పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

‘ప్రపంచ పులుల దినోత్సవం’ సందర్భంగా పులుల గణనపై సమగ్ర నివేదికను ఆవిష్కరించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి

పులుల సంరక్షణలో నేడు భారత్‌దే అగ్రస్థానం; పులులు అధికంగాగల దేశాలతో ఉత్తమాచరణ పద్ధతులు పంచుకుంటాం: శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌

అటవీ ప్రాంతంలో పశుగ్రాసం-నీటి లభ్యత పెంపుదల దిశగా తొలిసారి ‘లైడార్‌’ సాంకేతిక పరిజ్ఞానంతో అధ్యయనం: పర్యావరణ మంత్రి

Posted On: 28 JUL 2020 1:38PM by PIB Hyderabad

“పులి ప్రకృతిలో ఒక అద్భుత అంతర్భాగం... భారతదేశంలో పులుల సంఖ్య ప్రకృతి సమతౌల్యాన్ని ప్రతిబింబిస్తుంది” అని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్‌ అన్నారు. ఇవాళ ‘ప్రపంచ పులుల దినోత్సవం’ నేపథ్యంలో పులుల గణనకు సంబంధించిన సమగ్ర నివేదికను న్యూఢిల్లీలో ఆయన ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా శ్రీ జావడేకర్ మాట్లాడుతూ- పులులు, ఇతర వన్యప్రాణులు అంతర్జాతీయ వేదికపై భారత్‌ సగర్వంగా ప్రదర్శించదగిన ఒక రకమైన ‘మృదు సామర్థ్యం’ అన్నారు. భౌగోళికంగా భూ భూగం తక్కువ కావడంవంటి అవరోధాలెన్నో ఉన్నప్పటికీ మన దేశంలో జీవ వైవిధ్యం 8 శాతంగా ఉందని మంత్రి చెప్పారు. ప్రకృతి పరిరక్షణ, అందులో భాగంగా చెట్లు, వన్యప్రాణుల సంరక్షణ భారతీయ సంస్కృతిలో భాగం కావడమే ఇందుకు కారణమని వివరించారు. వన్యప్రాణులు మన సహజ సంపద అని, ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం భారతదేశంలో ఉండటం ప్రశంసార్హమైన అంశమని శ్రీ ప్రకాష్ పేర్కొన్నారు. పులుల జాతిని పెంచి పోషించడం కోసం పులులు అధికంగాగల మొత్తం 13 దేశాలతో సంయుక్తంగా భారత్ నిర్విరామ కృషి చేస్తున్నదని మంత్రి గుర్తు చేశారు.

   జంతు మరణాలకు దారితీస్తున్న మానవ-జంతు సంఘర్షణ సవాలును పరిష్కరించే దిశగా జంతువులకు అడవిలోనే ఆహారం, నీరు లభ్యమయ్యే విధంగా ఒక కార్యక్రమం చేపట్టినట్లు శ్రీ జావడేకర్‌ ప్రకటించారు. ఈ మేరకు తొలిసారిగా ‘లైడార్‌’ (LIDAR) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో అధ్యయనం చేపడుతున్నట్లు తెలిపారు. ‘నిర్దిష్ట లక్ష్యాన్ని లేజర్ కాంతితో ప్రకాశింపజేసి, ఆ కాంతి ప్రతిఫలనాన్ని సెన్సర్లతో కొలవడం ద్వారా దూరాలను లెక్కించే’ ప్రక్రియనే లైడార్‌ అంటారని ఆయన వివరించారు.

శిలాతోరణంలో ‘నడిమిరాయి’ వంటి పులుల కీలక స్వభావాన్ని ప్రస్ఫుటం చేస్తూ అడవి పిల్లుల ఉనికికి సంబంధించిన పోస్టర్‌ను కూడా పర్యావరణ శాఖ మంత్రి ఆవిష్కరించారు. మన దేశంలోని పులుల జనాభాలో 30 శాతం వాటికోసం ప్రత్యేకించిన ‘పులుల సంరక్షణ ప్రాంతాల’ వెలుపల ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అభివృద్ధి చేసిన ‘సుస్థిర సంరక్షణ హామీగల/పులుల ప్రమాణాల’ (CA|TS) చట్రం తోడ్పాటుతో నిర్వహణ చర్యల అంచనా దిశగా భారత్‌ ముందడుగు వేసిందని తెలిపారు. ఇందులో భాగంగా దీన్ని దేశంలోని 50 పులుల సంరక్షణ కేంద్రాలకు విస్తరింపజేస్తామని ప్రకటించారు.

 

ఈ సందర్భంగా పర్యావరణ శాఖ సహాయమంత్రి శ్రీ బాబుల్ సుప్రియో మాట్లాడుతూ- దేశంలో మానవ-జంతు సంఘర్షణను తప్పించవచ్చుగానీ, పూర్తిగా నివారించడం సాధ్యంకాదన్నారు. దేశంలో పులుల సంఖ్యను పెంచడంలో ముందువరుసలోని వివిధ విభాగాల అధికారులు ప్రశంసనీయ కృషి చేశారని కొనియాడారు.

నాలుగో అఖిలభారత పులుల సంఖ్య అంచనాపై సమగ్ర నివేదిక దిగువన పేర్కొన్న అంశాలరీత్యా విశిష్టమైనది:

  • ఇప్పటిదాకా అధీనతకు మాత్రమే పరిమితం చేయబడిన సహ-మాంసాహారుల సమృద్ధి సూచిక ప్రస్తుతం ఇతర జంతుజాతులకూ విస్తరించబడింది.
  • అన్ని కెమెరా బంధన ప్రదేశాల్లో పులుల లింగనిష్పత్తి తొలిసారి నమోదు చేయబడింది.
  • పులుల జనాభాపై మానవ కార్యకలాపాల ప్రభావం సమగ్రంగా వివరించబడింది.
  • పులుల సంరక్షణ కేంద్రాల్లో పరిధిలోని ప్రాంతాల్లో పులుల సమృద్ధి తొలిసారి ప్రస్ఫుటం చేయబడింది.

   రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పులులు అధికంగాగల శాల ప్రభుత్వాధినేతలు 2022 నాటికి తమ భౌగోళిక పరిధిలో పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. తదనుగుణంగా పులుల సంరక్షణపై ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ‘సెయింట్ పీటర్స్‌బర్గ్ తీర్మానం’పై సంతకాలు చేశారు. అంతేకాకుండా జూలై 29ని ‘ప్రపంచ పులుల దినోత్సవం’గా నిర్వహించుకోవాలని కూడా నిర్ణయించారు. అప్పటినుంచీ పులుల సంరక్షణపై అవగాహన సృష్టికి, విస్తరణ లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రపంచ పులుల దినోత్సవం-2019’ సందర్భంగా తీర్మాన నిర్దేశం మేరకు దృఢ సంకల్పంతో కృషిచేసిన ఫలితంగా గడువుకు నాలుగేళ్లముందే భారతదేశం పులుల సంఖ్యను రెట్టింపు చేసిందని ప్రధానమంత్రి సగర్వంగా చాటారు. తదనుగుణంగా భారత్‌లో ప్రస్తుతం పులుల సంఖ్య 2,967 కాగా, ఇది ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం కావడం గమనార్హం. దీంతోపాటు వన్యప్రాణులపై అతిపెద్ద కెమెరా బంధన అధ్యయనం నిర్వహించిన దేశంగా గిన్నెస్‌ ప్రపంచ రికార్డులో స్థానంద్వారా భారత కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది.

   దేశవ్యాప్తంగా పులుల ప్రాదేశిక అధీనత, వాటి జాతి సాంద్రతరీత్యా పులుల స్థితిగతులను ఇవాళ విడుదల చేసిన అధ్యయన నివేదిక సమగ్రంగా అంచనా వేసింది. “భారతదేశంలో పులుల స్థితిగతులు” పేరిట ప్రధానమంత్రి 2019 జూలైలో ఆవిష్కరించిన సారాంశ నివేదికలోని అంశాలతోపాటు మూడు అధ్యయనాల (2006, 2010, 2014) సమాచారాన్ని, 2018-19 నాటి అధ్యయన సమాచారంతో తాజా సమగ్ర నివేదిక సరిపోల్చి చూసింది. అప్పట్లో దేశవ్యాప్తంగా, నిర్దిష్ట భూ ప్రదేశాల్లో, అక్కడక్కడి ఆవాసాల్లో పులుల జనాభా ధోరణిని, అవి అంతరిస్తున్న తీరుతోపాటు 100 కిలోమీటర్ల స్వల్ప ప్రాదేశిక పరిమితిలో మార్పులకు దారితీసిన కారణాలు, పులుల స్థితిగతులపై అంచనా లక్ష్యంగా 2018-19నాటి అధ్యయనం దృష్టి కేంద్రీకరించింది. కాగా, తాజా నివేదిక ప్రధాన పులుల జనాభాను అనుసంధానించే ఆవాస ప్రాంతాల స్థితిని అంచనా వేస్తుంది. అంతేకాకుండా హానికారక, పరిరక్షణపై శ్రద్ధ చూపాల్సిన ప్రాంతాలను ప్రముఖంగా చూపుతుంది. ఈ నివేదిక ప్రధాన మాంసాహార వన్యప్రాణులతోపాటు గిట్టలుగల జంతువులకు సంబంధించిన విస్తృతి, సాపేక్ష సమృద్ధిపై  సమాచారం అందిస్తుంది.

వివరణాత్మక నివేదిక కోసం ఇక్కడ క్లిక్ చేయండి

***



(Release ID: 1641825) Visitor Counter : 404