ప్రధాన మంత్రి కార్యాలయం
సిఐఐ వార్షిక సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
మనం తప్పకుండా మన ప్రగతిని తిరిగి సాధిస్తాం: ప‌్రధాని
ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి సంకల్పం, సమ్మిళితత్వం, పెట్టుబడి, మౌలికసదుపాయాలు, నవకల్పనలు కీలకమైనవి: ప‌్రధానమంత్రి
Posted On:
02 JUN 2020 2:21PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత పారిశ్రామిక మండలుల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ -సిఐఐ) 125 వ వార్షిక సదస్సు లో ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సంవత్సరం వార్షిక సదస్సు అంశం, “ నూతన ప్రపంచంకోసం భారతదేశ నిర్మాణం : జీవితాలు, జీవనోపాథి, ప్రగతి”
ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, కరోనా కారణంగా ఇలాంటి ఆన్‌లైన్ సదస్సులు సాధారణమైపోయాయని అన్నారు.ప్రతి క్లిష్ట పరిస్థితిని అధిగ మించేందుకు ఒక మార్గాన్ని అన్వేషించడం మానవాళికి ఉన్న ఒక గొప్ప బలమని కూడా ఆయన అన్నారు. “ ఒకవైపు వైరస్‌పై పోరాటానికి కఠిన చర్యలు తీసుకొంటూ దేశప్రజల ప్రాణాలు కాపాడాలి. మరోవైపు ఆర్థికవ్యవస్థకు స్థిరత్వం తెచ్చి దానిని వేగవంతం చేయాలి ”అని ఆయన అన్నారు.
ఈ సంవత్సరం వార్షిక సదస్సు థీమ్ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, వృద్ధిని తిరిగి వెనక్కు తెచ్చేందుకు చర్చను ప్రారంభించడం పై భారత పరిశ్రమలను ప్రధానమంత్రి ప్రశంసించారు.పరిశ్రమవర్గాలు దీనినుంచి మరింతముందుకు వెళ్ళాలని అంటూ ఆయన,“ అవును! తప్పకుండా మన వృద్దిని తిరిగి మనం సాధిస్తాం.” అని అన్నారు. భారతదేశ సమర్థత, సంక్షోభ నియంత్రణపై తనకు అపార విశ్వాసం ఉందన్నారు. భారతదేశ ప్రతిభ, టెక్నాలజీ, దాని వినూత్న ఆవిష్కరణలు,భారతదేశ మేధోసంపద, భారత రైతాంగం, ఎం.ఎస్.ఎం.ఇలు,ఎంటర్‌ప్రెన్యూయర్లను చూసిన తర్వాత మనం వృద్దిని తిరిగిసాధించగలమన్న గట్టి నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు.
మన వృద్ధివేగాన్ని కరోనా తగ్గించి ఉండవచ్చు,కాని, ఇవాళ మనముందున్న గొప్ప వాస్తవమేమంటే, భారతదేశం లాక్‌డౌన్ దశను అధిగమించి ,అన్ -లాక్ తొలి దశలో ప్రవేశించిందని ప్రధానమంత్రి అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం అన్-లాక్ - ఫేజ్ -1 లో ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. జూన్ 8 తరువాత ఇంకా చాలా ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు. తిరిగి వృద్ధి సాధించడం ప్రారంభమైందని ఆయన అన్నారు.
ప్రపంచంలొ కరోనా వ్యాపిస్తున్న దశలో భారతదేశం సరైన సమయంలో , సరైన చర్యలు తీసుకున్నదని ప్రధానమంత్రి చెప్పారు.
“ ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు, భారతదేశంలో లాక్‌డౌన్ ప్రభావం ఎంత విస్తృతమైనదో ఇవాళ మనం తెలుసుకోగలుగుతున్నాం. ” అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. “ కరోనాకు వ్యతిరేకంగా తిరిగి ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడం మన అత్యున్నత ప్రాధాన్యతలలో ఒకటి” అని ప్రధానమంత్రి అన్నారు. ఇందుకు, తక్షణం చేపట్టవలసిన , దీర్ఘకాలంలో అవసరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటున్నదని ఆయన చెప్పారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు సహాయపడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి వివరించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, పేదలకు తక్షణ ప్రయోజనం కలిగించేందుకు సహాయపడినట్టు ఆయన చెప్పారు. ఈ పథకం కింద 74 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ సరఫరా చేసినట్టు ప్రధానమంత్రి చెప్పారు. వలస కార్మికులకు ఉచిత రేషన్ అందించినట్టు ఆయన తెలిపారు.మహిళలు, వయోధికులు, కార్మికులు, ఇలా ప్రతి ఒక్కరూ దీనివల్ల లబ్ధిపొందారని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో పేదలకు 8 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లను, అదికూడా ఉచితంగానే ప్రభుత్వం పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. 50 లక్షల మంది ప్రైవేటు ఉద్యోగులు 24 శాతం ఇపిఎప్ ప్రభుత్వ కంట్రిబ్యూషన్ మొత్తాన్నివారివారి బ్యాంకు ఖాతాల ద్వారా పొందారన్నారు. ఇది మొత్తం 800 కోట్ల రూపాయలు.
ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి, భారతదేశాన్ని శరవేగంతో తిరిగి అబివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ఐదు అంశాలను ప్రదానమంత్రి పేర్కొన్నారు. అవి -సంకల్పం, సమ్మిళతత్వం, పెట్టుబడులు, మౌలికసదుపాయాలు, నూతన ఆవిష్కరణలు. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలలో ఇవి ప్రతిఫలించాయని ప్రధానమంత్రి చెప్పారు. చాలా రంగాలను భవిష్యత్తుకు సిద్ధపడేట్లు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
“ మన దృష్టిలో సంస్కరణలనేవి ఏదో యాదృచ్చికంగా చేపడుతున్నవో లేక అరకొర నిర్ణయాలో కాదు. మన దృష్టిలో సంస్కరణలంటే ఒక పద్దతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా , సమీకృతమైన, అనుసంధానత కలిగిన, భవిష్యత్తుతో ముడిపడిన ప్రక్రియలు.మన దృష్టిలో సంస్కరణలంటే నిర్ణయాలు తీసుకోవడానికిగల సాహసం, అలాగే వాటిని తగిన హేతుబద్ధ ముగింపునకు తీసుకువెళ్ళడం” అని ఆయన అన్నారు. ప్రైవేటు పారిశ్రామిక రంగంలో ప్రోత్సాహక వాతావరణం కల్పించేందుకు తీసుకున్న పలు చర్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇన్‌సాల్వెన్సీ, దివాలా కోడ్(ఐబిసి), బ్యాంకుల విలీనం, జిఎస్‌టి, వ్యక్తుల ప్రమేయం లేకుండా ఐటి అసెస్‌మెంట్ వంటి పలు కీలక నిర్ణయాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
దేశం ఆశలు వదులుకున్నరంగాలలోకూడా ప్రభుత్వం విధానపరమైన సంస్కరణలు తీసుకువస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. వ్యవసాయ రంగం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యానంతరం రూపొందించిన నియమ నిబంధనలు రైతులను, మధ్యదళారీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేశాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఎపిఎంసి) చట్టానికి సవరణలు తీసుకువచ్చిన అనంతరం ప్రస్తుతం రైతులు దేశంలోని ఎవరికైనా , ఏ రాష్ట్రంలోని వారికైనా తమ ఉత్పత్తులను అమ్ముకునే హక్కు కలిగిఉన్నారని చెప్పారు.
మన కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని , ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు, కార్మిక సంస్కరణలు చేపడుతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. గతంలో ప్రైవేటు రంగాన్ని అనుమతించని, వ్యూహాత్మకం కాని రంగాలలో ప్రైవేటు రంగాన్నిప్రస్తుతం అనుమతించడం జరిగిందన్నారు. బొగ్గు రంగంలో వాణిజ్య మైనింగ్ కార్యకలాపాలను అనుమతించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. “ ఈ దిశగా, మైనింగ్ , ఇంధనం, లేదా పరిశొధన, సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ప్రభుత్వం ముందుకు పొతున్నది. ప్రతి రంగంలొనూ పరిశ్రమ వర్గాలకు అవకాశాలు దక్కుతాయి. యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వీటన్నింటికీ మించి దేశ వ్యూహాత్మక రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం కూడా వాస్తవ రూపం ధరించనుంది. అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా, లేక అణు ఇంధన రంగంలో నూతన అవకాశాలను అన్వేషించదలచినా అన్ని అవకాశాలూ పూర్తిగా మీముందు ఉన్నాయి” అని ప్రధానమంత్రి పరిశ్రమ వర్గాలకు చెప్పారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ ప్రైజ్‌ల (ఎం.ఎస్.ఎం.ఇ)రంగం మన దేశానికి ఒక ఆర్థిక ఇంజిన్ వంటిదని , ఇది మన జిడిపిలో 30 శాతం వరకు సమకూరుస్తున్నదని ప్రధాని అన్నారు. ఎం.ఎస్.ఎం.ఇ ల నిర్వచనాన్ని అప్‌డేట్ చేయాలని పరిశ్రమ వర్గాలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నాయని, దానిని నెరవేర్చడం జరిగిందని చెప్పారు.దీనితో ఎం.ఎస్.ఎం.ఇలు ఇక ఎలాంటి చింతలు లేకుండా పురోగమించడానికి అవకాశం ఉంటుందని, ఎం.ఎస్.ఎం.ఇ హోదా నిలుపుకోవడానికి ఇతర మార్గాలు ఎంచుకోవలసిన అవసరం ఇక ఎంతమాత్రం ఉండదని ఆయన అన్నారు. 200 కోట్ల రూపాయల వరకూ ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్లకు అంతర్జాతీయ టెండర్ల విధానాన్ని రద్దు చేశారని,దేశ ఎం.ఎస్.ఎం.ఇలలో పనిచేస్తున్న కోట్లాది అసోసియేట్లకు ప్రయోజనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
ప్రపంచదేశాలకు భారతదేశంపై గొప్ప ఆశలు ఉన్నాయని , వారు ఇండియాను ఎంతగానో విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. ఇండియా 150 కిపైగా దేశాలకు మందులు సరఫరా చేసి సహాయపడిందని ప్రధానమంత్రి చెప్పారు.విశ్వసనీయమైన , నమ్మకమైన భాగస్వామికోసం ప్రపంచం ఎదురు చూస్తున్నదని ఆయన చెప్పారు. భారతదేశంలో ఈ శక్తిసామర్ధ్యాలు, బలం , సమర్థత ఉన్నాయన్నారు . భారతదేశం పట్ల పెరుగుతున్న విశ్వాసాన్ని, పరిశ్రమ వర్గాలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
వృద్ధిని తిరిగి సాధించడం ఎంతమాత్రం కష్టం కాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అత్యంత గొప్ప విషయం ఏమంటే, ప్రస్తుతం భారత పరిశ్రమల ముందు ఉన్న స్పష్టమైన మార్గం ,ఆత్మనిర్భర భారత్ అని ప్రధానమంత్రి చెప్పారు. ఆత్మనిర్భర భారత్ అంటే మనం బలపడి, ప్రపంచాన్నిబలోపేతం చేయడమన్నారు. ఆత్మనిర్భర భారత్ అంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థతో పూర్తిగా సమ్మిళితం కావడమని, అలాగే దానికి అండగా నిలవడమని ఆయన అన్నారు.
అంతర్జాతీయ సప్లయ్ చెయిన్‌లో భారత దేశ వాటాను బలోపేతం చేసేందుకు , బలమైన లోకల్ సప్లయ్ చెయిన్‌ను ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.కరోనా అనంతర కాలంలో ఇండియా స్వావలంబన సాధించేందుకు సిఐఐ వంటి పెద్ద సంస్థలు ముందుకు వచ్చికొత్త పాత్ర పోషించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశంలో తయారైన ఉత్పత్తులు ఉండాలని, ప్రపంచం కోసం తయారు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాలలో ఉత్పాదకతను పెంచేందుకు లక్ష్యాలు నిర్ణయించాల్సిందిగా పరిశ్రమవర్గాలను ప్రధానమంత్రి కోరారు. వ్యక్తిగత రక్షణ పరికరాలను -పిపిఇ ల పరిశ్రమ తయారు చేయడంలో , అది కూడా మూడు నెలల్లో వందల కోట్ల రూపాయల విలువగలవాటిని తయారు చేయడంలో ఈ రంగం కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి, రైతులతో భాగస్వామ్యానికి గల అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. గ్రామాలకు సమీపంలో స్థానిక వ్యవసాయాధారిత ఉత్పత్తుల క్లస్టర్లకు తగిన మౌలిక సదుపాయాలు సిద్ధం చేయడం జరుగుతోందన్నారు.దేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రైవేటు రంగాన్ని ఒక భాగస్వామిగా ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఆత్మ నిర్భర భారత్ అభియాన్‌కు సంబంధించి పరిశ్రమ వర్గాల ప్రతి అవసరాన్ని తీర్చనున్నట్టు ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. దేశాన్ని స్వావలంబన సాధించేలా చేసేందుకు పరిశ్రమ వర్గాలు ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు తమ సంపూర్ణ శక్తియుక్తులు కేంద్రీకరించాలని ప్రధానమంత్రి పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు.
***
(Release ID: 1628702)
Visitor Counter : 308
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam