పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

బాగ్జాన్ గ్యాస్ బ్లోఅవుట్ మరియు అగ్ని ప్ర‌మాదంపై ఎంఓపీఎన్‌జీ మరియు అమెరికా ఇంధన శాఖ మధ్య చర్చలు

Posted On: 13 JUN 2020 8:16PM by PIB Hyderabad

 

అస్సాం రాష్ట్రంలోని టిన్సుకియా జిల్లా బాగ్జాన్ వద్ద ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్‌) కు చెందిన గ్యాస్ బావిలో 12వ తేదీన బ్లోఅవుట్ మరియు భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించాయి. ఈ నేప‌థ్యంలో పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్‌జీ) యొక్క సీనియర్ అధికారులు, ఓఐఎల్ మరియు ఓఎన్‌జీసీ సంస్థ‌ల యొక్క సీఎండీలతో పాటు ఆయా సంస్థ‌ల  ప్ర‌మాదాల‌ నిర్వహణ బృందం, మరియు ఇతర నిపుణులు బాగ్జాన్ గ్యాస్ విపత్తు నియంత్రణ నిమిత్తం అమెరికాకు చెందిన‌ ఇంధన శాఖ (డీఓఈ), అమెరికా చ‌మురు, గ్యాస్ విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌కు చెందిన నిపుణుల‌తో సమగ్ర చర్చలు జరిపారు. ఈ సమావేశానికి సింగపూర్‌కు చెందిన విదేశీ నిపుణులు కూడా హాజరయ్యారు. అమెరికాలో ఈ త‌ర‌హా గ్యాస్ బ్లోఅవుట్ సంఘటనల విష‌య‌మై వ్యవహరించిన తమ అనుభవాన్ని అమెరికా వైపు అధికారులు, నిపుణులు పంచు
కున్నారు. ఈ స‌మావేశంలో భార‌త బృందంలోని అధికారులు బాగ్జాన్ గ్యాస్ బావిలో ఎగిసిప‌డుతున్న మంట‌ల‌ను నియంత్రించ‌డంతో పాటు ఈ బావిని మూసివేయ‌డానికి గాను చేప‌డుతున్న వివిధ చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. అగ్నిప్రమాదం తీరు నీటి నిర్వహణ వ్యవస్థ, శిథిలాల తొలగింపు, డ్రోన్లతో సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడ‌కం మరియు చివరికి బావిని మూసివేయడానికి చేప‌డుతున్న చ‌ర్య‌లనూ వారు వివ‌రించారు. ఓఐఎల్ మరియు ఓఎన్‌జీసీ నిపుణులు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అమెరికా ఇంధ‌న శాఖ మరియు నిపుణులు ఆమోదించారు. దీనికి తోడు మంటలను క‌ట్ట‌డి చేయ‌డం మరియు బావిని మూసివేయడానికి కూడా రూపొందించిన ప్రణాళికల‌కు వారు స‌మ్మ‌తి తెలియ‌జేశారు. ఈ విష‌య‌మై రాబోయే రోజుల్లో మ‌రోసారి త‌మ అభిప్రాయాలను మార్పిడి చేసుకోవాలని ఇరు పక్షాల వారు నిర్ణయించారు. బావిని పూడ్చివేయ‌డం లో పురోగతిని కూడా భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ స‌మావేశ‌మై స‌మీక్షించాల‌ని ఇరు ప‌క్షాలు నిర్ణ‌యించాయి. ప్ర‌స్తుత‌ భారత్- అమెరికా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యంలో భాగంగా ఈ చర్చలు జరిగాయి.



(Release ID: 1631487) Visitor Counter : 195