ప్రధాన మంత్రి కార్యాలయం
అంపన్ తుపాను నేపథ్యంలో ప్రధాని ప్రసంగం
Posted On:
22 MAY 2020 2:54PM by PIB Hyderabad
మరో సారి భారతదేశ తీర ప్రాంతం ముఖ్యంగా తూర్పు ప్రాంతంలోని తీర ప్రాంతం తుపాను బారిన పడింది. పశ్చిమ బెంగాల్ లోని సోదర సోదరీమణులకు ఈ తుపాను తీవ్ర నష్టం కలిగించింది. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది.
తుపానుకు సంబంధించి రక్షణ చర్యలు చేపడుతున్నవారందరితోను ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే వున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే వుంది. ఈ తుపాను కారణంగా ఎక్కువ నష్టం జరగకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూనే వుంది. ఎంత కష్టపడినప్పటికీ ఈ తుపాను కారణంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
వ్యవసాయం, విద్యుత్, టెలీకమ్యూనికేషన్ రంగాల్లో ఆస్తినష్టం గణనీయస్థాయిలో జరిగింది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. మౌలిక సదుపాయాలకు నష్టం జరిగింది. వ్యాపార రంగానికి నష్టం వాటిల్లింది.
ఈ రోజున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, గవర్నర్ తో కలిసి ఏరియల్ సర్వే చేశాను. తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాను. ఈ తుపానుకు సంబంధించి జరిగిన నష్టంపై గవర్నర్, ముఖ్యమంత్రి తమ ప్రాధమిక నివేదికలను నాకు ఇచ్చారు. పలు రంగాల్లో జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంచనా వేయడానికిగాను త్వరలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. వ్యవసాయ, విద్యుత్, టెలి కమ్యూనికేషన్ రంగాలకు, నివాస గృహాలకు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుంది.
కేంద్ర బృందం పర్యటించిన వెంటనే పునరావాస, పునర్ నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుంది. సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవడంద్వారా రాష్ట్రం కోలుకోవడానికి కేంద్రం సహాయం చేస్తుంది. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా వుంటుంది. రాష్ట్రంతో కలిసి చేయి చేయి కలిపి పని చేయడంద్వారా నష్టాన్నించి కోలుకోవడం జరుగుతుంది. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్రానికి అవసరమైన చర్యలను చేపడ్డానికిగాను కేంద్రం అన్ని విధానాలను, నిబంధనలను ఉపయోగిస్తుంది.
ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవడానికిగాను కేంద్రం వేయి కోట్ల రూపాయాల సహాయాన్ని అందజేస్తోంది. అదే సమయంలో మృతుల కుటుంబాలకు కేంద్రం రూ. 2 లక్షల నష్ట పరిహారాన్ని ప్రధాని సహాయ నిధినుంచి అందించడం జరుగుతుంది. అదే విధంగా క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇవ్వడం జరుగుతుంది.
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం తల్లడిల్లుతోంది. ఈ వైరస్ ను నిరోధించడానికిగాను భారతదేశం అలుపెరగని పోరాటం చేస్తోంది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగాను, తుపాను నుంచి బైటపడడానికిగాను చేపట్టాల్సిన చర్యలు పూర్తి వ్యతిరేక దిశలో చేపట్టాల్సినవి.
కరోనా మహమ్మారి వైరస్ బారిన పడకుండా వుండాలంటే ఇంటికే పరిమితం కావాలి. ఎంతో అవసరమైతే తప్ప బైటకు రాకూడదు. కానీ తుపాను నుంచి రక్షించుకోవాలంటే నివాస గృహాలనుంచి బైటకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒకే సమయంలో రెండు విభిన్నమైన పోరాటాలు చేస్తోంది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వం కింద రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. తుపాను రాకముందే అనేక రక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలను తయారు చేసుకోవడం జరుగుతోంది.
ఈ రోజున ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన రాయ్ జయంతి. ఆయన దేశం గర్వించదగ్గ మహానుభావుడు. ఈ రోజున ఆయన పుట్టిన గడ్డ పశ్చిమ బెంగాల్ లో వుండడం ఒక వైపు సంతోషం కలిగిస్తున్నప్పటికీ మరో వైపున తుపాను సంక్షోభం విషాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆయన ఆశీస్సులతో మనమంతా ఐకమత్యంగా నిలిచి ఆయన కలల్ని నిజయం చేయడానికి కృషి చేసి సామాజిక మార్పు తెద్దాం. రాబోయే తరాల ప్రగతి కోసం, వారి బంగారు భవిష్యత్ కోసం సామాజిక సంస్కరణల దిశగా మనం అడుగులు వేద్దాం. అదే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి.
ఈ సంక్షోభ సమయంలో దేశమంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలకు అండగా వుందని ఈ సందర్భంగా నేను దీమాగా చెబుతున్నాను. మీరు చేసే ప్రతి పనికి కేంద్రం తన సాయాన్ని అందిస్తుంది. ఈ సంక్షోభ సమయంలో ప్రజల్ని కలవడానికి వచ్చాను. కరోనా వైరస్ కారణంగా మిమ్మల్ని కలవలేకపోతున్నాను. దీనికిగాను నాకు చాలా బాధగా వుంది. ఇక్కడనుంచి ఒడిషా రాష్ట్రానికి వెలుతున్నాను. అక్కడ ఏరియల్ సర్వే చేస్తాను. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోను, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తుపాను నష్టం గురించి తెలుసుకుంటాను.
మరోసారి మీకు చెబుతున్నాను. ఈ సంక్షోభ సమయంలో ఈ విషాద సమయంలో మీకు అండగా కేంద్రం వుంది. మీరు ఎంతో వేగంగా బైటపడడానికి వీలుగా మీకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయి.
థ్యాంక్స్ ఎలాట్!
***
(Release ID: 1626304)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam