PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 02 AUG 2020 6:29PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో ఒకేరోజు 51,255 మందికి వ్యాధి నయం; కోలుకున్నవారి సంఖ్య కొత్త రికార్డు.
  • ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య సుమారు 11.5 లక్షలు.
  • భారత్‌లో కోలుకునేవారి జాతీయ సగటు 65.44 శాతంతో మరో రికార్డు.
  • మ‌ర‌ణాలు స్థిరంగా తగ్గుతూ మరింత కనిష్ఠంగా 2.13 శాతానికి ప‌త‌నం.
  • మొత్తం కేసులలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న (5,67,730) కేసులు 32.43 శాతం మాత్రమే.
  • ‘సార్స్‌-సీవోవీ-2’కు సంబంధించి దేశవ్యాప్తంగా తొలి 1000 జన్యుక్రమాల నమోదు ప్రక్రియ విజయవంతం: డాక్టర్‌ హర్షవర్ధన్.

దేశంలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 51,255 మందికి కోవిడ్‌-19 వ్యాధి నయం; ఇప్ప‌టిదాకా కోలుకున్నవారి సంఖ్య సుమారు 11.5 లక్షలు; కోలుకునేవారి స‌గ‌టు 65.44 శాతంతో మరో రికార్డు

దేశంలో గడచిన 24 గంటల్లో మునుపెన్నడూ లేనిరీతిలో 51,000 మందికిపైగా కోలుకున్నారు. ఈ మేరకు 51,225 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లడంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 11,45,629కి దూసుకెళ్లింది. తదనుగుణంగా కోలుకునే వారి జాతీయ సగటు గరిష్ఠంగా 65.44 శాతంతో కొత్త రికార్డు నమోదుచేసింది. దీన్నిబట్టి కోలుకుంటున్న కోవిడ్‌ పీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని స్పష్టమవుతోంది. కాగా, 2020 జూన్‌ 10వ తేదీన తొలిసారిగా చికిత్స పొందే కేసులతో పోలిస్తే 1,573 అధికంగా నమోదైన కోలుకునే కేసుల సంఖ్య ఇవాళ ఏకంగా 5,77,899కి దూసుకుపోయింది. దీంతో దేశవ్యాప్తంగా చికిత్స పొందే బాధితుల సంఖ్య 5,67,730గా... అంటే 32.43 శాతంగా మాత్రమే ఉంది. వీరిలో అధికశాతం ఆస్పత్రులలో వైద్యుల పర్యవేక్షణతోపాటు మరికొందరు ఏకాంత గృహవాసంలో చికిత్స పొందుతున్నారు. మొత్తంమీద ప్రస్తుతం భారత్‌లో మరణాల సగటు కేవలం 2.13శాతం కాగా, ప్రపంచంలో అత్యల్ప మరణశాతంగల దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643049

సార్స్‌-సీవోవీ-2కు సంబంధించి దేశవ్యాప్తంగా తొలి 1000 జన్యుక్రమాల నమోదు ప్రక్రియ విజయవంతం: డాక్టర్‌ హర్షవర్ధన్

సార్స్‌-కరోనా వైరస్‌-2 (SARS-CoV-2)కు సంబంధించి దేశవ్యాప్తంగా తొలి 1000 జన్యుక్రమ విశ్లేషణ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్లు కేంద్ర శాస్త్ర-సాంకేతిక, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ, భూవిజ్ఞాన శాస్త్రాధ్యయన శాఖలమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు నిన్న కోవిడ్-19 వ్యాప్తి నిరోధం దిశగా బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), బయోటెక్నాలజీ పరిశ్రమల పరిశోధన సహాయ మండలి (బీఐఆర్‌ఏసి), డీబీటీ పరిధిలో స్వయం ప్రతిపత్తి సంస్థలు చేపట్టిన కార్యకలాపాలను ఒక సమావేశంలో ఆయన సమీక్షించారు. అలాగే కోవిడ్-19పై పరిశోధనకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 5 బయో రిపాజిటరీలను ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. వీటిని డీబీటీ రికార్డు వ్యవధిలో సాకారం చేయడం గమనార్హం. కోవిడ్-19 మహమ్మారి నుంచి ఉపశమనం కోసం బయోటెక్నాలజీ విభాగం నిర్విరామంగా పోరాడుతున్నదని ఆయన ప్రశంసించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642945

ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ హ్యాకథాన్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘స్మార్ట్ ఇండియా హాకథాన్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ- దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు వివిధ పరిష్కారాల అన్వేషణలో విద్యార్థులు ముమ్మరంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ దిశగా వారు చేస్తున్న కృషి డేటా, డిజిటలీకరణ, హైటెక్ భవిష్యత్తులాంటి అంశాలపై భారత ఆకాంక్షలను కూడా వారు చేస్తున్న కృషి వెల్లడిస్తున్నదని చెప్పారు. దేశంలో కొత్త విద్యావిధానంపై మాట్లాడుతూ- 21వ శతాబ్దపు యువత ఆలోచనలు, అవసరాలు, ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా దీనికి రూపుదిద్దామని చెప్పారు. ఇది కేవలం ఒక విధానపత్రం కాదని, 130 కోట్లకుపైగా భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపమని అభివర్ణించారు. ఈ విధానం స్థానికతపై ఒకవైపు దృష్టి సారిస్తూనే మరోవైపు అంతర్జాతీయ సమగ్రతకు ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఈ మేరకు ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలు భారత్‌లో ప్రాంగణాలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కాగా, స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 4వ సంచిక ముగింపు కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ ప్రారంభించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643045

మహమ్మారిలో క్లిష్టమైన వనరుల అంచనా, వ్యూహరచన దిశగా జెఎన్‌సీఏఎస్‌ఆర్‌ శాస్త్రవేత్తలద్వారా అనుకూల నమూనా రూపకల్పన

అంటువ్యాధి ఆరంభదశలో ఏ దేశంలోనైనా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆ మేరకు వ్యాధిబారిన పడినవారిని గుర్తించి, వేరుచేయడానికి నిర్దిష్ట, కచ్చితమైన పరీక్షలు అవసరం. అలాగే ఈ నవ్య పరీక్ష పద్ధతులను పెంచే దిశగా కొన్ని వారాలు లేదా నెలల ముందుగానే వ్యాధి సంక్రమణల సంఖ్యపై అంచనాలు రూపొందించుకోవాలి. అటుపైన దేశంలోని ప్రతి జిల్లాలో ఆరోగ్య సంరక్షణ అవసరాల జాబితా రూపకల్పనలో ఈ అంచనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఈ అంచనాల కోసం నమూనాల తయారీకి అవసరమైన సాధనాలను అనిశ్చిత పారామితుల నడుమ సమకూర్చుకోవడం ఎలా? అన్నదే ప్రశ్న. ఈ నేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR) శాస్త్రవేత్తలు కోవిడ్-19 ప్రాథమిక దశను, అనుకూల వ్యూహాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఒక నమూనాను అభివృద్ధి చేశారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643077

అగరుబత్తీల ఉత్పత్తిలో భారత్‌ స్వయంసమృద్ధమయ్యే దిశగా కొత్త పథకానికి శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదం

అగర్బత్తి ఉత్పత్తిలో భారత్‌ను స్వయం సమృద్ధం చేసేదిశగా ఖాదీ-గ్రామీణ పరిశ్రమల సంస్థ (KVIC) ప్రతిపాదించిన ఒక ప్రత్యేక ఉపాధి కల్పన కార్యక్రమానికి కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. “ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్భర్‌ మిషన్” పేరిట చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుద్యోగులు, వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తారు. తద్వారా దేశీయంగా అగర్బత్తి ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని సంకల్పించారు. ముడి అగర్బత్తి దిగుమతిపై ఆంక్షలు, వెదురు పుల్లలపై దిగుమతి సుంకం పెంపు ద్వారా ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఈ పథకం రూపొందింది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643102

రైల్వేశాఖలో 2320 మంది అధికారుల ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని తొలిసారి వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా నిర్వహించిన రైల్వేశాఖ

రైల్వేశాఖలోని వివిధ జోన్లు/డివిజన్లు/ఉత్పాదక యూనిట్లలో పనిచేస్తున్న 2320 మంది అధికారులు, సిబ్బంది 2020 జూలై 31న ఉద్యోగ విరమణ చేసిన నేపథ్యంలో రైల్వే మంత్రిత్వశాఖ తొలిసారిగా వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ-  ఇది ఆనందం-విచారం ఒకేసారి కలిగిస్తున్న రోజు. ఇదెందుకు సంతోషకరమైనదంటే- వివిధ ప్రాంతాలలో, రకరకాల హోదాలలో చాలాకాలంపాటు ఉద్యోగులంతా బాధ్యతలు నిర్వర్తించారు. వారి కర్తవ్య నిర్వహణ తీరువల్ల గడచిన కొన్నేళ్లుగా రైల్వేశాఖ సామర్థ్యం మెరుగుపడింది. ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి సమయంలో సరుకు రవాణా రైళ్లు, పార్శిల్ రైళ్లు, శ్రామిక ప్రత్యేక రైళ్లు నడిచాయి. ఆ మేరకు రైల్వేశాఖ దేశానికి విలువైన సేవలందించింది. అందుకే రైల్వే ఉద్యోగులు కరోనా యోధులకు ఎందులోనూ తీసిపోరు. ఇందుకుగాను నేను సిబ్బందిని అభినందిస్తున్నాను అని ప్రశంసించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643076

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలో కరోనా నివారణపై అవగాహన కోసం ‘మిషన్ ఫతే’కింద పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా తాజా విధానం కింద వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులతోపాటు క్షేత్రస్థాయిలో ముందువరుస కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణద్వారా కోవిడ్-19ను ఎదుర్కొనడానికి చర్యలు తీసుకుంటోంది.
  • కేరళ: రాష్ట్రంలో ఇవాళ 11 నెలల శిశువుసహా 6 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. తీరప్రాంతాలలో సమూహాల నుంచి అంటువ్యాధులు వ్యాప్తి చెందడంతో రాష్ట్ర రాజధానిలో కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయి. కాగా, గడచిన 3 రోజులలో నగరం నడిబొడ్డునగల ఒక ప్రధాన కాలనీలో 50 మందికిపైగా వ్యాధిబారిన పడ్డారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఒక డీవైఎస్పీ, మరో ఆరుగురు పోలీసులకూ రోగ నిర్ధారణ అయింది. కొళ్ల జైల్లోని 14 మంది ఖైదీలకూ వ్యాధి నిర్ధారణ అయింది. కాగా, నిన్న రాష్ట్రంలో 1,129 కొత్త కేసులు నమోదవగా వీటిలో 880 పరిచయాలవల్ల సంక్రమించినవి కాగా, 58 కేసుల మూలాలు తెలియరాలేదు. వివిధ జిల్లాల్లో 10,862 క్రియాశీల కేసులుండగా, 1.43 లక్షల మంది నిఘాలో ఉన్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముందువరుస యోధులైన వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలుసహా కోవిడ్-19 నుంచి కోలుకున్నవారిని వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని పాఠశాల విద్యాశాఖ పాఠశాలలకు సిఫారసు చేసింది. కాగా, గృహ నిర్బంధంలోగల రాష్ట్ర గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 2.5 లక్షలు కాగా, చెన్నైలో 1 లక్ష దాటాయి. శనివారం 7,010 మంది డిశ్చార్జ్ అయినప్పటికీ మరో 5,879 మంది రోగ నిర్ధారణ కాగా, 99 మంది మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 4,034కు చేరింది.
  • కర్ణాటక: బెంగళూరు నగరంలో నియంత్రణ జోన్ల సంఖ్య 20,000 దాటింది. కాగా, చిత్రదుర్గ పట్టణంలో కోవిడ్‌ బారినపడిన 110 ఏళ్ల మహిళ విజయవంతంగా కోలుకుంది. కోవిడ్-19 రోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కేసు నమోదుచేసింది. కాగా, బెంగళూరులో 1,852సహా రాష్ట్రంలో నిన్న 5172 కొత్త కేసులు, 98 మరణాలు నమోదవగా 3860మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 1,29,287; క్రియాశీల కేసులు: 73,219; మరణాలు: 2412గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై ఆందోళన పడాల్సిన అవసరంల లేదని, చికిత్సకు మౌలిక సదుపాయాలు, ఔషధాలపరంగా అన్ని సౌకర్యాలూ ఉన్నందున బాధితులందరికీ చికిత్స లభిస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 2,800 ఐసీయూ పడకలు, ఆక్సిజన్ మద్దతుగల మరో 11,353సహా 12,000 సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో 26,153 పడకలు ఖాళీగా ఉన్నట్లు ఆరోగ్య కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో నిన్న 9276 కొత్త కేసులు, 58 మరణాలు నమోదవగా 12,750 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 1,50,209; క్రియాశీల కేసులు: 72,188; మరణాలు: 1407గా ఉన్నాయి.
  • తెలంగాణ: బీమా నియంత్రణ-అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎ) హెచ్చరించినప్పటికీ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల నుంచి నగదుకోసం పట్టుబడుతూనే ఉన్నాయి. దీంతో రోగులను పీడిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కొరడా ఝళిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిద్ధమవుతోంది.  కాగా, కోవిడ్‌-19తో విషమస్థితిలోగల, ఇతర వ్యాధులతోనూ బాధపడే 5,000 మందికిపైగా రోగులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1891 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా, 1088మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 517 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 66,677; క్రియాశీల కేసులు: 18,547; మరణాలు: 540; డిశ్చార్జి: 47,590గా ఉన్నాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్ బి.డి.మిశ్రాతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ ఇవాళ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితితోపాటు అభివృద్ధి అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
  • అసోం: రాష్ట్రంలో కోవిడ్‌ మరణాలు 0.24 శాతం కాగా, కోలుకునేవారి సగటు 75 శాతంగా ఉంది. మరోవైపు ప్రతి పది లక్షల జనాభాకు నమూనాల పరీక్ష సగటు 27,544గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.
  • మణిపూర్: రాష్ట్రంలో మొత్తం కేసులు 2756కుగాను ప్రస్తుతం 1051 యాక్టివ్‌ కేసులుండగా కోలుకునేవారి సగటు 61 శాతంగా ఉంది.
  • మహారాష్ట్ర: దిగ్బంధ విముక్తి-3 మార్గదర్శకాల ప్రకారం... మహారాష్ట్రలో నాలుగున్నర నెలల విరామం తర్వాత ఆగస్టు 5 నుంచి మాల్స్‌ తెరవబోతున్నారు. కాగా, రాష్ట్రంలోని 75 పెద్ద మాల్స్‌లో సగం ఒక్క ముంబై మహానగర ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే, వీటిని ఉదయం 9 నుంచి రాత్రి 7దాకా మాత్రమే తెరవడానికి అనుమతించిన నేపథ్యంలో ప్రజాస్పందన ఆశించిన మేర ఉండబోదని భావిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో శనివారం 9,761 కొత్త కేసులు నమోదవగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.49 లక్షలకు చేరింది. మరోవైపు శనివారం 10,725మంది కోలుకోగా, మొత్తం మృతుల సంఖ్య 15,316గా ఉంది.
  • గుజరాత్: రాష్ట్రంలో శనివారం 875 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, ఇప్పటిదాకా కోలుకున్న రోగుల సంఖ్య 45,000 దాటింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 14,327గా ఉంది. గత 24 గంటల్లో నమోదైన 1,136 కొత్త కేసులలో సూరత్ (262), అహ్మదాబాద్ (146) తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం నిర్ధారణ అయిన 561 కొత్త కేసులకుగాను కోటాలో గరిష్ఠంగా (100 కేసులు) నమోదవగా, జైపూర్ (77), పాలి (58) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్‌లో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,391గా ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో శనివారం 808 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 32,614కు చేరింది. భోపాల్‌ నగరంలో గరిష్ఠంగా (156 కేసులు) నమోదవగా, జబల్పూర్ (125), ఇండోర్ (120) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక శనివారం 698 మంది కోలుకోగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,769గా ఉంది.
  • గోవా: గోవాలో హోటళ్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతించిన 25 రోజుల తర్వాత ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరుగాకా తెరవరాదని యాజమాన్యాలు నిర్ణయించాయి. వినియోగదారులను కనీస సంఖ్యలో మాత్రమే అనుమతించడం అన్న నిబంధనను “వ్యాపారం చేయడం”గా పరిగణించలేమని అధికశాతం యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అందువల్ల తదుపరి నిర్ణయం కోసం సెప్టెంబర్దాకా ఆగాలని నిశ్చయించుకున్నాయి. కాగా, గోవాలో శనివారం 280 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో  ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,705కు చేరింది.

FACTCHECK

****


(Release ID: 1643105) Visitor Counter : 338