ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల కోసం పి.ఎం.జి.కె.పి. కింద ప్రకటించిన బీమా పథకం అమలును సమీక్షించిన - ఆర్థిక మంత్రి;

త్వరితగతిన పరిష్కారం మరియు ప్రయోజనం త్వరగా నామినీలకు చేరవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన - ఆర్ధిక మంత్రి.

Posted On: 13 JUL 2020 6:54PM by PIB Hyderabad

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పి.ఎమ్.జి.కే.పి) కింద ప్రకటించిన కోవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తల భీమా పథకం అమలును సమీక్షించడానికి ఈ రోజు ఇక్కడ నిర్వహించిన సమావేశానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షత వహించారు.  ఈ సమావేశంలో ఆర్థిక సేవల విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ‌కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్  ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం మరియు ఈ రోజు వరకు దాని అమలు స్థితి గురించి వివరాలను అందించారు.

బీమా క్లైములను వేగంగా పరిష్కరించడానికి రాష్ట్ర నోడల్ అధికారులతో అనుసరిస్తున్న విధానం గురించి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు.  మరణించిన వారి కుటుంబ వివరాలు సేకరించే సమయంలోనూ, చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రాన్ని పొందే సమయంలోనూ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా పేర్కొన్నారు. 

ఈ రోజు వరకు అందుకున్న 147 సమాచార పత్రాలలో, 87 కోసం క్లెయిమ్ పత్రాలు సమర్పించబడ్డాయి, వాటిలో 15 చెల్లించబడ్డాయి, 4 చెల్లింపు కోసం ఆమోదించబడ్డాయి, 13 పరీక్షలో ఉన్నాయి.  ఇంకా, మొత్తం 55 క్లైములు అనర్హమైనవిగా గుర్తించబడ్డాయి, వాటిలో 35 దావాలు బీమా పరిధికి వెలుపల వస్తాయి. వీటిలో, పోలీసు సిబ్బంది, ఆసుపత్రులతో సంబంధంలేని మునిసిపల్ కార్మికులు, విద్య, రెవిన్యూ మొదలైన శాఖలకు చెందినవారి క్లైములు ఉన్నాయి. కాగా, మరో 20 క్లైములలో మృతికి కారణం కోవిడ్-19 కు బదులు గుండెపోటు తదితర కారణాలు ఉన్నాయి.    

సమావేశంలో, ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, క్లైములు త్వరగా పరిష్కరించవలసిన ప్రాముఖ్యతను ఎత్తి చూపారు మరియు నామినీలకు త్వరగా ప్రయోజనం చేరవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

 

*****



(Release ID: 1638454) Visitor Counter : 215