, రసాయనాల వినియోగం అత్యల్పం. అదేవిధంగా గిరిజన, ద్వీప సరిహద్దు ప్రాంతాలు తమ సేంద్రియ సాగును కొనసాగించేలా ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహమిస్తోంది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645634

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • మహారాష్ట్ర: రాష్ట్రంలో 12,712 కొత్త కేసులు నమోదవగా, 13,804మంది కోలుకున్నారు. దీంతో ప్రస్తుత చురుకైన కేసుల సంఖ్య 1.47 లక్షలుగా ఉంది. ఇప్పటిదాకా 3.81 లక్షల మందికిపైగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అయినప్పటికీ రాష్ట్రంలో మరణాల సంఖ్య అత్యధికగా 18,650గా ఉంది. ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్-19 రుసుములపై ప్రకటనను సమీక్షించాలని ఐఎంఏ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విషమ స్థితిలోగల రోగుల చికిత్సకు మహాత్మా ఫూలే జనారోగ్య యోజన కింద నిర్దేశించినట్లుగా రోజుకు రూ.4వేలు-9వేల మధ్య చేయడం వీలుకాదని పేర్కొంది.
 • గోవా: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగానే గోవాలో కేసుల సంఖ్య అధికంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు. ఈ మేరకు ప్రతి 10 లక్షల జనాభాకు 90,000 వంతున పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా 65,000 సగటుగల ఢిల్లీని అధిగమించినట్లు తెలిపారు. ప్రస్తుతం గోవాలో 3,194 క్రియాశీల కేసులున్నాయి.
 • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్-19 రోగుల కోసం ప్రభుత్వం 1,300 కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు ఊపు లభించింది. రాజస్థాన్‌లో ప్రస్తుతం 13,630 యాక్టివ్ కేసులున్నాయి.
 • చత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌ సింగ్‌ భార్యతోపాటు మరో 438 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,498కి పెరిగింది. తాజా కేసులలో రాయ్‌పూర్ 154, రాజ్‌నందగావ్ 55, రాయ్‌గఢ్‌ 41, దుర్గ్‌ 29, బస్తర్‌ 26 వంతున నమోదయ్యాయి.
 • కేరళ: రాష్ట్రంలో ఇవాళ రెండు మరణాల నమోదుతో మొత్తం మృతుల సంఖ్య 128కి చేరింది. తిరువనంతపురంలోని సెంట్రల్ జైలులో 41మంది ఖైదీలకు కోవిడ్‌ నిర్ధారణ అయింది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో మధ్యాహ్నం వరకు 25 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, డాక్టర్ సిఫారసు లేకుండా ప్రైవేట్ ప్రయోగశాలల్లో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రంలో నియంత్రణ జోన్లను గుర్తించే బాధ్యతల నుంచి పోలీసులను తప్పించి, విపత్తు నిర్వహణ అథారిటీకి అప్పగించారు. కేరళలో నిన్న 1,212 కొత్త కేసులు నమోదవగా 880మంది కోలుకున్నారు. ప్రస్తుతం 13,045మంది చికిత్స పొందుతుండగా 1.51 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
 • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మరో ఆరుగురి మరణంతో మొత్తం మృతుల సంఖ్య 100 దాటింది. మరోవైపు 305 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6680కి పెరిగింది. కాగా, ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 2750గా ఉంది. కోవిడ్-19 భయాల నేపథ్యంలో ఈ ఏడాది వినాయక చవితి ప్రదర్శనలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. మదురైలో ఓ నెలపాటు కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గడచిన రెండువారాలుగా తాజా, క్రియాశీల, నిర్ధారిత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నిన్న 5871 కొత్త కేసులు, 119 మరణాలు నమోదవగా 5633 కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,14,520; క్రియాశీల కేసులు: 52,929; మరణాలు: 5278; డిశ్చార్జి: 2,56,313; చెన్నైలో యాక్టివ్ కేసులు: 10,953గా ఉన్నాయి.
 • కర్ణాటక: బీబీఎంపీ కోవిడ్ వార్ రూమ్ విశ్లేషించిన గణాంకాల ప్రకారం బెంగళూరు నగరంలో నిర్ధారిత కేసులు జూలైలో 24శాతం కాగా, ఆగస్టులో 18శాతానికి తగ్గింది. నగరంలో పడకలు ఖాళీగా ఉన్నా లేవని చెబుతున్న ప్రైవేట్ ఆసుపత్రులను బీబీఎంపీ హెచ్చరించింది. రాష్ట్రంలో పీయూసీ తొలి సంవత్సరం ప్రవేశాలు నేటినుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నిన్న 7883 కొత్త కేసులు నమోదవగా ఒకేరోజులో ఇది అత్యధికం. మరోవైపు 7034 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా, 113 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు: 1,96,494; క్రియాశీల కేసులు: 80,343; మరణాలు: 3510; డిశ్చార్జి: 1,12,633గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: కోవిడ్‌ నియంత్రణ దిశగా ముందు జాగ్రత్తలు చేపట్టడంపై ప్రజలకు తోడ్పడేందుకు ప్రభుత్వం ఒక సహాయకేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది టెలిమెడిసిన్, 104 కాల్ సెంటర్ వివరాలను కూడా అందిస్తుంది. కరోనా పరిస్థితుల నడుమ మొహర్రం నిర్వహణపై ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. కాగా, ఆగస్టు 20నుంచి పది రోజులదాకా అమలు కానున్న కోవిడ్-19 నిబంధనలకు భక్తులు కట్టుబడాలని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిన్న 9597 కొత్త కేసులు, 93 మరణాలు నమోదవగా 6676 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,54,146; క్రియాశీల కేసులు: 90,425; డిశ్చార్జి: 1,61,425; మరణాలు: 2296గా ఉన్నాయి.
 • తెలంగాణ: తేలికపాటి, ఓ మోస్తరు లక్షణాలున్న కోవిడ్-19 నిర్ధారిత రోగుల కోసం ఖరీదైన ‘ఫావిపిరవిర్‌’ బదులు చౌకధరలో 'ఫావిలో' పేరిట యాంటీ-వైరల్ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన జెనెరిక్ డ్రగ్ తయారీ సంస్థ ‘ఎంఎస్‌ఎన్’ గ్రూప్ గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1931 కొత్త కేసులు, 11 మరణాలు నమోదవగా 1780 మంది కోలుకున్నారు. కొత్త  కేసులలో 298 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 86,475; క్రియాశీల కేసులు: 22,736; మరణాలు: 665; డిశ్చార్జి: 63,074గా ఉన్నాయి. రాష్ట్రంలో తీవ్ర కోవిడ్‌ ముప్పుగల ప్రదేశంగా పరిగణించబడుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గింది.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 103 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 768కి చేరగా, 1659 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అరుణాచల్ ప్రదేశ్‌లో నమోదైన కొత్త కేసుల్లో లోహిత్ 37 కేసులతో అగ్రస్థానంలో ఉంది. తూర్పు కామెంగ్ 22, ఇటానగర్‌ రాజధాని ప్రాంతం 10 కేసుల వంతున తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
 • అసోం: రాష్ట్రంలో గత 24 గంటల్లో 143,109 రోగ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. దీంతో అసోంలో ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 15,73,800కు చేరింది.
 • మణిపూర్: రాష్ట్రంలో 41 కొత్త కేసులు నమోదవగా 78 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో కోలుకునేవారి సంఖ్య 56 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1739 క్రియాశీల కేసులున్నాయి.
 • మిజోరం: రాష్ట్రంలో ఇవాళ 13 మంది కోలుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందేవారి 306 కాగా, ఇప్పటిదాకా 343 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిజోరంలో పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 10,000 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్లు కొనుగోలు చేయనుంది.
 • నాగాలాండ్: రాష్ట్రంలో ముందువరుసనగల కరోనా పోరాట యోధులైన ఆరోగ్య కార్యకర్తలకు ఇబ్బందులు కలిగించవద్దని, వేధింపులు మానాలని 23 వార్డులుగల దిమాపూర్ అర్బన్ పురపాలక మండలి తన సమాఖ్య సభ్యులందరినీ కోరింది.
 • సిక్కిం: రాష్ట్రంలో ఇవాళ కేవలం 2 కొత్త కేసులు నమోదయ్యాయి. సిక్కింలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 349 కాగా, ఇప్పటిదాకా 581 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

FACT CHECK

********(Release ID: 1645637) Visitor Counter : 22