రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కరోనా యోధులను భారతదేశం గౌరవిస్తోంది.

Posted On: 02 MAY 2020 6:09PM by PIB Hyderabad

కోవిడ్ యోధుల సహకారంతో భారతదేశం కరోనా వైరస్ తో విజయవంతంగా పోరాడుతోంది.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులను, సరకులను రవాణా చేయడం ద్వారా కరోనా ను కట్టడిచేయడంలో జాతీయ స్థాయిలో కొనసాగుతున్న కృషికి ఐ.ఏ.ఎఫ్. తన వంతు సహకారాన్ని అందిస్తోంది. కోవిడ్ టెస్టింగ్ ప్రయోగశాల ఏర్పాటుకు అవసరమైన పరికరాలతో పాటు సుమారు 600 టన్నులకు పైగా వైద్య పరికరాలను, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది తో సహా  పెద్ద సంఖ్యలో ప్రజలను ఐ.ఏ.ఎఫ్. విమాన మార్గంలో తరలించింది. కరోనా కు వ్యతిరేకంగా నిర్వహించే పోరులో ఐ.ఏ.ఎఫ్. సిబ్బంది శక్తి వంచన లేకుండా సహాయపడుతున్నారు. భారతదేశంలో కరోనా యోధుల సేవలకు కృతజ్ఞతగా, ఐ.ఏ.ఎఫ్. తన అనుబంధ సేవలు అందిస్తున్న వారితో కలిసి, ఈ భారతదేశ ధైర్య యోధులకు తనదైన శైలిలో గౌరవించాలని యోచిస్తోంది.   కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ అసాధారణమైన రోజుల్లో నిర్విరామంగా, నిస్వార్ధంగా సేవలందించిన ధైర్యవంతులైన కోవిడ్ వారియర్సును అభినందించడానికి భారత వైమానిక దళానికి చెందిన విమానాలను గగన వీధుల్లో వేగంగా విహరింపచేయాలని నిర్ణయించింది. 

 

2020 మే నెల 3వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన అనేక విమానాలు ఢిల్లీ మరియు ఎన్.సి.ఆర్. ప్రాంతంపై గగన తలంలో వేగంగా విహరించాలని నిర్ణయించాయి. భారత వైమానిక దళం శిక్షణా కార్యక్రమాన్ని కూడా దీనితో సమన్వయ పరుస్తున్నారు. కోవిడ్-19 టాస్క్ కు సంబంధించిన సరకులను రవాణా చేయడంలో నిమగ్నమైన విమానాలు, హెలీకాఫ్టర్లు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. 

 

కరోనా యోధులకు ఢిల్లీ గగనతలం నుండి వందనం సమర్పించే ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిముషాల వరకు నిర్వహించాలని నిర్ణయించారు.  యుద్ధ విమానాల అమరిక లో సుఖోయ్-30, ఎమ్.కే.ఐ., మిగ్-29 మరియు జాగ్వర్ విమానాలు పాల్గొని రాజ్ పథ్ పైన గగనతలంలో విహరిస్తాయి. ఢిల్లీలో నివసించే ప్రజలు తమ ఇళ్ల పై నుండి ఈ విన్యాసాలను తిలకించవచ్చు. వీటికి అదనంగా, సి-130 రవాణా విమానం కూడా మొత్తం ఢిల్లీ మరియు ఎన్.సి.ఆర్. ప్రాంతం పై గగన తలంలో ఇదే తరహా విన్యాసాలు చేస్తుంది. గగనతలంలో భద్రతను, ముఖ్యంగా పక్షుల విహారానికి అడ్డంకి కాకుండా సుమారు 500 మీటర్ల నుండి 1000 మీటర్ల ఎత్తులో ఈ విమానాలు ఎగురుతాయి. 

 

ఈ విన్యాసాలతో పాటు, ఉదయం 9 గంటలకు హెలికాఫ్టర్లు పోలీసుల యుద్ధ స్మారకం పై పుష్పాలను వెదజల్లుతాయి. అనంతరం ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిముషాల వరకు కోవిడ్-19 రోగులకు వైద్య సేవలందించడంలో నిమగ్నమైన ఢిల్లీ లోని ఆసుపత్రులపై కూడా పుష్పవర్షం కురిపిస్తాయి.  కోవిడ్-19 రోగులకు వైద్య సేవలందించిన ఆసుపత్రుల్లో, ఎయిమ్స్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రి, జి.టి.బి. ఆసుపత్రి,  లోకమాన్య ఆసుపత్రి, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, సఫ్దర్ జంగ్ ఆసుపత్రి, శ్రీ గంగారాం ఆసుపత్రి, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రి, మాక్స్ సాకేత్, రోహిణి ఆసుపత్రి, అపోలో ఇంద్రప్రస్థ ఆసుపత్రి, ఆర్మీ ఆసుపత్రి రీసెర్చ్ &రిఫెరల్ మొదలైనవి ఉన్నాయి.

*** 


(Release ID: 1620486) Visitor Counter : 223