విద్యుత్తు మంత్రిత్వ శాఖ
లాక్‌డౌన్ సమయంలోనూ నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్న NTPC
లాక్‌డౌన్ మార్గదర్శకాలకు కట్టుబడి అన్ని ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి
13 ఏప్రిల్ 2020న 100 శాతం PLF సాధించిన NTPC వింధ్యాచల్ ప్లాంటు
Posted On:
25 APR 2020 3:31PM by PIB Hyderabad
భారతదేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన NTPC, కరోనా సమయంలోనూ నిరంతరాయంగా పనిచేస్తోంది. దేశానికి అవాంతరాలు లేని విద్యుత్‌ను అందిస్తోంది. మహారత్న హోదాలో ఉన్న NTPCలోని అన్ని ప్లాంట్లు వాంఛనీయ సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ (స్వతంత్ర హోదా) ఆధ్వర్యంలోని విద్యుత్ శాఖ మద్దతు, మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విద్యుత్, పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.
కొవిడ్-19 సంక్షోభ సమయంలో విద్యుత్ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలు సజావుగా పనిచేయడంలో విద్యుత్ కీలకం కాబట్టి, విద్యుత్ ఉత్పత్తి మరింత ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. నిరంతరాయ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కోసం బొగ్గు సరఫరాను కూడా NTPC సమర్థవంతంగా నిర్వహిస్తోంది.
సామాజిక సంక్షేమ కార్యక్రమాలు
24 గంటలూ విద్యుత్ సరఫరా జరిగేలా NTPC సిబ్బంది కృషి చేస్తున్నారు. అన్ని ప్లాంట్లలో లాక్‌డౌన్ సూచనలు, సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తున్నట్లు NTPC ప్రకటించింది. నిరంతరాయ విద్యుత్ ఉత్పత్తే కాకుండా సామాజిక సంక్షేమ కార్యక్రమాలను కూడా NTPC చేపడుతోంది. బలహీన వర్గాలు, వలస కూలీలకు సరుకులు, వైద్య సాయం అందిస్తోంది. కొవిడ్-19పై పోరాటానికి దేశంలోని ప్రతి మూలకూ సరిపడినంత విద్యుత్ అందేలా NTPC యాజమాన్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది.
లాక్‌డౌన్ సమయంలోనూ రెండు ఘనతలు
NTPC ప్లాంట్లలో అతి పెద్దదైన వింధ్యాచల్ ప్లాంటు అరుదైన ఘనతను సాధించింది. 13, ఏప్రిల్ 2020న 100 శాతానికిపైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ( PLF) సాధించింది. భారతదేశంలోనే మొదటి అల్ట్రా సూపర్ క్రిటికల్ విద్యుత్ స్టేషన్, 660 మెగావాట్ల సామర్థ్యమున్న NTPC ఖర్‌గోన్ ప్లాంటు వాణిజ్యపరమైన అడుగు వేసింది. ఈ సంఘటనలు, లాక్‌డౌన్ సమయంలోనూ NTPC నిబద్ధతను చాటుతున్నాయి.
NTPC గ్రూపులోని అన్ని ప్లాంట సామర్థ్యం 62,110 మెగావాట్లు. దీనికి ఉన్న 70 స్టేషన్లలో 24 బొగ్గు ప్లాంట్లు, 7 మిశ్రమ గ్యాస్/ద్రవ ఇంధనం, 1 జల విద్యుత్, 13 పునరుత్పాదక ఇంధన ప్లాంట్లు, 25 JV విద్యుత్ స్టేషన్లు ఉన్నాయి.
దీనికి సంబంధించిన వీడియో కోసం ఈ వాక్యంపై క్లిక్ చేయండి.
(Release ID: 1618180)
Visitor Counter : 212