PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 30 JUL 2020 7:00PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో 10 ల‌క్ష‌ల మైలురాయిని అధిగ‌మించిన కోలుకునేవారి సంఖ్య‌
  • వ‌రుస‌గా 7వ రోజు 30,000 మందికిపైగా పీడితులకు వ్యాధి న‌యం.
  • మొత్తం 16 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు 64.44 శాతంక‌న్నా అధికం.
  • మరణాల సగటు 24 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు 2.21 శాతంకన్నా తక్కువ.
  • పరీక్షించిన మొత్తం నమూనాలు 1.82 కోట్లు; ప్రతి పది లక్షల జనాభాకు సగటు 13,181కి చేరిక.
  • దేశంలోని 21 రాష్ట్రాల్లో నిర్ధారిత కేసులు 10 శాతంకన్నా తక్కువ.
  •  దిగ్బంధ విముక్తి 3వ దశ మార్గదర్శకాలు జారీచేసిన దేశీయాంగశాఖ; నియంత్రణ జోన్లలో 2020 ఆగస్టు 31దాకా కఠిన ఆంక్షలు; వెలుపలి ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు అనుమతి.

 

దేశంలో 10 ల‌క్ష‌ల మైలురాయిని అధిగ‌మించిన కోలుకునేవారి సంఖ్య‌; వ‌రుస‌గా 7వ రోజు 30,000 మందికిపైగా వ్యాధి న‌యం; 16 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు 64.44 శాతంక‌న్నా అధికం

దేశంలో కోవిడ్‌-19 నుంచి కోలుకున్నవారి సంఖ్య 10 లక్షల మైలురాయిని అధిగ‌మించింది. ఆ మేర‌కు రోజువారీగా వరుసగా 7వ రోజు 30,000 మందికిపైగా కోలుకున్నారు. జూలై తొలివారంలో సగటున 15,000 నుంచి గతవారంలో 35,000 స్థాయికి పెరుగుద‌ల న‌మోదైంది. గడ‌చిన 24 గంటల్లో 32,553 మంది ఆస్ప‌త్రుల నుంచి ఇళ్ల‌కు వెళ్ల‌డంతో ఇప్ప‌టిదాకా వ్యాధి న‌య‌మైన‌వారి సంఖ్య 10,20,582కు పెరిగింది. దీంతో కోలుకునేవారి జాతీయ స‌గ‌టు 64.44 శాతంగా న‌మోదైంది. త‌ద‌నుగుణంగా కోలుకున్న-యాక్టివ్ రోగుల మ‌ధ్య అంత‌రం ఇప్పుడు 4,92,340 వద్ద ఉంది. అంటే చురుకైన (నిశిత వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లోగ‌ల 5,28,242) కేసుల‌క‌న్నా కోలుకున్నవి 1.9 రెట్లు అధికంగా ఉన్నాయి. ఇక 16 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో కోలుకునేవారి శాతం జాతీయ సగటుతో పోలిస్తే అధికంగా న‌మోదైంది. అలాగే ప్రపంచంలో అతిస్వల్ప మరణశాతంగల దేశాల్లో ఒకటిగా భారత్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ మరింత తగ్గి 2.21 శాతానికి పతనమైంది. అలాగే 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటుకన్నా తక్కువ కాగా, మరో 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 1 శాతంకన్నా దిగువన నమోదవడం విశేషం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642388

దేశంలో 1.82 కోట్ల నమూనాల పరీక్ష; ప్రతి 10 లక్షల జనాభాకు ప‌రీక్షల సగటు 13,181కి పెరుగుదల; 21 రాష్ట్రాల్లో నిర్ధారిత కేసులు 10 శాతంకన్నా తక్కువ

దేశంలో గడచిన 24 గంటల్లో 4,46,642 రోగ‌ నిర్ధార‌ణ ప‌రీక్షల నిర్వహణతో ప్రస్తుతం ప్రతి పది లక్షల జనాభాకు రోజువారీ (వారం నుంచి వారం ప్రాతిపదికన) పరీక్షల సగటు జూలై తొలివారంతో పోలిస్తే 2.4 లక్షల నుంచి చివరివారానికి 4.68 లక్షల స్థాయికి పెరిగాయి. ఇక దేశంలో ప్ర‌యోగ‌శాల‌ల సంఖ్య కూడా విస్త‌రిస్తూ నేడు 1,321కి చేర‌గా ప్ర‌భుత్వ రంగంలో 907, ప్రైవేటు రంగంలో 414 వంతున సేవ‌లందిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేయడంతో దేశవ్యాప్తంగా నిర్ధారణ అవుతున్న కేసుల సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 శాతంకన్నా తక్కువగా నమోదవుతోంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642446

దిగ్బంధ విముక్తి-3 మార్గదర్శకాలు జారీచేసిన దేశీయాంగశాఖ; నియంత్రణ జోన్లలో 2020 ఆగస్టు 31దాకా కఠిన ఆంక్షలు; వెలుపలి ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు అనుమతి

దేశంలో కోవిడ్‌ దిగ్బంధ విముక్తి-3వ దశకు సంబంధించి దేశీయాంగ శాఖ (MHA) నిన్న మార్గదర్శకాలు జారీచేసింది. ఇవి 2020 ఆగస్టు 1 నుంచి అమలులోకి రానుండగా నియంత్రణ జోన్లలో ఆగస్టు 31దాకా కఠిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆ జోన్ల వెలుపల దశలవారీగా మరిన్ని కార్యకలాపాల పునఃప్రారంభానికి అనుమతినిచ్చింది. కాగా, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల‌ ప్రభుత్వాల ప్ర‌తిస్పంద‌నల నేపథ్యంలో సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలతో విస్తృత చర్చల తర్వాత దేశీయాంగ శాఖ ఈ కొత్త‌ మార్గ‌ద‌ర్శ‌కాలను రూపొందించింది. ఇందులో కొన్ని ముఖ్యమైన విధివిధానాలేమిటంటే: రాత్రివేళ వ్య‌క్తులు సంచారంపై ఆంక్ష‌ల తొలగింపు; 2020 ఆగ‌స్టు 31 వ‌ర‌కు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, కోచింగ్ కేంద్రాల మూసివేత కొనసాగింపు; సామాజిక దూరం, మాస్కులు ధ‌రించ‌డం వంటి ఇత‌ర ఆరోగ్య విధివిధానాలు పాటిస్తూ స్వాతంత్ర్య వేడుక‌ల నిర్వహణకు అనుమ‌తి; ఇందుకు సంబంధించి దేశీయాంగ శాఖ 21.07.2020న జారీచేసిన ఆదేశాల‌ను పాటించాలి. నియంత్రణ జోన్లలో 2020 ఆగ‌స్టు 31 వ‌ర‌కూ దిగ్బంధ ఆంక్షలు క‌ఠినంగా అమ‌లు; ఈ జోన్లను రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంత ప్ర‌భుత్వాలు జాగ్ర‌త్త‌గా గుర్తించడంతోపాటు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642183

కోవిడ్‌-19 రోగులకు ‘ఏఐఐఏ’లో ఉచిత నిర్ధారణ పరీక్ష-చికిత్స సౌకర్యాలు

న్యూఢిల్లీలోని అఖిలభారత ఆయుర్వేద సంస్థ (AIIA) ప్రాంగణంలోగల కోవిడ్‌-19 ఆరోగ్య కేంద్రం (CHC)లో కరోనా వైరస్‌ సోకిన రోగులకు ఉచిత పరీక్ష-చికిత్స అందించడం ప్రారంభించింది. ఈ కేంద్రంలో సంబంధిత ఏర్పాట్లను 2020 జూలై 28న శ్రీ నాయక్  సమీక్షించారు. ఈ సందర్భంగా ఇక్కడ రోగులందరికీ ఉచితంగా పరీక్ష, చికిత్స సదుపాయం కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. అదే సమయంలో వెంటిలేటర్ సౌకర్యం, ఐసీయూ సంబంధిత సకల ప్రామాణిక నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను కూడా ఆయన ప్రారంభించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642327

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సహాయసంస్థల నుంచి భాగస్వాములతో ప్రధానమంత్రి సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సహాయ సంస్థల భాగస్వాములతో భవిష్యత్‌ మార్గ ప్రణాళికపై సంభాషించారు. ఈ సందర్భంగా వృద్ధికి అండగా నిలవడంలో ద్రవ్య, బ్యాంకింగ్ వ్యవస్థల కీలకపాత్రపై లోతుగా చర్చించారు. చిన్నతరహా వ్యవస్థాపకులు, స్వయం సహాయ బృందాలు, రైతులు తదితర వర్గాలకు ప్రత్యేకించిన రుణపరపతి అవసరాలు నెరవేర్చుకుని, వారు ఎదిగే విధంగా ప్రోత్సహించాల్సి ఉంటుందని ప్రధానమంత్రి సూచించారు. బ్యాంకులు అన్ని ప్రతిపాదనలకూ ఒకే కొలబద్దను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. ఆ మేరకు అనుమతించదగిన వాటిని సవ్యంగా గుర్తించి ఆమోదయోగ్యత మేరకు ఆర్థిక సహాయం అందించేలా చూడాలి తప్ప పాత బకాయిల పేరిట ఇబ్బంది పెట్టరాదన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642250

మారిషస్‌లో సుప్రీం కోర్టు కొత్త భవనాన్ని సంయుక్తంగా ప్రారంభించిన భారత-మారిషస్‌ ప్రధానమంత్రులు

మారిషస్‌ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) కొత్త భవనాలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్‌ ప్రధాని శ్రీ ప్రవింద్‌ జుగ్నాథ్‌ ఇవాళ సంయుక్తంగా ప్రారంభించారు. ఇది మారిషస్‌ రాజధాని నగరం పోర్ట్‌ లూయీలో భారత్‌ ఆర్థిక సహాయంతో నిర్మించిన తొలి మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు కావడం గమనార్హం. ఈ మేరకు భారత ప్రభుత్వం 28.12 మిలియన్ డాలర్ల మేర పూర్తి సహాయం కింద అందజేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ- భారత్‌-మారిషస్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి ప్రజావసరాల ఆధారిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పాత్రను ప్రశంసించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642276

ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ నుంచి 1.80 లక్షల మాస్కులను కొనుగోలు చేయనున్న భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ

దేశంలో ఖాదీ మాస్కుల నాణ్యత-అందుబాటు ధర ఫలితంగా వాటికి ప్రజాదరణ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత రెడ్‌క్రాస్‌ సొసైటీ (IRCS) 1.80 లక్షల మాస్కుల సరఫరా కోసం ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (KVIC)కు ఆర్డర్‌ ఇచ్చింది. కాగా, ఐఆర్‌సీఎస్‌ ఇచ్చిన నమూనాల ఆధారంగా ఈ రెండుపొరల కాటన్‌ మాస్కులను కేవీఐసీ ప్రత్యేకంగా రూపొందించింది. వీటిపై ఎడమవైపు ఐఆర్‌సీఎస్‌ లోగో, కుడివైపు ఖాదీ ఇండియా టాగ్‌ ఉంటాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1642330

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో సామాజిక దూరం నిబంధనను అధికశాతం ఉల్లంఘిస్తున్న రద్దీ ప్రాంతాలు, ఇతర మార్కెట్లను గుర్తించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను చండీగఢ్‌ పాలన యంత్రాంగాధిపతి ఆదేశించారు. తదనుగుణంగా అటువంటి వాటిని వారాంతాల్లో మూసివేయడం, బేసి-సరి సూత్రం అమలుసహా కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టడంపై యోచించాలని సూచించారు.
  • పంజాబ్: ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాల మేరకు బస్సుల్లో కోవిడ్‌ విధివిధానాల అమలుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 186 బస్సులలో 3500 మంది ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించనివారు 96 మంది మాత్రమే ఉన్నారని తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మాస్కు ధరించని వ్యక్తులకు అధికారులు జరిమానా విధించారు. మరోవైపు అన్ని బస్ స్టాండ్లలో మాస్కులు, పరిశుభ్రకాలు, చేతి తొడుగులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని రవాణాశాఖ జారీచేసిన ఆదేశాలు అమలులో ఉన్నాయి.
  • హర్యానా: రాష్ట్రంలో రాబోయే 10 రోజుల్లో తొమ్మిది కొత్త రోగ నిర్ధారణ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని, దిగ్బంధ విముక్తి-3 సమయంలో మాస్కుల ధారణకు ప్రజలను సమాయత్తం చేయాలని, ఈ దిశగా ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ అధికారులను ఆదేశించారు. మాస్కు ధారణను కఠినంగా అమలుచేయాలని, ఉల్లంఘించినవారికి అక్కడికక్కడే జరిమానా విధించి వసూలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడంతో పరస్పర సమన్వయానికి వీలు కలిగిందని ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాకూర్ అన్నారు. ఈ  ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాదేనని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనడం కోసం రాష్ట్ర, జిల్లా అధికారులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రభుత్వం క్రమంత తప్పకుండా సమావేశాలు నిర్వహించిందని గుర్తుచేశారు. దీంతోపాటు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వాస్తవిక, సాదృశ సమావేశాలు, చర్చాగోష్ఠులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
  • కేరళ: రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు మరో 3 మరణాలు నమోదవడంతో మృతుల సంఖ్య 71కి చేరింది. కోవిడ్ రోగులకు ఇళ్లలోనే చికిత్సలో తొలిదశగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఇకపై వ్యాధి బారినపడిన ఆరోగ్య కార్యకర్తలు తమ ఇళ్లలో చికిత్స పొందవచ్చు. ఇక రాబోయే రోజుల్లో లక్షణరహిత రోగులు ఇంట్లోనే చికిత్స పొందడానికి అనుమతి ఉంటుంది. రాష్ట్రంలో నిన్న 903 కొత్త కేసులు నమోదవగా వీటిలో 739 స్థానికంగా సంక్రమించినవే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,350 మంది చికిత్స పొందుతుండగా 1.47 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ ఒకరు మరణించగా, 122 కొత్త కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసులు 3293కు, మరణాలు 48కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1292గా ఉన్నాయి. కాగా, తమిళనాడులో దిగ్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది; తదనుగుణంగా చెన్నైలో ఉదయం 6నుంచి రాత్రి 7గంటల మధ్య రెస్టారెంట్లు, టీ షాపులలో 50 శాతం సీట్లలో వినియోగదారులను అనుమతిస్తారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో చిన్న ప్రార్థనా స్థలాలలో ప్రజలు ప్ర్రార్థన చేసేందుకు అనుమతి ఉంటుంది. ఇక రెండు వారాలుగా మదురైలో నమోదైన కేసులలో సగానికిపైగా కోవిడ్-19 రోగులతో పరిచయాలవల్ల సోకినవేనని తేలింది. మదురైలో నిన్న 6426 కొత్త కేసులు, 82 మరణాలు సంభవించగా, 5927 కోలుకున్నారు. ప్రస్తుతం ఈ నగరంలో 2392 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు: 2,34,114; యాక్టివ్‌ కేసులు: 57,490; మరణాలు: 3741; చెన్నైలో యాక్టివ్ కేసులు: 12,735గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ సంక్షోభం నడుమ ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఇవాళ ప్రారంభమైంది. సుమారు 1.94 లక్షలమంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో భాగంగా కోవిడ్‌ సంరక్షణ కేంద్రాలలోని విద్యార్థులు సిఇటి రాసేందుకు ఏర్పాట్లతోపాటు పరీక్ష హాళ్లలో పర్యవేక్షకులు పీపీఈ కిట్లు ధరించడంవంటి భద్రత నిబంధనలను పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక రాష్ట్రంలో నిన్న 5503 కొత్త కేసులు, 92 మరణాలు నమోదవగా 2397మంది డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులలో బెంగళూరు నగరానికి చెందినవి 2270గా ఉన్నాయి. మొత్తం కేసులు: 1,12,504; యాక్టివ్‌: 67,448; మరణాలు: 2147గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడానికి కారణం పరీక్షలు ముమ్మరం చేయడమేనని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, రాజ్ భవన్ వద్ద విధుల్లోగల 15 మంది భద్రతా సిబ్బందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణ దిశగా రాష్ట్రంలో 26,778 వైద్య పోస్టుల (మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, సాంకేతిక నిపుణులు) భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ్టినుంచి ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా ఈ నియామక ప్రక్రియను ఆగస్టు 5లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 మరణశాతాన్ని గణనీయంగా తగ్గించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో “రెమ్‌డెసివిర్, టోలిసిజుమాబ్”వంటి యాంటీవైరల్ ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 10,093 కొత్త కేసులు, 65 మరణాలు నమోదవగా 2784 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,20,390; యాక్టివ్‌ కేసులు: 63,771; మరణాలు: 1213గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో సంచార కోవిడ్-19 పరీక్ష కేంద్రా (బస్సు)లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు అంబులెన్సులు, శిక్షణపొందిన సిబ్బంది నియంత్రణ జోన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ సమాచార పత్రం  ప్రకారం... తెలంగాణ ఆసుపత్రులలో 14,000 కోవిడ్ పడకలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 1811 కొత్త కేసులు, 13 మరణాలు నమోదవగా 821 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 521 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసులు: 60,717; యాక్టివ్‌ కేసులు: 15,640; మరణాలు: 505; డిశ్చార్జి అయినవి: 44,572గా ఉన్నాయి.
  • మణిపూర్: కోవిడ్‌-19 మహమ్మారిపై రాష్ట్ర ప్రతిస్పందనపై బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ శాసనసభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్. అధ్యక్షత వహించారు. కాగా, మణిపూర్‌లో రిమ్స్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు రెసిడెంట్ వైద్యులకు కోవిడ్‌ నిర్ధారణ కాగా, ఇప్పటిదాకా ఈ ఆస్ప్రతిలో వైరస్‌ బారినపడినవారి సంఖ్య 22కు చేరింది.
  • నాగాలాండ్: రాష్ట్రంలో ఇవాళ నిర్ధారణ అయిన 48 కొత్త కేసులకుగాను దిమాపూర్‌లో అత్యధికంగా 32, కోహిమాలో 16 వంతున నమోదయ్యాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్ కేసులు 4 లక్షలస్థాయిని దాటాయి. తాజాగా 9,211 కొత్త కేసులతో మొత్తం కేసులు 4,00,651కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,46,129కాగా, ఇవాళ మహారాష్ట్రలో 7,478మంది కోలుకోవడంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,39,755కు చేరింది. ఇక రాష్ట్రంలో 298 మరణాలు కూడా నమోదవగా మొత్తం మృతుల సంఖ్య 14,463కు పెరిగింది. రాష్ట్రంలోని పుణె, సాంగ్లి, నాసిక్, కొల్హాపూర్ తదితర నగరాలు, పట్టణాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31వరకూ దిగ్బంధాన్ని పొడిగించింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళ్ల కర్ఫ్యూ కొనసాగుతుంది.
  • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,144 కొత్త కేసులు, 24 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 59,126కు, మృతుల సంఖ్య 2,396కు చేరుకున్నాయి. గుజరాత్‌లో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 13,535గా ఉంది. కాగా, వివిధ మతాలకు సంబంధించిన పండుగల వేడుకలను స్వచ్ఛందంగా మానుకోవాలని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పరిస్థితుల కొనసాగితే నవరాత్రి వేడుకలు కూడా రద్దవుతాయని ప్రకటించారు. ఇక మాస్కు ధరించకపోతే విధించే జరిమానా మొత్తాన్ని ప్రభుత్వం రూ.200 నుంచి రూ.500కు పెంచింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం 365 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో గరిష్ఠంగా 108 కోటా జిల్లాకు చెందినవి కాగా- అజ్మీర్ (50), అల్వార్ (48) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీంతో రాజస్థాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 40,145కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 10,817 కాగా, ఇప్పటివరకూ 654 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని మూడు ప్రధాన నగరాలు... ఇండోర్, భోపాల్, ఉజ్జయినిలలో సీరో నిఘా అధ్యయనం చేపట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. భోపాల్‌లోగల ఎయిమ్స్ పర్యవేక్షణలో ఈ సర్వే సాగనుంది. ఉజ్జయినిలో మరణాలు అత్యధికంగా ఉన్నందున ఈ నగరం నుంచే అధ్యయనం మొదలవుతుంది. కాగా, రాష్ట్రంలో బుధవారం 917 కొత్త కేసులు నమోదయ్యాయి.

ImageImage

****



(Release ID: 1642458) Visitor Counter : 186