PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 11 AUG 2020 6:28PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో కోవిడ్‌ నుంచి కోలుకున్నవారు దాదాపు 16 లక్షలు; జాతీయ సగటు సుమారు 70 శాతం.
  • కేసులలో మరణాల సగటు 2 శాతానికన్నా దిగువన నమోదు.
  • దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుత (6,39,929) కేసులు కేవలం 28.21 శాతం.
  • కోవిడ్‌ మహమ్మారి పరిస్థితులపై సమీక్ష, భవిష్యత్‌ నియంత్రణ వ్యూహంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సమావేశం.

Image

దేశంలో సుమారు 16 లక్షలమంది కోవిడ్‌ పీడితులు కోలుకోగా- 70 శాతానికి చేరువైన జాతీయ సగటు; మరణాల సగటు 2 శాతంకన్నా దిగువకు పతనం

దేశంలో ఇవాళ కోవిడ్‌ వ్యాధి నయమైనవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో కోలుకునేవారి జాతీయ సగటు 70 శాతానికి చేరువైంది. ఈ మేరకు గత 24 గంటల్లో 47,446 మందికి వ్యాధి నయంకాగా మొత్తంమీద ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినవారి సంఖ్య భారీగా నమోదైంది. వీరితోపాటు చాలామంది స్వస్థత పొంది, ప్రస్తుతం ఏకాంత గృహవాస పర్యవేక్షణలో ఉండటంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 15,83,489కి చేరంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుత (6,39,929) కేసులు కేవలం 28.21 శాతంగా మాత్రమే ఉన్నాయి. వీరంతా ఇప్పుడు చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కోలుకునేవారి సంఖ్య నిరంతరం స్థిరంగా పెరుగుతున్నందున కోలుకున్న- ప్రస్తుత  రోగుల మధ్య అంతరం దాదాపు 9.5 లక్షలకు చేరింది. ఆసుపత్రులలో మెరుగైన, సమర్థ చికిత్స విధానాలతోపాటు సత్వర, సకాల తరలింపు చర్యల ఫలితంగా ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో మరణాల సగటు నిన్నటి 2 శాతానికన్నా తగ్గి ఇవాళ 1.99 శాతానికి పతనమైంది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645036

కోవిడ్ మహమ్మారి పరిస్థితులపై సమీక్ష, భవిష్యత్‌ నియంత్రణ వ్యూహంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సమావేశం

కోవిడ్ మహమ్మారి పరిస్థితులపై సమీక్ష, భవిష్యత్‌ నియంత్రణ వ్యూహంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో కర్ణాటకకు ఉప-ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించారు. కాగా, ఆయా రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ గొప్ప సహకార స్ఫూర్తి ప్రదర్శించారని, భారత బృందం ఈ మేరకు చేసిన సంయుక్త కృషి ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడిని ఆయన ప్రస్తావించారు. దేశంలోని ప్రస్తుత చురుకైన కేసులలో దాదాపు 80 శాతం ఓ పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని, ఈ రాష్ట్రాల్లో వైరస్‌ను ఓడించగలిగితే మహమ్మారిపై యుద్ధంలో దేశం యావత్తూ విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రోజువారీ పరీక్షల సంఖ్య దాదాపు 7 లక్షల స్థాయికి చేరిందని, నానాటికీ పెరుగుతున్నదని ప్రధాని గుర్తుచేశారు. దేశంలో మరణాల సగటు అత్యల్పమే కాకుండా నిరంతరం తగ్గుతున్నదని అలాగే కోలుకునేవారి సంఖ్య స్థిరంగా, గణనీయ స్థాయిలో పెరుగుతున్నందున చురుకైన కేసుల శాతం పడిపోతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించిందని, మరణాల సగటును 1 శాతంకన్నా దిగువకు తగ్గించాలన్న లక్ష్యాన్ని త్వరలో సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు. కాగా- బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షలు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహమ్మారిపై యుద్ధంలో నియంత్రణ, రోగులతో సంబంధాల అన్వేషణ, నిఘా అత్యంత ప్రభావం చూపగల ఆయుధాలని నొక్కిచెప్పారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645136

కోవిడ్ మహమ్మారి పరిస్థితులపై సమీక్ష, భవిష్యత్‌ నియంత్రణ వ్యూహంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సమావేశం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645041

మధ్యప్రదేశ్‌లో ఆరోగ్య రంగం సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

మధ్యప్రదేశ్‌లో ఆరోగ్య రంగం సమ్యలపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ నిన్న డిజిటల్‌ మాధ్యమంద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చించారు. ఈ మేరకు రాష్ట్రంలో పరిస్థితుల మెరుగుకు చేపట్టాల్సిన చర్యలపై తనకు అవసరమైన ప్రాథమిక సమాచారం తెలపాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని 2023నాటికి స్వయం సమృద్ధం చేసేదిశగా రూపొందించిన మార్గ ప్రణాళికను ఉన్నతాధికారులు డిజిటల్‌ రూపంలో ఆయనకు సమర్పించారు. అనంతరం దీనిపై డాక్టర్ హర్షవర్ధన్ విలువైన సూచనలివ్వగా వాటన్నిటినీ సంపూర్ణంగా అమలు చేస్తామని చౌహాన్ హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644971

రైల్వేశాఖ నుంచి తదుపరి ప్రకటన వెలువడేదాకా సాధారణ ప్రయాణిక, శివారు రైలు సేవల నిలిపివేత

భారత రైల్వేశాఖ ఇంతకుముందే తీసుకున్న నిర్ణయంపై ప్రకటన వెలువరించిన నేపథ్యంలో తదుపరి ప్రకటన వచ్చేదాకా సాధారణ ప్రయాణిక, శివారు రైలు సేవల నిలిపివేత కొనసాగనుంది. అయితే, ప్రస్తుతం నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లు మాత్రం కొనసాగుతాయి. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ముంబైలో పరిమిత ప్రాతిపదికన నడుస్తున్న స్థానిక రైళ్లు కూడా కొనసాగుతాయి. ఇక ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల రద్దీని నిత్యం పర్యవేక్షిస్తున్నందున అవసరాన్నిబట్టి అదనపు ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉంటుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645088

ఉప-రాష్ట్రపతి మూడేళ్ల పదవీకాలంపై ‘కనెక్టింగ్‌, కమ్యూనికేటింగ్‌, ఛేంజింగ్‌’ పేరిట రూపొందిన ‘ఈ-బుక్‌’ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్‌

ఉప-రాష్ట్రపతి మూడేళ్ల పదవీకాలంపై కనెక్టింగ్‌, కమ్యూనికేటింగ్‌, ఛేంజింగ్‌పేరిట రూపొందిన ఈ-బుక్‌ను కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్‌ ఇవాళ ఆవిష్కరించారు. ఇదే పుస్తకం ముద్రిత ప్రతిని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. ప్రజలతో మమేకం కావడంద్వారా భారతదేశ పరివర్తనకు కృషి చేయాలన్న ఆసక్తిగల యువతకు ఉప-రాష్ట్రపతి ప్రసంగాలతో కూడిన ఈ 3వ సంచిక ఒక నిధిలా ఉపయోగపడగలదని జావడేకర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. శ్రీ రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ- వక్తృత్వం ఒక కళ అని, ఆ మేరకు ఉప-రాష్ట్రపతి హృదయానుగతంగా ప్రసంగిస్తారని ప్రశంసించారు. ఆయన ప్రసంగాలు, ఆలోచనలు, భావోద్వేగాలకు ఈ పుస్తకం ఒక ప్రతిబింబమని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645060

ప్రభుత్వరంగ రక్షణ పరిశ్రమలు-ఓఎఫ్‌బీల కొత్త మౌలిక వసతుల సృష్టి, సౌకర్యాల ఉన్నతీకరణ తదితరాలను ప్రారంభించిన రక్షణశాఖ మంత్రి

స్వయం సమృద్ధ వారోత్సవంలో భాగంగా ప్రభుత్వరంగ రక్షణ పరిశ్రమలు-ఓఎఫ్‌బీల కొత్త మౌలిక వసతుల సృష్టి, సౌకర్యాల ఉన్నతీకరణ తదితరాలను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ నిన్న డిజిటల్ మాధ్యమంద్వారా ప్రారంభించారు. స్వయం సమృద్ధ భారతం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టమైన పిలుపునిచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందులో భాగమైన 5-I సూత్రం “ఆసక్తి, సమీకరణ, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు” ఆర్థిక వ్యవస్థను అధిక వృద్ధి పథంలో పరుగులు తీయిస్తాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644892

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో ‘మాడ్యులర్‌ ఆపరేషన్ థియేటర్ల’ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న పీఎఫ్‌సీ

ఉత్తరప్రదేశ్‌ సిద్ధార్థ్‌ నగర్‌లోని జిల్లా ఆస్పత్రిలో రెండు ‘మాడ్యులర్‌ ఆపరేషన్ థియేటర్ల’ నిర్మాణం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ (PFC) ఆ  జిల్లా యంత్రాంగంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద దాదాపు రూ.94 లక్షల ఆర్థిక సహాయాన్ని పీఎఫ్‌సీ అందిస్తుంది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644889

కోవిడ్‌-19 అంతరాయాలతో డిజిటల్‌ పరివర్తన అవకాశాల ఆవిర్భావాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన డీఎస్‌టీ కార్యదర్శి

భవిష్యత్తంతా సరికొత్త డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన సమ్మేళనంగా ఉంటుందని, కొత్తదనాన్ని నిరోధించడకన్నా మార్పులో భాగంకాగల అవకాశాన్ని కోవిడ్‌-19 మన దేశానికిచ్చిందని శాస్త్ర-సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ నొక్కిచెప్పారు. ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఇన్‌ కోవిడ్‌-19’ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన ప్రసంగించారు. “డిజిటల్‌ సాంకేతికతలు, యంత్రాలు దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తాయి. ప్రధాని మోదీ ‘స్వయం సమృద్ధ భారతం’ స్వప్నాన్ని సాకారం చేస్తాయి” అన్నారు. కోవిడ్‌-19కన్నా ముందే భవిష్యత్‌ మనవైపు వేగంగా వస్తున్నవేళ ఈ వైరస్‌ ప్రతి అంశాన్నీ మార్చేసిందన్నారు. ఊహకందని రీతిలో ప్రతి రంగాన్ని, అందరి జీవితాలనూ పూర్తిగా మార్చేసిందన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645057

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  •  పంజాబ్: భారత ఉత్తర మండల ప్రాంతానికి కేటాయించిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ సెంటర్‌’ను పంజాబ్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కొన్ని వారాలకిందట దీనిపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై పంజాబ్ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. వైరాలజీ రంగంలో పరిశోధనల పెంపు, భవిష్యత అవసరాల దిశగా దేశాన్ని సంసిద్ధం చేయడంలో వైరాలజీ సెంటర్ ఒక మైలురాయి కాగలదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
  • హర్యానా: రాష్ట్రంలో రక్తరసి అధ్యయనం నిర్వహణకు హర్యానా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. ఈ అంశంపై దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిన్న సమీక్షించిన సందర్భంగా మాట్లాడుతూ దీనికోసం ప్రణాళికను కూడా రూపొందించినట్లు తెలిపారు.
  • హిమాచల్ ప్రదేశ్: ప్రధాని కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన కింద దేశంలోని 8.5 కోట్లమంది రైతుల బ్యాంకు ఖాతాలకు మరో విడతగా రూ.17వేల కోట్లు విడుదల చేసినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి నిర్వహణ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.15 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు.
  • మణిపూర్: రాష్ట్రంలో కోవిడ్‌-19 సోకిన 60 ఏళ్ల వ్యక్తి ఈ ఉదయం ‘జేనిమ్స్‌’ (JNIMS)లో తుదిశ్వాస  విడిచిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో మణిపూర్‌లో మృతుల సంఖ్య 12కు చేరింది.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 623కు చేరాయి. వీటిలో 300 క్రియాశీల కేసులున్నాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, ప్రిన్సిపాళ్ల మండలి విజ్ఞప్తిమేరకు మిజోరం విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ పరీక్షలు వాయిదా వేసింది.
  • కేరళ: రాష్ట్రంలో ఐదు మరణాలు నమోదవడంతో మృతుల సంఖ్య 120కి పెరిగింది. కాగా, మళప్పురంలో ఆదివారాల్లో పూర్తి దిగ్బంధం అమలుకానుంది. రాజధాని తిరువనంతపురం జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగా, ఈ మధ్యాహ్నంవరకు 20 తాజా కేసులు నమోదయ్యాయి. వీధుల్లో జన సమ్మర్దం నిరోధం కోసం మరింత ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని మోహరించాలని రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యాన జరిగిన సమీక్ష సమావేశం నిర్ణయించింది. ఇక కోవిడ్ విధివిధానాల నడుమ ఆగస్టు 17 నుంచి దేవాస్వమ్ బోర్డు పరిధిలోని ఆలయాలలో భక్తులకు ప్రవేశం ఉంటుంది. కేరళలో నిన్న 1184 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం చికిత్సలోగల కేసుల సంఖ్య 12,737కు పెరిగింది. వివిధ జిల్లాల్లో 1.49 లక్షల మంది నిఘాలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 276 కొత్త కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 5,900కు మరణాలు 91కి పెరిగాయి. ప్రస్తుతం 2,277 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్-19పై పోరుకోసం పుదుచ్చేరి ప్రభుత్వం కేంద్రంనుంచి రూ.25 కోట్లు కోరింది. ఇక తమిళనాడులో కోలుకునేవారి సగటు 80.8 శాతంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, ఇవాళ రాష్ట్రంలో 5914 కొత్త కేసులు, 114 మరణాలు నమోదవగా 6037 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 3,02,815; క్రియాశీల కేసులు: 53,099; మరణాలు: 5041; డిశ్చార్జి: 2,44,675; చెన్నైలో యాక్టివ్ కేసులు: 11,328గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో  కోవిడ్ పరిస్థితుల నిర్వహణ గురించి కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్‌ ఇవాళ ప్రధానమంత్రికి వివరించారు. కరోనా వైరస్‌ బారినపడిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఏకాంత గృహవాసంలో ఉండటంతో ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రధానమంత్రి నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో డాక్టర్‌ సుధాకర్‌ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ- రాష్ట్రంలో రోజువారీ రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్యను 20,000 నుంచి దాదాపు 50,000 వరకు పెంచామని ప్రధానికి వివరించినట్లు తెలిపారు. ఇక ఆర్టీ-పీసీఆర్, రాపిడ్ యాంటిజెన్ పరీక్షలను ముమ్మరం చేయడంద్వారా దీన్ని 75,000కు పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. కాగా రాష్ట్రంలో నమోదైన మొత్తం 182354 కేసులలో ప్రస్తుతం 79908 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రంలో 1.14 లక్షల కోవిడ్ కేర్ సెంటర్ పడకలు, 20,000 సాధారణ పడకలు, 8,000 ఆక్సిజన్ మద్దతుగల పడకలు, 3000 ఐసీయూ పడకలు, వెంటిలేటర్లతో 1500 ఐసీయూ పడకలతో వైద్య మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. కర్ణాటకలో నిన్న 4267 కొత్త కేసులు, 114 మరణాలు నమోదవగా 5218 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల నిర్ధారణ, గుర్తింపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, తద్వారా మరణాల సగటును తగ్గించేందుకు కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి వివరించారు. ప్రధానమంత్రితో ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల పెంపునకు కేంద్రం మద్దతు కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు వెన్నెముకగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ ఇక 24గంటలూ పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా రాష్ట్రంలో నిన్న 7665 కొత్త కేసులు, 80 మరణాలు నమోదవగా 6924 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 2,35,525; క్రియాశీల కేసులు: 87,773; మరణాలు: 2116; డిశ్చార్జి: 1,45,636గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ బోధన ఆస్పత్రులలో కోవిడ్‌ రోగుల కోసం మొత్తం 17,767 పడకలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 1896 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా 1788 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 338 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 82,647; క్రియాశీల కేసులు: 22,628; మరణాలు: 645; డిశ్చార్జి కేసులు: 59,374గా ఉన్నాయి.

FACT CHECK

 

 

    • ImageImage

****



(Release ID: 1645200) Visitor Counter : 196