ప్రధాన మంత్రి కార్యాలయం

దేశ ప్రజల ను ఉద్దేశించి 2020వ సంవత్సరం మే నెల 12వ తేదీ న ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగం పాఠం  

Posted On: 12 MAY 2020 10:14PM by PIB Hyderabad

నా దేశవాసులకు ఇవే అభినందనలు.  ప్రపంచ దేశాల లోని జన సముదాయంగత నాలుగు నెలల కు పైగా కరోనా వైరస్ తో పోరాడుతున్నది.


ఈ కాలం లో ప్రపంచవ్యాప్తం గా 42 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా సంక్రమణ కు గురి అయ్యారు.

2.75 లక్షల మందికి పైగా ప్రజలు మరణించడం విషాదాన్ని మిగిల్చింది. భారతదేశం లో కూడా, ప్రజలు వారి ప్రియతముల ను మరియు సన్నిహితుల ను కోల్పోయారు.

అందరిక నేను హృద‌య‌పూర్వక ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.

మిత్రులారా, ఒక వైరస్ ప్రపంచాన్ని నాశనం చేసివేసింది. ప్రపంచం అంతటా కోట్ల మంది ప్రజలు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.


భూగోళం అంతటా, మనమందరమూ అమూల్యమైనటువంటి ప్రాణాల ను కాపాడుకోవడం కోసం ఒక సమరాన్ని సాగిస్తున్నాము. 


ఈ తరహా సంకటాన్ని మనం ఎన్నడూ కని విని ఎరుగము.  ఈ గండం ఆలోచన కు అందనిదే కాక మానవాళి కి ఇటువంటి ఆపద ను ఇదివరకు ఎన్నడూ ఎదురయ్యిందేలేదు.  ఏమైనా, ఉద్వేగానికి లోనవడం, ఓడిపోవడం లేదా ముక్కలైపోవడం మానవ జాతి కి ఆమోదయోగ్యం కాదు.


ఇటువంటి ఒక యుద్ధం లో మనం జాగరూకత తో ఉంటూ, దీనిని అతి సమీపం నుండి పర్యవేక్షిస్తూ, నియమాల ను అనుసరిస్తూ మనలను మనం కాపాడుకొని ముందుకు సాగిపోవలసిందే.

ప్రస్తుతం, ప్రపంచం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, మనం మన సంకల్పాన్ని బల పరచుకొని తీరాలి. మన మహా సంకల్పం ఈ సంకటం బారి నుండి బయటపడటానికి మనకు సహాయకారి కాగలదు.

మిత్రులారా, మనం 21వ శతాబ్దం భారతదేశానిది అన్న మాటల ను గడచిన వంద సంవత్సరాలు గా వింటూ వస్తున్నాము.
 
కరోనా కు పూర్వం ప్రపంచాన్ని మరియు ప్రపంచ వ్యవస్థల ను మనం సమగ్రం గా చూసినవాళ్లమే. కరోనా సంకటం విరుచుకుపడిన తరువాత సైతం మనం భూగోళం అంతటా చోటు చేసుకొంటున్న పరిస్థితి ని నిత్యం గమనిస్తూ వస్తున్నాము. మనం ఈ రెండు కాలాల ను భారతదేశం యొక్క దృష్టి కోణం లో నుండి గమనిస్తే, 21వ శతాబ్దం భారతదేశపు శతాబ్దియే అని అనిపిస్తుంది.

ఇది మన స్వప్నం కాదు, అంతకంటే మన అందరికి ఒక బాధ్యత అని చెప్పాలి.  అయితే మరి మన పయన దిశ ఏ విధం గా ఉండాలి?  ప్రస్తుత ప్రపంచ స్థితి మనకు నేర్పుతున్న అంశం ఏమిటి అంటే, అది ఒక ‘‘స్వయం సమృద్ధ భారతదేశం’’ అనే ఒక్క దారి మాత్రమే మిగిలింది అనేది.  మన ధర్మగ్రంథాల లో ప్రబోధించబడింది- ఐశ్: పంథ:

ఈ మాటల కు, ఆత్మనిర్భరమైనటువంటి భారతదేశం అని భావం.  మిత్రులారా, ఒక దేశం గా ప్రస్తుతం మనం ఒక కీలకమైనటువంటి సంకట స్థితి లో ఉన్నాము. అంతటి పెను విపత్తు భారతదేశానికి ఒక సంకేతం, అది ఒక సందేశాన్ని తీసుకు వచ్చింది; మరి ఒక అవకాశాన్ని కూడా వెంటబెట్టుకు తెచ్చింది.


మీకు నా యొక్క దృష్టి కోణాన్ని ఒక ఉదాహరణ సాయం తో మీకు వివరిస్తాను.

కరోనా సంక్షోభం తలఎత్తినప్పుడు, భారతదేశం లో ఒక్కటంటే ఒక్క పిపిఇ కిట్ కూడా తయారు గా లేదు.  ఎన్-95 మాస్క్ లు భారతదేశం లో చాలా తక్కువ స్థాయి లో ఉత్పత్తి అయ్యాయి.  ఇవాళ మనం ప్రతి రోజు 2 లక్షల పిపిఇ కిట్ లను, ఇంకా 2 లక్షల ఎన్-95 మాస్క్ లను ఉత్పత్తి చేయగల స్థితి లో ఉన్నాము. 


ఈ సంకట స్థితి ని ఒక అవకాశం గా భారతదేశం మలచుకొంది కాబట్టే మనం ఈ కార్యాన్ని నెరవేర్చగలిగాము.  సంక్షోభాన్ని అవకాశం గా మార్చివేసుకొనే భారతదేశం యొక్క దార్శనికత స్వయంసమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న మన సంకల్పం విషయంలోనూ అంతే ప్రభావవంతం గా నిరూపణ కానున్నది.

మిత్రులారా, ఇవాళ స్వయంసమృద్ధి అనే మాట కు అర్థం మారిపోయింది.  మానవ కేంద్రిత ప్రపంచీకరణ కు, ఆర్థిక వ్యవస్థ కేంద్రిత ప్రపంచీకరణ కు మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి.

భారతదేశం యొక్క ప్రాథమిక భావధార ప్రపంచం సమక్షం లో ఓ ఆశాకిరణం లా నిలచింది.
భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు స్వావలంబన ను గురించి చెబుతాయి. మరి వసుధైవ కుటుంబకమ్ అనేది దీని యొక్క ఆత్మ గా ఉన్నది.

స్వయంసమృద్ధి విషయానికి వస్తే భారతదేశం స్వీయకేంద్రిత ఏర్పాటుల ను సమర్థించదు.  భారతదేశం యొక్క స్వయంసమృద్ధత ప్రపంచం యొక్క సంతోషం లో, ప్రపంచం యొక్క సహకారం లో మరియు ప్రపంచం యొక్క శాంతి లో ఇమిడిపోయివుంది. ఇది ఎటువంటి సంస్కృతి అంటే, అది ప్రపంచం యొక్క సంక్షేమం పట్ల, సమస్త జీవరాశుల సంక్షేమం పట్ల నమ్మకాన్ని కలిగివున్నటువంటి సంస్కృతి; మరి ఈ సంస్కృతి యావత్తు ప్రపంచాన్ని ఒక పరివారం గా భావన చేస్తుంది.

మాతా భూమి: పుత్రో అహం పృథివ్య: అన ఒక పూర్వసిద్ధాంతం ఉన్నది.  ధరణి ని మాత గా భావన చేసేటటువంటి సంస్కృతి ని ఈ ఆధారవాక్యం సూచిస్తున్నది.  మరి ఎప్పుడయితే భరత భూమి స్వయంసమృద్ధం గా మారుతుందో, అది సమృద్ధ ప్రపంచం యొక్క సంభవనీయత కు పూచీ పడుతుంది.


 భారతదేశం యొక్క ప్రగతి సదా ప్రపంచ ప్రగతి లో ఒక అంతర్భాగం గా ఉంటూ వచ్చింది.  భారతదేశం యొక్క లక్ష్యాలు మరియు కార్యాచరణ ప్రపంచ సంక్షేమాన్ని ప్రభావాన్వితం చేస్తాయి.
 
ఎప్పుడయితే భారతదేశం సార్వజనిక స్థానాల లో మల మూత్రాదుల విసర్జన అభ్యాసం నుండి విముక్తం అయిందో, దాని తాలూకు ప్రభావం ప్రపంచం యొక్క ప్రతిరూపం పైన ప్రసరించింది.  అది క్షయ వ్యాధి కావచ్చు, పౌష్టికాహార లేమి కావచ్చు, పోలియో కావచ్చు.. భారతదేశం యొక్క ప్రచార ఉద్యమాలు ప్రపంచం మీద ప్రభావాన్ని చూపెట్టాయి. ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ అనేది భూగోళ కవోష్ణత కు విరుద్ధం గా భారతదేశం అందించినటువంటి  బహుమానం.


అంతర్జాతీయ యోగ దినం అనే కార్యక్రమం ఒత్తిడి నండి ఉపశమనం పొందడం కోసం భారతదేశం ఇచ్చిన ఒక బహుమతి.  భారతదేశ ఔషధాలు ప్రపంచం లో వేరు వేరు ప్రాంతాల ప్రజల కు ఒక సరిక్రొత్త జీవనాన్ని ప్రసాదించాయి. ఈ చర్య లు భారతదేశాని కి ప్రశంసల ను కొనితెచ్చాయి, ఈ సంగతి భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటట్టు చేస్తుంది మరి. భారతదేశం చాలా చక్క గా మనగలుగుతుంది అని, అంత మంచిదైనటువంటి మనుగడ మానవాళి యొక్క సంక్షేమాని కి ఎంతో అందించగలుగుతుంది అని ప్రపంచం నమ్మడం ఆరంభించింది.    

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఎలా?  

ఆ ప్రశ్నకు జవాబు ఏమిటంటే -  దేశంలోని 130 కోట్ల మంది పౌరులు  స్వయం సమృద్ధ భారతాన్ని నిర్మించాలని సమష్టిగా తీర్మానం చేయడం. ద్వారా

మిత్రులారా,   మనది శతాబ్దాల ఘన చరిత్ర.    

గతంలో భారత్ సంపదలతో తులతూగింది.  అప్పుడు దాన్ని బంగారు బాతు అన్నారు. ఐశ్వర్యంతో అలరారిన దేశం తల ఎత్తి తిరిగేది.  ప్రపంచ సంక్షేమానికి పాటుపడేది.  

అప్పుడే  పరిస్థితి మారింది.   దేశం దాస్య శృంఖలాలలో మగ్గిపోయింది.  అభివృద్ధి కోసం  అర్రులు చాచవలసి వచ్చేది.     ఇప్పుడు  ప్రగతి బాటలో వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో కూడా ఇండియా ప్రపంచ సంక్షేమ లక్ష్యాలకు కట్టుబడి ఉంది.    ఈ శతాబ్దం మొదట్లో వచ్చిన   వై2కె సంక్షోభం  గురించి మీకు గుర్తుండే ఉంటుంది.  అప్పడు ఇండియాకు చెందిన టెక్నాలజీ నిపుణులే ప్రపంచాన్ని ఈ సంక్షోభం నుంచి బయట పడవేశారు.   ఈ రోజు మనకు వనరులు ఉన్నాయి.  మనకు శక్తి ఉంది,  ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులు మన దేశంలో ఉన్నారు.   మనం మంచి ఉత్పత్తులను తయారు చేయగలం,  మనం  వాటి నాణ్యతను మరింత పెంచగలం  సరఫరా శృంఖలను మరింత ఆధునీకరించగలం.   మనం చేయగలం.   మనం తప్పనిసరిగా చేస్తాం.  

మిత్రులారా,  

నేను  స్వయంగా గుజరాత్ లోని కచ్  ప్రాంతంలో వచ్చిన భూకంపాన్ని చూశాను.   ఎక్కడ చూసినా శిధిలాలే.   అంతా నాశనమైపోయింది.  మొత్తం కచ్  ప్రాంతం అంతా చావు దుప్పటి కప్పుకొని నిదురిస్తోందా అనిపించింది.  అలాంటి స్థితిలో పరిస్థితి ఎప్పటికైనా  మారుతుందా అనే భావన ఊహల్లోకి కూడా రాదు.  అయితే కచ్ లేచింది.  కచ్  కదలడం మొదలెట్టింది.  కచ్ కదిలింది.    అదే మన భారతీయుల ధైర్యం, సంకల్పం.  

మనం కృత నిశ్చయంతో ముందడుగు వేస్తే  మన లక్ష్యాలను  చేరగలం.   ఏ దూరాలు మనకు భారం కాబోవు.   ఈ రోజు  మనసుంటే మార్గం ఉంటుంది.    అదే స్వయం సమృద్ధ భారత్ నిర్మాణం. మనందరి సమష్టి తీర్మానం ఎంత బలమైనదంటే ఇండియా  సరిపడినంత చేయగలిగినంత.  

మిత్రులారా ... ఇంతటి మహత్తర స్వయం సమృద్ధ భారత్ భవన  నిర్మాణం ఐదు స్తంభాలపై నిలుస్తుంది.    

మొదటి స్థంభం  -  ఆర్ధిక వ్యవస్థ...  ప్రతి ఏటా కొంచం కొంచంగా పెరిగే ఆర్ధిక వ్యవస్థ కాకుండా జాంబవంతుని అంగలతో అభివృద్ధి సాధించేది.  

రెండవ స్తంభము  మౌలిక సదుపాయాలు.   నవ భారతానికి మౌలిక సదుపాయాలు గుర్తింపుగా నిలిచాయి.    

మూడవ స్తంభము మన వ్యవస్థ. టెక్నాలజీతో నడిచే సిస్టంలపై ఆధారపడిన పాలనా వ్యవస్థ.   అది  21వ శతాబ్దపు కలలను సాకారం చేయడానికి తోడ్పడాలి గాని  క్రితం శతాబ్దపు విధానాలను అమలు చేయరాదు.  

నాల్గవ స్తంభము  మన జనాభా   ప్రపంచంలోనే  అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మనకు   చైతన్యవంతమైన జన సంపద మన బలం    స్వయం సమృద్ధ భారతావనికి  ఇంధనం.    

అయిదవ స్తంభం డిమాండ్     ..  మనదేశంలో సరఫరా మరియు  డిమాండ్ శృంఖల  మన ఆర్ధికవ్యవస్థకు ఉన్న బలం.   దానిని పూర్తి సామర్ధ్యం మేరకు ఉపయోగించుకోవాలి.    దేశంలో డిమాండ్ పెంచడానికి,  ఆ డిమాండ్ ను  తీర్చడానికి  సరఫరా శృంఖలకు చెందిన ప్రతి భాగస్వామిని సాధికారులను చేయాలి.   మన సరఫరా శృంఖలను బలోపేతం చేద్దాం.  మన సరఫరా వ్యవస్థ  మన మట్టి  పరిమళంతో ,   శ్రామికుల స్వేదంతో  నిర్మితమైంది.   

మిత్రులారా,   ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ప్రకటనలు   కరోనా సంక్షోభానికి సంబంధించినవి.   అవి రిజర్వు బ్యాంకు  నిర్ణయాలు.   ఈ రోజు ప్రకటిస్తున్న ఆర్ధిక ప్యాకేజీని పూర్తిగా కూడితే   దాదాపు   20  లక్షల కోట్ల రూపాయలు అవుతుంది.   2020లో దేశం సాగిస్తున్న అభివృద్ధి యాత్రకు ఈ ప్యాకేజీ కొత్త ఊపును, దిశను చూపుతుంది.  స్వయం సమృద్ధ భారత్ సంకల్పానికి రుజువుగా భూమి, శ్రామికులు, ద్రవ్యం మరియు  శాసనాలను గురించి  ఈ ప్యాకేజీలో నొక్కి చెప్పడం  జరిగింది.

ఈ ఆరిక ప్యాకేజీ  లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న మన కుటీర పరిశ్రమలు,  గృహ పరిశ్రమలు,  చిన్న తరహా పరిశ్రమలు,  మన ఎం ఎస్ ఎం ఇల కోసం  ఉద్దేశించింది .   అదే స్వయం సమృద్ధ భారతానికి పునాది.   ప్రతి పరిస్థితిలో,  ప్రతి ఋతువులో దేశవాసుల కోసం  రేయింబవళ్ళు శ్రమిస్తున్న రైతులు, శ్రామికుల కోసం  ఈ ఆర్ధిక ప్యాకేజీ.   నిజాయితీగా పన్నులు చెల్లించి దేశాభివృద్ధికోసం పాటుపడే  మధ్యతరగతి కోసం  ఈ  ఆర్ధిక ప్యాకేజీ.    దేశ ఆర్ధిక  సామర్ధ్యాన్ని పెంచడానికి  కృతనిశ్చయంతో పాటుపడుతున్న భారతీయ పరిశ్రమల కోసం ఈ  ఆర్ధిక ప్యాకేజీ .  రేపటి నుంచి మొదలుపెట్టి వచ్చే కొద్దీ రోజుల్లో ఆర్ధిక మంత్రి  స్వయం సమృద్ధ భారత్  ప్రచార స్పూర్తితో ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తారు.  

స్నేహితులారా, స్వ‌యం స‌మృద్ధి సాధించే భార‌త‌దేశాన్ని త‌యారు చేయ‌డానికిగాను, సాహ‌సోపేత సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌నే నిబ‌ద్ద‌త‌తో ముందుకుపోవాల్సిన క్లిష్ట‌మైన స‌మ‌య‌మిది. గ‌త ఆరు సంవ‌త్స‌రాలుగా దేశంలో చేప‌డుతున్న సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగానే ఈ సంక్షోభ స‌మ‌యంలో భార‌త‌దేశ వ్య‌వ‌స్థ‌లు స‌మ‌ర్థ‌వంతంగా పని చేస్తున్నాయనే విష‌యం మీకు అనుభ‌వంలోకి వ‌చ్చి వుంటుంది. సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాము కాబ‌ట్టే ప్ర‌భుత్వం అన్న‌దాత‌ల‌కు ఇస్తున్న ఆర్ధిక సాయం నేరుగా వారి ఖాతాల్లోకే వెళ్లిపోతోంది. అది కూడా అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు మూసి వేసిన రోజుల్లో కూడా జ‌రుగుతోంది. ర‌వాణా లేక‌పోయినా అది జ‌రుగుతోంది. ఈ సంస్క‌ర‌ణ అనేది జ‌నధ‌న్ ఆధార్ మొబైల్ జామ్స్ త్రిశ‌క్తికి సంబంధించిన‌ది. దాని ప్ర‌భావం మ‌నం చూశాం. ఇప్పుడు సంస్క‌ర‌ణ‌ల ప‌రిధిని మ‌రింత విస్త‌రించాలి. వీటిని నూత‌న శిఖ‌రాల‌కు తీసుకుపోవాలి. ఈ సంస్క‌ర‌ణ‌లు వ్య‌వసాయానికి సంబంధించిన మొత్తం స‌ర‌ఫ‌రా వ్య‌వస్థ‌కు సంబంధించినవి. త‌ద్వారా రైతుకూడా సాధికార‌త పొందుతాడు. అంతే కాదు భ‌విష్య‌త్తులో క‌రోనాలాంటి సంక్షోభం త‌లెత్తిన‌ప్పుడు అతి త‌క్కువ న‌ష్టంతో బైట‌ప‌డే అవ‌కాశం వుంటుంది. స‌హేతుక‌మైన ప‌న్నుల వ్య‌వ‌స్థ‌, స్ప‌ష్ట‌మై చ‌ట్టాలు, మంచి మౌలిక స‌దుపాయాలు, స‌మ‌ర్థ‌వంత‌మైన, పోటీకి నిలిచే మాన‌వ‌వ‌న‌రులు, బ‌ల‌మైన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను నిర్మించుకోవ‌డం మొద‌లైన వాటికోసం సంస్క‌ర‌ణ‌లు తేవాలి. ఈ సంస్క‌ర‌ణ‌లు వ్యాపార‌రంగాన్ని ప్రోత్స‌హిస్తాయి. పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తాయి. భార‌త‌దేశంలోనే త‌యారీ అనే మ‌న నిర్ణ‌యాన్ని బ‌లోపేతం చేస్తాయి. 

స్నేహితులారా, స్వ‌యం స‌మృద్ధి అనేది అంత‌ర్గ‌త బ‌లం, ఆత్మ‌విశ్వాసం ద్వారానే సాధ్య‌మ‌వుతుంది. స్వ‌యంస‌మృద్ధి అనేది అంత‌ర్జాతీయ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లోగ‌ల గ‌ట్టి పోటీని త‌ట్టుకోవ‌డాకి అనుగుణంగా దేశాన్ని త‌యారు చేస్తుంది. అంత‌ర్జాతీయ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లో ప్ర‌ధాన‌మైన పాత్ర పోషించాల్సిన స‌మ‌యం భార‌త‌దేశానికి ఆస‌న్న‌మైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్ధిక ప్యాకేజీలో అనేక చ‌ర్య‌లను తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ ప్యాకేజీ అనేది అన్ని రంగాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాదు నాణ్య‌తకు ప్రాధాన్య‌త ఇస్తుంది. 

స్నేహితులారా ప్ర‌స్తుతం మ‌నం ఎదుర్కొంటున్న సంక్షోభం చాలా పెద్ద‌ది. పెద్ద పెద్ద వ్య‌వ‌స్థ‌లే క‌దిలిపోతున్నాయి. అయిన‌ప్ప‌టికీ, ఇలాంటి ప‌రిస్థితుల్లో దేశంలోని పేద సోద‌ర సోద‌రీమ‌ణులు ఎంతో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యంగా వీధి వీధి తిరిగి వ‌స్తువులు అమ్ముకునే తోపుడుబండివాళ్లు, కార్మికులు, ప‌నిమ‌నుషులు ఇలాంటివారంతా అనేక క‌స్టాలుపడుతూ ఈ స‌మ‌యంలో ఎంతో త్యాగం చేశారు. వారి సేవ‌లు లేక‌పోవ‌డమ‌నే స‌మ‌స్య అంద‌రికీ తెలిసి వ‌చ్చింది. కాబ‌ట్టి వారిని బ‌లోపేతం చేయ‌డం మ‌న విధి. వారి ఆర్ధిక అవ‌స‌రాల‌తీర్చ‌డానికిగాను పెద్ద పెద్ద నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పేదవారికి, కార్మికుల‌కోసం, వ‌లస కార్మికుల కోసం, పశు పోష‌ణ‌దారుల‌కోసం, మ‌త్స్య‌కారుల‌కోసం, వారువ్య‌వ‌స్థీకృత‌రంగానికి చెందిన‌వారు కావ‌చ్చు, కాక‌పోవ‌చ్చు అలాంటి వారంద‌రికోసం అలాంటి అన్ని వ‌ర్గాల వారికోసం ఈ ఆర్ధిక ప్యాకేజీలో కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాం. 
 స్నేహితులారా క‌రోనా సంక్షోభం కార‌ణంగా స్థానిక త‌యారీ రంగం ప్రాధాన్య‌త తెలిసి వ‌చ్చింది. స్థానిక మార్కెట్లు, స్థానిక స‌ర‌ఫరా వ్య‌వ‌స్థల‌ ప్రాధాన్య‌త‌ను క‌రోనా సంక్షోభం తెలియ‌జేస్తోంది. ఈ సంక్షోభ స‌మ‌యంలో స్థానిక వ్య‌వ‌స్థ‌లే మ‌న అవ‌స‌రాల‌ను తీరుస్తున్నాయి. ఇవే మ‌న‌ల్ని కాపాడుతున్నాయి. స్థానిక వ్య‌వ‌స్థ‌ల‌నేవి అవ‌స‌రం మాత్ర‌మే కాదు అవి మ‌న బాధ్య‌త‌లు కూడా. స్థానిక వ్య‌వ‌స్థ‌ల‌ను మ‌న జీవితంలో అత్యంత ముఖ్య‌మైన‌విగా చేసుకోవాల‌నే విష‌యాన్ని కాలం మ‌న‌కు నేర్పింది. మీరు ఇప్పుడు గ్లోబ‌ల్ బ్రాండుల‌ని భావిస్తున్న‌వి ఒక‌ప్పుడు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా వున్న‌వే. అయితే ప్ర‌జ‌లు వాటికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డమ‌నేది పెర‌గ‌డంతో, బాగా ప్రోత్స‌హించ‌డంతో వాటి గురించి గ‌ర్వంగా చెప్ప‌డంతో అవి రాను రాను గ్లోబ‌ల్ రూపం సంత‌రించుకున్నాయి. కాబ‌ట్టి ఈ రోజునుంచి ప్ర‌తి భార‌తీయుడు త‌మ త‌మ స్థానిక ఉత్ప‌త్తుల గురించి గ‌ట్టిగా మాట్లాడాలి. వాటిని కొన‌డ‌మే కాకుండా వాటిని ఎంతో గ‌ర్వంగా ప్ర‌చారం చేయాలి. ఈ ప‌నిని నా దేశం చేస్తుంద‌నే విష‌యంపై నాకు పూర్తి విశ్వాసం వుంది. ప్ర‌తిసారీ మీరు చేస్తున్న కృషి మీ ప‌ట్ల నాలో ఆరాధ‌నా భావం పెంచుతోంది. గ‌ర్వం‌తో ఒక విష‌యాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఖాదీ బ‌ట్ట‌లు కొనుగోలు చేయాల‌ని చేనేత కార్మికుల‌కు అండ‌గా నిల‌వాల‌ని గ‌తంలో నేను మిమ్మ‌ల్ని కోరాను. నా న‌మ్మ‌కం నిజ‌మైంది. ఈ రోజున ఖాదీ, చేనేత వ‌స్త్రాల డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. అంతేకాదు మీరు ఖాదీ వ‌స్త్రాన్ని ఒక గొప్ప బ్రాండుగా చేశారు. నేను చేసిన కృషి చిన్న‌దే కానీ ఫ‌లితం మాత్రం చాలా గొప్ప‌గా వుంది. 
 స్నేహితులారా నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్న‌దేమంటే క‌రోనా అనేది చాలా కాలంపాటు మ‌న జీవితాల్లో భాగంగా వుండ‌బోతున్న‌ది. అయితే అదే స‌మ‌యంలో ఈ క‌రోనా కార‌ణంగా మ‌న జీవితాల‌ను దీని చుట్టే ప‌రిమితం చేయ‌కూడ‌దు. మాస్కులు ధ‌రించి రెండు గ‌జాల భౌతిక దూరాన్ని పాటిస్తూనే మ‌న ల‌క్ష్యాల‌ను చేరుకోవాల్సి వుంటుంది. కాబ‌ట్టి లాక్ డౌన్ నాలుగోద‌శ అనేది పూర్తిగా రీ డిజైన్ చేయ‌డం జ‌రుగుతోంది. నూత‌న నియ‌మాల‌ను పెట్ట‌బోతున్నాం. రాష్ట్రాల‌నుంచి వ‌చ్చిన సూచ‌న‌లు స‌ల‌హాల ఆధారంగా మే నెల 18 తేదీకంటే ముందు లాక్ డౌన్ 4 ఎలా వుండ‌బోతున్న‌ద‌నే దానిపై స్ప‌ష్ట‌త ఇస్తాం. నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకొని క‌రోనాపై పోరాటం చేస్తూ మ‌నం ముందుకు సాగుతామ‌నే న‌మ్మ‌కం నాకు వుంది. 
 స్నేహితులారా  'सर्वम् आत्म वशं सुखम् అని మ‌న సంస్కృతిలోని గొప్ప విష‌యం గురించి పెద్ద‌లు చెప్పారు. అంటే సంతోషం అనేది మ‌న చేతుల్లోనే వున్న‌ద‌ని అర్థం. స్వ‌యం స‌మృద్ధి అనేది సంతోషానికి, సంతృప్తికి, సాధికార‌త‌కు దారి తీస్తుంది.  21వ వ శ‌తాబ్దాన్ని భార‌త‌దేశ శ‌తాబ్దంగా మార్చాల‌నే మ‌న బాధ్య‌త స్వ‌యం స‌మృద్ధి సాధించిన భార‌త‌దేశాన్ని సాధించ‌డంద్వారా నెర‌వేరుతుంది. భార‌త‌దేశంలోని 130 కోట్ల మంది భార‌తీయుల ద్వారా... ఈ బాధ్య‌త నెర‌వేర‌డానికి కావాల్సిన శ‌క్తి వ‌స్తుంది. స్వ‌యం స‌మృద్ధి భార‌త‌దేశ సాధ‌న అనేది ప్ర‌తి భార‌తీయుని ప్ర‌తిజ్ఞ కావాలి. అంతే కాదు ఇది ఒక నూత‌న ప‌ర్వ‌దినం కావాలి. మ‌నం ఇప్పుడు స‌రికొత్త ఆకాంక్ష‌తో, దృఢ‌మైన నిర్ణ‌యంతో ముందుకు సాగాలి. బాధ్య‌త‌తో కూడిన నీతి నియ‌మాల‌తో, జాగ్రత్త‌గా నేర్పుగా కృషి చేస్తే, నైపుణ్యాల‌నే పెట్టుబ‌డులుగా పెట్టి ప‌ని చేస్తే  స్వ‌యం స‌మృద్ధి సాధించ‌కుండా దేశాన్ని ఆప‌డం ఎవ‌రిత‌రం? మ‌నంద‌రం క‌లిసి దేశాన్ని స్వ‌యం స‌మృద్ధ భార‌తంగా తీర్చిదిద్ద‌గ‌లం. మ‌నం భార‌త‌దేశాన్నిస్వ‌యం స‌మృద్ధి దేశంగా చేయ‌బోతున్నాం. ఈ నిర్ణ‌యంతో ఈ న‌మ్మ‌కంతో, మీకంద‌రికీ నా శుభాభినంద‌న‌లు. 

***



(Release ID: 1623465) Visitor Counter : 562