ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కోవిడ్-19 నిర్వహణ కోసం చేపట్టిన సంసిద్ధత మరియు నివారణ చర్యలను సమీక్షించిన - డాక్టర్ హర్ష వర్ధన్.
"ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కార్మికులకు సరైన క్వారంటైన్ ఏర్పాట్లతో పాటు, ఎస్.ఏ.ఆర్.ఐ./ ఐ.ఎల్.ఐ. కేసుల నమూనా మరియు పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉంది"
Posted On:
07 MAY 2020 5:39PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కోవిడ్-19 నిర్వహణ కోసం చేపట్టిన చర్యలు, సంసిద్ధత పై ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జై ప్రతాప్ సింగ్; ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ నాబా కిషోర్ దాస్; కేంద్ర ఆరోగ్యం, కుటుంబసంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే తో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
దేశంలో కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో అన్ని రాష్ట్రాలూ అంకితభావంతో కృషి చేస్తున్నాయని డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసించారు. 2020 మే నెల 7వ తేదీ వరకు దేశంలో మొత్తం 52,952 కేసులు నమోదయ్యాయనీ, వీటిలో 15,266 మందికి వ్యాధినయమయ్యిందనీ ఆయన తెలిపారు. కాగా, 1,783 మరణాలు సంభవించాయని చెప్పారు. గత 24 గంటల్లో, కొత్తగా 3,561 కేసులు నమోదుకాగా, 1,084 మందికి వ్యాధి నయమయ్యింది. ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశం పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు. మరణాల రేటు 3.3 శాతంగా ఉండగా, రికవరీ రేటు 28. శాతంగా ఉంది. కాగా చికిత్స పొందుతున్న రోగుల్లో , 4.8 శాతం మంది రోగులు ఐ.సి. యు. లో, 1.1 శాతం మంది రోగులు వెంటిలేటర్లపైనా, 3.3 శాతం మంది రోగులు ఆక్సీజన్ సహాయంతోనూ ఉన్నారని ఆయన వివరించారు. " దేశంలో పరీక్షల సామర్ధ్యం పెరిగింది. 327 ప్రభుత్వ ప్రయోగశాలలు, 118 ప్రైవేట్ ప్రయోగశాలల్లో రోజుకు 95,000 పరీక్షలు జరుగుతున్నాయి. ఇంతవరకు కోవిడ్-19 కోసం మొత్తం 13,57,442 పరీక్షలు జరిగాయి." అని డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు.
ఇంతవరకు దేశంలోని 180 జిల్లాల్లో గత 7 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 180 జిల్లాల్లో గత 7-13 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 164 జిల్లాల్లో గత 14-20 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 136 జిల్లాల్లో గత 21-28 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. గత 24 గంటల్లో దేశంలోని 13 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అవి - అండమాన్, నికోబార్ దీవులు; అరుణాచల్ ప్రదేశ్; ఛత్తీస్ గఢ్; ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్; కేరళ, లడఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఒడిశా. కాగా, డామన్, డయ్యు, సిక్కిం, నాగాలాండ్, లక్షద్వీప్ లలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని డాక్టర్ హర్ష వర్ధన్ తెలిపారు.
దేశంలో 130 హాట్-స్పాట్ జిల్లాలు; 284 హాట్-స్పాట్ కాని జిల్లాలు; 319 ప్రభావితం కానీ జిల్లాలు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నివారణకు ప్రస్తుతం 1,50,059 పడకలతో 821 కోవిడ్ కోసం ప్రత్యేకించిన ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 1,32,219 ఐసోలేషన్ పడకలు, 17,840 ఐ.సి.యు. పడకలు ఉన్నాయి. అదేవిధంగా 1,19,109 పడకలతో కోవిడ్ కోసం ప్రత్యేకించిన ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,09,286 ఐసోలేషన్ పడకలు, 9,823 ఐ.సి.యు. పథకాలు ఉన్నాయి. వీటికి అదనంగా 7,569 క్వారంటైన్ కేంద్రాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు / కేంద్ర సంస్థలకు 29.06 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ.లు); 62.77 లక్షల ఎన్-95 మాస్కులు పంపిణీ చేసినట్లు కూడా డాక్టర్ హర్ష వర్ధన్ తెలియజేశారు.
ఆయా రాష్ట్రాలలో కోవిడ్-19 పరిస్థితిపై ప్రదర్శించిన వివరాలు చూసిన అనంతరం డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ "మరణాల రేటును తగ్గించడానికి, సమర్ధవంతమైన నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, ఎర్లీ డయాగ్నోసిస్ పై రాష్ట్రాలు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది." అని సూచించారు. "ఇంతవరకు ప్రభావితం కానీ జిల్లాల్లో అలాగే గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాల్లో వైద్య కళాశాలల తో కలిసి ఐ.డి.ఎస్.పి. నెట్ వర్క్ ద్వారా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (ఎస్.ఏ.ఆర్.ఐ.) / ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యం (ఐ.ఎల్.ఐ.) యొక్క నిఘా తీవ్రతరం చేయాలి." అని ఆయన సూచించారు. ఇటువంటి చర్యలు ప్రారంభ దశలో ఏదైనా బయటపడని సంక్రమణ ఉనికిని సూచించడానికి సహాయపడతాయి, తద్వారా దానిపై సమయానుకూలంగా చర్యలు తీసుకోడానికి సహాయపడుతుంది ” అని ఆయన చెప్పారు.
ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ హర్ష వర్ధన్ రాష్ట్రాలను కోరారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను / సూచనలను రాష్ట్రాలు తప్పకుండా పాటించాలని సూచించారు. కోవిడ్-19 నిర్వహణకు ప్రయివేట్ ఆసుపత్రులలో భాగస్వామ్యం కావడం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో కోవిడ్ ఆరోగ్య సేవలకు ప్రత్యేకంగా ఆసుపత్రులను చెల్లింపు పద్దతిలో గుర్తించడం గురించి మంత్రికి వివరించారు. వివిధ జిల్లాల్లో జిల్లా మేజిస్ట్రేట్లు / కమీషనర్లు, ఇతర అధికారులు చేపట్టిన ఉత్తమ సేవలను మంత్రి అభినందించారు. సమర్ధవంతమైన నిఘా మరియు కేసుల కోసం అన్వేషణ వంటి చర్యల కోసం ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధి చేసిన "గ్రామ నిగ్రాణి సమితిలు / మొహల్లా నిగ్రాణి సమితిలు" చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రశంసించారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రాలకు చేరుకోవచ్చని భావిస్తున్న వలసదారుల సంఖ్య పెరుగుదల దృష్ట్యా, వారి పరీక్షలకు, క్వారంటైన్, పాజిటివ్ కేసుల చికిత్సకూ రాష్ట్రాలు పటిష్టమైన వ్యూహంతో తగిన ఏర్పాట్లు చెయ్యాలని డాక్టర్ హర్ష వర్ధన్ నొక్కి చెప్పారు. కొన్ని రాష్ట్రాలు విదేశాల నుండి వలస వచ్చినవారిని కూడా జాగ్రత్తగా గమనించాలి.
కంటైన్మెంట్ ప్రాంతాల్లో, చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి నివారణ చర్యల పట్ల సామాజిక కార్యకర్తల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా డాక్టర్ హర్ష వర్ధన్ సూచించారు. ఇందుకోసం వార్డు స్థాయిలో కార్యకర్తలను గుర్తించాలని చెప్పారు. వారు సమాజంలో నెలకొన్న అపోహలను తొలగించడంలో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్ కానీ ఇతర వైద్య అవసరాలపై కూడా రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని ఆయన నొక్కి చెప్పారు. టీకాల కార్యక్రమం, టి.బి.వ్యాధి గుర్తింపు, చికిత్స, డయాలసిస్ రోగులకు అవసరమైన రక్తం అందుబాటులో ఉంచడం, కేన్సర్ రోగులకు చికిత్స, గర్భిణీలకు అవసరమైన సహాయం అందించడం వంటి సేవలను కూడా క్రమం తప్పకుండా అందించడానికి తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రక్తపోటు, మధు మేహం పరీక్షలు, మూడు రకాల కేన్సర్ పరీక్షలకు ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను వినియోగించుకోవచ్చునని ఆయన తెలిపారు. అవసరమైన మందుల నిల్వలను తగినంతగా ఉంచాలని రాష్ట్రాలకు సూచించారు. కోవిడ్ కానీ ఇతర అత్యవసర సేవల ఫిర్యాదుల పరిష్కారానికి, ఇతర అందుబాటులో ఉన్న సేవల గురించి తెలియజేయడానికి 1075 నెంబరుకు అదనంగా 104 నెంబరు హెల్ప్ లైన్ కూడా ఉపయోగించుకోవలసిందిగా రాష్ట్రాలకు ఆయన సూచించారు. అంటు వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం కూడా ఉందని వారికి సూచించారు.
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, సహరాన్పూర్, గౌతమ్ బుద్ధ నగర్, లక్నో లకు చెందిన డి.ఎమ్. లతోనూ, ఒడిశా లోని బలేశ్వర్, గంజాం, జైపూర్ లకు చెందిన డి.ఎమ్. లతోనూ కూడా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడి, ఆయా జిల్లాల్లో కోవిడ్-19 పరిస్థితి, నిర్వహణ చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో హెచ్.ఎఫ్.డబ్ల్యూ, కార్యదర్శి శ్రీమతి ప్రీతీ సుడాన్; హెచ్.ఎఫ్.డబ్ల్యూ, ఓ.ఎస్.డి. శ్రీ రాజేష్ భూషణ్; ఎన్.హెచ్.ఎం., ఏ.ఎస్. & ఎమ్.డి., శ్రీమతి వందన గుర్నాని; ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ., సంయుక్త కార్యదర్శి డాక్టర్ మనోహర్ అగ్నానీ; ఎన్.సి.డి.సి.,డైరెక్టర్,డాక్టర్ ఎస్.కే.సింగ్; ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, శ్రీ అమిత్ మోహన్ ప్రసాద్; ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, శ్రీ నికుంజ్ ధాల్; పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్.హెచ్.ఎమ్., మిషన్ డైరెక్టర్, డాక్టర్ సౌమిత్రా మోహన్ ప్రభృతులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1622043)
Visitor Counter : 217
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada