రైల్వే మంత్రిత్వ శాఖ

ఓహెచ్ఈ విద్యుదీక‌ర‌ణ సెక్ష‌న్ల‌లోనూ డబుల్ స్టాక్ కంటైనర్ రైలును న‌డిపించి స‌రికొత్త‌ ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాన్ని సృష్టించిన భార‌తీయ రైల్వే

- సరుకు రవాణా కార్యకలాపాల్లో స‌రికొత్త ఆవిష్కరణ, వేగం మరియు అనుకూలీకరణల‌పై దృష్టి సారించిన భార‌తీయ రైల్వే
- ఏప్రిల్ 1 నుండి జూన్ 10, 2020, వరకు భారతీయ‌ రైల్వే తన నిరంతరాయ ఫ్రైటర్స్ రైళ్ల కార్యకలాపాలతో 178.68 మిలియన్ టన్నుల స‌రుకు రవాణా
- దేశంలో సరఫరా గొలుసును క్రియాత్మకంగా నిలిపి ఉంచేందుకు గాను 24.03.2020 నుండి 10.06.2020 వరకు 32.40 లక్షలకు పైగా వ్యాగన్ల‌ స‌రుకు ర‌వాణా. వీటిలో, 18 లక్షలకు పైగా వ్యాగన్ల‌లో నిత్య‌వ‌స‌ర వస్తువుల ర‌వాణా..
- భారతీయ రైల్వే 22.03.2020 నుండి 10.06.2020 మ‌ధ్య మొత్తం 3,897 పార్శిల్ రైళ్లు న‌డిపి వాటి ద్వారా మొత్తం 1,39,196 టన్నుల సరుకు ర‌వాణా చేసింది

Posted On: 11 JUN 2020 6:00PM by PIB Hyderabad

భార‌తీయ రైల్వే స‌రుకు ర‌వాణా విభాగంలో స‌రికొత్త ప్ర‌మాణాన్ని సృష్టించింది. ప్ర‌పంచంలోనే తొలిసారిగా 7.57 మీటర్ల ఎత్తున‌ కాంటాక్ట్ వైర్‌తో కూడిన ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (ఓహెచ్ఈ) వ్య‌వ‌స్థ‌ను ప్రారంభించింది. అంతే కాకుండా వీటి ఆధారంగా డబుల్ స్టాక్ కంటైనర్లతో కూడిన రైలును విజయవంతంగా నడుపుతోంది. ప‌శ్చిమ రైల్వే విభాగంలో ఈ డబుల్ స్టాక్ కంటైనర్లతో కూడిన రైళ్ల‌ను న‌డుపుతున్నారు. ఈ అద్భుతమైన విజయం మొత్తం ప్రపంచంలో మొదటిది.
ఇది ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా మిషన్‌కు భారత రైల్వే చేప‌ట్టిన‌ తాజా హరిత చొరవగా  నిలువ‌నుంది. ఈ విశేషమైన చ‌ర్య‌తో ఎత్తైన ఓహెచ్ఈ భూభాగంలో హై రీచ్ పాంటోగ్రాఫ్‌తో
డబుల్ స్టాక్ కంటైనర్ రైలును నడిపిన మొదటి రైల్వేగా భారతీయ రైల్వే గర్వంగా నిలిచింది.
జూన్ 10 వ తేదీన గుజరాత్‌లోని పాలన్‌పూర్ - బొటాడ్ స్టేషన్ల మ‌ధ్య ఈ ర‌వాణా కార్య‌క్ర‌మం విజయవంతంగా ప్రారంభ‌మైంది. భార‌తీయ రైల్వేసరుకు రవాణా కార్యకలాపాల్లో కొత్త ఆవిష్కరణ, వేగం మరియు అనుకూలీకరణల‌పై దృష్టి సారించి ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.
గ‌త స‌రుకు ర‌వాణా గ‌ణాంకాలను అధిగ‌మించ‌డంపై దృష్టి..
కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌లవుతున్న ప్ర‌స్తుత త‌రుణంలోనూ భార‌తీయ రైల్వే గ‌త సంవ‌త్స‌రాల‌లో స‌రుకు ర‌వాణా గ‌ణాంకాలను అధిగ‌మించ‌డంపై దృష్టి సారించింది. ఏప్రిల్ 1 నుండి జూన్ 10, 2020 వరకు భారత రైల్వే తన నిరంతరాయమైన సరుకు రవాణా రైళ్ల కార్యకలాపాల ద్వారా 178.68 మిలియన్ టన్నుల వస్తువులను దేశవ్యాప్తంగా రవాణా చేసింది.
దేశంలో స‌ర‌ఫ‌రా గొలుసును క్రియాత్మకంగా ఉంచడానికి భార‌తీయ రైల్వే 24.03.2020 నుండి 10.06.2020 వరకు దాదాపు 32.40 లక్షలకు పైగా వ్యాగన్ల ద్వారా వివిధ ఉత్ప‌త్తుల ర‌వాణా చేప‌ట్టింది. వీటిలో 18 లక్షలకు పైగా వ్యాగన్లు దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలు, ఉప్పు, చక్కెర, పాలు, వంట‌ నూనెలు, ఉల్లిపాయలు, పండ్లు & కూరగాయలు, పెట్రో ఉత్పత్తులు, బొగ్గు, ఎరువులు వంటి ముఖ్యమైన వస్తువులను దేశవ్యాప్తంగా ర‌వాణా చేసింది. ఏప్రిల్ 1 నుండి జూన్ 10, 2020, వ‌ర‌కు రైల్వే 12.74 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను లోడ్ చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ర‌వాణా మొత్తం 6.79 మిలియన్ టన్నులుగా నిలిచింది.
ప్ర‌‌త్యేకంగా టైమ్ ‌టేబుల్ రైళ్లు..
22.03.2020 నుండి 10.06.2020 మ‌ధ్య కాలంలో భార‌తీయ రైల్వే మొత్తం 3,897 పార్శిల్ రైళ్ల‌ను న‌డిపింది. ఇందులో 3,790 టైమ్ టేబుల్ రైళ్లు ఉన్నాయి. ఈ పార్సెల్ రైళ్లలో మొత్తం 1,39,196 టన్నుల సరుకు ర‌వాణా చేయబడింది.

 


(Release ID: 1630958) Visitor Counter : 240