ప్రధాన మంత్రి కార్యాలయం
ఉన్నత విద్య సమావేశంలో ప్రధాని ప్రసంగం
Posted On:
07 AUG 2020 1:07PM by PIB Hyderabad
అందరికీ నమస్కారాలు. మంత్రి మండలిలో నా సహచరులైన శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ జీకి, శ్రీ సంజయ్ ధోత్రే జీకి, జాతీయ విద్యా విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారతదేశ ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరిరంగన్ కు ఆయన బృంద సభ్యులకు, వైస్ ఛాన్సలర్లకు, విద్యావేత్తలకు ఈ సమావేశంలో పాల్గొంటున్నవారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.
జాతీయ విద్యా విధాన నేపథ్యంలో ఈ కార్యక్రమం చాలా ప్రధానమైంది. దీని ద్వారా జాతీయ విద్యావిధానంలోని వివిధ అంశాల గురించి దేశంలోని విద్యారంగానికి వివరణాత్మకమైన సమాచారం లభిస్తుంది. జాతీయ విద్యా విధానంలోని ప్రధాన అంశాలన్నిటి గురించి వివరంగా చర్చిస్తే దానిని అమలు చేయడం సులువవుతుంది.
స్నేహితులారా! గత మూడు నాలుగు సంవత్సరాలుగా లక్షలాది మంది ప్రజలు సమగ్రమైన చర్చలు చేసిన తర్వాత, సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాత జాతీయ విద్యా విధానానికి ఆమోదం తెలపడం జరిగింది. దీని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా వివరంగా చర్చలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు, పలు సిద్ధాంతాలకు చెందిన ప్రజలు ఈ జాతీయ విద్యా విధానాన్ని సమీక్షిస్తున్నారు. వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన చర్చ. ఈ చర్చల ద్వారా దేశంలోని విద్యా వ్యవస్థ చక్కగా లబ్ధి పొందుతుంది. ఒక సంతోషకరమైన అంశం ఏమిటంటే ఏ ప్రాంతానికి చెందిన వారు కూడా దీన్ని వివక్షాపూరితంగా వుంది అని అనలేదు. దశాబ్దాల తరబడి కొనసాగిన పాత విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలని ప్రజలు కోరుకుంటూ వచ్చారో వారు కోరుకుంటున్న మార్పులు జాతీయ విద్యా విధానంలో వస్తున్నాయనడానికి ఇది ఒక సూచిక.
విద్యారంగంలో తెస్తున్న ఈ భారీ సంస్కరణల్ని ఎలా అమలు చేస్తారని కొంత మంది ప్రశ్నించడం సహజమే. ఈ జాతీయ విద్యా విధానం అమలుకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సవాలును దృష్టిలో పెట్టుకొని అవసరమైన చోట మెరుగులు దిద్దుకుంటూ దీనికోసం మనందరం కలిసి అమలు చేయాలి. జాతీయ విద్యా విధానం అమలులో మీరందరూ ప్రత్యక్షంగా భాగస్వాములై వున్నారు. కాబట్టి మీరు ప్రధానమైన పాత్రను పోషించాల్సి వుంది. ఇక రాజకీయ చిత్తశుద్ధికి సంబంధించి నేను పూర్తి స్థాయిలో నిబద్దత కలిగి వున్నాను. నా సహకారం మీకు ఎల్లప్పుడూ వుంటుంది.
స్నేహితులారా, ప్రతి దేశం తన జాతీయ విలువలు, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా తన విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేసుకుంటుంది. దేశంలోని విద్యా వ్యవస్థ వర్తమాన తరానికే కాదు భవిష్యత్ తరాలకు కూడా మంచి భవిష్యత్తును అందించాలనేది ఈ సంస్కరణల వెనక వున్న ఆలోచన. ఇదే ఆలోచనే భారతదేశ జాతీయ విద్యా విధాన రూపకల్పన వెనక కూడా వుంది. ఈ 21వ శతాబ్ద భారతదేశంలో... మనం సాధించబోతున్న నూతన భారతదేశానికి జాతీయ విద్యా విధానం పునాది వేస్తుంది. ఈ 21 వ శతాబ్ద భారతదేశ యువతకు కావలసిన విద్య, నైపుణ్యాలను అందించడంపై జాతీయ విద్యా విధానం దృష్టి పెట్టింది.
భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా చేయడంపైన ఈ విద్యా విధానం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చడంపైనా, భారతీయ పౌరులను సాధికారులను చేయడంపైనా, ప్రజలకు ఎన్ని వీలైతే అన్ని అవకాశాలు లభించేలా చేయడంపైనా ఈ విద్యావిధానం ప్రత్యేక దృష్టిపెట్టింది. భారతీయ విద్యార్థులు వారు నర్సరీలో వుండవచ్చు లేదా కళాశాలలో వుండవచ్చు వారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా చదువులు అభ్యసిస్తేనే జాతి నిర్మాణంలో వారు నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలరు.
స్నేహితులారా, చాలా సంవత్సరాలుగా మన విద్యా వ్యవస్థలో సంస్కరణలు లేవు. దాంతో విద్యార్థుల్లో నేర్చుకోవాలనే కాంక్ష, ఊహాశక్తికి ప్రోత్సాహం లభించలేదు. ప్రమాదకరమైన పోటీలో పడిపోయేలా ఇంతకాలం వారిని ప్రోత్సహించారు. వైద్యుడు కావాలని లేదా ఇంజినీరు కావాలని, లేదా న్యాయవాది కావాలనే పోటీ వుండేది. విద్యార్థుల ఇష్టం, సామర్థ్యం, డిమాండును పట్టించుకోని పోటీ మనస్తత్వాన్ని మన విద్యా వ్యవస్థనుంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. చదువులపట్ల బలమైన కాంక్ష, విద్యయొక్క తాత్వికత, విద్య ఉద్దేశ్యం లేకపోతే మన యువతలో విమర్శనాత్మక, వినూత్న ఆలోచనలు ఎలా కలుగుతాయి?
స్నేహితులారా, ఈ రోజు గురు రవీంద్రనాధ్ టాగూర్ వర్ధంతి. ఆయన ఏమనేవారంటే...ఉన్నతమైన విద్య అంటే అది కేవలం సమాచారం ఇచ్చేది మాత్రమే కాదు, మనం మన చుట్టుపక్కలగల సృష్టితో సామరస్యంతో జీవించేలా చేసేది అని ఆయన అనేవారు.
అవును నిజమే, జాతీయ విద్యా విధానం భవిష్యత్తులో చేరుకోవబోయే లక్ష్యం రవీంద్రుని సందేశం మీద ఆధారపడి రూపొందింది. దీన్ని సాధించడానికిగాను సమగ్రమైన విధానం వుండాలి. అంతే తప్ప ముక్కలు ముక్కలుగా వుండే విధానం కాదు. ఈ విషయంలో జాతీయ విద్యా విధానం విజయం సాధించింది.
స్నేహితులారా, జాతీయ విద్యా విధానం స్పష్టమైన దృఢమైన రూపాన్ని సంతరించుకుంది. దీని అమలుకు సంబంధించి ప్రారంభ దినాల్లో ఎదురయ్యే సవాళ్ల గురించి నేను మీతో చర్చించాలని అనుకుంటున్నాను. మన ముందు రెండు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. మన విద్యా విధానం మన యువతలో సృజనాత్మకత, తృష్ణను నింపి నిబద్దతగల జీవితాన్ని గడిపే స్ఫూర్తిని ఇవ్వగలదా? మీరు ఈ విద్యారంగంలో చాలా సంవత్సరాలుగా వున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసు.
స్నేహితులారా, ఇక రెండో ప్రశ్న. మన విద్యా వ్యవస్థ మన యువతకు సాధికారతను కలిగించి సాధికార సమాజాన్ని తయారు చేయడానికి సాయం చేస్తున్నదా? ఈ ప్రశ్నలు మీకు తెలుసు. వీటికి సమాధానాలు తెలుసు. స్నేహితులారా, భారతదేశ విద్యా విధానాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడే ఈ ప్రశ్నలను పరిగణలోకి తీసుకోవడం నాకు సంతృప్తినిస్తోంది.
స్నేహితులారా మారుతున్న పరిస్థితులపై నూతన దృక్పథంతో నూతన ప్రపంచ విధానం రూపుదాలుస్తోంది. నూతన ప్రపంచ ప్రమాణం కూడా సిద్ధమవుతోంది. కాబట్టి తన విద్యా వ్యవస్థలో మార్పులను ప్రవేశపెట్టడం భారతదేశానికి తప్పనిసరి అయింది. పాఠశాల విద్యా ప్రణాళికను 10+ 2 నిర్మాణంనుంచి 5+3+3+4కు మార్చడం ఈ దిశగా వేసిన అడుగు. మనం మన విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలి. అదే సమయంలో వారు తమ మూలాలను మరిచిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మూలాలనుంచి ప్రపంచస్థాయిదాకా, మనిషినుంచి మానవాళిదాకా, గతాన్నించి ఆధునికతవరకూ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ విద్యా విధాన రూపాన్ని నిర్ణయించడం జరిగింది.
స్నేహితులారా, పిల్లలు ఇంట్లో ఏ భాషలో మాట్లాడుకుంటారో అదే భాషలోనే చదువుకుంటే వారు వేగంగా నేర్చుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీలైనంతమేరకు పిల్లలు ఐదో తరగతివరకు తమ మాతృభాషలోనే చదువుకోవాలనే నిర్ణయానికి ఏకాభిప్రాయం రావడం వెనక ఇదే కారణం వుంది. ఇది పిల్లల పునాదిని బలంగా చేయడమే కాదు వారు ఉన్నత విద్యలను చదువుకునే సమయంలో ఆ ఉన్నత చదువులకు అవసరమయ్యే పునాది కూడా బలోపేతమవుతుంది.
స్నేహితులారా ఇంతకాలమున్న విద్యా విధానం ఏమి ఆలోచించాలనేదానిపైన దృష్టి పెట్టి కొనసాగింది. ఇప్పుడు రాబోతున్న నూతన విద్యా విధానం ఎలా ఆలోచించాలి అనేదానిపైన దృష్టి పెడుతుంది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజుల్లో సమాచారానికి, కంటెంట్ కు కొదవ లేదు. సమాచారం వరదలా వచ్చి పడుతోంది.మొత్తం సమాచారమంతా మొబైల్ ఫోన్లలో లభ్యమవుతోంది. అయితే ఏ సమాచారం ముఖ్యం, ఏ అవసరాలకు అనుగుణంగా చదువుకోవాలి అనేది చాలా ముఖ్యం. ఇది మనసులో పెట్టుకొని అవసరంలేని విద్యా ప్రణాళిక బరువును తగ్గించడానికి జాతీయ విద్యా విధానంలో ప్రయత్నం జరిగింది. కుతూహలంతో కూడిన, ఆవిష్కరణలు చేయగలిగే, చర్చలకు ఆధారమయ్యే, విశ్లేషణయుతమైన విధానాలను విద్యార్థులకు బోధించడమే ప్రస్తుత రోజుల్లో మనకు అవసరం. దీని వల్ల పిల్లలకు చదువులపట్ల ఇష్టం పెరుగుతుంది. తరగతి గదుల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుంది.
స్నేహితులారా, ప్రతి విద్యార్థికి తన అభిరుచికి అనుగుణంగా చదువుకునే అవకాశం లభించాలి. తన అవసరాలకు అనుగుణంగా, తన సౌలభ్యానికి అనుగుణంగా డిగ్రీగానీ మరో కోర్సుగానీ చదువుకునే వాతాతవరణం వుండాలి. అంతే కాదు తనకు ఇష్టం లేకపోతే ఆ డిగ్రీ లేదా కోర్సును మధ్యలోనే వదిలేసే స్వేచ్ఛ వుండాలి. ఒక విద్యార్థి తన చదువులు అయిపోయి ఉద్యోగం చేయడానిక వెళ్లినప్పుడు తాను చదివిన చదువుకు అక్కడి ఉద్యోగ అవసరాలకు మధ్యన పొంతన లేదనే విషయం తెలుసుకోవడం తరచుగా జరుగుతోంది. పలు కారణాలతో చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేసి ఏదో ఒక పనిలో పడుతుంటారు. అలాంటి విద్యార్థుల అవసరాలను పరిగణలోకి తీసుకొని ఒక కోర్సులోకి పలుసార్లు రావడం, పోవడమనే సదుపాయాన్ని కల్సించడం జరుగుతోంది. ఈ నిర్ణయం కారణంగా ఇప్పుడు ఒక విద్యార్థి ఒక కోర్సులో చేరి మరింత సమర్థవంతంగా చదువుకోవచ్చు. తన ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా చదువుకోవచ్చు. ఇది ఈ కొత్త విద్యావిధానంలోని మరో ముఖ్యమైన అంశం.
కాబట్టి ఇప్పుడు ఒక విద్యార్థి తాను చదువుతున్న కోర్సు అంటే ఇష్టం లేక దాన్ని వదిలేయాలనుకుంటే వదిలేసి కొత్త కోర్సులో చేరవచ్చు. దీనికోసం వారు కొంతకాలంపాటు మొదటి కోర్సుకు దూరంగా వుండి ఆ తర్వాత కొత్త కోర్సులో చేరవచ్చు. ఈ ఆలోచనలతోనే ఉన్నత విద్యలో అనేకసార్లు చేరడం, వెళ్లిపోవడం, క్రెడిట్ బ్యాంకులాంటి సదుపాయాలను కల్పించడం జరిగింది. ఒక ఉద్యోగంలో చేరి అదే ఉద్యోగంలోనే జీవితాంతం కొనసాగే రోజులు కావివి. మార్పు అనేది చాలా సహజం. దీనికోసం ఆ మనిషి నిరంతరాయంగా నూతన నైపుణ్యాలను తెలుసుకోవడం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం చేయాలి. జాతీయ విద్యా విధానంలో దీన్ని కూడా పరిణలోకి తీసుకోవడం జరిగింది.
స్నేహితులారా, ఒక జాతి అభివృద్ధిలో గౌరవ మర్యాదలనేవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సమాజంలోని ఆయా వర్గాలు సగర్వంగా నిలవడంలో కూడా అవి ముఖ్యం. సమాజంలో ఒక వ్యక్తి ఎలాంటి వృత్తినైనా చేపట్టవచ్చు. ఏ పనయినా సరే వర్తమానంలోని వృత్తులకంటే తక్కువదేమీ కాదు. ఒక పని గొప్పది మరో పని తక్కువది అనే అనారోగ్యకరమైన ఆలోచన ..సాంస్కృతికంగా ఎంతో గొప్పదైన మన దేశంలోకి ఎలా చొరబడిందో తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఒక వృత్తి పెద్ద చిన్న అనే ఆలోచన మన మెదళ్లలోకి ఎలా చొరబడింది? కార్మికుల పనిని తక్కువ చేసి చేసి ఎగతాళి చేయడం ఎందుకు జరుగుతోంది? ఇలాంటి ఆలోచనా విధానం వెనక ప్రధాన కారణం సమాజానికి దూరంగా విద్యా వ్యవస్థ వుండడమే. మీరు ఒక గ్రామాన్ని సందర్శిస్తే అక్కడ అన్నదాతలు, కూలీలు చేస్తున్న పనులను చూస్తే వారు ఈ సమాజ అభివృద్దికి ఎలా కష్టపడుతున్నారో మీకు తెలుస్తుంది. ప్రజల ఆహార అవసరాలను తీర్చి సమాజంకోసం వారు ఎలా శ్రమిస్తున్నారో తెలుస్తుంది. వారి శ్రమను గౌరవించడం మనం నేర్చుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి దశలోనే శ్రమశక్తిని గౌరవించే విధంగా మన జాతీయ విద్యా విధానంలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది.
స్నేహితులారా, 21వ శతాబ్దినుంచి ఈ ప్రపంచం చాలా ఆశిస్తోంది. ప్రపంచానికి కావాల్సిన ప్రతిభను, సాంకేతికతను అందించడానికి భారతదేశానికి సామర్థ్యం వుంది. ఈ ప్రపంచం పట్ల మనం నెరవేర్చాల్సిన బాధ్యతను దృష్టిలో పెట్టుకొని జాతీయ విద్యావిధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఉపయోగపడే సాంకేతికతలను దృష్టిలో పెట్టుకొని మన ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో జాతీయ విద్యా విధానంలో పరిష్కారాలను సూచించారు. తక్కువ వ్యయంతో, సమర్థవంతంగా, ఎంతో వేగంతో దూర ప్రాంతాల్లోని విద్యార్థులను చేరుకోవడానికిగాను సాంకేతికత మనకు ఒక మాధ్యమాన్ని ఇచ్చింది. ఈ సాంకేతికతనుంచి వీలైనంతగా లబ్ధి పొందాలి.
ఈ విద్యా విధానం ద్వారా సాంకేతికత ఆధారంగా వుండే మెరుగైన కోర్సులను, పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసుకోవడానికి కావల్సిన సహాయం లభిస్తుంది. కంప్యూటర్ రంగానికి సంబంధించిన ప్రాధమిక అంశాలు, కోడింగ్ లేదా పరిశోధనా దృక్పథంతో కార్యకలాపాలు....ఇవన్నీ విద్యావ్యవస్థను మార్చడమే కాకుండా మొత్తం సమాజ విధానాన్నే మార్చే మాధ్యమంగా పని చేస్తాయి. విర్చువల్ ల్యాబ్ అనే అంశం మెరుగైన విద్యను అందుకోవాలనే నా యువ స్నేహితుల కలల్ని సాకారం చేస్తుంది. ల్యాబ్ ప్రయోగాలు అవసరం కాబట్టి ఆ కారణంగా చదవలేకపోయినవారు ఇప్పుడు చదువుకోగలుగుతారు. మన దేశంలో పరిశోధనకు, విద్యకు మధ్యన వున్న అంతరాన్నితొలగించడంలో జాతీయ విద్యా విధానం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది.
స్నేహితులారా, విద్యాసంస్థలు, వాటిలో వున్న మౌలిక సదుపాయాల్లో విద్యా రంగ సంస్కరణలు ప్రతిఫలించినప్పుడే జాతీయ విద్యా విధానాన్ని సమర్థవంతంగా, వేగంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. ఇప్పుడు మన సమాజంలో ఎంతో అవసరమైనది ఏమిటంటే నూతన ఆవిష్కరణలు, వాటిని అమలు చేయడమనే విలువలు. ఇవి మన జాతీయ విద్యాసంస్థల్లో ప్రారంభం కావాలి. వాటి స్వయంప్రతిపత్తి అనేది మీ చేతుల్లోనే వుంది. సాధికారత కలిగిన సమాజాన్ని ఆవిష్కరించడానికిగాను విద్య ముఖ్యంగా ఉన్నత విద్య దోహదం చేయాలని మనం అనుకున్నప్పుడు దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు తగిన సాధికారత కల్పించాలి. విద్యాసంస్థలకు సాధికారత ఎలా కలిగించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు స్వయంప్రతిపత్తి అనే అంశం తలెత్తుతుంటుందనే విషయం నాకు తెలుసు. మనకు తెలుసు స్వయం ప్రతిపత్తి అనే దానిచుట్టూ పలు అభిప్రాయాలున్నాయని. దేశంలోని ప్రతి విద్యాసంస్థ... ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రమశిక్షణతో నడవాలని కొంతమంది నమ్ముతారు. కాదు కాదు స్వయంప్రతిపత్తి వుండాలని మరికొంతమంది నమ్ముతున్నారు.
మొదటి విధానంలో ప్రభుత్వేతర సంస్థల పట్ల అపనమ్మకం కనిపిస్తోంది. మరో వైపున రెండో విధానంలో స్వయంప్రతిపత్తి అనేది అంతా మేమే అనే లైసెన్స్ లాగా అయిపోతోంది. సరైన నాణ్యమైన విద్యా విధానాన్ని సాధించాలంటే అది ఈ రెండు అభిఫ్రాయాలను సమన్వయం చేసుకోవడంలో వుంది. నాణ్యమైన విద్యకోసం తపించే విద్యాసంస్థలకు స్వేచ్ఛను బహుమతిగా ఇవ్వాలి. ఆ పని చేస్తే నాణ్యత పెరగడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రగతి సాధించడానికి కారణమవుతుంది. జాతీయ విద్యా విధానం తయారు కావడానికి ముందు...ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా ...దేశంలోని విద్యాసంస్థలకు స్వయంప్రతిపత్తి ఇవ్వడానికిగాను మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మీకు తెలుసు. జాతీయ విద్యావిధానం అభివృద్ధయి అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో విద్యాసంస్థలకు స్వయంప్రతిపత్తి ఇచ్చే కార్యక్రమం మరింత వేగాన్ని పుంజుకుంటుందని నేను భావిస్తున్నాను.
స్నేహితులారా, మన మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త డాక్టర్ ఏపిజె అబ్దుల కలాం అంటుండేవారు..నైపుణ్యం, నిపుణతతో కూడిన విద్య యొక్క ఉద్దేశ్యం మనల్ని మానవత్వంతో నిండిన మనుషులుగా తయారు చేయడమే అని ఆయన అన్నారు. వికాసం పొందిన మానవులను ఉపాధ్యాయులే తయారు చేయగలరు. నిజానికి మీరందరూ ...అంటే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు... మీరే ఈ విద్యా వ్యవస్థలో మార్పును తేవడంలో కీలక పాత్ర పోషించేది. మీరు మంచి విద్యార్థులను అందించగలరు. సరైన వృత్తినైపుణ్యంగలవారిని తయారు చేయగలరు. అంతే కాదు ఈ దేశానికి మంచి పౌరులను అందించేది మీరే. విద్యారంగంతో అనుబంధం గల మీరు ఈ పనిని చేస్తారు, చేయగలరు. అందుకే ఈ జాతీయ విద్యావిధానంలో అధ్యాపకులకు తగిన గౌరవం ఇచ్చే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. అంతే కాదు భారతదేశంలోని ప్రతిభ భారతదేశంలోనే వుండిపోయి రానున్న తరాలను అభివృద్ది చేయడానికి దోహదం చేసేలా చర్యలను తీసుకోవడం జరిగింది. అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిని నిరంతరం వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా తయారుగా వుండేలా చేయడమనే అంశానికి జాతీయ విద్యా విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. ఉపాధ్యాయలు నిరంతరం నేర్చకుంటూ వుంటే వారు దేశాన్ని ముందుకు తీసుకుపోగలరు అనే విషయంపై నాకు విశ్వాసం వుంది.
స్నేహితులారా, జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలంటే మనందరం దృఢ సంకల్పంతో ఐకమత్యంతో పని చేయాలి. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాల విద్యా సంస్థలు, పలు రాష్ట్రాలు, ఈ రంగంతో సంబంధమున్న వారందరితో మరో దఫా చర్చలు ఇక్కడ మొదలవుతాయి. మీరందరూ ఉన్నత విద్యాసంస్థల్లో ఉన్నతమైన స్థానాల్లో వున్నారు కాబట్టి మీపై ఉన్నతమైన బాధ్యతలున్నాయి. జాతీయ విద్యా విధానంపై చర్చలు చేయాలని, వెబినార్లు నిర్వహించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విద్యా విధానం అమలు కోసం ఒక వ్యూహాన్ని తయారు చేయండి. ఈ వ్యూహం అమలుకోసం ఒక రోడ్డు మ్యాపు తయారు చేయండి. దానికి నిర్దిష్ట గడువు పెట్టుకోండి. వనరులను తయారు చేసుకోండి. మానవ వనరులను తయారు చేసుకోండి. తద్వారా ఈ విధానాన్ని అమలు చేయండి. నూతన విద్యా విధానం నేపథ్యంలో ఈ అంశాలన్నిటినీ ఒక చోటకు చేర్చడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోండి.
జాతీయ విద్యా విధానం అనేది కేవలం సర్క్యులర్ కాదు. ఒక సర్క్యులర్ ఇవ్వడంద్వారా, నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా జాతీయ విద్యావిధానం అమలు చేయడం జరగదు. మన ఆలోచనా విధానంలో మార్పు చేసుకొని అపరిమితమైన అంకితభావంతో పని చేస్తేనే ఇది అమలవుతుంది. భారతదేశ వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్మించాలంటే ఈ పని చాలా ముఖ్యం. దీనికి మీ వైపునుంచి ప్రధానమైన కృషి జరగాలి. ఈ సమావేశాన్ని చూస్తున్నవారు, వింటున్నవారు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలి. జాతీయ విద్యా విధానం సమర్థవంతంగా అమలవ్వడం కోసం ఈ సమావేశంద్వారా మెరుగైన సూచనలు సలహాలు, పరిష్కారాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. డాక్టర్ కస్తూరి రంగన్, ఆయన బృంద సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ సమావేశం ద్వారా నాకు అవకాశం లభించింది.
మరోసారి మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
******
(Release ID: 1644361)
Visitor Counter : 406
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam