రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఖరీఫ్ లో నిరాటంకంగా ఎరువుల సరఫరా: ఎరువుల కంపెనీలతో గౌడ వీడియో కాన్ఫరెన్స్
కరోనా ప్రభావాన్ని తగ్గించటంలో ఎరువుల పరిశ్రమ సహకారాన్ని అభినందించిన గౌడ
కార్మికుల కొరత, యంత్రాల దిగుమతులపై ఆంక్షల సడలింపుపై సానుకూల స్పందన
Posted On:
16 JUN 2020 5:09PM by PIB Hyderabad
ఈ ఖరీఫ్ సీజన్ లో ఎలాంటి ఆటంకమూ లేకుండా ఎరువుల సరఫరా జరిగేలా చూడాలని కేంద్ర రసాయనాలు. ఎరువుల శాఖామంత్రి శ్రీ డిఇ సదానంద గౌడ ఎరువుల తయారీదారులను కోరారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సదానంద గౌడ్ మాట్లాడుతూ, " కరోనా సంక్షోభ ప్రభావాన్ని తగ్గించటంలో ప్రభుత్వానికి సహకరించిన పరిశ్రమ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ సంక్షోభం, దాని వెనువెంటనే అమలు జరిగిన లాక్ డౌన్ విసిరిన సవాళ్ళు దేశవ్యాప్తంగా ఎరువుల అందుబాటును తీవ్రంగా ప్రభావితం చేసి ఉండేవి. అయితే, అదృష్ట వశాత్తూ అందరూ ఈ విపత్కర కాలంలో తగిన విధంగా స్పందించి ఖరీఫ్ కు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచగలగటం గొప్ప విషయం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎరువుల కర్మాగారాలు పనిచేయటం అభినందనీయం " అన్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి దేశ వ్యాప్తంగా రైతులు వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశముందని కూడా ప్రస్తావించారు. అందువలన ఈ ఏడాది కూడా ఎరువులకు డిమాండ్ గణనీయంగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నామన్నారు. నిరుటితో పోల్చి చూస్తే యూరియా, పొటాష్, భాస్వరం డిమాండ్ ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఎక్కువగా ఉండటాన్ని గుర్తుచేశారు,
ఖరీఫ్ సీజన్ లో 170 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుందని, అయితే ఉత్పత్తి సుమారు 133 లక్షల మెట్రిక్ టన్నులుంటుందని అంచనా వేశామన్నారు. ఈ తేడాను భర్తీ చేయటానికి దిగుమతులను ఆశ్రయిస్తామన్నారు. ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలిచామని, ఆ విధంగా రైతులకు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎరువుల అందుబాటు సక్రమంగానే ఉన్నట్టు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విభాగాలు తెలియజేశాయన్నారు. ఈ నెల 9న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. గడిచిన ఆరేళ్లలో అనుసరించిన సంప్రదాయాన్నే కొనసాగిస్తూ, ఈ సారి కూడా ఎరువుల కొరత ఉండబోదని గట్టిగా నమ్ముతున్నట్టు చెప్పారు. ఎరువుల పరిశ్రమ నిరంతర కృషి వల్లనే ఇది సాధ్యమైందంటూ అభినందించారు.
ఎరువుల విభాగం అధికారుల పాత్రను కూడా మంత్రి కొనియాడారు. లాక్ డౌన్ కాలంలో రేయింబవళ్ళు కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలతోను, రైల్వే శాఖతోనూ్, హోం మంత్రిత్వశాఖతోనూ సమన్వయం చేసుకోవటం ద్వారా ఎరువుల రవాణాకు, వాటి ముడి సరకుల రవాణాకూ, సిబ్బంది రవాణాకూ ఎలాంటి అంతరాయమూ కలగకుండా చర్యలు తీసుకున్నారన్నారు.
ఎరువుల సబ్సిడీ గురించి మాట్లాడుతూ, పొటాషియం, భాస్వరం ఎరువుల సబ్సిడీని నిర్థారిస్తూ అవసరమైన అనుమతులు పొందటానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి గౌడ వెల్లడించారు. అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎరువుల తయారీ కూడా తీవ్రంగా ప్రభావితమవుతుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తున్నామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న సబ్సిడీ బిల్లుల జాప్యం కారణంగా ఎరువుల కంపెనీలు పడుతున్న ఇబ్బందులు తమకు తెలుసునని, ఆర్థిక మంత్రిత్వశాఖతో కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని కూడా మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్ళిన కారణంగా కార్మికుల కొరత ఏర్పడటం, నిపుణులైన విదేశీ కార్మికులని రప్పించుకోవటం మీద ఉన్న ఆంక్షలు, యంత్ర సామాగ్రి దిగుమతుల మీద ఉన్న ఆంక్షలు కూడ్స్స్ ఎరువుల పరిశ్రమలు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలుగా గుర్తించామన్నారు. వీటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎరువుల కంపెనీల ప్రతినిధులు తమ సమస్యలను ప్రస్తావించగా, మొత్తంగా పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలన్నిటినీ పరిష్కరించే దిశలో కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తీరప్రాంత నౌకారవాణా ద్వారా ఎరువుల తరలింపులోను, నౌకాశ్రయాల్లో ఎరువుల పరిశ్రమలు ఎదుర్కుంటున్న సమస్యలను సహాయ మంత్రి శ్రీ మాన్ సుఖ్ మాందవ్యా చర్చించారు. ఎరువుల విభాగం కార్యదర్శి శ్రీ చబిలేంద్ర రౌల్ అధికారులు ఎరువుల తరలింపు విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. కోవిడ్ సంక్షోభ కాలంలో రైల్వే మంత్రిత్వశాఖతోను, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్టు తెలియజేశారు. ఎఫ్ ఎ ఐ డిజి, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల సిఎండీలు, ఎండీలు, సహకార సంఘాలు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
***
(Release ID: 1631956)
Visitor Counter : 221
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam