ప్రధాన మంత్రి కార్యాలయం

వాణిజ్యపరంగా గనుల తవ్వకం కోసం బొగ్గు గనుల సాదృశ వేలం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 18 JUN 2020 1:15PM by PIB Hyderabad

నమస్కారం!

   దేశవిదేశాల నుంచి ఇందులో పాల్గొంటున్న అందరికీ సాదర స్వాగతం. ప్రస్తుత కఠిన పరీక్ష సమయాన ఇలాంటి కార్యక్రమ నిర్వహణ, అందులో మీరంతా భాగస్వాములు కావడం ఓ కొత్త ఆశను కల్పించేది మాత్రమేగాక ఒక ముఖ్యమైన సందేశమిచ్చే సందర్భం. భారతదేశం కరోనా వైరస్‌తో యుద్ధం చేయడమే కాకుండా ఇందులో విజయం సాధించి ముందడుగు వేయగలదు. ఈ సంక్షోభాన్ని భారత్‌ ఎంతమాత్రం చేతులు కట్టుకు చూస్తూ కూర్చోదు. అదెంతటి సవాలు అయినప్పటికీ భారత్‌ దాన్నో అవకాశంగా మలుచుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉంది. ఆ మేరకు ‘స్వయం సమృద్ధం’... అంటే స్వావలంబన సాధించాలన్న పాఠాన్ని ఈ కరోనా వైరస్‌ భారతదేశానికి నేర్పింది! స్వయం సమృద్ధ భారతమంటే- దిగుమతుల పరాధీనతను తగ్గించుకోవడం... స్వయం సమృద్ధ భారతమంటే- దిగుమతులపై వెచ్చించే వేలాది, కోట్లాది రూపాయల విలువైన విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవడం... స్వయం సమృద్ధ భారతమంటే- భారత్‌ దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా నిరంతరం దేశీయ వనరులను అభివృద్ధి చేసుకోవడం... స్వయం సమృద్ధ భారతమంటే- ఇప్పడు మేం దిగుమంతు చేసుకుంటున్న వస్తుసామగ్రినే భారీస్థాయిలో విదేశాలకు పంపే ఎగుమతిదారుగా ఎదగడం!

మిత్రులారా!

   లక్ష్యాన్ని సాధించడానికి మనం ప్రతి రంగాన్నీ, ప్రతి ఉత్పత్తినీ, ప్రతి సేవనూ మనం మన చేతిలోకి తీసుకుని ఆయా రంగాల్లో భారత్‌ స్వయం సమృద్ధమయ్యే విధంగా సంపూర్ణ కృషి ప్రారంభించాలి. ఈ ఆలోచనా విధానంతో లక్ష్యం దిశగా ముందడుగుకు ఇవాళ్టి కార్యక్రమం ఒక ఉదాహరణ. నేడు ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేసేదిశగా గొప్ప ముందడుగు వేశాం. ఈ మేరకు ప్రస్తుత కార్యక్రమం ఒక్క రంగంలో... అంటే- బొగ్గు తవ్వకంలో సంస్కరణల అమలును చాటేది మాత్రమే కాదు... 130 కోట్లమంది ఆకాంక్షలను ప్రతిబింబించే కార్యక్రమమిది. యువతకు లక్షలాది ఉద్యోగాలను సృష్టించేందుకు శ్రీకారం చుట్టే కార్యక్రమమిది.

మిత్రులారా!

   స్వావలంబన స్వప్న సాకారం దిశగా గతనెలలో స్వయం సమృద్ధ భారతం కార్యక్రమం గురించి ప్రకటించినప్పుడు ఇదో సాదాసీదా ప్రభుత్వ ప్రకటనగా చాలామంది భావించారు. కానీ, ప్రకటన వెలువడిన నెల రోజుల్లోగా- వ్యవసాయం కావచ్చు... సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమ (MSME) కావచ్చు లేదా ప్రస్తుత బొగ్గు-గనుల తవ్వకపు రంగం కావచ్చు... క్షేత్రస్తాయిలో ప్రతి సంస్కరణ అమలు చేయబడుతోంది. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడంలో భారత్‌ దృఢ సంకల్పాన్ని, దీక్షను ప్రస్ఫుటం చేస్తున్న వాస్తవమిది. మేమివాళ బొగ్గు తవ్వకం వాణిజ్యీకరణపై వేలం ప్రారంభించడం మాత్రమేగాక దశాబ్దాల దిగ్బంధం నుంచి బొగ్గు రంగం విముక్తికి శ్రీకారం చుట్టాం. ఇప్పటిదాకా కొనసాగిన సదరు దిగ్బంధం ప్రభావమేమిటో నాకన్నా మీకే బాగా తెలుసు! నేనిప్పుడు చెప్పే వాస్తవం గురించి ఒక్కసారి ఆలోచించండి... ప్రపంచంలో అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాల్లో మనది నాలుగో స్థానం; రెండో అతిపెద్ద ఉత్పత్తిదారులం మనమే; అయినప్పటికీ భారతదేశం బొగ్గు ఎగమతిదారు కాదుగదా... రెండో అతిపెద్ద దిగుమతిదారు! మరి ప్రపంచంలో మనం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు అయినప్పుడు అదేస్థాయిలో అతిపెద్ద ఎగుమతిదారు ఎందుకు కాలేకపోయాం? ఇది నా మనసును మాత్రమేగాక... మీతోపాటు కోట్లాది భారతీయుల మదిని తొలిచే ప్రశ్న.

మిత్రులారా!

   శాబ్దాలుగా ఇదీ మన పరిస్థితి... దేశ బొగ్గురంగం ‘స్వీయ-స్వీయేతర’ నిర్బంధంలో చిక్కి విలవిలలాడుతోంది. పోటీతత్వానికి దూరంగా ఉంచబడింది; పారదర్శకత ఓ ప్రధాన సమస్యగా మారింది. సముచిత వేలం ప్రక్రియ మాట అటుంచి బొగ్గు గనుల కేటాయింపులో భారీ కుంభకోణాలు చోటుచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పర్యవసానంగా బొగ్గు రంగంలో పెట్టుబడుల కొరత ఏర్పడింది... అలాగే ఈ రంగం సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ఒక రాష్ట్రంలో బొగ్గు వెలికితీస్తే వందలాది కిలోమీటర్ల దూరంలోని మరొక రాష్ట్రానికి రవాణా అవుతుండగా, ఉత్పత్తి చేసే రాష్ట్రం మాత్రం బొగ్గు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి- ఇదెంతో గందరగోళంగా ఉంది. మిత్రులారా... ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి 2014 నుంచి అనేక చర్యలు తీసుకున్నాం. ఎవరూ ఊహించని రీతిలో బొగ్గు సంధానం ప్రక్రియను అమలు చేశాం. ఇటువంటి చర్యలు బొగ్గు రంగానికి కొత్త ఉత్తేజమిచ్చాయి. అలాగే దశాబ్దాలుగా మాటలకు మాత్రమే పరిమితమైన చాలా సంస్కరణలను ఇటీవల ప్రవేశపెట్టాం. ఇప్పుడు పూర్తిస్థాయి బహిరంగ పోటీ, మూలధనం, భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానాల వైపు బొగ్గు, గనుల తవ్వకం రంగాన్ని నడిపేలా భారత ప్రభుత్వం ఓ బృహత్‌ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ప్రైవేటు గనుల రంగంలో కొత్త భాగస్వాములకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాం.

మిత్రులారా!

   నులు, ఖనిజ రంగాల బలమైన తోడ్పాటు లేనిదే స్వావలంబన సాధ్యం కాదు; ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థకు ఖనిజాలు-గనులు ముఖ్యమైన మూలస్తంభాలు. ప్రస్తుత సంస్కరణల తర్వాత ఇక బొగ్గు ఉత్పత్తిసహా మొత్తొ బొగ్గు రంగం స్వీయాశ్రితం అవుతుంది. ఇప్పుడిక బొగ్గు బహిరంగ విపణిలోకి వచ్చినందువల్ల ఏ రంగమైనా తమ అవసరాల మేరకు కొనుగోలు చేయవచ్చు. మిత్రులారా... ఈ సంస్కరణలతో బొగ్గు రంగం ఒక్కటిగా ఇతర రంగాలు కూడా లబ్ధి పొందుతాయి. మనం బొగ్గు ఉత్పత్తిని పెంచితే, విద్యుదుత్పాదన పెరుగుతుంది... ఈ సానుకూల ప్రభావం ఉక్కు, అల్యూమినియం, ఎరువులు, సిమెంటు రంగాల్లో ఉత్పత్తి, తయారీ ప్రక్రియలపైనా పడుతుంది. అదృష్టవశాత్తూ మన దేశంలో బొగ్గు, ఇనుము, బాక్సైట్‌ తదితర ఖనిజ నిల్వలు ఒకదానికొకటి సమీపంలో ఉన్నాయి. అందువల్ల బొగ్గు తవ్వకం సంస్కరణల నుంచి ఖనిజ రంగంలో సంస్కరణలు బలం పుంజుకున్నాయి. మిత్రులారా... బొగ్గు వాణిజ్యీకరణ వేలం ఇవాళ ప్రారంభం కావడం భాగస్వాములందరికీ ఉభయతారకం. పరిశ్రమలకు.. మీకు.. మీ వ్యాపారాలు.. పెట్టుబడులకు కొత్త వనరులు, విపణులు సమకూరుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత రాబడి ఉంటుంది. అన్నిటికీ మించి దేశంలో అత్యధిక యువజనానికి ఉపాధి లభిస్తుంది. అంటే- ప్రతి రంగంపైనా సానుకూల ప్రభావం ఉంటుందన్నమాట!

మిత్రులారా!

   బొగ్గు రంగంలో సంస్కరణ అమలు నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భారత కట్టుబాటు బలహీనపడకుండా జాగ్రత్త వహించాం. ఆ మేరకు బొగ్గును వాయువుగా మార్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టబడుతుంది. ఆ విధంగా బొగ్గును వాయువు రూపంలోకి మార్చే చర్యలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. బొగ్గు వాయువును రవాణా చేయవచ్చు.. వంటకు ఉపయోగించవచ్చు.. ఇక యూరియా, ఉక్కు తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల బొగ్గును వాయువుగా మార్చే సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం ఇప్పటికే నాలుగ ప్రాజెక్టులను గుర్తించగా, ఈ ప్రక్రియలో రూ.20,000 కోట్లదాకా పెట్టుబడులు వస్తాయని నాకు సమాచారం ఉంది. మిత్రులారా... బొగ్గు రంగంలో సంస్కరణలు మన తూర్పు-మధ్య భారత ప్రాంతాలుసహా గిరిజన ప్రదేశాలు ప్రగతికి భారీ మూలాధారాలు కాగలవు. మన దేశంలో బొగ్గు, ఖనిజాలున్న ప్రాంతాలు ఆపేక్షిత స్థాయిలో ప్రగతి, సౌభాగ్యాలకు నోచుకోలేదు. అంతేకాకుండా దేశంలోని అనేక ప్రగతికాముక జిల్లాలు కూడా ఈ ప్రదేశాల్లోనే పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నా ఆ దిశగా ఇంకా వెనుకబడి ఉన్నారు. దేశంలోని 16 ప్రగతి కాముక జల్లాల పరిధిలో భారీ బొగ్గు నిల్వలుండగా, ప్రజలకు మాత్రం దానివల్ల ఎలాంటి ప్రయోజనం లభించడం లేదు. ఈ ప్రదేశాలకు చెందిన అనేకమంది ఉపాధి వేటలో సుదూర నగరాలకు వలసబాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

   నుల తవ్వకంలో వాణిజ్యీకరణకు చేపట్టిన చర్యలు తూర్పు-మధ్యభారత ప్రాంతాల్లోని భారీ జనాభాకు వారి ఆవాసాల సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించి, వలస వెళ్లడం వంటి దుస్థితిని తొలగంచడానికి దోహదపడతాయి. ఇవాళ ప్రారంభించిన బొగ్గు గనుల వేలం ప్రక్రియతోనే లక్షలాది ఉద్యోగాల సృష్టి సాధ్యమవుతుంది. ఇదొక్కటే కాదు... బొగ్గు వెలికి తీయడంనుంచి రవాణాదాకా అవసరమైన మౌలిక సదుపాయాలద్వారా కూడా ఉద్యోగావకాశాల సృష్టి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.50,000 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. మిత్రులారా... బొగ్గు రంగంలో సంస్కరణలు పెట్టుబడులు ప్రజలకు.. ముఖ్యంగా పేదల-గిరిజన సోదరీసోదరులకు జీవన సౌలభ్యం కల్పనలో కీలక పాత్ర పోషిస్తాయి. బొగ్గు ఉత్పాదన ద్వారా లభించే అదనపు రాబడిని ఆ ప్రాంతాల్లోని ప్రజల సంక్షేమం దిశగా వివిధ పథకాల కోసం ఉపయోగిస్తాం. అలాగే జిల్లా ఖనిజ నిధి నుంచి రాష్ట్రాలకు ఎప్పటిలాగానే సాయం కొనసాగుతుంది. ఈ నిధిలో అధికశాతాన్ని బొగ్గు గనుల పరిసర ప్రాంతాల్లో అత్యవసన సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తాం. ఖనిజ సంపన్న ప్రాంతాల ప్రజలను సంపన్నలను చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. నేడు చేపడుతున్న చర్యలు ఆ లక్ష్యసాధనలో ఎంతగానో దోహదం చేస్తాయి.

మిత్రులారా!

   దేశంలో ఆర్థిక కార్యకలాపాలు జోరుగా సాధారణ స్థాయికి చేరుతున్న వేళ ఈ వేలం సాగుతోంది. వినియోగం-గిరాకీ వేగంగా కోవిడ్‌-19 మునుపటి స్థాయిని అందుకుంటున్నాయి. కాబట్టి ఇందుకు ఇంతకన్నా మంచి తరుణం మరేముంటుంది! గతనెల- మే ఆఖరువారం నుంచి జూన్‌ తొలివారం మధ్య విద్యుత్‌ వినియోగంతోపాటు పెట్రోలియం ఉత్పత్తులకు గిరాకీ జోరందుకుంది. ఆ మేరకు ఏప్రిల్‌ నెలతో పోలిస్తే ‘ఈ-వేబిల్లుల’ జారీ దాదాపు 200 శాతం స్థాయికి దూసుకుపోయింది. రహదారి రుసుము (టోల్‌ ఫీ) వసూళ్లు ఫిబ్రవరితో పోలిస్తే జూన్‌లో ఇప్పటికే 70 శాతం స్థాయికి చేరుకున్నాయి. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో రైళ్లలో సరకు రవాణా కూడా 26 శాతం పెరిగింది. అలాగే చిల్లర డిజిటల్‌ లావాదేవీల్లోనూ పరిమాణ-ప్రమాణాల రీత్యా స్పష్టమైన పెరుగుదల నమోదైంది. మిత్రులారా... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా ఊర్ధ్వముఖం పట్టింది. ఈ ఏడాది ఖరీఫ్‌ పంటల సాగు విస్తీర్ణం నిరుటితో పోలిస్తే 13 శాతం అధికంగా ఉంది. గోధుమ ఉత్పత్తి, కొనుగోళ్లు కూడా ఈసారి పెరిగాయి. ఆ మేరకు పోయినేడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటికే 11 శాతం అధికంగా నమోదైంది. అంటే- రైతులకు మరింత డబ్బు సమకూరిందన్న మాట. ఈ సూచీలన్నిటినీ పరిశీలిస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుని, ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉందని అర్థం కావడం లేదూ!

మిత్రులారా!

   భారతదేశం లోగడ ఇంతకన్నా పెను సంక్షోభాలనుంచి విజయవంతంగా బయటపడింది... ఇప్పుడూ జరిగేది అదే. భారతీయులం కోట్లాది వినియోగదారులం మాత్రమేగాక, కోట్లాది ఉత్పత్తిదారులం కూడా. కాబట్టి భారతదేశ విజయం, వృధ్ధి తథ్యం... మనం స్వయం సమృద్ధం కాగలమనడంలో సందేహమే లేదు! ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. కొన్ని వారాల కిందట మనం పెద్దసంఖ్యలో ఎన్‌-95 మాస్కులు, కరోనా పరీక్ష పరికరాలు, వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE), వెంటిలేటర్లు తదితరాలను దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ, ఇవాళ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం ద్వారా తనకు అవసరమైన వాటిని భారతదేశమే స్వయంగా సమకూర్చుకుంటోంది. అంటే- త్వరలోనే మనం ఔషధ ఉత్పత్తుల ముఖ్యమైన ఎగుమతిదారుగా ఎదుగుతాం. ఆ మేరకు మీరు ‘మనం చేయగలం’ అనే నమ్మకం, నైతికస్థైర్యంతో ముందడుగు వేయండి. మనం కచ్చితంగా స్వయం సమృద్ధ భారతంగా అవతరించగలం!

మనం స్వయం సమృద్ధ భారతాన్ని నిర్మించగలం!

   దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు శ్రీకారం చుట్టిన ఈ స్వావలంబన భారత పయనంలో మీరంతా ప్రధాన భాగస్వాములు. భారతదేశాన్ని ముందుకు నడిపి, స్వయం సమద్ధ భారతంగా రూపొందిద్దాం రండి! బొగ్గు రంగంలో విశేష నాందీ ప్రస్తావన చేసిన సందర్భంగా మరొకసారి మీకందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మనమంతా ఏదో ఒకటి సాధించి చరిత్రగతిని మలుపుతిప్పే అవకాశాలు జీవితంలో కొన్నిమాత్రమే వస్తాయి. ఆ మేరకు ఇవాళ ప్రజలకు స్వస్థత చేకూర్చడంద్వారా నేడు చరిత్రను మార్చే అవకాశం పారిశ్రామిక లోకానికి, భారత సేవారంగానికి లభించింది. ఈ అవకాశాన్ని వదులుకోరాదు... భారత్‌ను ముందుకు నడిపి, ఒక స్వయం సమృద్ధ దేశంగా రూపొందిద్దాం రండి!

మిత్రులారా!

   నేడు మిమ్మలి కలిసే అవకాశం నాకు లభించింది. ఇది బొగ్గుకు సంబంధించిన అంశమైనా మనం మాత్రం వజ్ర స్వప్నాలు కనాలి. బొగ్గురంగంలో ఈ విశేష నాందికిగాను మీకందరికీ నేను మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రత్యేకించి ఈ మంత్రిత్వశాఖలోని అన్ని అంశాలనూ క్షుణ్నంగా, సమర్థంగా అధ్యయనం చేయడం కోసం ప్రస్తుత దిగ్బంధ కాలాన్ని సద్వినియోగం చేసుకున్న నా మంత్రిమండలి సహచరుడు ప్రహ్లాద్‌ జోషి గారితోపాటు ఆయన వెంట నడిచిన బృందం మొత్తాన్నీ మరొకసారి అభినందిస్తున్నాను. దేశహితానికి తోడ్పడగల, గొప్ప నాయకత్వాన్ని అందించగల నవ్య మార్గాన్వేషణకుగాను ప్రహ్లాద్‌ జోషిగారిని, ఆయన కార్యదర్శిని, వారి బృందాన్ని అభినందించ దలచాను. ఇదొక సాధారణ కార్యక్రమంగా మీరు భావిస్తూండవచ్చు... కానీ, నేనలా అనుకోవడం లేదు. ప్రహ్లాద్‌గారూ! స్వావలంబన భారత దిశగా మీరివాళ బలమైన పునాది వేశారని నేను అభిప్రాయపడుతున్నాను. అందుకుగాను మీకు, మీ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు! ఈ సందర్భంగా నేను మీతోనే ఉంటానని నా పారిశ్రామిక మిత్రులందరికీ మరోసారి హామీ ఇస్తున్నాను. దేశ సంక్షేమం కోసం మీరు రెండడుగులు వేస్తే నేను మీతో నాలుగు అడుగులు వేయడానికి సదా సిద్ధం. రండి... ఈ అవకాశాన్ని వృథా కానివ్వకండి.

మరొకసారి మీకందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!

కృతజ్ఞతలు!

******


(Release ID: 1632368) Visitor Counter : 277